ఇంగ్లిష్ చానల్ దాటే ప్రయత్నంలో ఏడేళ్ల పాప మృతిపై బీబీసీ పరిశోధన, స్మగ్లర్‌ను ఎలా పట్టుకున్నారంటే

సారా
ఫొటో క్యాప్షన్, సారా
    • రచయిత, ఆండ్రూ హార్డింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆ కూడలిలో నిర్భయంగా తిరుగుతున్న ఆయనకు తనను ఎవరో అనుసరిస్తున్నారనే సంగతి తెలియలేదు.

పొట్టిగా, బలిష్టంగా, లేత ఆకుపచ్చ రంగు సూట్, బేస్‌బాల్ క్యాప్ ధరించిన ఆ 39 ఏళ్ల వ్యక్తి, లక్సెంబర్గ్‌లోని వలసదారుల రిసెప్షన్ సెంటర్ దగ్గరలో ఉన్న ట్రామ్ స్టేషన్‌కు వెళ్తున్నారు.

బీబీసీ బృందం పరుగున వెళ్లి ఆయన్ను మాట్లాడించింది.

"నువ్వు ఎవరో మాకు తెలుసు. నువ్వొక స్మగ్లర్‌వి" అని బీబీసీ బృందంలోని ఒకరు అన్నారు.

ఆ వ్యక్తిని నిలదీయడంతో, 51 రోజుల క్రితం మొదలైన బీబీసీ పరిశోధన చివరి దశకు చేరినట్లయింది. మేం ఈ పరిశోధన చేపట్టడానికి కారణం, ఉత్తర ఫ్రాన్స్‌లోని సముద్రంలో సారా అనే ఏడేళ్ల బాలిక సహా అయిదుగురు మరణించడం. పడవలో మృతదేహాల మధ్య సారా ఊపిరి ఆడక మరణించారు.

ఈ పరిశోధనలో భాగంగా బీబీసీ ప్రతినిధులు, లిల్లేలోని ఫ్రెంచ్ పోలీసు విభాగానికి కలైస్, బౌలోన్ చుట్టూ ఉన్న అనధికారిక వలస శిబిరాలకు, ఎసెక్స్‌లోని మార్కెట్ టౌన్‌కు, బెర్లిన్‌లోని ఆంట్‌వెర్ప్‌లోని బెల్జియన్ పోర్ట్‌కు, చివరకు లక్సెంబర్గ్‌కు, ఆ దేశంలోని వలస రిసెప్షన్ సెంటర్‌లకు వెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

బీబీసీ ప్రతినిధుల ఎదుట ఉన్న ఆ వ్యక్తే సారా, ఆమె కుటుంబం ఇంగ్లండ్‌ వెళ్లడానికి ప్రమాదకరమైన ప్రయాణ ఏర్పాట్లు చేసిన స్మగ్లర్ జబాల్.

అతడిని బీబీసీ ఎలా ట్రాక్ చేసిందన్నదే ఈ కథ.

మేం అతన్ని నిలదీసినప్పుడు, ‘‘ప్రామిస్. నేను మీరు అనుకుంటున్న మనిషిని కాదు’’ అని స్మగ్లర్ జబాల్, లక్సెంబర్గ్‌లోని యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమీపంలోని ట్రామ్ స్టేషన్ వైపు వెళుతూ పదేపదే అన్నాడు.

బీబీసీ ప్రతినిధులు అప్పటికే అతని ఇరాకీ పాస్‌పోర్ట్, ఇటాలియన్ గుర్తింపు కార్డును చూసేశారు. బీబీసీ ప్రతినిధులతో మాట్లాడుతుండగానే అతని జేబులోని ఫోన్ మోగడం మొదలైంది. దీంతో మాకు స్పష్టత వచ్చింది.

మొదట, మోగుతున్న ఫోన్‌ను అతను పట్టించుకోలేదు. కానీ, చివరికి జేబులో నుంచి ఫోన్‌ను బయటకు తీశాడు. స్క్రీన్ మీద ఇన్‌కమింగ్ నంబర్ చూడగానే, మేం వెదుకుతున్న వ్యక్తి అతనే అని పూర్తిగా నిర్ధరణ అయింది.

ఎందుకంటే అతనికి ఫోన్ చేసింది బీబీసీ బృంద సభ్యుడే. అలా మరోసారి మేం స్మగ్లర్ అతనేనని ధ్రువీకరించుకున్నాం.

