హాథ్‌రస్: ఓ కానిస్టేబుల్ 'భోలే బాబా'గా ఎలా మారారు? సినిమా కథను తలపించే 'సత్సంగ్ బాబా' రియల్ స్టోరీ...

ఫొటో సోర్స్, FB/ GOVERNMENT VISHWAHAR
- రచయిత, దినేశ్ శాక్య
- హోదా, బీబీసీ కోసం
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో జరిగిన సత్సంగ్(ఆధ్యాత్మిక కార్యక్రమం)లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 120 దాటింది.
అయితే, ఈ సత్సంగ్ ఎవరు నిర్వహించారనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.
నారాయణ్ సాకార్ హరి పేరుతో ఈ కార్యక్రమం జరిగినట్లు తేలింది. హాథ్‌రస్ వీధుల్లో అన్ని ఈయన పోస్టర్లే పెట్టారు.
ఈ సత్సంగ్‌లో బోధించే నారాయణ్ సాకార్ ప్రజలకు 'భోలే బాబా', విశ్వహరి అనే పేర్లతో సుపరిచితం.
జూలై నెలలో వచ్చే తొలి మంగళవారం ఈ కార్యక్రమాన్ని ‘మానవ్ మంగళ్ మిలన్’ పేరుతో నిర్వహించారు. మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగమ్ సమితి అనే పేరుతో నిర్వాహకులు దీన్ని చేపట్టారు.
ఈ సమితిలో నిర్వాహకులుగా ఆరుగురి పేర్లు ఉన్నాయి. వారందరి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. స్థానిక పోలీసులు వారిని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు.


ఫొటో సోర్స్, X/AKHILESHYADAV
నిర్వాహకుల కోసం వెతుకులాట
‘‘సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీపై, 'బాబా'పై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.’’ అని అలీగఢ్ ఐజీ శలభ్ మాథుర్ చెప్పారు.
ఈ కేసు ఎఫ్ఐఆర్ రిపోర్టులో కూడా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఉంది. ఈ దుర్ఘటనకు కారణాలను వివరిస్తూ భోలే బాబా ప్రవచనాలను ప్రస్తావించారు. దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు వారిపై విచారణ చేపట్టి, వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
‘‘కమిటీ నిర్వాహకులు, 'భోలే బాబా' కోసం వెతుకుతున్నాం. అందరి మొబైల్ ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయి. అందుకే, ప్రతి ఒక్కరి గురించి సరైన, కచ్చితమైన సమాచారాన్ని సేకరించలేకపోతున్నాం.’’ అని శలభ్ మాథుర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ భోలే బాబా ఎవరు ?
అయితే, అసలు ఈ 'భోలే బాబా' ఎవరు? ఆయన స్టోరీ సినిమా కథను తలపించేలా ఉంది.
సూరజ్‌పాల్ జాతవ్ అలియాస్ భోలే బాబా నారాయణ్ సాకార్ హరి గురించి కొంచెం తెలుసుకుందాం..
మాజీ పోలీసు కానిస్టేబుల్ అయిన సూరజ్‌పాల్ జాతవ్ ఉద్యోగాన్ని వదిలేసి, ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని పుచ్చుకున్నారని తెలిసింది. చూస్తుండగానే ఆయన లక్షల మంది భక్తులను సంపాదించారు.
ఎటా జిల్లా నుంచి విడిపోయిన కాస్‌గంజ్ జిల్లాలోని పటియాలి ప్రాంతానికి చెందిన బహదూర్‌పూర్ గ్రామ నివాసే ఈ నారాయణ్ సాకార్ హరి.
ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో తొలుత ఆయన లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎల్ఐయూ)లో పనిచేశారు. వేధింపుల కేసులో ఆరోపణలు రావడంతో 28 ఏళ్ల కిందట ఆయన సస్పెండ్ అయ్యారు. తర్వాత ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేశారు.
అంతకుముందు, సూరజ్‌పాల్ పలు పోలీసు స్టేషన్లలో, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లలో పనిచేశారు.
వేధింపుల కేసులో సూరజ్‌పాల్ ఎటా జైలులో శిక్ష కూడా అనుభవించారని ఇటావా పోలీసు సీనియర్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ చెప్పారు.


ఫొటో సోర్స్, FB/ GOVERNMENT VISHWAHARI
పోలీసు ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన తర్వాత..
పోలీసు సేవల నుంచి డిస్మిస్ అయిన తర్వాత, సూరజ్‌పాల్ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఆయనకు మళ్లీ ఉద్యోగం వచ్చింది. కానీ, 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకున్నారు సూరజ్‌పాల్.
పదవీ విరమణ తర్వాత సూరజ్‌పాల్ స్వగ్రామం నాగ్లా బహదూర్‌పూర్ చేరుకున్నారు. అక్కడే కొన్ని రోజులు గడిపారు.
భగవంతుడితో మాట్లాడతానని తన ఊరి ప్రజలకు చెప్పడం మొదలు పెట్టారు. తనకు తాను భోలే బాబాగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొద్దికాలంలోనే ఆయనకు అనుచరులు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డారు. వాళ్లు ఆయన్ను అనేక పేర్లతో పిలుచుకునే వారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు వేలసంఖ్యలో ప్రజలు వచ్చేవారు.
సూరజ్‌పాల్ అలియాస్ 'భోలే బాబా' ముగ్గురు సోదరులలో ఒకరని, అందరిలో పెద్దవాడని సంజయ్ కుమార్ చెప్పారు. సూరజ్ పాల్ రెండో సోదరుడు మరణించగా, మూడో సోదరుడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు.
'భోలే బాబా' చాలా అరుదుగా తన ఊరు వెళ్తుంటారు. అయితే, బహదూర్‌పూర్ గ్రామంలో ఉన్న తన చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికీ పనిచేస్తుంది.
గవర్నమెంట్ ఉద్యోగం నుంచి నేను ఇక్కడి దాకా ఎలా ఎదిగానో తనకు తెలియదని సత్సంగ్‌లలో అనేకమార్లు నారాయణ్ సాకార్ హరి చెప్పేవారు.

