చల్లా శ్రీనివాసులు శెట్టి: రూ.7.5 లక్షల కోట్ల ఎస్‌బీఐకి ‘చైర్మన్ అవుతున్న’ తెలంగాణవాసి ఎవరు?

చల్లా శ్రీనివాసులు

ఫొటో సోర్స్, Youtube/IITM Research Park

ఫొటో క్యాప్షన్, చల్లా శ్రీనివాసులు శెట్టి
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు తెలుగు వ్యక్తి చైర్మన్ అయ్యే అవకాశం వచ్చింది.

ఎస్బీఐ తదుపరి చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ప్రతిపాదించింది.

చల్లా శ్రీనివాసులు తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందినవారు.

జూన్ 29న ముగ్గురిని ఇంటర్వ్యూ చేసిన ఎఫ్ఎస్ఐబీ ప్యానెల్, శ్రీనివాసులు శెట్టి పేరును చైర్మన్‌గా ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది.

ప్రస్తుత చైర్మన్ దినేష్ కారా పదవీకాలం 2024 ఆగస్టు 28న ముగియనుంది.

ఆ తర్వాత ఆయన స్థానంలో చల్లా శ్రీనివాసులు శెట్టి అభ్యర్థిత్వానికి ఆమోదం లభిస్తే.. ఎస్‌బీఐకి 27వ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

వాట్సాప్

50 కోట్ల మందికిపైగా ఖాతాదారులు..

సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఎస్‌బీఐ ఫార్చూన్-500 కంపెనీలలో ఒకటిగా ఉంది. ముంబయి ప్రధాన కేంద్రంగా 22,500 శాఖల ద్వారా 50 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు ఎస్‌బీఐ చెబుతోంది.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ మార్కెట్ విలువ సుమారు 7.5 లక్షల కోట్ల రూపాయలు. మార్కెట్ విలువ పరంగా దేశంలో మూడో స్థానంలో ఉంది. 29 దేశాలలో ఇది పని చేస్తోంది.

ప్రస్తుతం శ్రీనివాసులు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. బ్యాంకులో ఉన్న నలుగురు ఎండీలలో ఆయన సీనియర్. 2020 జనవరి నుంచి శ్రీనివాసులు ఎండీగా కొనసాగుతున్నారు.

గతంలో ఆయన రిటైల్ అండ్ డిజిటల్ ఆపరేషన్స్ బాధ్యతలు చూశారు. ప్రస్తుతం ఓవర్సీస్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు పర్యవేక్షిస్తున్నారు.

చల్లా శ్రీనివాసులు

ఫొటో సోర్స్, challasetty

అగ్రికల్చర్ బీఎస్సీ చేసి..

చల్లా శ్రీనివాసులు శెట్టిది తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామం.

లక్ష్మీ దేవమ్మ, లింగయ్యశెట్టి దంపతుల నలుగురి సంతానంలో చిన్నవారు శ్రీనివాసులు శెట్టి.

ఆయన ఏడో తరగతి వరకు సొంతూరిలోనే చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు గద్వాలలో చదివారు.

హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. అప్పట్లో ఆయన ప్రభుత్వ ఉపకారవేతనంతో డిగ్రీ పూర్తి చేశారు.

1988లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించారు శ్రీనివాసులు. అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలోకి వచ్చినట్లు ఆయన తెలిపారు.

‘‘నేను యాక్సిడెంటల్ బ్యాంకర్. బ్యాంకర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో ఉన్నప్పుడు అందరూ బ్యాంకు పరీక్షలు రాస్తుంటే నేనూ రాశా. చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ చదవాలని ఉండేది. అనుకోకుండా బ్యాంకు ఉద్యోగంలోకి వచ్చా. ఈ ఉద్యోగానికి వచ్చిన కొత్తలో సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లలేదనే బాధ కాస్త ఉండేది. తర్వాత అలాంటి ఆలోచనే రాలేదు’’ అని గతంలో ఈటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీనివాసులు చెప్పారు.

ఎస్‌బీఐలో ప్రతి ఒక్కరికి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుదని, అలా పైస్థాయికి వెళ్లవచ్చని ఆయన వివరించారు.

