ఇస్లామిక్ స్టేట్: ఈ పదేళ్లలో ప్రమాదకర ఐఎస్ చేసిందేంటి?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
- హోదా, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ తన ఖలీఫా రాజ్యాన్ని ప్రకటించి సరిగ్గా పదేళ్లు అయింది. ఆ తర్వాత కొద్దిరోజులకు మోసుల్‌లోని నూరి మసీదు నుంచి ఆ గ్రూప్ వ్యవస్థాపకులు అబూ బకర్ అల్ - బాగ్దాదీ బయటి ప్రపంచానికి ఐఎస్ గురించి ప్రకటన చేశారు.
దీనిని అరబిక్‌లో ఐసిస్ లేదా డాయిష్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రూప్ సిరియా, ఇరాక్‌లలో భారీ భూభాగాలను స్వాధీనం చేసుకుంది. అక్కడ షరియాను(ఇస్లామిక్ చట్టం) తీవ్రంగా అమలు చేస్తూ, క్రూరమైన శిక్షలు విధిస్తూ, హత్యలు చేస్తూ, ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.
ఆ తర్వాతి ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది జిహాదిస్టులను ఆకర్షిస్తూ, ఆదర్శవంతమైన ఇస్లామిక్ కాలిఫేట్(ఖలీఫా రాజ్యం)ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసింది.
అసలు వాస్తవమేంటంటే, విపరీతమైన హింసతో ఆధిపత్యం: టౌన్ స్క్వేర్ రెయిలింగ్‌లపై తెగిపడిన తలలు, పెట్రోలింగ్ పేరుతో మొరాలిటీ పోలీసుల నిరంతర వేధింపులు, అమెరికా, దాని మిత్రపక్షాల కూటమి బాంబు దాడులు.
సుమారు 70 దేశాల కంటే ఎక్కువ దేశాలున్న ఈ కూటమి ఎట్టకేలకు 2019లో తూర్పు సిరియాలోని బఘుజ్‌లో తన చివరి స్థావరం నుంచి ఐఎస్‌ని తరిమికొట్టింది. భౌతికంగా కాలిఫేట్ లేకపోయినా, ఆ భావజాలం మాత్రం అలాగే ఉంది.
మరి, ఈరోజు ఐఎస్ పరిస్థితేంటి?


ఫొటో సోర్స్, Reuters
'తగ్గింది.. కానీ అంతరించిపోలేదు..'
''ప్రస్తుతం ఐఎస్ తగ్గిందని, కానీ అంతరించిపోలేదు''అని లండన్‌లోని వైట్‌హాల్(ప్రభుత్వ కార్యాలయాల సమూహం) సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ఆ గ్రూప్ కీలక నాయకత్వం సిరియాలో ఉంది, కానీ అనేక ఖండాలకు ఐఎస్ తన ఫ్రాంచైజీలను విస్తరించింది.
ఐఎస్ పేరుతో జరుగుతున్న దాడుల్లో ఎక్కువ భాగం ఇప్పుడు ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతానికి సమీపంలో జరుగుతున్నాయి. యూరప్, మిడిల్ ఈస్ట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాని అత్యంత ప్రమాదకర శాఖను ఐఎస్-ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్‌కేపీ)గా పిలుస్తున్నారు. ఇటీవల మాస్కోతో పాటు ఇరాన్‌లోని కెర్మాన్‌లో భారీగా ప్రాణనష్టం జరిగిన దాడులు ఐఎస్ ఖొరాసన్ ప్రావిన్స్ పనిగా ఆరోపిస్తున్నారు.
ఐఎస్ - ఖొరాసన్ ప్రావిన్స్, లేదా ఐఎస్‌కేపీ అఫ్గానిస్తాన్, వాయువ్య పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోంది. అక్కడ అఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తోంది.
