ముంబయి లోకల్ రైళ్లలో జంతువుల తరలింపులా ప్రయాణాలు, చూస్తే సిగ్గుచేటుగా ఉందన్న హైకోర్టు.. ఎందుకీ పరిస్థితి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రజక్తా పోల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముంబయిలోని లోకల్ రైళ్లలో రద్దీపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రైళ్లలో జంతువులను తరలిస్తున్నట్లుగా ప్రజలు ప్రయాణిస్తున్నారని, ఇలాంటి పరిస్థితి చూస్తుంటే సిగ్గుచేటుగా ఉందని వ్యాఖ్యానించింది.
రద్దీగా ఉండే రైళ్ల నుంచి పడిపోతూ లేదా ట్రాక్‌లపై ఇతర ప్రమాదాల కారణంగా నమోదవుతున్న మరణాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
దీనిని చాలా తీవ్రమైన సమస్యగా కోర్టు పరిగణించింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని యతిన్ జాధవ్ దాఖలు చేశారు.
‘‘ముంబయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సంబంధిత రైల్వే ఉన్నతాధికారులు దీనికి బాధ్యత వహించాలి’’ అని బొంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ నేతృత్వంలోని బెంచ్ చెప్పింది.
‘‘ఈ పిల్ చాలా తీవ్రమైన అంశాన్ని ఎత్తిచూపింది. రైల్వే అధికారులు దీనిపై దృష్టిసారించాలి. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్నందున ఏమీ చేయలేమని మీరు చెప్పడానికి వీలు లేదు. మీరు ప్రజలను జంతువుల్లా ట్రీట్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు చేస్తున్న ప్రయాణాలను చూస్తే అవమానకరంగా అనిపిస్తోంది’’ అని బొంబే హైకోర్టు మండిపడింది.

ముంబయిలో ప్రయాణ కష్టాలపై బీబీసీ అందిస్తున్న వివరణాత్మక కథనం ఇది.
రైల్వే స్టేషన్: డోంబివిలి
సోమవారం, ఉదయం 7.59 గంటలకు
ప్లాట్‌ఫామ్ ప్రయాణికులతో రద్దీగా ఉంది.
కొద్దిసేపట్లో ప్లాట్‌ఫామ్‌పైకి లోకల్ ట్రైన్ రాబోతోందనే ప్రకటన వచ్చింది. రైలు ఎక్కేందుకు పూజ మరోసారి సిద్ధమైంది.
లోకల్ రైలు రాగానే, అది ఆగడానికి ముందే పెద్ద సంఖ్యలో మహిళలు దూసుకొచ్చారు. ఈ రద్దీ ధాటికి తట్టుకోలేక పూజ ప్లాట్‌ఫామ్‌పైనే పడిపోయారు.
చాలా మంది ఆమెను తోసుకుంటూనే రైలు ఎక్కేందుకు వెళ్లారు. ఈ రద్దీలో ట్రైన్ ఎక్కడం పూజ వల్ల కాలేదు. ఆమె కాలుకు గట్టి దెబ్బ తగిలింది. డోంబివిలిలో నివసిస్తున్న పూజకు ఈ ప్రమాదం జరిగి రెండేళ్లు అవుతోంది. కానీ, ఇప్పటికీ తన కాలు నొప్పి పోలేదని పూజ చెప్పారు.
‘‘అంతకుముందు లాగా మేం రైలు ఎక్కలేం. మేం ఎలా వెళ్లాలి? గంట గంటన్నర ముందు బయలుదేరినా, సరైన సమయానికి ఆఫీసుకు చేరుకోలేకపోతున్నాం. చాలా సార్లు గాయపడుతున్నాం. బట్టలు చినుగుతాయి. కానీ, దీనికి ప్రత్యామ్నాయం ఎవరూ ఆలోచించరు’’ అని పూజ వాపోయారు.
2024 ఏప్రిల్ 29న జరిగిన ప్రమాదం
రియా రాజ్గోర్. డోంబివిలిలో నివసించే 26 ఏళ్ల మహిళ. థానేలో ఉన్న తన ఆఫీసుకు వెళ్లాలని బయలుదేరారు. డోంబివిలిలో అన్ని లోకల్ రైళ్లూ కాలుపెట్టేంత చోటు లేకుండా కిక్కిరిసిపోతున్నాయి.
దీంతో, రియా ఫాస్ట్ లోకల్ ఎక్కారు. ఫాస్ట్ లోకల్‌కు డోంబివిలి తర్వాత స్టాప్ థానేనే. ఫాస్ట్ లోకల్‌లో కూడా రద్దీగా ఉండటంతో, ఆమె రైలు లోపలికి ఎక్కలేకపోయారు. డోర్‌ను పట్టుకుని ప్రయాణించారు.
డోర్ వద్ద ఉన్న వారిని లోపలికి నెట్టాలని ప్రయాణించారు. కానీ, ఆమె వల్ల కాలేదు. డోంబివిలి దాటగానే, రైలు స్పీడ్ పెరిగింది. పట్టు కోల్పోయిన రియా, కదులుతున్న రైలు నుంచి ట్రాక్ మీద పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇది ముంబయిలో సెంట్రల్ రైల్వే పరిధిలో పరిస్థితి.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ రైల్వే పరిస్థితి దీనికేమీ భిన్నంగా లేదు.
