బైడెన్ పోటీ నుంచి తప్పుకొంటారా? గెలుపుపై డెమొక్రాట్లలో నమ్మకం కలిగించలేకపోతున్నారా

Biden

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాచెల్ లూకర్, కోర్ట్నీ సుబ్రమణియన్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

డోనల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో సరిగా మాట్లాడలేకపోవడంతో, రీ-ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి తప్పుకోవాలని తన సొంత పార్టీలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అయితే, శుక్రవారం రాత్రి ఏబీసీ న్యూస్‌కు బైడెన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇలాంటి ఆందోళనలు, వ్యతిరేకతలను తగ్గించలేకపోయింది.

బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని మిన్నెసోటాకు చెందిన డెమొక్రాట్ నేత ఏంజీ క్రెగ్ పిలుపునిచ్చారు. దీంతో, బైడెన్ తప్పుకోవాలని కోరుతున్న డెమొక్రాట్ల జాబితాలో ఆమె చేరారు.

మరింత మంది డెమొక్రాట్లు బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని కోరుతుండొచ్చని పలు కథనాలు చెబుతున్నాయి.

ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్, తన డిబేట్‌‌పై వచ్చిన ఆరోపణలను కొట్టివేశారు.

దేవుడు మాత్రమే తనను పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పగలడని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
శుక్రవారం ఏబీసీ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏబీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో బైడెన్

81 ఏళ్ల బైడెన్, ఆదివారం రెండు ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందు.. శనివారం డెలావేర్‌లోని తన కుటుంబంతో గడిపారు.

డెమొక్రాట్లలో ఆయనపై నిరసన పెరుగుతున్నప్పటికీ, పార్టీకి చెందిన ఏ సీనియర్ సభ్యులు కూడా బైడెన్ ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకోవాలని బహిరంగంగా కోరడం లేదు.

బైడెన్‌తో పోలిస్తే ట్రంప్ ముందంజలో ఉన్నారని చాలా పోల్స్ చెబుతున్నాయి.

ఒకవేళ బైడెనే కనుక అధ్యక్ష అభ్యర్థిగా ఉంటే సెనేట్ మెజార్టీతో పాటు అధ్యక్షతను, సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు.

బైడెన్ సమర్థంగా ప్రచారం నిర్వహించి, డోనల్డ్ ట్రంప్‌పై గెలుస్తారని తనకు అనిపించడం లేదని మిన్నెసోటాలోని కాంపిటీటివ్ జిల్లాలో పోటీ చేసే ఏంజీ క్రెగ్ అన్నారు.

దశాబ్దాల పాటు బైడెన్ చేసిన సేవలను తాను గౌరవిస్తానని చెబుతూనే బైడెన్ అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తే రెండోసారి డోనల్డ్ ట్రంప్‌‌నకు అధ్యక్ష అవకాశం ఇచ్చే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని తొలుత పిలుపునిచ్చిన టెక్సస్ సభ్యుడు లాయిడ్ డాగె, ఏబీసీ ఇంటర్వ్యూ విడుదలైన నిమిషాల వ్యవధిలోనే మళ్లీ స్పందించారు.

బైడెన్ తప్పుకోవాలని గతంలో తాను డిమాండ్ చేసినప్పటి కంటే ఇప్పుడు ఆ అవసరం మరింత తీవ్రంగా ఉందన్నారు.

బైడైన్ తప్పుకోవాలనే నిర్ణయం ఎంత ఆలస్యమైతే అంత నష్టం జరుగుతుందని, బైడెన్ తప్పుకోవడం ఎంత ఆలస్యమైతే ఆయన స్థానంలో వచ్చే కొత్త అభ్యర్థి ట్రంప్‌ను ఓడించడం అంత కష్టమవుతుందని అన్నారు.

బైడెన్ అధ్యక్ష రేసు నుంచి పక్కకు తప్పుకోవాలని కోరుతున్న వారిలో ఇల్లినాయిస్ నేత మైక్ క్విగ్లీ, మసాచుసెట్స్‌కు చెందిన సెత్ మౌల్టన్‌ ఉన్నారు.

బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

అధ్యక్షుడిగా మరో దఫా సేవలందించేందుకు తాను ఫిట్‌గా ఉన్నానని నిరూపించేందుకు కాగ్నిటివ్ టెస్ట్ తీసుకోవడానికి బైడెన్ తన తాజా ఇంటర్వ్యూలో నిరాకరించారు.