తాలిబాన్లు షరియాను తీవ్రంగా అమలు చేయడం, సరైన విద్య అందకుండా, ఉద్యోగాలు చేయకుండా మహిళలను నిషేధిం విధించడం, రాళ్లతో కొట్టి చంపడం వంటి శిక్షలను తిరిగి అమలు చేయడం వంటివి కాస్త వింతగా అనిపించవచ్చు. ఇప్పటికీ తాలిబాన్, ఐఎస్ ప్రత్యర్థులుగానే ఉన్నాయి. దాదాపు 20 ఏళ్లపాటు తిరుగుబాటుదారులుగా చెప్పుకున్న తాలిబాన్లు, ఇప్పుడు తమకు తాము వేటగాళ్ల నుంచి కాపలాదారులుగా చెప్పుకుంటున్నారు.
సిరియా, ఇరాక్‌లో భౌతిక స్థావరం ఉన్నప్పుడు తుర్కియేకి సులభంగా చేరుకుని, అక్కడి నుంచి బస్సులో బోర్డర్‌కి, ఆ తర్వాత సిరియాలోకి అక్రమంగా తీసుకురాగలిగిన వారిని తమ గ్రూపులో రిక్రూట్ చేసుకునేలా ఐఎస్ ఆకర్షించేది.
ఇలా రిక్రూట్ అయిన వారిలో సైనిక అనుభవం లేదా సిరియాను ముక్కలు చేస్తున్న అంతర్యుద్ధం గురించి అంతగా అవగాహన లేనివారే ఎక్కువ. అలాంటి వారిలో చాలా మందికి చిన్నచిన్న నేరాలు, డ్రగ్స్ సరఫరా వంటి నేపథ్యం ఉంది. వీరిలో పశ్చిమ లండన్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారిని బందీలు ది బీటిల్స్ అని పిలిచేవారు. వీరు పాశ్చాత్య సహాయక సిబ్బందికి, జర్నలిస్టులకు కాపలాగా ఉండడం, వారిని హింసించడం వంటివి చేసేవారు.
ప్రస్తుతం వారిలో ఒకరు చనిపోగా, మిగిలిన వారు జైల్లో ఉన్నారు. వారిలో ఇద్దరు అమెరికాలోని సూపర్‌మ్యాక్స్ జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్నారు.
అయితే, ఐఎస్ ఇప్పటికీ ఆన్‌లైన్ మీడియా ద్వారా దాడులను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఐఎస్ చెబుతున్న రెండు ప్రధాన కారణాలు: గాజాపై ఇజ్రాయెల్ 9 నెలల సుదీర్ఘ దాడికి ప్రతీకారం, రెండోది ఉత్తర సిరియాలో భయంకరమైన, ఘోరమైన క్యాంపుల్లో ఐఎస్ మహిళలు, పిల్లలను నిర్బంధించడం.

ఫొటో సోర్స్, Reuters
ఆఫ్రికాకు మకాం..
అల్ ఖైదా మాదిరిగానే ఐఎస్ కూడా అంతరించిపోలేదు. శాంతిభద్రతలు దెబ్బతినడం, పాలన గాడితప్పడం, నిరాశ నిస్పృహలు ఉన్నచోట ఐఎస్ వృద్ధి చెందుతోంది.
ఆఫ్రికాలో, ప్రధానంగా మూడు చోట్ల ఐఎస్‌కు భారీగా అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో సాహెల్ బెల్టులోని మాలి, నైగర్, బుర్ఖినా ఫాసో దేశాల్లో సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ఇది అస్థిరతకు దారితీసింది.
జిహాదీ ముప్పును అరికట్టేందుకు స్థానిక ప్రభుత్వాలకు ఫ్రెంచ్, అమెరికన్, యూరోపియన్ దళాలు సాయం అందిస్తున్నప్పటికీ ప్రతిసారీ విజయవంతం కాలేవు. భారీ సంఖ్యలో రష్యన్ కిరాయి సైనికులను తరిమివేయడం లేదా వారి స్థానంలో మరొకరు రావడం వంటివి జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆఫ్రికాలో ఐఎస్‌కు ఐదు శాఖలు ఉన్నాయి. వాటిని పశ్చిమ ఆఫ్రికా, లేక్ చాడ్ ఏరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉత్తర మొజాంబిక్‌లో విస్తరించి ఉన్న విలయాత్ (ప్రావిన్సులు)గా చెబుతున్నారు.
