లోక్‌సభ-రాజ్యసభ: సభ్యుల మైక్‌ను కట్ చేసేది ఎవరు, ఈ కంట్రోల్ స్పీకర్, చైర్మన్‌ల దగ్గరే ఉంటుందా?

ఓం బిర్లా, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

18వ లోక్‌సభ తొలి సెషన్ రోజే అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది.

అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలను ఓం బిర్లా కొట్టివేశారు.

లోక్‌సభలో మాట్లాడేందుకు సభ్యులకు ఇచ్చే మైక్రోఫోన్‌ విషయంలో కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలుపుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలుపుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రతిపక్షాలు ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి?

జూన్ 28 శుక్రవారం నాడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతున్న సమయంలో ఆయన మైక్ ఆగిపోయింది. మైక్‌ ఆన్ చేయాలని లోక్‌సభ స్పీకర్‌ను రాహుల్ గాంధీ కోరారు.

నీట్ ఎగ్జామ్‌ అంశంపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘విద్యార్థులకు అండగా మేమున్నాం’ అనే సందేశాన్ని ఇస్తూ అధికార పార్టీ, విపక్షాలు నీట్ ఎగ్జామ్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ కోరారు.

రాహుల్ గాంధీ డిమాండ్‌పై స్పందించిన ఓం బిర్లా, ‘‘సభ నియమాలకు అనుగుణంగా మేం వెళ్తాం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించిన తర్వాతనే ఈ చర్చను చేపడతాం.’’ అని చెప్పారు.

ఆ తర్వాత రాహుల్ గాంధీ మైక్‌ను ఆపివేశారు.

దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసింది.

‘‘పార్లమెంట్‌లో మైక్రోఫోన్‌ను అపేయడం అనేది యువత గొంతుకను నొక్కివేసే కుట్ర.’’ అని కాంగ్రెస్ ఆరోపించింది.

ఓం ప్రకాశ్ బిర్లా

ఫొటో సోర్స్, ANI

‘‘ఇంతకు ముందులాగానే మైక్రోఫోన్‌ను ఆపేసే బటన్ నా దగ్గర లేదు. దానికొక విధానం ఉంది. మైక్రోఫోన్ ఆపివేసే మెకానిజం ఇక్కడ లేదు.’’ అని ఓం బిర్లా పీటీఐ వార్తాసంస్థ కు తెలిపారు.

రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ కూడా ఇదే విషయంపై సభలో తీవ్రంగా మండిపడ్డారు.

‘నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ధన్కడ్ అనే లోపే, కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి మధ్యలో ఆటంకం కలిగిస్తూ మరేదో చెప్పారు.

ఈ సమయంలో ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ మైక్ ఆపమంటారా? నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎవరి మైక్ ఆన్‌లో ఉండటానికి వీలు లేదు. మీకు ఈ విషయం తెలుసు. మీకు సుదీర్ఘ అనుభవం ఉంది.’’ అని అన్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో, లోక్‌సభలో మైక్రోఫోన్‌ను ఎవరు నియంత్రిస్తారనే దానిపై అందరి దృష్టి మళ్లింది. సభ్యుల మైక్‌లను స్పీకర్ ఆపివేయగలరా? సభలో అనుసరించే విధానం ఏంటి? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

లోక్‌సభ

ఫొటో సోర్స్, ANI

హాల్ విధానం ఏంటి?

లోక్‌సభ, రాజ్యసభలో ప్రతి ఎంపీకి ఒక కుర్చీ ఉంటుంది. ఎంపీ డెస్క్‌కు మైక్ అనుసంధానించి ఉంటుంది.

2014లో దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ఇన్‌ఫర్మేషన్ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. దీనిలో ప్రతి ఎంపీకి మైక్, స్విచ్ బోర్డు ఇస్తారని తెలిపింది.

ఈ స్విచ్ బోర్డులో వేరువేరు రంగుల బటన్లు ఉంటాయి. ఎంపీ మాట్లాడాలనుకున్నప్పుడు, ఈ బోర్డులోని గ్రే బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు, వారికి ముందున్న మైక్ ఆన్ అవుతుంది. రెడ్ బటన్ ప్రారంభమవుతుంది.

