మీలో కొందరు ఫోన్ పే, గూగుల్ పేలో కరెంటు బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేరు, ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు ఫోన్ పే, గూగుల్ పే, క్రెడ్, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్‌ల ద్వారా కరెంటు బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు వంటివి చెల్లిస్తున్నారా? అయితే, ఇక నుంచి మీరు అలా చేయలేకపోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన నిబంధనలే ఇందుకు కారణం.
కొన్ని బ్యాంకుల కార్డుల నుంచి మినహా, మెజార్టీ బ్యాంకుల కార్డుల ద్వారా బిల్లుల చెల్లింపులు నిలిచిపోతాయని ఆర్బీఐ ప్రకటించింది.
అంటే, కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రం అలాంటి ఇబ్బందులు కలగకపోవచ్చు. ఎందుకంటే, ఆర్బీఐ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసుకోవడంతో ఆయా బ్యాంకుల కస్టమర్లకు ఈ ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు.
‘‘ఆర్బీఐ ఆదేశాల మేరకు ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా బ్యాంకులు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కరెంటు బిల్లులు కట్టించుకోవడం లేదు. జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వినియోగదారులందరూ తమ నెలవారీ కరెంటు బిల్లులు నేరుగా టీజీఎస్పీడీసీఎల్ వెబ్ సైట్, టీజీఎస్పీడీసీఎల్ యాప్ సాయంతో బిల్లులు కట్టాలి’’ అని తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ సూచించింది.


ఫొటో సోర్స్, Getty Images
ముగిసిన బీబీపీఎస్ యాక్టివేషన్ డెడ్‌లైన్
ప్రస్తుతం ఆయా బ్యాంకులకు యూపీఐ లేదా ఇతర పేమెంట్ గేట్ వేల సాయంతో చెల్లింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్ పే, క్రెడ్, పేటీఎం వంటివి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా జరుగుతుంటాయి.
ఇకపై ఇలాంటి బిల్లులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా జరగాలని ఆర్బీఐ నిబంధన విధించింది. దీనికి జూన్ 30 డెడ్‌లైన్‌గా బ్యాంకులకు నిర్దేశించింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకులన్నీ భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ గేట్‌వేను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోకపోతే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చెల్లించే బిల్లులు ప్రాసెస్ కావని ఆర్బీఐ ప్రకటించింది.
‘‘గూగుల్ పే, ఫోన్ పే, క్రెడ్ వంటివి థర్డ్ పార్టీ యాప్స్. అంటే, ఇవి మనం చెల్లించిన బిల్లులను ముందుగా యాప్స్ ఖాతాలో వేసుకుని.. అక్కడి నుంచి చెల్లింపులు జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఒకవేళ మనం నేరుగా బ్యాంకు యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి బిల్లు చెల్లిస్తే అది నేరుగా బ్యాంకు ద్వారా ప్రాసెస్ అవుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ అనేవి బ్రిడ్జిలా పనిచేస్తాయి. వీటి పేమెంట్ గేట్ అనేది యూపీఐపై ఆధారపడి ఉంది. అలా కాకుండా, మరింత భద్రతతో కూడిన పేమెంట్ గేట్‌వే 'భారత్ బిల్ పేమెంట్స్ వ్యవస్థ'ను ఆర్బీఐ తీసుకొచ్చింది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలని బ్యాంకులకు చెప్పింది’’ అని ముంబయికి చెందిన బ్యాంకు ఆఫ్ బరోడా మేనేజర్ ఒకరు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఏంటి?
ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ 'భారత్ బిల్ పే సిస్టమ్'ను తీసుకొచ్చింది.
దీని ద్వారా ఖాతాదారులు తమ చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. డిజిటల్ విధానంలో పేమెంట్స్ చేసేందుకు భారత్ బిల్ పే వ్యవస్థ ఒక గేట్ వేగా పనిచేస్తుంది.
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, టెలికాం, డీటీహెచ్, రుణ చెల్లింపులు, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫాస్టాగ్, కేబుల్ వంటి బిల్లుల చెల్లింపులకు వెసులుబాటు కల్పిస్తోంది.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. దీనిలో దాదాపు 21 వేలకుపైగా బిల్లర్లు, 1224 మంది ఏజెంట్ ఇన్‌స్టిట్యూషన్లు రిజస్టర్ చేసుకున్నట్లు భారత్ బిల్ పే చెబుతోంది.
దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ 2014 ఆగస్టులోనే రూపొందించింది ఆర్బీఐ. ఇందుకోసం గిరో అడ్వైజరీ గ్రూప్ చైర్మన్ ఉమేష్ బెల్లూర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో పకడ్బందీగా ఉండే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు.
ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌కు అజయ్ కుమార్ చౌధురి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. నుపూర్ చతుర్వేది సీఈవోగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యాక్టివేట్ చేసుకున్నవి ఎనిమిది బ్యాంకులే..
దేశంలోని నేషనలైజ్డ్, ప్రైవేటు సెక్టార్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎనిమిది బ్యాంకులు - ఎస్బీఐ, కొటక్ మహింద్రా, ఇండస్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు, ఐడీబీఐ, కెనరా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రమే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకున్నాయి.
మిగిలిన బ్యాంకులు యాక్టివేట్ చేసుకోలేదు. దీనివల్ల ఆయా బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలంటే ఇబ్బంది అవుతుంది.
ముఖ్యంగా క్రెడిట్ కార్డుల బిల్లులు, కరెంటు, వాటర్, ఇంటి పన్ను బిల్లులు చెల్లించడం సాధ్యపడకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారి చెప్పారు.