ఇక్కడ కూడా, అల్ ఖైదాతో ప్రత్యక్ష పోటీతో పాటు తరచూ ఘర్షణ వాతారణం ఉంది. తన కార్యకలాపాలతో పాటు తన ఆధీనంలో ప్రాంతాలను కూడా విస్తరించుకుంటున్నట్లు ఐఎస్ గొప్పలు చెబుతోంది. అయితే, మారుమూల ప్రాంత గ్రామాల్లో ఆకస్మిక, భీకర దాడులతో ఎంతోమంది సైనికులు, గ్రామస్తులను బలితీసుకుంటూ అక్కడ ఎదురీదుతున్న ప్రభుత్వాల కంటే చురుగ్గా కనిపిస్తోంది.
పదేళ్ల కిందట సిరియా కేంద్రంగా ఉన్న జిహాదిస్టులను భౌగోళికంగా ఆఫ్రికా అంతగా ఆకర్షించలేదు. తుర్కియే - సిరియన్ బోర్డర్‌కు లేదా అంతకుముందు వాయువ్య పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలకు గుంపులుగా వాలంటీర్లు తరలివచ్చే పరిస్థితులు అక్కడ లేవు. కానీ, ఐఎస్ ఫ్రాంచైజీకి ఇప్పటికీ చాలా మంది రిక్రూట్‌లు ఉన్నారు. వారిలో ఎక్కువగా దాదాపు ఎక్కడా ఎలాంటి అవకాశాలు దొరకని స్థానిక యువకులు, పురుషులు ఉన్నారు.
ఆఫ్రికాలో స్థానికంగా జరుగుతున్న అత్యంత హింసాత్మక ఘర్షణలు యూరప్‌కు వేల మైళ్ల దూరంలో జరుగుతుండొచ్చు. కానీ, జిహాదీ ముప్పు పెరుగుతుండడం వలసదారులను యూరప్‌లో సురక్షిత జీవనం కోరుకునేలా చేస్తోంది.

ఫొటో సోర్స్, EPA
యూరప్ ఇప్పటికీ లక్ష్యమే..
2015లో పారిస్‌లోని బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ ఘటనలో 130 మంది మరణించిన ఘోరమైన దాడిని యూరప్‌లో ఐఎస్ చేయగలిగింది.
ఆ దాడికి పాల్పడిన హంతకులు సిరియాలో శిక్షణ పొంది, పలు దేశాల సరిహద్దులను దాటి ఇక్కడికి వచ్చారు. పర్వతాల పైనుంచి కలాష్నికోవ్స్ వంటి శక్తివంతమైన ఆటోమేటిక్ ఆయుధాలను వాడడంలోనూ వారు సిద్ధహస్తులు.
ఈ దాడితో పాటు యూరప్‌లోని ఇతర నగరాల్లో జరిగిన అనేక దాడుల తర్వాత పోలీసు బలగాలు, భద్రతా సంస్థల నిఘా మరింత పెరిగింది. పక్కాప్లాన్ ప్రకారం, 2005 నాటి బాంబుదాడులు, 2015 బాటాక్లాన్ వంటి దాడులు చేయడం ఐఎస్ లేదా అల్ ఖైదాకు కష్టతరమైనప్పటికీ, అసాధ్యం కాదని ఇప్పుడు యూకే అధికారులు భావిస్తున్నారు.
