గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి, వీధుల్లో చిన్నారుల ఆర్తనాదాలు

దాడి జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, రష్దీ అబులౌఫ్, టామ్ మెక్‌ఆర్థర్
    • హోదా, బీబీసీ న్యూస్

గాజా స్ట్రిప్‌లోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 16 మంది చనిపోయినట్లు పాలస్తీనా అధికారులు చెప్పారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపారు.

సెంట్రల్ గాజాలోని నుసెయిరాట్ శరణార్థుల శిబిరం వద్ద ఉన్న ఈ భవనంలో వేలమంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నట్లు హమాస్ వైద్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

అయితే, అల్-జౌని స్కూల్‌ ప్రాంగణంలో ఉన్న కొన్ని భవనాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ‘ఉగ్రవాదులపై’ తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) చెప్పింది.

దీంతో పాటు, ఇదే శరణార్థ శిబిరంలోని మరో ఇంటిపై జరిగిన వైమానిక దాడిలో 10 మంది చనిపోయినట్లు రిపోర్టులు తెలిపాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

నుసెయిరాట్ స్కూల్ వద్ద జరిగిన దాడికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి.

ఆ వీడియోల్లో.. శిథిలాల కింద చిక్కుకున్న పిల్లలు, పెద్దలు ఏడుస్తుండడం కనిపిస్తోంది. వీధులన్నీ దుమ్ము, పొగ ధూళితో కనిపిస్తున్నాయి.

స్కూల్ పైఅంతస్తులను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు బీబీసీకి చెప్పారు. ఈ స్కూల్ మార్కెట్‌కు దగ్గర్లో ఉంది.

ఈ భవనంలో 7 వేల మంది వరకు ఆశ్రయం పొందుతున్నట్టు బీబీసీకి తెలిసింది.

ఏడుస్తున్న చిన్నారులు, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

‘ఎలాంటి హెచ్చరికలు లేకుండా నాలుగోసారి ఈ స్కూల్‌పై దాడి’

భవంతిపై దాడి జరిగినప్పుడు ఖురాన్ చదువుకుంటున్న కొందరు పిల్లలు కూడా చనిపోయినట్లు ఒక మహిళ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

ఎలాంటి హెచ్చరికలు లేకుండా స్కూల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం ఇది నాలుగోసారని ఆమె చెప్పారు.

ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన అంతస్తును హమాస్ పోలీసులు వాడుతున్నట్టు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు స్థానిక జర్నలిస్టులు చనిపోయినట్లు హమాస్ తెలిపింది. ఈ జర్నలిస్టుల కుటుంబ సభ్యులపైనా దాడులు జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి.

గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా మొదలుపెట్టిన ఈ దాడులలో ఇప్పటి వరకు 100 మందికి పైగా జర్నలిస్టులు మరణించారని ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ తెలిపింది.

అయితే, ప్రస్తుతం మరణించిన ఐదుగురితో కలుపుకొని ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల సంఖ్య 158కి చేరిందని హమాస్ తెలిపింది.

దాడిపై ఇజ్రాయెల్, హమాస్ ఏం అంటున్నాయి?

స్కూల్ భవనాలపై దాడిని ధ్రువీకరించిన ఐడీఎఫ్, ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేకుండా పలు రకాల చర్యలు తీసుకున్నామని ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించింది.

ఐడీఎఫ్ దళాలపై దాడులు జరిపేందుకు హమాస్ ఈ ప్రాంతాన్ని వాడుకుంటోందని ఆరోపించింది.

‘‘ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడులు జరిపేందుకు పౌరులను, వారి భవనాలను రక్షణగా వాడుకుంటూ అంతర్జాతీయ చట్టాలను హమాస్ ఉల్లంఘిస్తుంది’’ అని ఆరోపించారు.

ఈ దాడి నిరాశ్రయులైన నిస్సహాయ ప్రజలపై ఊచకోత అని హమాస్ ఆరోపించింది.

చనిపోయిన, గాయాలు పాలైన వారిలో చాలామంది మహిళలు, పిల్లలు, వయోధికులు ఉన్నట్టు హమాస్ టెలిగ్రామ్ చానల్‌లో తెలిపింది.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందనే ఆశలు నెలకొన్న సమయంలో ఈ దాడి జరిగింది.

బందీల విడిపించేందుకు హమాస్‌తో చర్చలు జరిపేందుకు వచ్చే వారం తమ టీమ్‌ను పంపనున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 38 వేల మందికి పైగా మరణించినట్లు హమాస్ తెలిపింది.

గాజా యుద్ధంతో ఇళ్లను విడిచిపెట్టిన 17 లక్షల మంది ప్రజలు గత ఎనిమిది నెలలుగా స్కూళ్లల్లో, ఐరాస భవనాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)