నేపాల్: ప్రమాదంలో ప్రధాని ప్రచండ సీటు, 16 ఏళ్ల ప్రజాస్వామ్యంలో 10 సార్లు మారిన ప్రభుత్వాలు

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లో ప్రజాస్వామ్యం ఏర్పడి కేవలం 16 ఏళ్లు మాత్రమే. అక్కడ ఇప్పటికే 10 ప్రభుత్వాలు మారాయి.
అంతకుముందు నేపాల్‌లో రాచరిక వ్యవస్థ ఉండేది. దాదాపు 239 ఏళ్ల పాటు కొనసాగిన రాచరిక వ్యవస్థ ముగిసి 2008లో ప్రజాస్వామ్యం వచ్చింది.
నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ - లెనినిస్ట్) - సీపీఎన్‌యూఎంల్ ఒక్కటవడంతో నేపాల్‌లో మరోసారి ప్రభుత్వం మారుతున్నట్లు కనిపిస్తోంది.
తాజా రాజకీయ సమీకరణాలతో నేపాల్ ప్రధాని పుష్పకమల్ దాహాల్ ప్రచండ పదవి ప్రమాదంలో పడింది.
ఈ రాజకీయ పరిణామాలతో ప్రచండ మద్దతు కోల్పోయారు. అయితే, ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు ఆయన నిరాకరించారు.
ప్రభుత్వం నడిపేందుకు కావాల్సినంత మెజార్టీ లేకపోవడంతో నేపాల్‌లో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
నేపాల్ కాంగ్రెస్, ఓలీ మధ్య కుదిరిన ఒప్పందంపై నేపాల్ మీడియాలో వాడీవేడి చర్చ జరుగుతోంది.
రాజీనామా చేసేందుకు నిరాకరించడం ద్వారా ప్రచండ రాజకీయ పరిస్థితులను మరింత హీటెక్కించారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.
గత మంగళవారం, కేపీ శర్మ ఓలీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం, ఈ కొత్త కూటమిలో చేరాలని ఆయన చిన్న పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు సీపీఎన్‌యూఎంఎల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి ప్రదీప్ జ్ఞవాలి చెప్పారు.
ఓలీ పార్టీ సీపీఎన్‌యూఎంఎల్ ప్రస్తుతం ప్రచండ ప్రభుత్వంలో భాగంగా ఉంది.
నేపాల్‌కు చెందిన ఇంగ్లిష్ పత్రిక కఠ్మాండూ పోస్టు ప్రకారం, ''ప్రచండ ప్రభుత్వంలోని మా మంత్రుల నుంచి రాజీనామాలు ఇంకా అడగలేదు. ప్రచండ పార్టీ అయిన మావోయిస్ట్ సెంటర్‌తో శత్రుత్వం మాకు ఇష్టం లేదు. అయితే, నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన మంత్రి అడ్డంకిగా మారితే, మా మంత్రులు రాజీనామా చేస్తారు. ప్రధాని మా అభ్యర్థనను పట్టించుకోకపోతే, మేం మా మద్దతు ఉపసంహరించుకుంటాం'' అని ప్రదీప్ జ్ఞవాలి చెప్పారు.
ప్రస్తుతం ప్రచండ ప్రభుత్వంలో ఓలీ పార్టీకి చెందిన 8 మంది మంత్రులుగా ఉన్నారు. కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణాలు ఉన్నాయని ప్రదీప్ జ్ఞవాలి అన్నారు.
అందుకు గల కారణాలను ఆయన తెలియజేస్తూ, ''ప్రధాన మంత్రి ప్రచండ గత నెలరోజులుగా నేపాలీ కాంగ్రెస్‌తో కలిసి నేషనల్ యూనిటీ ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారు. అందువల్లే అవిశ్వాసం తలెత్తింది. అందువల్ల నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రచండ ప్రతిపాదనను నేపాలీ కాంగ్రెస్ తిరస్కరించడంతో మేం ఆ పార్టీతో చర్చలు జరిపాం'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యర్థుల కలయిక
నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్‌యూఎంఎల్ పొత్తుపై రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎప్పుడూ ప్రత్యర్థులుగానే కొనసాగిన ఈ రెండు పార్టీలు జట్టుకట్టడమే అందుకు కారణం.
నేపాలీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాశ్ శరణ్ మహత్ మాట్లాడుతూ, తొలిదశలో సీపీఎన్‌యూఎంఎల్ అధ్యక్షులు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారని చెప్పారు.
మరోసారి మాట్లాడుతూ, ఎన్నికల ముందు షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు.
''రెండు పెద్ద పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రధాన మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలి. అదే సరైనది. ఈ కొత్త కూటమికి అనేక రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. రాజీనామా చేయాలని మేం కూడా ప్రచండను కోరాం'' అని అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త కూటమిలో ఎవరెవరు ఉన్నారు?