ఎస్బీఐ

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకుముందు శ్రీనివాసులు స్ట్రెస్డ్ అసెట్స్ రిజల్యూషన్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌, కార్పొరేట్ అకౌంట్స్ గ్రూప్ చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, ఇండోర్ కమర్షియల్ బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు.

గుజరాత్, హైదరాబాద్, ముంబయిలలో పనిచేశారు.

న్యూయార్క్‌లోని ఎస్‌బీఐ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (సిండికేషన్స్)గా బాధ్యతలు నిర్వర్తించారు.

మొత్తంగా శ్రీనివాసులు శెట్టికి ఎస్‌బీఐలో 36 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

డిజిటల్ పేమెంట్స్

ఫొటో సోర్స్, Getty Images

డిజిటల్ బ్యాంకింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ

ముంబయి బ్రాంచ్ హెడ్ జనరల్ మేనేజర్‌గా శ్రీనివాసులు శెట్టి ఉన్నప్పుడు.. ఆయనతో కలిసి పనిచేసిన పేరు రాయడానికి ఇష్టపడని ఎస్‌బీఐ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడారు.

‘‘శ్రీనివాసులుతో కలిసి పనిచేసినప్పుడు కొన్ని విషయాలను నేను గమనించాను. ఆయనకు కార్పొరేట్ ఫైనాన్స్‌పై మంచి పట్టు ఉంది. విషయాలను చాలా సులువుగా గ్రహిస్తారు. లీడర్ షిప్ నైపుణ్యాలు బాగుంటాయి. టీం బిల్డింగ్ బాగా చేసేవారు. ప్రతిఒక్కరిని ప్రోత్సహించే తత్వం ఉండేది.’’ అని చెప్పారు.

ఎస్బీఐ ఛైర్మన్ అయ్యాక ఏ అంశాలపై దృష్టి పెట్టవచ్చనే విషయంపై స్పందిస్తూ.. ‘‘డిజిటల్ బ్యాంకింగ్, రుణాలు సులువైన పద్దతుల్లో అందించడం, కార్పొరేట్ ఫైనాన్స్ పరంగా కొత్త కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది. హెచ్ఆర్ పరంగా ప్రోత్సాహకాలపై దృష్టి పెట్టవచ్చు’’ అని చెప్పారు.

సొంతూరుకు సామాజిక కార్యక్రమాలు

బ్యాంకర్లు ఉద్యోగం చేస్తున్నామనే భావనతో కాకుండా సమాజంలోని ఎవరైనా ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేస్తున్నామనే బాధ్యతతో ఉండాలని శ్రీనివాసులు శెట్టి విశ్వసిస్తుంటారు.

బ్యాంకు తరఫున సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆయన పుట్టిన ఊరికి ప్రాధాన్యం ఇస్తుంటారు.

గతంలో ఎస్‌బీఐ తరఫున మొబైల్ హెల్త్ క్లినిక్ పేరుతో తన సొంతూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య సేవలు ఉచితంగా అందించే ఏర్పాట్లు చేశారు.

అలాగే తాను చదివిన గద్వాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్, ప్రొజెక్టర్ అందించారు.

ఏపీ, తెలంగాణ సీఎంల శుభాకాంక్షలు

శ్రీనివాసులు శెట్టి భార్య శ్రీదేవి. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు శ్రీచరణ్, శ్రీకర్ ఉన్నారు.

శ్రీనివాసులును ఎస్‌బీఐ చైర్మన్‌గా ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారి పేరును సిఫార్సు చేయడం తెలుగువారందరికీ గర్వ కారణం. ఆయన నేతృత్వంలో ఎస్‌బీఐ మరెన్నో మైలురాళ్లు అందుకోవాలి. క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాదకబాధకాలు తెలిసిన శ్రీనివాసులు శెట్టి.. ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింప చేయాలని ఆకాంక్షిస్తున్నా’’ అని చెప్పారు.

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

ఎస్బీఐ

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్ఎస్ఐబీ అంటే ఏమిటి?

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలకు డైరెక్టర్లు, ఛైర్మన్ల నియామకానికి ఇంటర్వ్యూలు చేస్తుంది.

అర్హత కలిగిన వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.

ప్రస్తుతం ఈ బోర్డుకు భానుప్రతాప్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. ఈయన కాకుండా ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఆరుగురు సభ్యులుగా ఉంటారు.

ఈ బోర్డు శ్రీనివాసులుశెట్టి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)