విరార్‌లో నివసించే హృషికేష్ గోసావి, గత ఏడెనిమిదేళ్లుగా విరార్ నుంచి అంధేరీ మధ్యలో ప్రయాణిస్తున్నారు.
‘‘ఏ సమయానికి వెళ్లినా, లోకల్ రైళ్లలో రద్దీ అలానే ఉంటుంది. ప్రతి రోజూ రైలు ఎక్కేందుకు నానా కష్టాలు పడాల్సిందే. ఎలాగో అలా రైలు ఎక్కితే, మళ్లీ దిగేటప్పుడు ఆ ఇబ్బంది మరోరకంగా ఉంటుంది. అంత రద్దీగా ఉంటుంది రైలు. ఒకవేళ ఎక్కేందుకు, దిగేందుకు కాస్త ఖాళీ దొరికినా, కొన్ని గ్యాంగులు డోర్ల వద్ద నిల్చుని వాటిని బ్లాక్ చేస్తాయి. కొందరు అవసరం లేని రూల్స్‌ను ప్రవేశపెడుతూ, బలవంతంగా ప్రయాణికులు పాటించేలా చేస్తారు. పోలీసులుంటారు, కానీ ఈ విషయాల్లో జోక్యం చేసుకోరు. ఒకవేళ ఎవరికైనా కొత్త వారికి ఈ నిబంధనలు తెలియకపోతే, వారెలా ప్రయాణించగలరు? దైనందిన జీవిత పోరాటం కాలు పెట్టడానికి కూడా వీలులేనంత రద్దీగా ఉండే లోకల్ ట్రైన్ వద్ద మొదలై, అదే లోకల్ ట్రైన్‌తో ముగుస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయాలి’’ అని హృషికేష్ గోసావి అన్నారు.
ముంబయి, దాని శివారు ప్రాంతాల్లో నివసించే లక్షల మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులివి.
లోకల్ రైలు కాకుండా మరో సరైన ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకపోవడంతో, లక్షల మంది ముంబయి వాసులకు మరో మార్గం లేకుండా పోయింది. ప్రతి రోజూ ఈ ప్రయాణ కష్టాలు పడాల్సిందే!

ఫొటో సోర్స్, Getty Images
కరోనా తర్వాత రద్దీ తగ్గినా ప్రమాదాలు తగ్గలేదు..
12 బోగీలుండే లోకల్ రైలులో మూడున్నర వేల మంది ప్రయాణించొచ్చు. కూర్చుని, నిల్చుని ప్రయాణించవచ్చు. అయితే, పీక్ అవర్స్‌లో ఈ రైళ్లలో ఈ పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు.
సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేల పరిధిలో కలిసి 2019, 2020లలో రోజుకు సుమారు 75 లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణించారు. కోవిడ్ తర్వాత ఈ రద్దీ కాస్త తగ్గిందని రైల్వే గణాంకాలు చెబుతున్నాయి.
కరోనా తర్వాత పశ్చిమ రైల్వే పరిధిలో రోజూ సుమారు 7 లక్షల 13 వేల మంది ప్రయాణికులు తగ్గారని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే, సెంట్రల్ రైల్వేలో రోజుకు 3.82 లక్షల మంది ప్రయాణికులు తగ్గారని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రయాణికులు తగ్గినా, ఈ రద్దీకి కారణమేంటి? అంటే సరైన సమాధానం లేదు.
రద్దీ తగ్గిన విషయం నిజమైనప్పటికీ, ప్రజల ప్రయాణం మాత్రం సులభతరం కాలేదు. లోకల్ రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు జరిగే మరణాలు ఆగడం లేదు.
అధికారిక లెక్కల ప్రకారం, పశ్చిమ రైల్వే పరిధిలో రోజుకు మూడు మరణాలు నమోదవుతున్నాయి.
2023లో 936 మంది చనిపోగా, 984 మంది గాయపడ్డారు.
ఇందులో కేవలం ప్రయాణ మరణాలను మాత్రమే కాక, ఇతర మరణాలు కూడా ఉన్నాయి.
పశ్చిమ రైల్వే అధికారులు చెబుతున్న దాని ప్రకారం, చాలా వరకు మరణాలు ట్రాక్‌లు దాటేటప్పుడు లేదా ఆత్మహత్యల కారణంగా నమోదవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మహిళా ప్రయాణికుల డిమాండ్లు నెరవేరడం లేదు
నిత్యం లోకల్ ట్రైన్లలో ప్రయాణించే మొత్తం ప్రయాణికుల్లో 20 నుంచి 22 శాతం మంది మహిళలు ఉంటారు.
1982లో మహిళల కోసం తొలిసారి సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్ కోచ్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ కోచ్‌లను పెంచింది.
