హాథ్‌రస్: అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాలను కూడా జనం ఎందుకు నమ్ముతారు?

హాథ్‌రస్ తొక్కిసలాట బాధితులు

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, భవదీప్ కాంగ్
    • హోదా, బీబీసీ కోసం

నమ్మకమే భక్తులను భోలేబాబా సత్సంగానికి నడిపించింది. తర్వాత విషాదకర మరణాలకూ కారణమైంది.

పిండిమరలో నలిగిపోయిన ధాన్యపు గింజల్లా అక్కడ జరిగిన తొక్కిసలాటలో భక్తులు నలిగిపోయారు. బురదలో కూరుకుపోయారు. ఫలితంగా ఆ పొలంలో మహిళలు, పిల్లలు నిర్జీవంగా పడిపోయారు.

అయినా వారిలో బాబా మీద విశ్వాసం ఏ మాత్రం తగ్గలేదు.

దేవాలయాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో ఇలాంటి తొక్కిసలాటలు చాలా జరిగాయి. ఈ తొక్కిసలాటల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు.

భావోద్వేగాలు భక్తులను భయాందోళనకు గురయ్యే గుంపుగా మారుస్తాయి. దీంతో వారి దారిలో అడ్డొచ్చిన ప్రతీదీ నాశనమవుతుంది.

కుంభమేళాలో, వైష్ణోదేవి దగ్గర, నైనా దేవి వద్ద, శబరిమలలో ఇలాంటి ఘటనలు జరిగాయి. భక్తి ఉన్మాదానికి చాలామంది బలైపోయారు.

కానీ విశ్వాసం మాత్రం కొనసాగుతూనే ఉంది.

తమ భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మతగురువులలో కానిస్టేబుల్ నుంచి బాబాగా మారిన ‘భోలే బాబా’ అలియాస్ నారాయణ్ సాకార్ హరి అలియాస్ సూరజ్ పాల్ జాతవ్ మొదటివాడైతే కాదు. అంతకుముందు కూడా చాలామంది బాబాలు తమ భక్తుల విషయంలో ఇలాగే వ్యవహరించారు.

బాబా సత్సంగ్ నిర్వాహకులు చెప్పిన దానికంటే ఈ కార్యక్రమానికి హాజరైన భక్తుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఈ తొక్కిసలాట జరగడంపై రెండు వాదనలు ఉన్నాయి.

వాటిల్లో ఒకటి సత్సంగ్ నిర్వాహకులు భక్తులను చేలల్లోంచి వెళ్లకుండా అడ్డుకుని ఉండాల్సింది. లేదంటే బాబా వెళ్లే దారి నుంచి తప్పుకోవాలంటూ బాబా వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయినా భక్తులను తోసి వేసి ఉండాలి.

భక్తులు ఒక క్రమపద్ధతిలో వెళ్లడానికి ముందస్తు జాగ్రత్తలేవీ తీసుకోలేదు.

అలాగే గాయపడినవారికి ఎటువంటి సహాయం అందలేదు. సహాయక చర్యలూ లేవు.

ఇంతపెద్ద తొక్కిసలాట జరిగి 120 మంది భక్తులు మరణించినా కూడా బాబా దీనికి బాధ్యత తీసుకోవడం లేదు.

ఘటనాస్థలి దరిదాపుల్లో కనిపించకుండా దూరంగా వెళ్లిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
 మహిళల ఫోటో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బాబాలను గుడ్డిగా నమ్మేవారిలో అత్యధికులు నిస్సహాయులైన మహిళలే.

మూఢభక్తే గురువుల బలం

హాథ్‌రస్ ఘటనలో భక్తులు తమ తలరాత ప్రకారం కర్మఫలాన్ని అనుభవించారు. అంతేకానీ గురువు దీనికి బాధ్యత వహించరు.

ఇది గురువుకు, ఆయన భక్తులకు మధ్య ఉండే బంధం ఎంత శక్తిమంతమైనదో చెబుతుంది. భక్తులు సేవ చేస్తారు. గురువులు ఆ సేవను ఉదారంగా అంగీకరిస్తారు.