స్మగ్లర్ జబాల్
ఫొటో క్యాప్షన్, స్మగ్లర్ జబాల్

ఉచ్చులో చిక్కుకున్న స్మగ్లర్

బీబీసీ బృందంలోని ఒక సభ్యుడు, ఇంగ్లిష్ చానల్‌ను దాటి ఇంగ్లండ్‌కు వెళ్లాలనుకుంటున్న వలసదారుడిగా నటించారు.

స్మగ్లర్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న అనేక మంది మధ్యవర్తులను సంప్రదించాక, బీబీసీ ప్రతినిధి "మహమూద్" చివరకు జబాల్‌ను ప్రత్యక్షంగా కలవగలిగారు.

ఆ స్మగ్లర్‌తో అనేక ఫోన్ సంభాషణలను బీబీసీ రహస్యంగా రికార్డ్ చేసింది. ఒక ఫోన్ కాల్‌లో తాను ఇప్పటికీ స్మగ్లింగ్ బిజినెస్ చేస్తున్నట్లు జబాల్ స్వయంగా చెప్పారు.

లక్షన్నర రూపాయలు ఇస్తే, వెంటనే ఉత్తర ఫ్రాన్స్ నుంచి బయలుదేరే చిన్న పడవలో, తగిన భద్రత మధ్య సులభంగా యూకే చేరుకోవచ్చని మహమూద్‌కు జబాల్ హామీ ఇచ్చారు.

జబాల్ మా ముందు ఉన్నప్పుడు, మహమూద్ అతనికి ఫోన్ చేశారు. జబాల్ స్క్రీన్ మీద మహమూద్ నంబర్ స్పష్టంగా మాకు కనిపించింది.

జబాల్

ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేశామంటే?

ఏప్రిల్ 23న ఫ్రెంచ్ తీరంలో జరిగిన ఒక సంఘటనే ఈ పరిశోధనకు మూలం.

వలసదారులు సాధారణంగా ఫ్రాన్స్‌లోని విమూర్ పట్టణం వెలుపల ఉన్న బీచ్‌ నుంచే చానల్‌ను దాటడానికి ప్రయత్నిస్తారు. రాత్రంతా మేం అక్కడే ఉన్నాం.

ఫ్రెంచ్ పోలీసులు ఆ రోజున రెండు గ్రూపుల స్మగ్లర్లు, వాళ్లు స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

వారు పడవ ఎక్కకుండా ఆపడంలో పోలీసులు విఫలమయ్యారు.

రద్దీగా మారిన ఆ పడవలో వెళ్లేందుకు రెండు ప్రయాణికుల బృందాలు గొడవకు దిగాయి. మామూలుగానైతే ఈ పడవల్లో 60 మందిని స్మగ్లర్లు ఎక్కించుకుంటారు. కానీ, ఆరోజున ఒక పడవలో 100 మందికి పైగా ఉన్నారు. అక్కడ జరిగిన ఈ తతంగాన్నంతా బీబీసీ చిత్రీకరించింది.

ఆ వీడియోలో, పింక్ జాకెట్‌లో ఉన్న ఒక చిన్న అమ్మాయి, తండ్రి భుజాలపై కూర్చొని కనిపించారు. తర్వాత ఆమెను సారా అని గుర్తించారు.

పడవ బయల్దేరిన కొన్ని నిమిషాల తర్వాత, ఒడ్డు నుంచి కొన్ని మీటర్లు వెళ్లగానే సారాతో పాటు మరో నలుగురు చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన కొంత మందిని, చనిపోయినవారి మృతదేహాలను ఫ్రెంచ్ సహాయక సిబ్బంది ఒడ్డుకు తీసుకువచ్చారు. కానీ, మిగిలిన వాళ్లతో పడవ చివరికి ఇంగ్లాండ్‌ వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.

తర్వాతి రోజుల్లో సారా కుటుంబాన్ని గుర్తించి, ఆమె తండ్రి అహ్మద్‌ను బీబీసీ కలిసింది.

సారా
ఫొటో క్యాప్షన్, సారా

తమ ముగ్గురు పిల్లలను ఈ ప్రమాదంలో పడేసినందుకు తాను, తన భార్య అనుభవించిన అపరాధం భావం గురించి, యూరప్ నుంచి బహిష్కరణ భయంతో యూకేకు వెళ్లడానికి తీసుకున్న నిర్ణయం గురించి బీబీసీకి ఆయన వివరించారు.

