జదునాథ్ మహారాజ్: మహిళా భక్తులను ‘లైంగికంగా దోచుకున్న’ ఈ స్వామీజీని ఎదిరించిన జర్నలిస్ట్ కర్సన్‌దాస్ మూల్జీ ఎవరు?

చరిత్ర

ఫొటో సోర్స్, KARSONDAS MULJI A BIOGRAPHICAL STUDY (1935)

    • రచయిత, నియాజ్ ఫారూఖీ
    • హోదా, బీబీసీ ఉర్దూ.కామ్, దిల్లీ

ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'మహారాజ్' సినిమా రెండు కారణాల వల్ల వార్తల్లో నిలిచింది.

భారతీయ సమాజంలో వందేళ్లకు పైగా కొనసాగుతున్న దురాచారాలపై ఒక జర్నలిస్టు చేసిన పోరాటానికి సంబంధించిన కథ కావడం ఒక కారణమైతే, రెండోది.. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తొలిసారి వెండితెరపై కనిపించడం.

2014లో గుజరాతీ జర్నలిస్ట్ సౌరభ్ షా రాసిన 'మహారాజ్' నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

కర్సన్‌దాస్ మూల్జీ అనే జర్నలిస్ట్ చేసిన సంఘ సంస్కరణోద్యమం, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

ఈ సినిమాకు సిద్ధార్థ మల్హోత్రా దర్శకత్వం వహించగా, ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో పాటు షాలినీ పాండే, శార్వరి వాఘ్, జయదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రలు పోషించారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో, 1862లో ఒక జర్నలిస్ట్.. స్వామీజీ లైంగిక నేరాల గురించి రాయడం మొదలుపెడతారు. అలా రాసిన కారణంగా ఆయన పరువు నష్టం కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది.

నూట యాభై ఏళ్ల కిందట భారతీయ సమాజంలో మహిళలపై లైంగిక దోపిడీకి, సంప్రదాయ మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆ జర్నలిస్ట్ ఎవరు?

బీబీసీ న్యూస్ తెలుగు

ఎవరీ కర్సన్‌దాస్ మూల్జీ?

కర్సన్‌దాస్ మూల్జీ 1832 జులై 25న, అప్పటి బొంబాయిలోని ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారని కర్సన్ దాస్ మూల్జీ: ఎ బయోగ్రాఫికల్ స్టడీ అనే పుస్తకం రాసిన బీఎన్ మోతీవాలా వెల్లడించారు. గుజరాతీ మాధ్యమంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన మూల్జీ.. ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు.

సినిమాలో చూపించిన దాని ప్రకారం, చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే ఆయన సమాజంలోని ఆచారాలపై ప్రశ్నిస్తుండేవారు.

''మనం రోజూ గుడికి ఎందుకు వెళ్తాం? దేవుడికి గుజరాతీ అర్థమవుతుందా? దేవుడు మన ఊరి వాడేనా? మహిళలు ఎందుకు ఎప్పుడూ ముసుగులు వేసుకుంటారు?'' వంటి ప్రశ్నలు అడుగుతుండేవారు.

కర్సన్‌దాస్ మూల్జీ గుజరాతీ జర్నలిస్టు. మతం పేరుతో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దోపిడీ గురించి ఆయన రాయడం మొదలుపెట్టారు.

సామాజిక ఆచారాలను ప్రశ్నించడం వల్ల ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

బాలీవుడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (ఎడమ) కర్సన్‌దాస్ మూల్జీ పాత్రను పోషించారు

మహారాజ్ ఎవరు?

శ్రీక‌ష్ణుడిని ఆరాధించే వైష్ణవ పుష్టిమార్గ్ సంప్రదాయానికి చెందిన మతగురువు/స్వామీజీ జదునాథ్ జీ మహారాజ్. ఈ శాఖకు చెందిన మతగురువులు తమను ''మహారాజ్‌''గా పిలుచుకునేవారు.

గుజరాత్, కఠియావాడ్, కచ్ ప్రాంతాలతో పాటు మధ్య భారతంలోని సంపన్న వ్యాపారుల నుంచి రైతుల వరకు.. భాటియాలు, బనియాల వంటి ప్రభావవంతమైన కులాలకు చెందిన వారు కూడా ఆయన అనుచరుల్లో ఉండేవారు.

ఈ శాఖకు సంబంధించిన స్వామీజీలు మహిళా భక్తుల విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని 'చరణ్ సేవ' అనే ఆచారం పేరుతో వారిపై లైంగిక దోపిడీకి పాల్పడుతూ, దానిని మత సంప్రదాయంగా చెప్పేవారు.

''మహారాజ్ కేవలం తన మహిళా భక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా, తన సెక్స్ కోరికలు తీర్చుకోవడం కోసం మగ భక్తులు వారి భార్యలను కూడా తన వద్దకు పంపాలని ఆశించారు.'' అని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అనే పత్రికలో అనుకుమార్ రాశారు.

మతం, విశ్వాసం పేరుతో జరుగుతున్న దురాగతాలపై కర్సన్‌దాస్ వంటి సంఘ సంస్కర్తలకు బాగా తెలుసు, కానీ వారు 'మహారాజ్' భక్తుల నుంచి, వారి సొంత కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.

