యూకేలో అతిపిన్న వయసు ఎంపీ: 2002లో పుట్టారు, ఇప్పుడు ఎంపీ అయ్యారు

Sam Carling

ఫొటో సోర్స్, Sam Carling

ఫొటో క్యాప్షన్, కేంబ్రిడ్జ్ గ్రాడ్యుయేట్ అయిన 22 ఏళ్ల సామ్ కార్లింగ్‌ తాజా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి యూకే పార్లమెంట్‌‌లో అడుగుపెట్టబోతున్నారు ఈ యువ ఎంపీ. ఈయన వయసు 22 ఏళ్లే. అయితే, తన వయసు గురించి ఎక్కువగా చర్చించడం తనకు ఇష్టం లేదని ఆయన అంటున్నారు.

నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జ్‌షైర్ నుంచి స్వల్ప మెజార్టీతో నెగ్గిన లేబర్ పార్టీ అభ్యర్థి సామ్ కార్లింగ్‌, హౌస్ ఆఫ్ కామన్స్‌లో అతిపిన్న వయస్కుడు కావడంతో అనధికారికంగా ''బేబీ ఆఫ్ ది హౌస్'' బిరుదు పొందవచ్చు.

కేంబ్రిడ్జీ యూనివర్సిటీ సైన్స్‌ గ్రాడ్యుయేట్ అయిన కార్లింగ్, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి అయిన సీనియర్ ఎంపీ శైలేశ్ వరాను 39 ఓట్లతో ఓడించారు.

తన విజయాన్ని ''రాజకీయ ప్రకంపన''గా ఆయన అభివర్ణించారు. మరింత మంది యువత రాజకీయాల్లోకి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

''పార్లమెంట్‌తో పాటు స్థానిక కౌన్సిళ్లలో వారు తమను తాము ప్రతినిధులుగా చూసుకుంటారు. ఇది మనకెందుకులే అనే ఉదాసీనతను పారదోలుతుంది'' అని ఆయన అన్నారు.

ఇంతకుముందు ''బేబీ ఆఫ్ ది హౌస్'' అయిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, సహచర ఎంపీ కీర్ మాథర్ 2023 ఉప ఎన్నికల్లో సెల్బీ అండ్ ఐన్‌స్టీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

కేంబ్రిడ్జ్‌లో కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న కార్లింగ్ మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారని, అయితే సన్నిహితులు మాత్రం చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు.

''చాలా మంచిది, యువత ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని వారు చెప్పారు'' అన్నారాయన.

''యువతను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో చాలా విమర్శలు వస్తున్నాయి. కానీ, నేరుగా చూసినప్పుడు, వారి గురించి తెలుసుకున్నప్పుడు ప్రజలు థ్రిల్ ఫీలవుతుంటారు'' అన్నారు కార్లింగ్.

బీబీసీ న్యూస్ తెలుగు
Sam Carling

ఫొటో సోర్స్, Emma Baugh/BBC

ఫొటో క్యాప్షన్, లేబర్ పార్టీ యువతకు ఎక్కువ అవకాశాలు ఇస్తుందని కార్లింగ్ ఆశిస్తున్నారు

అయితే, తన వయసుపై ఎక్కువ దృష్టి పెట్టడం ఆయనకు ఇష్టం లేదు.

''చిన్నవయసు ఎంపీ అనే ఈ వింత ఆలోచనా విధానం నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నా. నాకు తెలిసినంత వరకూ అందరిలాగే ఉంటాం. నేను ఎంపీగా నా బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నా'' అని కార్లింగ్ అన్నారు.

ఇటీవలి కాలంలోనే రాజకీయాలపై కార్లింగ్ ఆసక్తి పెంచుకున్నారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు.. యూకే పార్లమెంట్‌లో తీసుకున్న నిర్ణయాలకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్నానని ఆయన చెప్పారు.

ఈశాన్య ఇంగ్లండ్‌ ప్రాంతంలోని ఓ సాధారణ పట్టణంలో కార్లింగ్ పెరిగారు. అది ''చాలా వెనుకబడిన ప్రాంతం'' అని ఆయన చెప్పారు.

''నా చుట్టూ ఉన్న పరిస్థితులు అధ్వానంగా మారడం చూశాను. స్థానికంగా షాపులు మూతపడడం ఆందోళన కలిగించింది. గతంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉండేది. కానీ, ఇప్పుడు అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆరో తరగతిలో స్కూల్‌ మూతపడింది, అప్పటికి నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు'' అన్నారు.

యూకే

ఫొటో సోర్స్, Shariqua Ahmed/BBC

ఫొటో క్యాప్షన్, నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జ్‌షైర్ నుంచి పోటీ చేసిన కార్లింగ్, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి శైలేశ్ వరాను ఓడించారు

పీటర్‌బరో నగరం కేంద్రంగా ఉండే తన నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వం ''పరిష్కరించేందుకు చాలా సమస్యలు ఉన్నాయి. దేశంలో క్షేత్రస్థాయి పరిస్థితి ఇది'' అని కార్లింగ్ అన్నారు.

దంతవైద్యులు, ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది సమస్యతో పాటు గ్రామీణ రవాణా వంటి సమస్యలను తమ పార్టీ ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటున్నారు.

భవిష్యత్ రాజకీయాలను మాతరం ఎలా మార్చేస్తుందనేది ఆసక్తికరమైన అంశం కావొచ్చని కార్లింగ్ అన్నారు.

''చాలా మందికి కన్జర్వేటివ్ ప్రభుత్వం గురించి మాత్రమే తెలుసని అనుకుంటున్నా.

పాలనలో గణనీయమైన మార్పులు తీసుకురాగలం, ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని అందించగలమని నేను గట్టిగా చెప్పగలను. అలాగే, ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నా" అని కార్లింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)