అహ్మద్ 14 ఏళ్ల క్రితం ఇరాక్ నుంచి పారిపోయి బెల్జియం చేరుకున్నారు. బెల్జియంలో ఆశ్రయం ఇవ్వాలంటూ అహ్మద్ చేసిన విజ్ఞప్తి పదే పదే తిరస్కరణకు గురైంది. ఆయన స్వస్థలమైన బస్రాను ఇప్పుడు సురక్షితమైన ప్రాంతంగా ప్రకటించడంతో ఆయనకు బెల్జియంలో ఆశ్రయం ఇవ్వడానికి అధికారులు ఒప్పుకోలేదు. బెల్జియం నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని ఆయన్ను హెచ్చరించారు. ఆయన పిల్లలంతా యూరప్‌లోనే జన్మించారు. అయినప్పటికీ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని వారిని ఆదేశించారు.

బీబీసీ ఈ అంశాన్ని లోతుగా పరిశోధించాలని నిర్ణయించుకుంది. ఆ పడవ ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన క్రిమినల్ గ్యాంగ్‌లను కనుగొని, వాళ్లు వేల మంది వలసదారులను ఫ్రెంచ్ తీరప్రాంతానికి ఎలా రప్పిస్తున్నారో, వాళ్ల నెట్‌వర్క్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవాలనుకుంది.

జూన్ 18న 15 చిన్న పడవలు చానల్‌ను దాటుతూ 882 మందిని యూకే తీరానికి తీసుకువచ్చాయి. ఒకే రోజులో ఇంతమంది ఇలా రావడం రికార్డు. ఈ ఏడాది ఇప్పటివరకు యూకేకు అలా చేరిన వారి సంఖ్య 12,000 కంటే ఎక్కువ.

సారా మరణం తర్వాత, ఇద్దరు అనుమానిత స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు యూకేకు చెందిన నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ప్రకటించింది. వారిని త్వరలో ఫ్రాన్స్‌కు అప్పగిస్తారు. అయితే, పోలీసులు పట్టుకున్నఈ యువకులు పడవలో పనివాళ్లు. కానీ, తెర వెనుక ఉన్న వారు వేరే.

సారా తండ్రి అహ్మద్
ఫొటో క్యాప్షన్, సారా తండ్రి అహ్మద్

ఆరోజు రాత్రి జరిగిన ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లలో వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడాలని బీబీసీ నిశ్చయించుకుంది. దీని కోసం ఫ్రాన్స్‌లో తీరానికి సమీపంలో ఉన్న అక్రమ వలస శిబిరాలు, హాస్టళ్లలోని కొందరిని కలిసింది. వారిలో చాలా మంది తమ పేర్లను వెల్లడించవద్దని కోరారు. వాళ్లు ఇంకా చానల్‌ని దాటడానికి ప్రయత్నిస్తున్నారు.

సారా కుటుంబంతో కలిసి పడవ ఎక్కిన చాలా మందికి ఈ అక్రమ ప్రయాణం వెనుక ఉన్నవారి గురించి ఏమీ తెలియదు. వాళ్లు మధ్యవర్తులతోనే మాట్లాడేవాళ్లు. ఒకసారి చెల్లించాల్సిన డబ్బు గురించి మాట్లాడుకున్నాక, చాలా మంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేసేవాళ్లు.

అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన బెల్జియన్ పోర్ట్ ఆఫ్ ఆంట్‌వెర్ప్ నుంచి ఈ ముఠా నెట్‌వర్క్ పని చేస్తున్నట్లు ముగ్గురు వ్యక్తులు బీబీసీకి చెప్పారు. జబాల్ అనే వ్యక్తి ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లు వాళ్లు అంగీకరించారు. అందులో ఇద్దరు జబాల్‌తో నేరుగా మాట్లాడగా, ఒక్కరు ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు.

బీబీసీ పరిశోధన బృందం బెర్లిన్‌కు వెళ్లగా, అక్కడ మరొకరు జబాల్ గుర్తింపును ధ్రువీకరించారు. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో అతను రెండోసారి తప్పకుండా చానల్‌ను దాటిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఇదంతా జరుగుతుండగా, బహుశా జబాల్ ఆ సమయానికి బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌లో ఉండొచ్చని బీబీసీకి తెలిసింది.

