జో బైడెన్: ‘తడబడ్డాను, కానీ రేసు నుంచి తప్పుకోను..’

జో బైడెన్, కమలాహారిస్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు తన మద్దతు కొనసాగుతుందని కమలా హారిస్ పునరుద్ఘాటించారు.
    • రచయిత, గరెత్ ఎవన్స్, కోర్ట్నీ సుబ్రమణియన్, కయ్లా ఎప్‌స్టెయిన్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్ & న్యూయార్క్

ఇటీవల డోనల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో తాను సరిగా మాట్లాడలేకపోయిన మాట వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. అయినా ఎన్నికల రేసులో పోరాడతానని ప్రతిజ్ఞ చేయడంతోపాటు మద్దతుదారులకు భరోసానిచ్చారు.

చర్చలో తన తడబాటు మాటలతో పొరపాటు చేశానని ఆయన విస్కాన్సిన్ రేడియో స్టేషన్‌కు తెలిపారు. కానీ ప్రజలు ట్రంప్‌తో సంవాదాన్ని కాక, శ్వేతసౌధంలో తన పనితీరును బట్టి తనను అంచనా వేయాలని ఆయన కోరారు.

భవిష్యత్తు పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేసుకుంటున్న బైడెన్ స్టేట్ గవర్నర్లు, ప్రచార సిబ్బంది సహా సీనియర్ డెమోక్రాట్లను శాంతింపచేసే పనిలో పడినట్టు బుధవారం నాటి మీడియా కథనాలు చెబుతున్నాయి.

విస్తృత ఎన్నికల ప్రచారానికి పిలుపునిస్తూ ఆయన ‘‘డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని నేనే. నన్నెవరూ తప్పుకోమనడం లేదు. నేను పోటీ నుంచి వైదొలగడం లేదు’’ అని చెప్పినట్టు విశ్వసనీయవర్గాలు బీబీసీ న్యూస్‌కు చెప్పాయి.

అయితే, నవంబర్‌లో ఎన్నికలు జరిగే ముందు కమలాహారిస్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

కానీ బైడెన్‌కు మద్దతు ఇచ్చే విషయాన్ని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ పునరుద్ఘాటించారు.

విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ బైడెన్, హారిస్ శిబిరం ఓ ఈమెయిల్ కూడా పంపింది.

‘‘నేనీ విషయాన్ని స్పష్టంగా, సరళంగా చెబుతున్నాను. నేను పోటీలోనే ఉన్నాను’’ అని బైడెన్ చెప్పారు.

మాటల్లో తడబాటు, బలహీనమైన గొంతుతో 81 ఏళ్ళ బైడెన్ తన ప్రచారాన్ని కొనసాగించగలరా? అనే ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.

బైడెన్ సామర్థ్యంపైనా, ఆయనకు ఎన్నికలు గెలిచే సత్తా ఉందా? అనే విషయంపైనా డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు.

రిపబ్లికన్ల ఆధిక్యం పెరుగుతోందని వస్తున్న సర్వేలతో బైడెన్ వైదొలగాలనే ఒత్తిడి పెరుగుతోంది.

బైడెన్, ట్రంప్ చర్చ అనంతరం న్యూయార్క్ టైమ్స్ ఓ పోల్ నిర్వహించింది. దాని ఫలితాలను బుధవారం ప్రచురించింది. అందులో ట్రంప్ 6 పాయింట్ల ఆధిక్యంతో ఉన్నట్టు తేలింది.

కీలక రాష్ట్రాలలో బైడెన్ కంటే ట్రంప్ మూడు పాయింట్లు ముందంజలో ఉన్నట్టు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ పబ్లిష్ చేసిన ప్రత్యేక పోల్‌ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
బైడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

‘బైడెన్ తప్పుకోవాలి’

బైడెన్ పక్కకు జరగాలని కొందరు డెమోక్రాటిక్ దాతలు, చట్టసభ సభ్యులు బహిరంగంగా పిలుపునివ్వడం కూడా ఆయనకు నష్టం కలిగిస్తోంది.

అలా పిలుపునిచ్చినవారిలో మసాచుసెట్స్‌లోని పారిశ్రామికవేత్త, భారత సంతతి అమెరికన్ రమేష్ కపూర్ కూడా ఉన్నారు. ఆయన 1988 నుంచి డెమోక్రాట్ల కోసం నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

‘‘ఆయన (బైడెన్) తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను’’ అని కపూర్ బీబీసీకి చెప్పారు.

‘‘ఆయనకు విజయం సాధించాలనే తపన ఉందని నాకు తెలుసు. కానీ ప్రకృతికి ఎదురొడ్డి పోరాడలేం’’ అని తెలిపారు.

అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ను తప్పించాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌లోని ఇద్దరు డెమోక్రాట్ ప్రతినిధులు బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరైన ఆరిజోనా ప్రతినిధి రౌల్ గ్రిజాల్వా న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ బైడెన్ సరైన ఎంపిక కాదని, పార్టీ మరో వ్యక్తిని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలను బైడెన్ శిబిరం, శ్వేతసౌధం కొట్టిపారేస్తున్నాయి. నవంబర్ 5న ట్రంప్‌ను రెండోసారి ఓడించడానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పాయి.

తాను మళ్ళీ ఎన్నికయ్యే అవకాశానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు తనకు తెలుసునని బైడెన్ ఓ మద్దతుదారుకు చెప్పినట్టు ది న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ బుధవారం నాడు రిపోర్ట్ చేశాయి.

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 90 నిమిషాల చర్చ కాదు, 3.5 సంవత్సరాలలో ఏం చేశానో చూడాలని జో బైడెన్ విజ్ఞప్తి చేశారు.