ఫొటో సోర్స్, Getty Images
విరాళాలు లేకుండానే ఆశ్రమాలు ఏర్పాటు
అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నారాయణ్ సాకార్ ఎలాంటి విరాళాలను, దక్షిణలను, భక్తుల నుంచి కానుకలను తీసుకునే వారు కాదు. కానీ, చాలా ఆశ్రమాలను మాత్రం ఆయన నిర్మించారు.
ఉత్తరప్రదేశ్‌లోని వేరువేరు ప్రాంతాల్లో తన సొంత స్థలంలో ఆశ్రమాలను ఏర్పాటు చేశారు.
సత్సంగ్‌లలో సేవాదారుగా ఆయన పని చేసేవారు. భక్తులలో ఎక్కువ పాపులర్ కావడం కోసం ఆయన ఇవన్నీ చేసి ఉండొచ్చు.
ఆయనెప్పుడూ తెల్లటి వస్త్రాలలోనే కనిపిస్తారు. పైజామా కుర్తా, ప్యాంట్ -షర్ట్, సూట్‌లలో నారాయణ్ సాకార్ కనిపిస్తుండేవారు.

ఇంటర్నెట్‌లో ఆయన అంత పాపులర్ కాదు. సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు అంతగా లేరు.
తన ఫేస్‌బుక్ పేజీలో అంత ఎక్కువ లైక్‌లు లేవు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన లక్షల మంది భక్తులను పోగు చేసుకున్నారు. ఆయన ప్రతి సత్సంగ్‌లో వేల మంది భక్తులు కనిపిస్తుంటారు.
ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు వందలమంది వలంటీర్లుగా పాల్గొంటారు. నీళ్లు, ఆహారం నుంచి భక్తుల రద్దీని నియంత్రించేంత వరకు ప్రతి ఏర్పాటును కమిటీ భక్తులు చూసుకుంటారు.
‘‘మూడేళ్ల కిందట 'భోలే బాబా'కు చెందిన సత్సంగ్‌ను నెలరోజుల పాటు ఇటావా పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించారు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. భవిష్యత్‌లో బాబా ప్రోగ్రామ్ కోసం అనుమతి ఇవ్వొద్దని అధికారులను ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రాంతానికి చుట్టుపక్కలున్న కాలనీ ప్రజలు కోరారు.’’ అని యూపీ పోలీసు సర్వీసులో సర్కిల్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన రామ్‌నాథ్ సింగ్ యాదవ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భక్తులు ఏం చెబుతున్నారు?
నారాయణ్ సాకార్ భక్తులలో సమాజ్‌వాద్ పార్టీ నేత అన్వర్ సింగ్ జాతవ్ కూడా ఒకరు. 'బాబా' తన సత్సంగ్‌లో మానవత్వానికి సంబంధించిన సందేశాన్ని ఇస్తుంటారని అన్వర్ సింగ్ జాతవ్ అన్నారు.
‘‘ప్రేమతో ప్రజలు జీవించాలని, అందరూ కలిసి మెలిసి ఉండాలని చెబుతుంటారు’’ అని ఆయన చెప్పారు.
తన సత్సంగ్‌లలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నారాయణ్ సాకార్ అసలు ఒప్పుకునే వారు కాదని అన్వర్ సింగ్ జాతవ్ అన్నారు.
కార్యక్రమం నిర్వహించేటప్పుడు, కమిటీ ఏర్పడి, ఈ కమిటీలోని సభ్యులందరికీ బాధ్యతలు అప్పజెబుతారు.
సత్సంగ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు, వారిలో వారే విరాళాలను కమిటీ సభ్యులు సేకరించుకుంటారు. కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ‘భూతవైద్యుడి మరణంతో దెయ్యాలు ఊళ్లోకి వచ్చాయి’ అంటూ ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్న జనం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఇల్లు కిరాయికి ఇస్తే నట్టింట్లో 3 అడుగుల మట్టిపోసి గంజాయి సాగు చేశారు
- ‘మా ముత్తాత విశాఖపట్నానికి తొలి ఎంపీ. కానీ మాకు తినడానికి తిండి లేదు. పనసపళ్లు తిని బతుకుతున్నాం’
- హాథ్‌రస్: తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోతున్నారు
- ఉత్తరప్రదేశ్: హాథ్రస్లో సత్సంగ్ కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట, 100 మందికి పైగా మృతి
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