దానికి బదులుగా, ఇప్పుడు ఒంటరిగా దాడులు చేసే వారి గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు తాముగా తీవ్రవాదం వైపు మళ్లిన వారు, ఆన్‌లైన్‌లో జిహాదిస్ట్ ప్రచారానికి ప్రభావితమై తీవ్రవాదులుగా మారుతున్న సామాజికవేత్తల గురించి ఆందోళన చెందుతున్నారు.
యూకేలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే భద్రతా విభాగం ఎం15 ఇప్పటికీ ఐఎస్, అల్ ఖైదా స్థావరాలపై దృష్టి పెట్టింది. యూరప్‌పై ఇప్పటికీ ఐఎస్ కన్నుంది. మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌పై దాడి చేసిన ఘటనలో 140 మందికి పైగా మరణించారు. శత్రువు ఏమరపాటుగా ఉన్న సమయంలో (యుక్రెయిన్ యుద్ధం) అదనుచూసి దెబ్బకొట్టే అవకాశాన్ని ఐఎస్ ఎప్పుడూ వాడుకుంటుందని ఈ దాడి నిరూపించింది.

ఫొటో సోర్స్, Reuters
నాయకత్వ సమస్య
తమ సామ్రాజ్యం భౌతికంగా బలంగా ఉన్నప్పుడు ఉన్నంత దీటుగా ఐఎస్ ఆన్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు లేదు. అయితే, తన ద్వేషం, ప్రతీకార ప్రేరేపిత సందేశాలను వ్యాప్తి చేసేందుకు అవసరమైన ప్రతిభావంతులైన గ్రాఫిక్ డిజైనర్లు, వెబ్ డిజైనర్లను మాత్రం నియమించుకోగలిగింది.
ఇటీవల విడుదలైన వీడియోల్లో, ఒకదానిలో ఏఐతో రూపొందించిన న్యూస్ రీడర్‌లా కనిపించిన వ్యక్తి, సందేశాన్ని తెలియజేస్తున్నప్పటికీ, ఆ వ్యక్తి గుర్తింపు బహిర్గతమయ్యే ప్రమాదం లేదు.
2019లో అబూ బకర్ అల్ - బాగ్గాదీ మరణించిన నాటి నుంచి ఎన్నడూ లేనంతగా ఐఎస్ నాయకత్వ గుర్తింపు ప్రమాదంలో పడింది. ఒకప్పుడు అల్ ఖైదా నాయకుడు, దివంగత ఒసామా బిన్ లాడెన్‌కి ఉన్నట్లుగా, ఆన్‌లైన్‌లో అంత చరిష్మా ఉన్న నాయకత్వం కనిపించడం లేదు. ఇది వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి అనుచరులతో సంబంధాలు తెగిపోయేలా చేసింది.
దానికితోడు జిహాదీ నేతల స్వల్ప జీవితకాలం. ఒక్కసారి వారి వివరాలు బహిర్గతమైతే, నిఘా పరికరాల ద్వారా కానీ, లేదంటే వారితో పాటే ఉండే వారిచ్చిన సమాచారం ద్వారా కానీ నేతల ఆచూకీ కనుగొనే ప్రమాదం లేకపోలేదు.
ఐఎస్ ప్రస్తుత నాయకుడి గురించి ఇప్పటి వరకూ దాదాపుగా ఏమీ తెలియదు.
ఇవి కూడా చదవండి:
- బొలీవియా: ప్రపంచంలోనే ఎక్కువ తిరుగుబాట్లు జరిగిన దేశం ఇదేనా
- వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?
- వీళ్లు ఏటా లీటర్ల కొద్దీ మద్యం తాగేస్తున్నారు, అత్యధికంగా ఆల్కహాల్ తాగే దేశాలు ఇవే..
- ఈ పామును చంపితే రూ. 35 వేలు బహుమతి ఇస్తామని ఆ రాజకీయ నాయకుడు ఎందుకు ప్రకటించారు?
- చాంగ-6: చంద్రుని ఆవలి వైపు నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చిన చైనా వ్యోమనౌక
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