బీబీసీ పరిశోధన
ఫొటో క్యాప్షన్, జబాల్ ఉన్న కేంద్రం వద్ద బీబీసీ మూడురోజులు పడిగాపులు కాచింది

బీబీసీ బృందం ఆంట్‌వెర్ప్‌కు చేరుకుని, జబాల్‌‌ను గుర్తించి, అతనితో మాట్లాడటానికి ఒక వ్యూహం పన్నింది. అతని మునుపటి క్లయింట్‌లలో ఒకరు అతని ఫొటోను మాకు ఇవ్వగా, మరొకరు అతని ఇరాకీ పాస్‌పోర్ట్ కాపీని, యూరోపియన్ గుర్తింపు కార్డును ఇచ్చారు.

జబాల్ అసలు పేరు రెబ్వార్ అబాస్ జంగానా అని బీబీసీకి తెలిసింది. అతను ఉత్తర ఇరాక్‌కు చెందిన కుర్దిష్. అవివాహితుడు. అతను స్వయంగా వలస వచ్చిన వ్యక్తి. అతని ఇమ్మిగ్రేషన్ స్థితి సైతం ఇంకా అస్పష్టంగా ఉంది. అతను కొంతకాలంగా కలైస్, బ్రస్సెల్స్, ఆంట్‌వెర్ప్‌లో తిరుగుతున్నారు.

యూకేకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిగా నటించిన బీబీసీకి చెందిన మహమూద్, ఆంట్‌వెర్ప్‌లో ఒక మధ్యవర్తిని కలిశారు. అతను తనకు జబాల్ తెలుసునని, అతన్ని కలిసే ఏర్పాటు చేస్తానని మహమూద్‌కు హామీ ఇచ్చారు.

దాదాపు రెండు వారాల తర్వాత చివరికి ఒక రాత్రి, బీబీసీ ప్రతినిధికి కాల్ వచ్చింది.

"మీరు బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? మీరు ఎంత మంది? మీరు యూకేకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా?" అని మహమూద్‌ను ఫోన్‌లో అడిగారు.

ఫోన్‌లో జబాల్ పొడిపొడిగా మాట్లాడారు. ఆ కాల్‌తో పాటు తర్వాత జరిగిన రెండు ఫోన్ సంభాషణల్లోనూ తాను చాలా రోజుల నుంచి ఈ పని చేస్తున్నట్లు జబాల్ తెలిపారు. సారా మరణించాక, తన రవాణా మార్గాలను మరింత మెరుగుపరిచినట్లు ఆయన హామీ ఇచ్చారు.

"మీలో ఎంత మంది యూకేకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు?" అని అతను అడిగారు. కలైస్‌లో వాతావరణం మరుసటి రోజు ప్రయాణానికి అనుగుణంగా లేదని చెప్పారు.

జబాల్
ఫొటో క్యాప్షన్, జబాల్

మహమూద్‌తో ఆ కాల్ మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ఆంట్‌వెర్ప్ నుంచి జబాల్ హడావిడిగా వెళ్లిపోయాడని తెలిసింది. దీనికి కారణం, ఏప్రిల్‌లో జరిగిన అయిదు మరణాలలో అతని పాత్ర ఉండటంతో, తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని అతనికి తెలిసింది.

ఆ తర్వాత బీబీసీకి సహకరించిన వ్యక్తి, జబాల్ ఉన్న ప్రదేశానికి సంబంధించిన ఒక స్క్రీన్ గ్రాబ్‌ను పంపించారు. ఒక పెద్ద గుడారంలో తీసిన ఫోటోలా అది కనిపించింది. అది ఒక శరణార్థి శిబిరంలా అనిపించింది. దాన్ని ఇంటర్నెట్‌లో శోధించినప్పుడు 2022లో ఒక ఆర్టికల్‌లో ప్రచురితమైన లక్సెంబర్గ్‌లోని అధికారిక శరణార్థి, వలసదారుల రిసెప్షన్ సెంటర్‌తో ఆ ఫోటో సరిపోలింది.

బీబీసీ వెంటనే అక్కడికి వెళ్లింది.

లక్సెంబర్గ్ ఒక చిన్న దేశం. శరణార్థులు, వలసదారులకు అది ప్రాథమిక రిసెప్షన్. జబాల్ కొంతకాలం రహస్యంగా ఉండాలని లేదా కొత్త పేరుతో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అక్కడికి వచ్చి ఉండొచ్చు.

