నరేంద్ర మోదీ - కీర్ స్టార్మర్: భారత్, బ్రిటన్ సంబంధాలు ఎలా మారబోతున్నాయి?

starmer, Modi

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మ్యాచ్‌కు ముందే ఏదైనా జట్టు ఓటమిని అంగీకరిస్తే అది దానికి సపోర్టు చేసే వాళ్లను పూర్తిగా నిరుత్సాహపరుస్తుంది.

జులై 4న యూకేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షలాది మంది మద్దతుదారుల గురించి ఇదే చెప్పవచ్చు.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పలువురు నేతలు పోలింగ్‌కు ముందే విజయంపై ఆశలు వదులుకున్నట్లు కనిపించారు.

లేబర్ పార్టీకి సూపర్ మెజారిటీని ఇవ్వొద్దని వాళ్లు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

తమకు గణనీయమైన సంఖ్యలో సీట్లు వస్తే, సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

రిషి సునక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిషి సునక్

కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి కారణాలేంటి?

కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయానికి దారి తీసిన కారణాలు ఏమిటనే అంశంపై మిడిల్‌సెక్స్ యూనివర్శిటీకి చెందిన దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు డాక్టర్ నీలం రైనా మాట్లాడారు.

"కన్జర్వేటివ్‌ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం వరుస కుంభకోణాలు. వాటి వల్ల ప్రజలకు రాజకీయాలపై నమ్మకం పోయింది" అని నీలం రైనా అన్నారు.

కన్జర్వేటివ్‌లు(వీళ్లనే టోరీలు అనీ అంటారు) ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వారి గత 14 సంవత్సరాల పాలనతో ఓటర్లు విసిగిపోవడమేనని లండన్‌‌కు చెందిన చాతామ్ హౌస్‌లో ఆసియా-పసిఫిక్ ప్రోగ్రామ్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ క్షితిజ్ బాజ్‌పేయీ చెప్పారు.

"వాళ్ల విధానపరమైన లోపాలు, కుంభకోణాలు ఈ ఓటమికి కారణం’’ అని చెప్పారు.

కోవిడ్ మహమ్మారిపై కన్జర్వేటివ్‌ ప్రభుత్వ స్పందన సైతం విమర్శలకు గురైంది.

ఆనాటి ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన కేబినెట్ సహచరులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు.

ఆ వివాదం పెద్దది కావడంతో ఆయన స్థానంలో లిజ్ ట్రస్‌ను నియమించారు. ఆమె తన ఆర్థిక విధానాల కారణంగా కేవలం 40 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు.

ఆ తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు.

ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటివి సునక్ పాలనకు సవాలుగా నిలిచాయి.

రిషి సునక్, ఆయన ప్రభుత్వంలోని సభ్యులకు సన్నిహితులు బెట్టింగ్ కుంభకోణంలో చిక్కుకోవడంతో పార్టీ ప్రతిష్ఠ దిగజారింది.

బోరిస్ జాన్సన్‌లా కాకుండా, లిజ్ ట్రస్, రిషి సునక్‌లను పార్టీయే ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేసిందని డాక్టర్ రైనా తెలిపారు.

కెయిర్ స్టార్మర్

ఫొటో సోర్స్, Getty Images

కొన్నేళ్లుగా సౌతాల్ నుంచి పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఎంపీగా ఉన్న వీరేంద్ర శర్మ ఈసారి పోటీ చేయలేదు.

"నేను నా సీటును యువ నాయకుల కోసం వదులుకున్నాను" అని ఆయన చెప్పారు.

ఆయనకు చాలామంది కన్జర్వేటివ్ ఎంపీలతో స్నేహం ఉంది. ఆ పార్టీలోని అంతర్గత చీలికలు, నాయకత్వ స్థాయిలో మార్పులే కన్జర్వేటివ్ పార్టీ పతనానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

"మీరు జనరళ్లను పదేపదే మారుస్తూ ఉంటే, యుద్ధంలో ఎలా గెలుస్తారు? గత కొన్నేళ్లలో నలుగురు ప్రధానులు మారారు. పార్టీలో ఐక్యత లేదు. వాళ్ల పాలనలో 14 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది" అన్నారు.

లేబర్ పార్టీ నాయకులు కీర్ స్టార్మర్‌పై కన్జర్వేటివ్ పార్టీ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఆ పార్టీ ఇప్పటికీ జెరెమీ కార్బిన్ నేతృత్వంలో ఉంటే, అది ఓడిపోయి ఉండేదని ఓ సీనియర్ కన్జర్వేటివ్ పార్టీ నేత అన్నారు. స్టార్మర్ పార్టీని పూర్తిగా మార్చేశారని ఆయన అన్నారు.

కార్బిన్ లేబర్ పార్టీ నేతగా ఉన్నప్పుడు భారత్ చాలా అసంతృప్తిని వ్యక్తం చేసింది.

రిషి సునక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిషి సునక్ భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోలేకపోయారు

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడం స్టార్మర్‌కు పెద్ద సవాలు

స్టార్మర్ నాయకత్వంలో, లేబర్ పార్టీ 2019లో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

కశ్మీర్‌లో మానవ సంక్షోభం నెలకొందని, కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలని అందులో పేర్కొన్నారు. ఆ తీర్మానాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.

అది భారత్, పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక అంశమని ఆ తర్వాత కీర్ స్టార్మర్ స్పష్టం చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అయితే, స్టార్మర్ భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.

స్టార్మర్ నేతృత్వంలో రెండు దేశాల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయని లేబర్ పార్టీ మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ అభిప్రాయపడ్డారు.

“స్టార్మర్ ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకునే నాయకుడు. ఆయన నేతృత్వంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి." అని చెప్పారు.