పార్లమెంట్‌లో రెండు సభలలో కూడా ఒక చాంబర్ ఉంటుంది. ఈ చాంబర్‌లో సౌండ్ టెక్నిషియన్లు కూర్చుని ఉంటారు.

సభలకు చెందిన ప్రొసీడింగ్స్‌ను వారు రిజిస్టర్ చేసి, రికార్డు చేస్తుంటారు. ఈ చాంబర్‌లో ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటుంది. ఈ బోర్డుపై సభ్యులందరి సీటు నెంబర్లు రాసి ఉంటాయి. అక్కడి నుంచే మైక్రోఫోన్లను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం చేస్తుంటారు.

లోక్‌సభలో ఈ విధానాన్ని లోక్‌సభ సెక్రటేరియట్, రాజ్యసభలో రాజ్యసభ సెక్రటేరియట్ నియంత్రిస్తుంటాయి.

ఈ టెక్నిషియన్లందరూ కూడా నిపుణులు, అనుభవజ్ఞులై ఉంటారు.

సభలో సభ్యుల మైక్‌ను స్పీకర్ ఆపివేయొచ్చా?

సభ్యుల మైక్‌ను ఆపివేయాలని స్పీకర్ ఆదేశించగలరని లోక్‌సభ, రాజ్యసభ ప్రొసీడింగ్స్‌ను కవర్ చేసే సీనియర్ జర్నలిస్టులు చెప్పారు.

కానీ, అది కూడా నిబంధనలకు అనుగుణంగా ఉంటుందన్నారు. మైక్‌ను నేరుగా నియంత్రించే అధికారం ఆయన/ఆమెకు ఉండదన్నారు.

సభా కార్యక్రమాల్లో ఏదైనా ఆటంకం ఎదురైతే, రాజ్యసభ చైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ తన అధికారాన్ని వినియోగించుకుంటారని అన్నారు.

ఆ సమయంలో టెక్నిషియన్లు సభలోని మైక్‌లను కట్ చేస్తారని చెప్పారు.

పార్లమెంట్‌లో ప్రతి సభ్యునికి జీరో అవర్‌లో మూడు నిమిషాలు కేటాయిస్తారు. ఈ సమయం అయిపోగానే, మైక్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.

బిల్లు వంటి వాటిపై చర్చ జరిగేటప్పుడు, ప్రతి పార్టీకి సమయాన్ని కేటాయిస్తారు. ఈ టైమ్ షెడ్యూల్‌నే చైర్‌పర్సన్ అనుసరిస్తారు. ప్రతి సభ్యునికి మాట్లాడేందుకు నిర్దిష్ట సమయం దొరుకుతుంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

మైక్‌ విషయంలో అంతకుముందు వచ్చిన ఆరోపణలేంటి?

తమ సభ్యులు మాట్లాడేటప్పుడు మైక్‌ను ఆపివేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం ఇదే తొలిసారి కాదు.

రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గత ఏడాది జూలైలో ఈ ఆరోపణలు చేశారు.

తాను మాట్లాడేటప్పుడు మైక్‌ను ఆపేసి అవమానించారని ఖర్గే అన్నారు.

‘‘ఇది నా హక్కుల ఉల్లంఘన. నన్ను అవమానించారు. నా ఆత్మాభిమానాన్ని సవాలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సభ జరిగితే అది ప్రజాస్వామ్యం కాదని నా అభిప్రాయం.’’ అని మల్లికార్జున ఖర్గే చెప్పారు.

గత ఏడాది మార్చిలో విదేశాల్లో పర్యటించినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఇవే ఆరోపణలు చేశారు.

విపక్ష నేతల మైక్రోఫోన్లను లోక్‌సభలో నిలిపివేస్తుంటారని బ్రిటీష్ పార్లమెంట్‌ సభ్యులతో మాట్లాడిన సందర్భంగా రాహుల్ గాంధీ చెప్పారు.

ఈ ఆరోపణలను బీజేపీ సైతం విదేశాల్లోనే ఖండించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)