‘అదంతా అబద్ధం’

బైడెన్ తప్పుకుంటారనే ప్రచారం ‘పూర్తిగా అబద్ధం’ అని ఓ అధికార ప్రతినిధి చెప్పారు. తరువాత కొద్దిసేపటికే శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ బైడెన్ వైదొలుగుతారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.

కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసోమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ సహా 20 రాష్ట్రాల గవర్నర్లతోపాటు సీనియర్ డెమోక్రాట్లతో బైడెన్ బుధవారం సమావేశమయ్యారు.

బైడెన్‌ను పక్కన పెడితే ఆయన స్థానంలో కాలిఫోర్నియా, మిషగన్ రాష్ట్రాల గవర్నర్లను ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారనే ప్రచారం ఉంది.

సమావేశం అనంతరం మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ ‘‘అధ్యక్షుడికి మేము, మాకు అధ్యక్షుడు పరస్పరం వెన్నుదన్నుగా నిలుస్తాం’’ అని చెప్పారు.

కానీ 59 ఏళ్ళ కమలా హారిస్‌ను ఇప్పటికీ బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు. అయితే ఆమె ఆమోదనీయ రేటింగ్స్ పేలవంగా ఉన్నాయి.

బైడెన్-ట్రంప్ సంవాదం తరువాత డెమోక్రాట్లలో ఆమెకు మద్దతు పెరిగింది.

ఈ ఊహాగానాల నడుమ, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తాను ఇకపై కమలాహారిస్‌పై దృష్టి సారించనున్నట్టు తెలియజేశాయి.

డైలీ బీస్ట్ సేకరించిన ఫుటేజీలో, ట్రంప్ స్వయంగా ఆన్‌లైన్‌లో షేర్ చేసిన దాంట్లో... ట్రంప్ బైడెన్‌ను తిట్టిపోస్తున్నట్టుగా ఉంది. తాను బైడెన్‌ను విలువలేని వ్యక్తిగా చేశానని, ఆయన కంటే హారిస్ దయనీయమైనప్పటికీ బెటర్ అని వ్యాఖ్యానించినట్టు ఉంది.

కమలా హారిస్
ఫొటో క్యాప్షన్, జో బైడెన్ తప్పుకుంటే కమలాహారిస్ పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

కమలాహారిస్‌ పోటీ చేస్తారా?

ట్రంప్‌తో బైడెన్ చర్చ ముగిసిన వెంటనే ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ సీఎన్ఎన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అధ్యక్షుడికి పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు.

అధ్యక్షుడి తరపున కమలాహారిస్ ప్రచారం కొనసాగిస్తారని ఆమె సన్నిహితులు ఒకరు బీబీసీ న్యూస్‌కు చెప్పారు.

‘‘అధ్యక్షుడికి మంచి భాగస్వామిగా ఉండాలనే విషయాన్ని ఆమె ఎప్పుడూ మనసులో పెట్టుకుంటారు’’ అని ఆమె మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జమాల్ సిమన్స్ బీబీసీ న్యూస్‌కు చెప్పారు.

‘‘డెమోక్రాట్ల నామినీని నిర్ణయించే వారందరూ ఇప్పటికే బైడెన్‌కు మద్దతు ఇస్తామని వాగ్దానం చేశారు. ఒకవేళ ఇప్పుడు బైడెన్ వైదొలగినా, ఇతరులు నామినేషన్ పొందడమనేది సవాలుగా మారుతుంది. కమలా హారిస్ ఉత్తమమైన పని ఏమిటంటే ఆమె అధ్యక్షుడికి భాగస్వామిగా ఉండటమే’’ అన్నారు.

కమలా హారిస్‌లో ఎలాంటి మార్పు రాలేదని, ఆమె అధ్యక్ష పదవికి ప్రచారం కొనసాగిస్తారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

డెమోక్రటిక్ నేషనల్ కమిటీ సభ్యులు ఆగస్టులో జరిగే సదస్సులో అధికారికంగా బైడెన్‌ను పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేయడానికి ఓటు వేస్తారు. ఈ నామినేషన్‌తో బ్యాలెట్‌పై దేశవ్యాప్తంగా బైడెన్ పేరు ఉంటుంది.

దీనిపై ఇతర ప్రతినిధులతో చర్చించిన ఓ సభ్యుడు అంతర్గతంగా జరిగిన సున్నిత చర్చల గురించి బీబీసీతో చెప్పారు. ‘‘ఒక వేళ బైడెన్ తప్పుకుంటే నామినేషన్ కమలాహారిస్‌కు వెళ్తారు’’ అని ఆయన తెలిపారు. ఆయన తన పేరును బయటికి వెల్లడించొద్దని బీబీసీని కోరారు.

‘‘బహిరంగంగా చర్చిస్తే, అది గందరగోళానికి దారి తీసి, నవంబర్‌లో మమ్మల్ని దెబ్బతీయచ్చు’’ అని చెప్పారు.

రాబోయే రోజులలో అధ్యక్ష పదవికి తగిన సత్తా ఉందనే విషయాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని బైడెన్, ఆయన టీమ్ గుర్తించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది.

ఈ వారాంతంలో విస్కాన్సిన్, ఫిలడెల్ఫియా పర్యటనలకు బైడెన్ సిద్ధమయ్యారు. ఇక ట్రంప్‌తో చర్చ తరువాత ఆయన మొదటిసారిగా ఈ శుక్రవారం నాడు ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో కనిపించనున్నారు.

ట్రంప్‌తో సంవాదంలో తడబడినట్టు ఒప్పుకుంటూనే ‘‘వేదికపై ఆ 90 నిమిషాలు కాదు, గడిచిన 3.5 సంవత్సరాలలో నేనేం చేశానో చూడండి’’ అని బైడెన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)