బ్రిటన్‌లో లేబర్ పార్టీ ఘన విజయానికి కారణమైన 11 కీలక అంశాలు..

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత ఘన విజయం సాధించింది.
బ్రిటన్ పార్లమెంట్‌లో మొత్తం 650 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 326 సీట్లు అవసరం. లేబర్ పార్టీ 412 స్థానాలను కైవసం చేసుకుంది. రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలను మాత్రమే సాధించింది.
లేబర్ పార్టీ ఇంతటి ఘన విజయం సాధించడానికి దోహదం చేసిన 11 కీలక అంశాలను చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
సంపద సృష్టి
తమ పార్టీకి మాత్రమే సంపద సృష్టించే సామర్థ్యం ఉందని లేబర్ పార్టీ ఘనంగా ప్రచారం చేసుకుంది.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యం అని మేనిఫెస్టోలో చెప్పింది.
2016 నుంచి దేశంలో పెట్టుబడులు తగ్గాయని, వాటిని పెంచడం తమ లక్ష్యమని చెప్పింది.
దీనివల్ల దేశంలోని యువతకు మరింత మెరుగైన శిక్షణ, నైపుణ్యాల వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
8 బిలియన్ పౌండ్లకు రెవెన్యూ
లేబర్ పార్టీ మేనిఫెస్టోలో పన్నులు, వ్యయాలకు సంబంధించిన సరళమైన విధానాలను ప్రతిపాదించింది. దాదాపు 8 బిలియన్ పౌండ్లకు (రూ.85,405 కోట్లకు) రెవెన్యూని పెంచేలా చర్యలను ప్రతిపాదించింది.
ధనవంతులకు ఉన్న నాన్-డోమ్ ట్యాక్స్ స్టేటస్‌లో మార్పులు చేయడం, ప్రైవేట్ స్కూళ్లకు వ్యాట్ అమలుచేయడం, పెద్ద ఎనర్జీ కంపెనీలకు విండ్ ఫాల్ ట్యాక్స్ అమలు చేయడం వంటి కొన్ని విధానాలను ప్రతిపాదించింది.
వీటితో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ విధానాలపై ఆయా కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

ప్రైవేట్ స్కూళ్లపై వ్యాట్‌తో ప్రభుత్వ టీచర్ల నియామకం
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుపై 20 శాతం వ్యాట్ విధించి, ఆ ఆదాయాన్ని 6,500 మంది అదనపు ప్రభుత్వ టీచర్ల నియామకానికి వినియోగించుకుంటామని లేబర్ పార్టీ పేర్కొంది.
అయితే, ఇది తమ ఆశలపై విధించే పన్ను అని, మధ్యతరగతి ప్రజలు ఈ ఫీజుల వల్ల అధిక భారాన్ని మోయాల్సి ఉంటుందని కొందరంటున్నారు.
దాదాపు 7 శాతం మంది పిల్లలు బ్రిటన్‌లో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తారు.
ఈ ప్రతిపాదన కారణంగా వీరిలో కొంతమంది ప్రభుత్వ స్కూళ్ల వైపు మొగ్గొచ్చు.
కానీ, ఉపాధ్యాయులపై భారం ఎక్కువ కావడంతో ఈ రంగం వైపు వస్తున్న యువత సంఖ్య నానాటికీ తగ్గుతోంది.
అందువల్ల ఇది ఎంతమేరకు ఫలితాలనిస్తుందో చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాదికి 3 లక్షల ఇళ్లు
రాబోయే ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలనేది లేబర్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఏడాదికి 3 లక్షల ఇళ్ల నిర్మాణం జరగాలి.
కానీ, 1960 తర్వాత ఎప్పుడూ ఈ స్థాయిలో బ్రిటన్‌లో ఇళ్ల నిర్మాణం జరగలేదు. గడిచిన 12 నెలల్లో కేవలం 1.5 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు. అంటే లేబర్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్న దానిలో సగం మాత్రమే.
గత పదేళ్ల సగటు చూసినా ఏడాదికి 1.52 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగింది.
ప్లానింగ్ నిబంధనలు, భూమి ధరలను నియంత్రించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలనేది లేబర్ పార్టీ ప్రణాళిక.