బాబాలు గుడ్డి నమ్మకాన్ని కోరుకుంటారు. దానిని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటారు. ఈ విషయంలో ప్రత్యేకించి మహిళలే బాధితులు.

మహిళా భక్తులను లైంగికంగా వేధించిన కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాల జాబితా పెద్దదే. ఇందులో ‘భోలే బాబా’ పేరు కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాల్లో ప్రముఖులుగా గుర్మీత్ రామ్ రహీం, ఆశారాం బాపు పేర్లు ఉన్నాయి.

ఇలాంటి ఆరోపణలకు మారుపేరైన నిత్యానంద పరమహంస పరారీలో ఉన్నారు.

శ్రీ రామచంద్రపుర మఠానికి చెందిన రాఘవేశ్వర్ భారతిపై చార్జిషీటు వేసినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో రద్దు చేశారు.

ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా భక్తులు మాత్రం బాబాలను అనుసరించడం మానరు.

విశ్వాసం గుడ్డిది కాదు. కానీ అది చూడాలనుకుంటున్నదాన్ని మాత్రమే చూస్తుంది.

భక్తుల నమ్మకం ఏంటంటే తప్పుచేసినప్పటికీ బాబాలు ఎప్పుడూ మంచివాళ్లే అని.

గురువులు ఎప్పుడూ తప్పుచేయరని భక్తులు దృఢంగా నమ్ముతారు.

బాబాల చర్యలు అసంబద్ధంగా ఉన్నా, బాబా తప్పు చేయరనే మూఢ భక్తి....వారు నిజంగా తప్పు చేసినా చేయలేదని నమ్మేలా చేస్తోంది.

ఒకసారి గురువు దైవత్వాన్ని భక్తులు విశ్వసించడం మొదలుపెడితే వారిని నెత్తిన పెట్టుకుంటారు. తమ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు అందరికన్నా గురువునే నమ్ముతారు.

 హాథ్‌రస్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హాథ్‌రస్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతం

బాబాలకు భక్తులే రక్ష

‘లవ్ చార్జర్' అని పిలిచే రామ్ రహీం బాబాను 2017లో అత్యాచారం ఆరోపణలపై కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఆ ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను బెదిరించేందుకు తన భక్త గణాన్ని వాడుకున్నారు.

భక్తులు రహీమ్ బాబాపై వచ్చిన ఆరోపణలను లెక్కచేయలేదు. అత్యాచార ఆరోపణలతోపాటు ఆయనపై హత్యారోపణ కూడా ఉంది.

తనను నమ్మే 400మంది భక్తులను నపుంసకులను చేసిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.

కానీ, భక్తులకు మాత్రం గురువు చట్టానికి అతీతుడని భావిస్తుంటారు. ఆయన వ్యక్తిత్వానికి ఎటువంటి మరక అంటకుండా ఆయనను విడుదల చేయాలని కోరుకుంటారు.

రామ్ రహీం బాబాను కోర్టు దోషిగా తేల్చినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు పెద్ద ఎత్తున హింసకు దారితీశాయి. 38 మంది మరణించారు. వందలమంది గాయపడ్డారు.

ఈ మరణాలకు కారకులు ఎవరు? బాబానా-భక్తులా?

రామ్ రహీం బాబా తరహాలోనే హరియాణాకు చెందిన జగద్గురు రాం పాల్ మహరాజ్ భక్తులను తన కవచంగా ఉపయోగించుకున్నారు.

రాంపాల్ తన ఆశ్రమంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రపరిచారు. ఒక ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

గురుపై కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పుడు ఆయన అనుచరులను చూసి పోలీసులు చాలా ఆందోళన చెందారు.

బాబాని అరెస్టు చేయడానికి పారా మిలటరీ దళాల సహాయాన్ని అభ్యర్థించారు.

అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మహిళలు మృతి చెందారు. వారు బాబా కోసం తమను తాము 'త్యాగం' చేసుకున్నారు.

గురువు నైతికతను ఎవరూ తప్పుపట్టకూడదు. ఆయనను ప్రశ్నించకూడదు అని భక్తులు నమ్ముతారు.