కానీ, చాతామ్ హౌస్‌కు చెందిన డాక్టర్ బాజ్‌పేయీ మాత్రం, లేబర్ ప్రభుత్వంతో భారత్‌ పలు సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని అన్నారు.

‘‘మానవ హక్కుల వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే లేబర్ పార్టీ యూకేలోని 15 లక్షల మంది ప్రవాస భారతీయులనే కాకుండా, 12 లక్షల మంది ప్రవాస పాకిస్తాన్ ప్రజలకూ నచ్చేలా మసలుకోవాలి. అవే కాకుండా విస్తృత రాజకీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు యూకే-భారత్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది" అని హెచ్చరించారు.

డేవిడ్ లామీ విదేశీ వ్యవహారాల మంత్రి కావడమనేది భారత్-యూకే సంబంధాలు మరింత బలపడేందుకు ఉపయోగపడొచ్చని డాక్టర్ నీలం రైనా అభిప్రాయపడ్డారు.

"లామీకి దక్షిణాసియా వ్యవహారాలపై మంచి అవగాహన ఉంది. కానీ, ప్రస్తుతం భారత ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అని మనం మరచిపోకూడదు. ఇది భారత్-యూకే సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో సమతుల్యతను సృష్టిస్తుంది" అని చెప్పారు.

స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ, జెరెమీ కార్బిన్ హయాంలో క్షీణించిన యూకే-భారత్‌ సంబంధాల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు చేసింది.

స్టార్మర్, ఆయన పార్టీకి చెందిన పలువురు సభ్యులు భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే కోరికను సూచిస్తూ పలు ప్రకటనలు చేశారు.

స్టార్మర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టార్మర్

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, వలస సమస్యలు

భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడం స్టార్మర్ అజెండాలో ఉంటే, మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్‌టీఏ) సంతకాలు చేయడం ఆయన మొదటి ప్రాధాన్యం అవుతుంది.

"ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, జులై నెలాఖరులోపు భారత్‌లో పర్యటిస్తానని డేవిడ్ లామీ చెబుతున్నారు. దాదాపు 26 అంశాలపై చాలావరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది" అని డాక్టర్ బాజ్‌పేయి చెప్పారు.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగినప్పుడు (బ్రెగ్జిట్) వలసలను తగ్గించుకుంటామని హామీ ఇచ్చారు.

కానీ, బ్రెగ్జిట్ తర్వాత అత్యధిక సంఖ్యలో వలసదారులు ఉన్న దేశంగా బ్రిటన్ గుర్తింపు పొందింది.

యూకేకు వలస వెళ్లే భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్‌లు ఇవ్వడం భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ఒక అవరోధం.

కెయిర్ స్టార్మర్

ఫొటో సోర్స్, Getty Images

చట్టపరమైన వలసలను తగ్గించడం, అక్రమ వలసలను అరికట్టడం తమ లక్ష్యమని లేబర్ పార్టీ ప్రకటించుకుంది.

చట్టబద్ధమైన భారతీయ వలసదారులలో చాలామంది వర్క్ పర్మిట్‌లపై ఐటీ నిపుణులుగా పని చేస్తున్నారు.

అయితే మన దేశానికి చెందిన ఇంకా కొందరు అక్రమ వలసదారులు యూకేలో ఉన్నారు.

విస్తృత రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని, వలస సంఖ్యను నియంత్రించడం, నైపుణ్యం కలిగిన వలసదారుల ఆర్థిక ప్రయోజనాలను రక్షించడం ద్వారా సమతుల్యతను సాధించడానికి లేబర్ పార్టీ ప్రయత్నిస్తుంది.

బ్రిటన్‌లో నివసిస్తున్న మొత్తం 6.85 లక్షల మంది వలసదారులలో అత్యధికులు భారతీయులేనని ఆ దేశం గుర్తించింది.

బ్రిటన్ తన జాతీయ ఆరోగ్య సేవలు (నేషనల్ హెల్త్ సర్వీస్), ఐటీ రంగాన్ని సరిదిద్దడానికి నిపుణులు కావాలనుకుంటోంది.

కానీ, భారత్ నుంచి మాత్రమే కాకుండా, ఇతర దేశాల వారినీ నియమించుకోవాలని బ్రిటన్ చూస్తోంది.

బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం

ఫొటో సోర్స్, Getty Images

మానవ హక్కులు, పౌరసత్వ చట్టాలు

లేబర్ పార్టీ సంప్రదాయ భావజాల ఆధారిత విదేశీ విధానాన్ని అనుసరిస్తుంది.

దీనిలో భాగంగా మానవ హక్కుల విషయంలో భారతదేశం సహా అనేక దేశాలను తరచూ విమర్శిస్తుంటుంది.

అయితే, భారత ప్రభుత్వానికి ఇది మింగుడు పడడం లేదు. సంబంధాలు సజావుగా ఉండాలనుకుంటే, తాను మరింత ఆచరణాత్మక విధానాన్ని అనుసరించబోతున్నానని స్టార్మర్ భారతదేశాన్ని ఒప్పించాల్సి ఉంటుంది.

గత పార్లమెంట్‌లో 15 మంది పాకిస్తాన్ సంతతికి చెందిన ఎంపీలు లేబర్ పార్టీ నుంచి ఎన్నిక అయితే, భారత సంతతికి చెందినవారు కేవలం ఆరుగురే ఉన్నారు.

అందువల్ల లేబర్ పార్టీపై యూకేలోని పాకిస్తానీ సభ్యుల ఒత్తిడి ఉండొచ్చు.

కొత్త ప్రభుత్వం రెండు దేశాలకు చెందిన ఎంపీలను ఎలా సమన్వయపరుస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)