రెండు పార్టీల మధ్య జరిగిన సమావేశంలో ఒక ఒప్పందానికి వచ్చినట్లు నేపాలీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ధన్‌రాజ్ గురుంగ్ చెప్పారు.
''ఈ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. మా సమ్మతిని తెలియజేశాం. అభివృద్ధి, రాజ్యాంగ సవరణ, అవినీతి నిర్మూలన వంటి విషయాలపై కూడా చర్చించాం'' అని గురుంగ్ చెప్పారు.
రాజ్యాంగ సవరణకు మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమని, ఇతర రాజకీయ పార్టీలతోనూ చర్చిస్తామని ఆయన అన్నారు.
అయితే, ఈ రెండు పార్టీలు ఏ ప్రాతిపదికన ఒప్పందానికి వచ్చాయనే సమాచారం మాత్రం బయటకు రాలేదు. జులై 4లోగా ఒప్పందం గురించిన వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు.
ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంలో ఎవరికి ఎన్ని మంత్రి పదవులనే అంశం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రచండ పార్టీ ఏమంటోంది?
ప్రధాన మంత్రి రాజీనామా చేయకపోయినప్పటికీ పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రచండ పార్టీ మావోయిస్ట్ సెంటర్ చెబుతోంది.
దీని గురించి సీపీఎన్‌యూఎంఎల్ నేత ప్రదీప్ జ్ఞవాలితో మాట్లాడగా, ''రెండు ప్రధాన పార్టీల మధ్య చర్చలు జరిగి ఒప్పందం కుదిరిన తర్వాత ప్రధాన మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలి. ఆయన అలా చేయకుంటే, ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై మేం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది'' అన్నారు.
ప్రధాని స్పందించకపోతే సీపీఎన్‌యూఎంఎల్ తన మంత్రులను ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి.
ఉపేంద్ర యాదవ్‌కి చెందిన జనతా సమాజ్‌వాదీ పార్టీ, మహంత్ ఠాకూర్ పార్టీ డెమొక్రటిక్ సమాజ్‌వాదీ పార్టీ కొత్త కూటమి పట్ల సానుకూలంగా ఉన్నాయి.
జనతా సమాజ్‌వాదీ పార్టీకి నేపాలీ పార్లమెంట్‌లో 7, డెమొక్రటిక్ సమాజ్‌వాదీ పార్టీకి 4 సీట్లు ఉన్నాయి.
నేపాలీ పార్లమెంట్‌లో ఐదో అతిపెద్ద పార్టీ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ. ఈ పార్టీ కూడా కొత్త కూటమికి మద్దతిచ్చింది. ఈ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు.
కాంగ్రెస్, సీపీఎన్‌యూఎంఎల్ పార్టీలు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీని కూడా తమతో కలుపుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరి బలమెంత?
మొత్తం 275 మంది సభ్యులున్న నేపాలీ పార్లమెంట్‌లో, ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్)కు ఉన్న సభ్యుల సంఖ్య 32 మాత్రమే.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రచండకు కేపీ శర్మ ఓలీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ - లెనినిస్ట్) మద్దతు ఉంది. ఓలీ పార్టీకి 78 మంది ఎంపీలు ఉన్నారు.
2022 నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రచండ పార్టీ, నేపాలీ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ 89 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఎక్కువ సీట్లు సాధించడంతో, నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవుబా ప్రధాని అవుతారని అంతా భావించారు. కానీ, చివరి క్షణంలో ప్రచండ మరోపార్టీతో జతకట్టారు. తాను ప్రధాన మంత్రి కావాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరించలేదు.
2021 జూన్‌లో ప్రచండ మద్దతుతో దేవుబా ప్రధాన మంత్రి అయ్యారు.
2017 నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేపీ శర్మ ఓలీ పార్టీ సీపీఎన్‌యూఎంఎల్, ప్రచండ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) కలిసి పోటీ చేశాయి.
2018 ఫిబ్రవరిలో ఓలీ ప్రధాన మంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన కొద్దినెలల తర్వాత ప్రచండ, ఓలీ పార్టీలు విలీనమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. వారికి పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది. అయితే, ప్రచండ, ఓలీ స్నేహం ఎక్కువకాలం కొనసాగలేదు.
ఇవి కూడా చదవండి:
- బొలీవియా: ప్రపంచంలోనే ఎక్కువ తిరుగుబాట్లు జరిగిన దేశం ఇదేనా
- వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?
- వీళ్లు ఏటా లీటర్ల కొద్దీ మద్యం తాగేస్తున్నారు, అత్యధికంగా ఆల్కహాల్ తాగే దేశాలు ఇవే..
- ఈ పామును చంపితే రూ. 35 వేలు బహుమతి ఇస్తామని ఆ రాజకీయ నాయకుడు ఎందుకు ప్రకటించారు?
- చాంగ-6: చంద్రుని ఆవలి వైపు నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చిన చైనా వ్యోమనౌక
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