ఫస్ట్ క్లాస్ కోచ్‌లతో పాటు మొత్తం ఐదు కోచ్‌లు మహిళల కోసం కేటాయించారు. కానీ, వాటిల్లో ప్రయాణించడం కూడా కష్టంగానే ఉంటుంది.
‘‘పది పన్నెండేళ్ల క్రితం మహిళా ప్రయాణికులు చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం ప్రతి మహిళా బయటికి వస్తున్నారు. ఈ సంఖ్య పెరిగింది. గత కొన్నేళ్లుగా ఫస్ట్ క్లాస్ కోచ్‌లలో ఎలాంటి మార్పు లేదు’’ అని సంగతన్‌కు చెందిన లతా హార్డికర్ చెప్పారు.
మహిళల కోసం ప్రత్యేకంగా లోకల్ రైళ్లను నడుపుతున్నారు.
ప్రస్తుతం సెంట్రల్ రైల్వే 4 ఉమెన్ స్పెషల్ రైళ్లను నడుపుతుండగా.. పశ్చిమ రైల్వే 10 నడుపుతోంది. ఈ రైళ్లకు మంచి స్పందన వస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
మహిళల భద్రత కోసం స్టేషన్లలో, మహిళా కంపార్ట్‌మెంట్లలో సీసీటీవీ కెమెరాలు పెట్టారు. కానీ, ఇప్పటికీ కొందరు పురుషుల వల్ల ఇబ్బంది పడుతున్నామని, ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే ఎత్తడం లేదంటున్నారు మహిళా ప్రయాణికులు.
కానీ, దీనిపై రైల్వే అడ్మినిస్ట్రేషన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాజెక్టులు ఆలస్యం
2023-24 ఏడాది రైల్వే శాఖ కోసం రూ.2.44 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు. దానిలో రూ. 789 కోట్లు ముంబయి పరిసర ప్రాంతాల్లో రైల్వే ప్రాజెక్టుల విస్తరణకు ఇచ్చారు. చాలా ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేదా నిలిచిపోవడంతో లోకల్ ట్రైన్ ప్రయాణికుల కష్టాలు తీరడం లేదు.
‘‘ముంబయి పేరు ప్రపంచమంతా వినిపిస్తుంటుంది. కానీ, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ముంబయి లోకల్ రైళ్లకు సమానమైన రీతిలో ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోతోంది. ముంబయి లోకల్ ట్రైన్ ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది. కానీ, ప్రయాణికులను ఎందుకు పట్టించుకోవడం లేదు?’’ అని రైల్వే ప్రయాణికుల అసోసియేషన్ ప్రతినిధి కేతన్ షా ప్రశ్నించారు.
‘‘ఎన్నికల సమయంలో, సెక్యూరిటీ గార్డులతో రైలులో ప్రయాణిస్తారు. కానీ, సెక్యూరిటీని వదిలిపెట్టి, రష్ అవర్లలో ప్రయాణించండి. కోస్టల్ రోడ్డును, అండర్‌గ్రౌండ్ మెట్రోను మీరు అభివృద్ధి చేయొచ్చు. రైల్వే కారిడార్‌ను పట్టించుకోవడంలేదు? చాలా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ రూట్లను ఎప్పుడు అభివృద్ధి చేస్తారో ఎంపీలు, రైల్వే అధికారులు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేయాలి?
- రద్దీని సమర్థవంతంగా తట్టుకునే ప్రణాళిక అవసరం.
- లోకల్ రైళ్ల ట్రిప్పులను పెంచాలి.
- ఏసీ లోకల్‌లో ప్రయాణించడం అందరికీ సాధ్యం కాదు. ఏసీ లోకల్‌కు సాధారణ లోకల్ కోచ్‌లను జత చేయాలి.
- తిత్వాలా బడ్లపూర్ 15 కోచ్ ట్రైన్లను ప్రారంభించాలి.
- లేడీస్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ల సంఖ్యను పెంచాలి. ఎక్కువ రద్దీ ఉండే సమయాల్లో సెకండ్ క్లాస్ కంటే ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటోంది.
- ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్‌లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. టీసీలు అందుబాటులో ఉండటం లేదు.
- రాత్రిపూట ప్రయాణించేటప్పుడు మద్యం సేవించిన వారి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై రైల్వే పోలీసులు దృష్టిపెట్టడం అవసరం.
- అంతకుముందు సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై రాయితీ ఇచ్చేవారు. ఆ మినహాయింపు ఇప్పుడు కూడా ఇవ్వాలి.
- మహిళల కోసం అదనంగా టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. శుభ్రతపై దృష్టిపెట్టాలి.
- తరచూ ఎస్కలేటర్లు క్లోజ్ అవుతూ ఉంటాయి. దీని వల్ల, సీనియర్ సిటిజన్లు వంతెన దాటడం ఇబ్బందవుతోంది.
ఇవి కూడా చదవండి:
- బాలుడి పుర్రెలో మూర్ఛను తగ్గించే పరికరం అమర్చారు.. తర్వాత ఏమైందంటే?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