కానీ అతను అక్కడ ఉన్నాడని ఎలా నిర్ధరించుకోవాలి? ఆ శరణార్థుల కేంద్రంలోకి ఎవరూ వెళ్లలేరు. దాని ప్రవేశ, నిష్క్రమణ ద్వారం వద్ద కనీసం నలుగురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.

సారా
ఫొటో క్యాప్షన్, స్మగ్లర్లు అత్యాశపరులని సారా తండ్రి అహ్మద్ అన్నారు

లక్సెంబర్గ్‌కు వెళ్లిన రోజు సాయంత్రం మా బీబీసీ ప్రతినిధి మహమూద్ మరోసారి వలసదారుగా నటిస్తూ జబాల్‌తో మాట్లాడారు. అదే సమయంలొ, మా ప్రతినిధి మరొకరు రిసెప్షన్ కాంపౌండ్ చుట్టూ కారులో తిరుగుతూ పదే పదే హారన్ మోగించారు. అప్పుడు మహమూద్ ఫోన్‌లో ఆ హారన్ శబ్దం వినిపించడంతో జబాల్ అక్కడే ఉన్నట్లు నిర్ధరణ అయింది.

కానీ, అనుమానం రాకుండా అతన్ని బయటికి ఎలా రప్పించాలి? అతనికి అనుమానం కలిగి మళ్లీ పారిపోతే, కథ మొదటికి వస్తుంది.

మూడు రోజుల పాటు, బీబీసీ ఆ సెంటర్ ఎదుట కాపు కాయగా, ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు, జబాల్ బయటకు రావడం కనిపించింది. అతను ఎడమవైపుకు తిరిగి ట్రామ్ స్టేషన్ వైపు వెళ్లగా, బీబీసీ ప్రతినిధులు అతన్ని వెంబడించారు.

“అది నేను కాదు బ్రదర్. నాకు ఏమీ తెలియదు. మీ సమస్య ఏమిటి?" అని అతను బీబీసీ ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు.

సారా కుటుంబం
ఫొటో క్యాప్షన్, సారా కుటుంబం ఒక తాత్కాలిక హాస్టల్‌లో ఉంటున్నారు

బీబీసీ సారా ఫోటోను చూపిస్తూ, ఈ ఏడేళ్ల చిన్నారి మరణానికి మీరే కారణం కదా అని ప్రశ్నిస్తే ఆయన అడ్డంగా తల ఊపారు.

బీబీసీ అతని ఫోన్ నంబర్‌కు రింగ్ చేయగానే, యూకేకు పడవ ద్వారా చేరవేస్తున్న వ్యక్తి ఇతనే అని తెలిసిపోయింది. దాంతో అతని గుర్తింపుపై ఎలాంటి సందేహం లేకుండా పోయింది.

జబాల్‌తో ముఖాముఖి మాట్లాడిన తర్వాత, ఏప్రిల్‌లో జరిగిన మరణాలపై విచారణ చేస్తున్న ఫ్రెంచ్ పోలీసులను బీబీసీ కలిసింది. తమ పరిశోధన గురించి బీబీసీ వాళ్లకు చెప్పగా, ఈ దశలో తాము ఏమీ వ్యాఖ్యానించబోమని వారు అన్నారు.

సారా తండ్రి అహ్మద్, తల్లి నూర్, 12 ఏళ్ల సోదరి రహాఫ్, తొమ్మిదేళ్ల సోదరుడు, హుస్సామ్ ఇప్పటికీ ఫ్రెంచ్ నగరం లిల్లే వెలుపల ఉన్న ఒక చిన్న గ్రామంలో వలసదారుల కోసం నిర్మించిన తాత్కాలిక హాస్టల్‌లో ఉంటున్నారు. ఆ పిల్లలకు పాఠశాలలో ప్రవేశం దొరకదు. కొన్ని రోజుల తర్వాత వాళ్లకు ఫ్రాన్స్‌లో ఉండే హక్కు ఉండదు.

అహ్మద్ ఇప్పటికీ ఫ్రెంచ్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు, మరణాలపై వారి దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తున్నారు. జీవితంలో తాను పెద్ద గుణపాఠం నేర్చుకున్నానని ఆయన అంటారు.

“ఈ స్మగ్లర్లు అత్యాశపరులు. వాళ్ల ధ్యాస అంతా డబ్బు మీదే. వాళ్లందరికీ తగిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. నా కూతురు మరణం వృథాగా పోకూడదు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)