బ్రిటన్ ఎన్నికలు: కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్, రాజీనామా సమర్పించిన సునక్

ఫొటో సోర్స్, PA MEDIA
బకింగ్‌హామ్ పాలెస్‌లో కింగ్ చార్లెస్ III ని లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ కలుసుకున్న అనంతరం అధికారికంగా ప్రధాని అయ్యారు. ఆ వెంటనే డౌనింగ్ స్ట్రీట్‌కు చేరుకున్న స్టార్మర్ జాతినుద్దేశించి ప్రసంగించారు.
తరువాత కీర్ స్టార్మర్ తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. రాచెల్ రీవ్స్ మొదటి మహిళా ఛాన్సలర్ గా నియమితులయ్యారు.
ఉపప్రధానిగా ఏంజెలా రైనర్, హోంశాఖ కార్యదర్శిగా కూపర్, విదేశాంగ కార్యదర్శిగా డేవిడ్ లామీ నియమితులయ్యారు.
అంతకుముందు రాజును కలిసిన తరువాత ప్రధాని పదవికి రిషి సునక్ రాజీనామా సమర్పించారు. సునాక్ తన చివరి డౌనింగ్ స్ట్రీట్ ప్రసంగంలో తాను కన్జర్వేటరీ పార్టీ పగ్గాలను వదిలేస్తున్నట్టు చెప్పారు. అయితే ఆ పని వెంటనే చేయడం లేదని తెలిపారు.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు 412 స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్ల సంఖ్య 326. కన్జర్వేటివ్ పార్టీకి 121 సీట్లు వచ్చాయి.
ఇది కన్జర్వేటివ్‌లకు ఘోర పరాజయమని బీబీసీ పొలిటికల్ రిపోర్టర్ బ్రియాన్ వీలర్ అన్నారు.


‘‘మార్పు మొదలైంది. మేం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సమయం వచ్చింది’’ అని స్టార్మర్ అన్నారు.
ఈ ఎన్నికల్లో ఓడిపోయిన కన్జర్వేటివ్ పార్టీ కీలక నేతల్లో మాజీ ప్రధాని లిజ్ ట్రస్, రక్షణ మంత్రి గ్రాంట్ షాప్స్ కూడా ఉన్నారు.
ఈ ఎన్నికల్లో తన పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తున్నానని కన్జర్వేటివ్ పార్టీ నేత, ప్రస్తుత ప్రధాని రిషి సునక్ చెప్పారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని, ఈ ఎన్నికల నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.
ఈసారి కూడా రిచ్‌మండ్ అండ్ నార్తాలర్టన్ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
14 ఏళ్ల తర్వాత కన్జర్వేటివ్ పార్టీ ఓటమి..
బ్రిటన్ పార్లమెంట్‌లో మొత్తం స్థానాల సంఖ్య 650.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 365 సీట్లు గెలుచుకుంది. అప్పుడు బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అయ్యారు. కానీ, ఈసారి పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.
2019 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష లేబర్ పార్టీకి 203 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ తమకు పట్టున్న స్థానాల్లో కూడా ఓడిపోయింది. ఇప్పుడు సంపూర్ణ మెజార్టీతో గెలిచింది.
14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఏ ప్రభుత్వమైనా మళ్లీ ఎన్నికల్లో గెలవడం అసాధారణమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత కన్జర్వేటివ్ ఎంపీ డెహ్నా డేవిడ్‌సన్ అన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిషప్ ఆక్లాండ్ కౌంటీ డర్హమ్ నుంచి ఎంపీగా డెహ్నా గెలుపొందారు. డెహ్నా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