హెచ్‌డీఎఫ్‌సీ దేశంలోనే అత్యధిక క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకు. 2024 మే నెలకు సంబంధించి ఆర్బీఐ డేటా పరిశీలిస్తే.. ఆ బ్యాంకు 2.11 కోట్ల క్రెడిట్ కార్డులను జారీ చేసింది.
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బీబీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకోకపోవడం కారణంగా థర్డ్ పార్టీ యాప్స్ అయిన క్రెడ్, ఫోన్ పే వంటి వాటి ద్వారా ఈ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేరు.
మేజర్ బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకుల క్రెడిట్ కార్డు బిల్లులను కూడా థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో వినియోగదారులు కట్టలేరు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు సమస్య ఏంటంటే..
ఇప్పటి వరకూ కరెంటు బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, డీటీహెచ్ బిల్లుల వంటి వాటిని ఎక్కువ మంది థర్డ్ పార్టీ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో చేసేస్తుంటారు.
ఒక బిల్లు కోసం మీరు చెల్లింపు చేసినప్పుడు మొదట మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు కట్ అవుతుంది. అది యాప్ ఖాతాకు చేరి, అక్కడి నుంచి యూపీఐ గేట్‌వే ద్వారా సంబంధిత శాఖ(ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు), లేదా బ్యాంకు క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించిన ఖాతాకు జమవుతుంది.
అయితే, ఇప్పుడు బిల్లుల చెల్లింపుల కోసం కొత్తగా తీసుకొచ్చిన గేట్‌వే అయిన భారత్ బిల్లింగ్ పేమెంట్ సిస్టమ్‌ను చాలా బ్యాంకులు యాక్టివేట్ చేసుకోకపోవడం వల్ల ఆ సేవలు నిలిచిపోవచ్చు.
థర్డ్ పార్టీ యాప్ నుంచి మీరు చెల్లింపు చేసినప్పుడు, ఒకవేళ మీ బ్యాంకు బీబీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకోకపోయినట్లయితే ఆ చెల్లింపు మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే, థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి బీబీపీఎస్ ద్వారా బిల్లుల చెల్లింపులకు అవకాశం లేకపోవడమే అందుకు కారణం.
అందువల్ల, మీ బ్యాంకు బీబీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకుంటేనే థర్డ్ పార్టీ యాప్ నుంచి చెల్లింపులు వీలవుతాయి. ప్రస్తుతం ఎనిమిది బ్యాంకులు మాత్రమే యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఆయా బ్యాంకుల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. మిగిలిన వారు ఆ యాప్స్ ద్వారా బిల్లులు చెల్లించలేకపోవచ్చు.
అలా కాకుంటే, నేరుగా బ్యాంకు పోర్టల్ నుంచి, లేదా సంబంధిత బ్యాంకు యాప్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది.
అయితే, ఇది కేవలం బిల్లుల చెల్లింపులకు మాత్రమే సంబంధించినదని బ్యాంకు అధికారి తెలిపారు. నగదు లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి బిల్లులు చెల్లించడమెలా?
థర్డ్ పార్టీ యాప్స్ అనేవి యూపీఐ ఆధారిత చెల్లింపులకు వెసులుబాటు కలిగివున్నాయి. వాటితో కాకుండా బిల్లులు చెల్లించాలంటే నేరుగా బ్యాంకు పోర్టల్‌లోకి వెళ్లి బిల్లులు కట్టొచ్చని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకున్న బ్యాంకుల వినియోగదారులైతే.. ఆయా థర్డ్ పార్టీ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.
కరెంటు లేదా నీటి బిల్లులు చాలా వరకు ఆయా ప్రభుత్వ కార్యాలయాల వెబ్‌సైట్ లేదా కలెక్షన్ పాయింట్లలోనూ చెల్లించే వీలుంటుంది.
కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేందుకు వినియోదారులు ఎక్కువగా థర్డ్ పార్టీ యాప్స్‌ను వినియోగిస్తుంటారు. దీనివల్ల రివార్డ్ పాయింట్స్ రావడం లేదా కూపన్లు వస్తుంటాయని యాప్స్‌పై ఆధారపడుతుంటారు.
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్ బ్యాంకులు ఎక్కువగా క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. వీటికి సంబంధించిన క్రెడిట్ కార్డుల బిల్లులు నేరుగా బ్యాంకు పోర్టల్ ద్వారా చెల్లించేందుకే వీలవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో బ్యాంకుల వారీగా జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య…
హెచ్‌డీఎఫ్ సీ – 2,11,11,287
ఎస్బీఐ – 1,91,17,365
ఐసీఐసీఐ - 1,70,84977
యాక్సిస్ - 1,43,40,543
కోటక్ మహింద్రా బ్యాంకు– 59,35,815
ఎస్ బ్యాంకు – 21,52,111
ఇండస్ ఇండ్ బ్యాంకు – 29,66,866
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు – 27,43,113
బ్యాంక్ ఆఫ్ బరోడా – 25,75,688
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ - 13,60,555
స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకు – 10,90,953
ఫెడరల్ బ్యాంకు – 9,85,499
ఆధారం: 2024 మే నెల వరకూ ఆర్బీఐ డేటా
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?
- వీళ్లు ఏటా లీటర్ల కొద్దీ మద్యం తాగేస్తున్నారు, అత్యధికంగా ఆల్కహాల్ తాగే దేశాలు ఇవే..
- ఈ పామును చంపితే రూ. 35 వేలు బహుమతి ఇస్తామని ఆ రాజకీయ నాయకుడు ఎందుకు ప్రకటించారు?
- చాంగ-6: చంద్రుని ఆవలి వైపు నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చిన చైనా వ్యోమనౌక
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