అందుకే గురువుపై అత్యాచారం, హత్య, అపహరణ, నపుంసకులను చేయడం, భూకబ్జాలు, అక్రమ ఆర్థిక లావాదేవీల వంటి వాటిపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా భక్తుల దృష్టిలో ఆయన నిజాయితీపరుడే.

తమ గురువును కుట్రలో ఇరుక్కున్న బాధితుడిగా చూస్తారు భక్తులు.

హాథరస్ బాధితులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

రాజకీయ బంధం

బాబాల మహిమని బాబాలకన్నా భక్తులే ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే తాము నమ్ముతున్న బాబా మోసగాడు అని ఒప్పుకుంటే తమను తాము బుద్ధిలేని వాళ్లుగా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ తమ ఐడెంటిటీ ప్రశ్నార్ధకంగా మారుతుంది.

గురువుతో కలిసి భక్తులందరూ ఒక సంఘంగా మారతారు. ఈ సంఘంలో సభ్యత్వమే వారి గుర్తింపు అనుకుంటారు.

ఎవరైనా గురువుని ప్రశ్నిస్తే వారు సంఘం నుంచి బహిష్కృతులవుతారు. అందుకే ప్రతి ఒక్కరూ గురువుకి విశ్వాసపాత్రులుగా ఉంటారు.

ఈ మత విశ్వాసం బాబాలతోపాటు వారి స్నేహితులైన కొందరు రాజకీయ నాయకులకు కూడా ఉపయోగమే. ఎందుకంటే భక్తుల నమ్మకం ఓట్ల రూపంలో బదిలీ అవుతుంది.

సాధారణంగా మత గురువులు రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడరు. కానీ రామ్ రహీం బాబా వంటి కొంతమంది ఏదో ఒక పార్టీతో కలిసి ఉండాలని భావిస్తారు.

ఇలా వ్యవహరించడం ఆ బాబా గుర్తింపుని, అధికారాన్ని రెట్టింపు చేస్తుంది.

ఇది ఆయనలాంటి వారికి రాజకీయంగా భద్రత కల్పిస్తుంది. ప్రభుత్వోద్యోగుల బదిలీలు, పోస్టింగులు, ఎన్నికల ఆశావహులకు టిక్కెట్లు పొందడం వంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది.

మతపెద్దలు, రాజకీయ నాయకుల పొత్తు కేవలం ఓట్ల కోసమే కాదు.

రాజకీయ నాయకులు కూడా బాబాలను పూజిస్తారు. బాబాలు తమకు అనుకూలంగా దేవుడిని ప్రార్ధించి ప్రయోజనాలు చేకూరుస్తారని నమ్ముతారు.

రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల ముందు బాబాల ఆశీస్సులు తీసుకుంటారు. వారు చెప్పిన విధంగా పూజలు,యజ్ఞయాగాదులవంటివి జరిపిస్తారు.

ఉదాహరణకు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ‘భోలే బాబా’ సత్సంగ్ కు హాజరైన చిత్రాలను, అలాగే ఆయనను ప్రశంసిస్తూ అఖిలేష్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ను కొన్ని పత్రికా సంస్థలు ప్రచురించాయి.

మోక్షాన్ని పొందడంకోసం ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథుని రథయాత్రలో కొందరు భక్తులు తమకు తాముగా ఆ చక్రాలకింద పడేవారని పురాణ కథలలో ఉంది.

కానీ హాథ్‌రస్‌ ఘటనలో చనిపోయిన మహిళలు, పిల్లలు తమకుతాముగా మోక్షం పొందడానికి రాలేదు. ఆశీర్వాదం కోసం వచ్చారు. వారి కోరికలు తీరతాయని ఆశతో వచ్చారు.

కానీ వారు కొందరి బాధ్యతా రాహిత్యంతో నిర్దాక్షిణ్యంగా బలయ్యారు.

అయినా బాబాలపై విశ్వాసం కొనసాగుతూనే ఉంటుంది. ..మరింత బలపడుతూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)