తమిళనాడులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య, ఆ రోజు ఏం జరిగింది?

ఆర్మ్‌స్ట్రాంగ్‌

ఫొటో సోర్స్, BSP - TAMIL NADU UNIT/FB

ఫొటో క్యాప్షన్, ఆర్మ్‌స్ట్రాంగ్‌
    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై చెన్నైలోని ఆయన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈనెల 5న రాత్రి 7.30 గంటల సమయంలో ఆ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను క్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

ఆర్మ్‌స్ట్రాంగ్ మృతదేహాన్ని శనివారం సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ మృతదేహానికి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, జాతీయ సమన్వయకర్త ఆకాష్ ఆనంద్ నివాళులర్పించారు.

హంతకులు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వచ్చారని ఆర్మ్‌స్ట్రాంగ్ సోదరుడు వీరమణి చెప్పారు. అకస్మాత్తుగా తన సోదరుడిపై వారు కత్తులతో దాడికి దిగారని, కొద్దిదూరంలోనే ఉన్న తనకు అరుపులు వినిపించడంతో పరుగున వచ్చానని వీరమణి చెప్పారు.

‘’నేను మా అన్నయ్య దగ్గరికి పరుగెత్తాను. అప్పటికే ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు’’ అని వీరమణి చెప్పారు.

వాట్సాప్
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి

మాయావతి ఏమన్నారు?

‘’తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడంలో ఆర్మ్‌స్ట్రాంగ్ విశేష కృషి చేశారు. ఎంతో మంది పేదల కేసులను ఉచితంగా వాదించారు’’ అని మాయావతి తెలిపారు.

ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తమిళనాడులో శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించారు.

‘’ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించి ఉంటే అసలు దోషులు ఎవరో తేలిపోయేది. మాకు న్యాయం జరగాలి. కేసును సీబీఐకి అప్పగించాలి. ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది’’ అని ఆమె అన్నారు.

పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని మాయావతి సూచించారు.

తమిళనాడు పోలీసులు

ఫొటో సోర్స్, ANI

ఆర్కాడ్ సురేష్ హత్యకు ప్రతీకారమా?

"ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశాం, నిందితులు వాడిన ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. ఫుడ్ డెలివరీ కంపెనీ యూనిఫాం, బ్యాగు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఉత్తర చెన్నై అదనపు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) అస్రా గార్గ్ వార్తా సంస్థ ఏఎన్ఐతో చెప్పారు.

విచారణలో భాగంగా మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

"గత సంవత్సరం ఆగస్టులో ఆర్కాడ్ సురేష్‌ అనే వ్యక్తిని ఒక ముఠా హత్య చేసింది. దీనిలో ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రమేయం ఉన్నట్లు మృతుడి కుటుంబం, స్నేహితులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు అరెస్టయిన వారిలో సురేష్ తమ్ముడు కూడా ఉన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని గార్గ్ వివరించారు.

ఆర్మ్‌స్ట్రాంగ్ మృతదేహానికి లిబరేషన్ టైగర్స్ పార్టీ అధినేత తిరుమావళవన్ నివాళులర్పించారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ లేకపోవడం దళితులకు తీరని లోటని అన్నారు. పోలీసులు అసలు నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని ఆయన ఆరోపించారు.

'తమిళనాడులో దళిత నేతల హత్యలు జరగడం ఆందోళనకరం. షెడ్యూల్డ్ కులాల నేతలకు తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పించాలి' అని తిరుమావళవన్ డిమాండ్ చేశారు.

ఆ రోజు ఏం జరిగింది?

ఆర్మ్‌స్ట్రాంగ్ చెన్నైలోని పెరంపూర్‌లో నివసించేవారు. ఆయన కొత్త ఇంటికి సమీపంలోని పాత ఇంటిని కొన్నిరోజులుగా కూల్చివేయిస్తున్నారు. దీంతో ఆయన రోజూ సాయంత్రం ఆ పనులను పర్యవేక్షించేవారు. అదే క్రమంలో ఈ నెల 5న అక్కడికి వెళ్లి, అక్కడున్న వారితో మాట్లాడుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, రాత్రి 7:30 గంటల సమయంలో అక్కడికి ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరు కొడవళ్లు, కత్తులతో ఆర్మ్‌స్ట్రాంగ్‌పై దాడి చేసి పరారయ్యారు. అక్కడే ఉన్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వెంటనే దగ్గరలోని సెంబియం పోలీస్ స్టేషన్‌కు స్థానికులు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన ప్రాణాలు దక్కలేదు.

హత్యకు కొన్ని పదునైన ఆయుధాలు ఉపయోగించారని అదనపు కమిషనర్ అస్రా గార్గ్ తెలిపారు. దితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

ఆర్మ్‌స్ట్రాంగ్

ఫొటో సోర్స్, BSP - TAMIL NADU UNIT/FB

ఎవరీ ఆర్మ్‌స్ట్రాంగ్ ?

ఆర్మ్‌స్ట్రాంగ్ అట్టడుగు స్థాయి నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. ఆయన తండ్రి పేరు కృష్ణన్. చెన్నైలోని పెరంబూర్ ప్రాంతానికి చెందినవారు.

పాఠశాల రోజుల్లో బాక్సింగ్, వ్యాయామంలో ఆర్మ్‌స్ట్రాంగ్ ఆసక్తి కనబరిచేవారు. ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర న్యాయ కళాశాలలో న్యాయవిద్యను కూడా పూర్తి చేశారు.

ఆర్మ్‌స్ట్రాంగ్ మొదట్లో మాజీ ఎమ్మెల్యే పి.రంగనాథన్‌కు సన్నిహితులుగా ఉన్నారు. 2000లో పూవై మూర్తి నేతృత్వంలోని పురట్చి భారతం పార్టీలో చేరారు.

పూవై మూర్తి మరణంతో 2002లో ఆర్మ్‌స్ట్రాంగ్ పార్టీని వీడి 'అంబేడ్కర్ దళిత్ ఫౌండేషన్' పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు.

2006 చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99వ వార్డులో ఏనుగు గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

ఆ సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో ఇడుంబన్ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఏనుగు గుర్తుతో విజయం సాధించారని తెలుసుకొని BSPలో చేరాల్సిందిగా ఇడుంబన్ కోరారు. 2006లో పార్టీలో చేరిన ఆర్మ్‌స్ట్రాంగ్ 2007లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)