ఫొటో సోర్స్, PA Media
2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లు బ్యాన్
2030 నాటికి దేశంలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తామని లేబర్ పార్టీ చెప్పింది.
దీనిపై కొన్ని కార్ల కంపెనీలు హర్షం వ్యక్తం చేయగా, కొన్ని మాత్రం విమర్శించాయి.
ఎలక్ట్రిక్ కార్ల వైపు జనం ఆసక్తి చూపిస్తారా అనే దానిపై ఈ ప్రతిపాదన విజయం ఆధారపడి ఉంటుంది.
గతేడాదిలో కూడా ఎన్నో మోడళ్ల ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చినా డిమాండ్ మాత్రం పెద్దగా పెరగలేదు.
సరిహద్దు భద్రతకు కొత్త వ్యవస్థ..
చిన్న చిన్న పడవల్లో ఇంగ్లిష్ చానల్ దాటి వచ్చే వారిని అడ్డుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న రువాండా స్కీమ్‌ను వెంటనే రద్దు చేస్తామని లేబర్ పార్టీ ప్రకటించింది.
75 మిలియన్ పౌండ్ల (రూ.800 కోట్లు) నిధులను కొత్త బోర్డర్ అండ్ సెక్యూరిటీ కమాండ్ ఏర్పాటుకు మళ్లిస్తామని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పర్యావరణహిత కార్యక్రమాలకు ప్రాధాన్యం..
పర్యావరణహిత విధానాలకు, వాతావరణ మార్పులు నిరోధించడానికి తమ పార్టీ మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెబుతున్న లేబర్ పార్టీ దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం ఉన్న బడ్జెట్‌కు అదనంగా మరో 23.7 బిలియన్ పౌండ్లను (రూ.2,52,989 కోట్లు) కేటాయిస్తామన్నది.
ఇది విద్య, వైద్యంపై పెట్టే అదనపు వ్యయం కన్నా చాలా ఎక్కువ.
గ్రేట్ బ్రిటిష్ ఎనర్జీ కంపెనీకి ఏడాదికి 1.7 బిలియన్ పౌండ్లను (రూ.18,146 కోట్లను) కేటాయించడం ద్వారా పునరుత్పాదక వనరులతో పాటు, అణు విద్యుత్‌ను భారీగా ఉత్పత్తి చేయొచ్చని వారి ప్రణాళిక.
దీనివల్ల 2030 నాటికి 6.5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా.
అణ్వాయుధాలు, నాటోతో బంధం
అణ్వాయుధాలకు సంబంధించి తమ విధానం చాలా స్పష్టంగా ఉందని లేబర్ పార్టీ చెప్పింది.
అణ్వాయుధాలను నిరోధించడానికి తాము నిబద్ధతతో ఉన్నామని చెప్పింది.
ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదంది. అలాగే, నాటోతో తమ బంధం ఎంతో బలమైందని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
మెరుగైన వైద్య సేవలు..
ఎన్‌హెచ్ఎస్ (బ్రిటన్‌లో వైద్య సేవలు అందించే విభాగం)లో వారానికి 40 వేల అదనపు అపాయింట్‌మెంట్లు, ఆపరేషన్లు, స్కాన్లు నిర్వహించేలా చూస్తామని, అంటే ఏడాదికి 20 లక్షల అదనపు సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.
అయితే, చికిత్స కోసం రోగులు వేచిచూసే సమయాన్ని నియంత్రించగలిగితే సరిపోతుందని కొందరు నిపుణులు అంటున్నారు.
ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులు వస్తున్నా, ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుంటున్నా ఎన్‌హెచ్ఎస్ సేవలపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది.
ఎమర్జెన్సీ సర్వీసులకు డిమాండ్ పెరగడం, డిశ్చార్జ్ చేయడం ఆలస్యం కారణంగా రోగులు ఇబ్బంది పడుతున్నారు.
రేప్ కేసుల సత్వర విచారణ
ఇంగ్లండ్, వేల్స్ కోర్టుల్లో ఏప్రిల్ నాటికి దాదాపు 68 వేల కేసుల విచారణ పెండింగ్‌లో ఉంది.
వీటిలో తీవ్రమైన లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి.
రేప్ కేసుల విచారణను త్వరగా పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపడతామని లేబర్ పార్టీ హామీ ఇచ్చింది.
దీనికోసం అదనపు నిధులు అవసరం లేదు. కానీ, ఉన్న వనరులనే సరైన రీతిలో వినియోగించుకోవాలి.
అనుభవజ్ఞులైన లాయర్ల కొరత మధ్య ఇదెంత వరకూ సాధ్యమో చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
టికెట్ కష్టాలు
సాంస్కృతిక కార్యక్రమాలు.. మరీ ముఖ్యంగా లండన్‌లో వీటి టికెట్ల ధర సామాన్యులకు అందుబాటులో ఉండదనే విమర్శలున్నాయి.
కొందరు వీటిని అసలు చూడలేకపోతున్నారు. లేదా అధిక ధరలకు కొనడమో, నకిలీ టికెట్లు కొని మోసపోవడమో జరుగుతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల హక్కుల చట్టాన్ని బలోపేతం చేస్తామని లేబర్ పార్టీ హామీ ఇచ్చింది.
అయితే, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నీ అమల్లోకి రావడానికి ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు.
పెట్టుబడుల నుంచి ప్రతిఫలం అందాలంటే కొన్నిసార్లు కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. అయితే రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందనే అంచనాలున్నప్పటికీ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చనే ప్రమాద సంకేతాలూ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- బెరిల్: ‘మా ద్వీపం మొత్తాన్ని తుడిచిపెట్టేసిన హరికేన్ ఇది’ అంటున్న బాధితులు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే....
- పిల్లల కోసం తల్లిదండ్రులు ఒక చిన్న సెల్లో తమను తాము బంధించుకుంటున్నారు, ఎందుకు?
- వీళ్లు ఏటా లీటర్ల కొద్దీ మద్యం తాగేస్తున్నారు, అత్యధికంగా ఆల్కహాల్ తాగే దేశాలు ఇవే..
- వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?
- ‘60’ మందిని ఉరి తీసిన తలారి మృతి
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