'చరణ్ సేవ' అనే దురాచారానికి వ్యతిరేకంగా కర్సన్‌దాస్ గళమెత్తడంతో ఆయన్ను ఇంటి నుంచి గెంటేశారు. అయినప్పటికీ ఆయన తన జర్నలిజం ద్వారా మహారాజ్ దుశ్చర్యలను వ్యతిరేకించారు.

తొలుత దాదా భాయ్ నౌరోజీ వార్తాపత్రిక 'రస్త్ గుఫ్తార్' కోసం కథనాలు రాశారు. ఆ తర్వాత 'సత్య ప్రకాశ్' పేరుతో సొంత పత్రికను ప్రారంభించారు. తన పత్రికలో ఆయన రాసిన కథనం మహారాజ్ జదునాథ్‌ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఆయన కర్సన్‌దాస్‌పై పరువు నష్టం కేసు వేశారు.

చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

పరువు నష్టం కేసులో ఏముంది?

జదునాథ్ మహారాజ్ ఆధ్యాత్మికత పేరుతో మహిళలను లైంగికంగా దోచుకుంటున్నారని కర్సన్‌దాస్‌ మూల్జీ ఆరోపించారు. వాటి గురించి ఆయన తన పత్రికలో కూడా రాశారు.

దీంతో 1862లో మహారాజ్ తరఫున కర్సన్‌దాస్‌ మూల్జీపై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఈ సందర్భంగా, మహారాజ్ జదునాథ్‌ను తన ఎదురుగా విచారించాలని కర్సన్‌దాస్‌ వాదించారు. ఎందుకంటే, ఆయన వాదనల ప్రకారం, పుష్టి మార్గ్ అసలు నిజమైన హిందూ మతం కాదు. తమ శరీర వాంఛలను తీర్చుకోవడానికి భక్తులు తమ భార్యలను, కూతుళ్లను 'మహారాజ్'‌కి అప్పగించాలనే దురాచారాన్ని తీసుకొచ్చిన ఒక వక్రమైన శాఖ.

అయితే, కర్సన్‌దాస్‌ మూల్జీ కుటుంబానికి కూడా 'మహారాజ్‌'పై భక్తి, విశ్వాసం ఉండేది.

బొంబాయి కోర్టులో ఈ కేసు విచారణ 24 రోజుల పాటు సాగింది. తన వాదనలను సమర్థించుకోవడానికి మహారాజ్ చాలామంది సాక్షులను ప్రవేశపెట్టారు.

అయితే, ఈ కేసులో మహారాజ్ వ్యక్తిగత వైద్యుడు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన జదునాథ్, ఇతర 'మహారాజ్‌'లకు లైంగిక వ్యాధికి సంబంధించిన చికిత్స అందించినట్లు చెప్పారు. చాలామంది మహిళా భక్తులతో శారీరక సంబంధాలు నెరపడం వల్లే ఈ వ్యాధి వచ్చినట్లు వైద్యుడు చెప్పారు.

ఈ పరువు నష్టం కేసులో కర్సన్‌దాస్‌ విజయం సాధించారు. ఆ తర్వాత, అప్పటి సమాజంలో క్రమంగా వచ్చిన మార్పులకు ఈ కేసు కారణమైంది.

ఆనాటి హిందూ సమాజంలోని ఇతర ఆచారాలపై కూడా మూల్జీ గళమెత్తారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలకు అనుకూలంగా ప్రచారం చేశారు.

దీంతో స్థానిక ఇంగ్లిష్ పత్రికలు ఆయనకు 'ఇండియన్ లూథర్' అనే బిరుదు ఇచ్చాయి.

చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

కర్సన్‌దాస్‌ గురించి ఆయన స్నేహితులు ఏమన్నారు?

కర్సన్‌దాస్‌ సమకాలికుడు, ఆయన వార్తాపత్రికలో సహాయకుడు అయిన మాధవ్ దాస్ రఘునాథ్ దాస్, 1890లో రాసిన తన పుస్తకంలో కర్సన్‌దాస్‌ సాయంతో తాను వితంతువును వివాహం చేసుకున్న అనుభవం గురించి రాశారు.

ఈ వివాహం గురించి చెబుతూ, వితంతు పునర్వివాహం సాధారణ విషయం కాదని, ''దానిని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది'' అని ఆయన రాశారు.

కర్సన్‌దాస్‌ వితంతువుకి తండ్రి స్థానంలో ఉండి, స్వయంగా కన్యాదానం చేశారు. అయితే, సంప్రదాయవాదుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ఆయన భయపడ్డారు. బ్రిటిష్ ఇన్‌స్పెక్టర్ ఒకరు ఆ రాత్రి ఆయనకు పోలీసు రక్షణ కల్పించారు.

''ముందుజాగ్రత్త చర్యగా, మాకు మేమే ఆ ప్రదేశంలో నలుగురు బలమైన పఠాన్లను రక్షణగా పెట్టాం.'' అని ఆయన రాశారు.

కర్సన్‌దాస్‌ మరికొన్ని విధాలుగానూ సమాజాన్ని సవాల్ చేశారని మాధవ్ దాస్ రాశారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)