‘‘ప్రతి రోజూ నేను కాగ్నిటివ్ టెస్టు చేసుకుంటాను’’ అని జార్జ్ స్టెఫానోపౌలస్‌తో అన్నారు.

22 నిమిషాల పాటు జరిగిన ఏబీసీ ఇంటర్వ్యూలో బైడెన్.. తాను తప్పుకోవాలని సూచనలు వస్తున్నాయన్న మాటను కొట్టిపారేశారు. ఇలా ఎవరూ తనని అడగడం లేదన్నారు.

అధ్యక్షుడిగా మరో దఫా సేవలందించేందుకు బైడెన్‌కు ఉన్న సామర్థ్యంపై స్టెఫానోపౌలస్ మరోసారి ప్రశ్నించారు.

దానికి బైడెన్.. ‘అధ్యక్ష అభ్యర్థిగా నాకంటే ఇంకెవరికీ అర్హతులున్నాయని కానీ, ఈ రేసులో విజయం సాధిస్తారని కానీ నేను అనుకోవడం లేదు’ అన్నారు.

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అందిస్తున్న సహకారానికి ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఒకవేళ ఆయన తప్పుకొంటే, తర్వాత అధ్యక్ష రేసులో ఉన్న ప్రధాన ప్రత్యర్థి కమలా హారిస్‌నే.

అమెరికా ప్రజాస్వామ్యానికి నవంబర్ ఎన్నికలు కీలకమని న్యూ ఓర్లీన్స్‌లో ఎస్సెన్స్ బ్లాక్ కల్చర్ ఫెస్టివల్‌లో శనివారం జరిగిన ఇంటర్వ్యూలో కమలా హారిస్ అన్నారు. కానీ, బైడెన్‌పై డెమొక్రాట్లు చేస్తున్న ఆరోపణలను మాత్రం ఆమె ప్రస్తావించలేదు.

కమలాహారిస్
ఫొటో క్యాప్షన్, జో బైడెన్ తప్పుకుంటే కమలా హారిస్ పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

నియంతలపై అభిమానం చూపిస్తూ ట్రంప్ బహిరంగంగా మాట్లాడుతున్నారని, నియంతగా ఉండటం ఆయన ఉద్దేశ్యమని అన్నారు.

అయితే, బైడెన్ అభ్యర్థిత్వంపై వెల్లువెత్తుతున్న అనుమానాల నేపథ్యంలో, ఆయన స్థానాన్ని కమలా హారిస్ భర్తీ చేయగలరన్నడాన్ని తోసిపుచ్చలేం.

కమలా హారిస్ గత వారమంతా అధ్యక్షుడితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జులై 4న వైట్ హౌస్‌లో జరిగిన వేడుకలకు హాజరయ్యేందుకు లాస్‌ ఏంజిల్స్‌ నుంచి వెళ్లారు. గవర్నర్లతో, బైడెన్‌తో జరిగిన సమావేశంలో కమలా హారిస్ పాల్గొన్నారు.

‘‘అధ్యక్షుడికి మద్దతుగా ఉండాలనే విషయాన్ని ఆమె ఎప్పుడూ మనసులో పెట్టుకుంటారు’’ అని ఆమె మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జమాల్ సిమన్స్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

‘ఉపాధ్యక్షులు తమ ప్రధాన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూనే, తమ బాస్‌లకు స్పష్టమైన మద్దతు ఇచ్చే విషయంలో చాలా బ్యాలెన్సింగ్‌గా వ్యవహరిస్తుంటారు’ అన్నారు.

బైడెన్ చుట్టూ నెలకొన్న పలు అనుమానాల నేపథ్యంలో కమలా హారిస్‌కు ఈ బాధ్యత మరింత ఎక్కువైంది.

అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ విషయంలోనూ కొందరు డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇమిగ్రేషన్, విద్యా రుణాలు, ఓటింగ్ హక్కుల వంటి అంశాలపై ఆమెకు బాధ్యతలు ఇచ్చినప్పుడు, ఉపాధ్యక్షురాలిగా నిలదొక్కుకునేందుకు ప్రారంభంలో ఇబ్బందులు పడ్డారని అన్నారు.

ఇటీవల నెలల్లో ఆమె పనితీరు మెరుగైనప్పటికీ ఆమోదనీయ రేటింగ్స్ మాత్రం పేలవంగానే ఉన్నాయి.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)