‘డోనల్డ్ ట్రంప్‌ను ఓడించే కసి ఆయనలో ఉందా?’ అని బైడెన్‌పై సొంత పార్టీ వారే ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారు?

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హోలీ హాన్‌డ్రిచ్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రెండోసారి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తన అభ్యర్థిత్వం పట్ల పార్టీ సభ్యుల నుంచి వస్తోన్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో, ఆదివారంనాటి ప్రచారంలో తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించారు బైడెన్.

గత వారం డోనల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చ సందర్భంగా...సరిగా మాట్లాడలేక మధ్యలోనే ఆపివేయడంతో, ఆయన శారీరక, మానసిక సామర్థ్యంపై పలు ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శుక్రవారం ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ప్రైమ్ టైమ్ ఇంటర్వ్యూతో ఆయన భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత పెరిగాయి.

పార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తున్న ఈ సమయంలోనే, స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన పెన్సిల్వేనియాలో బైడెన్ రెండు ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

కానీ, ఈ కార్యక్రమాల ద్వారా కూడా బైడెన్ తన అభ్యర్థిత్వంపై తోటి డెమొక్రాట్ల నుంచి వస్తోన్న వ్యతిరేకతను ఆపలేకపోయారు.

ప్రతినిధుల సభలోని మైనార్టీ నేత హకీం జఫరీస్ ఆదివారం మధ్యాహ్నం డెమొక్రాటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులతో సమావేశం నిర్వహించారు. బైడెన్ అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

బైడెన్ తప్పుకోవాలని పిలుపునిచ్చిన నలుగురు సభ్యులు, ఆయన దిగిపోతారని అనుకుంటున్నామని బీబీసీ అమెరికా న్యూస్ పార్ట్‌నర్ సీబీఎస్‌తో అన్నారు.

నవంబర్‌ ఎన్నికల్లో ఆయన గెలుపు అవకాశాలపై ముగ్గురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

గతవారం రోజులుగా పలువురు టాప్ డెమొక్రాట్ నేతలు టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ వైఖరిని తెలియజేస్తున్నారు.

బైడెన్‌ను కొనసాగించడమా లేక తప్పించడమా..ఏది ప్రమాదకరమైంది అన్నది చర్చిస్తున్నారు. ఒకవేళ బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా కొనసాగితే, డోనల్డ్ ట్రంప్‌ చేతిలో ఓడిపోవడం ఖాయమని కొందరు అంటున్నారు.

అయితే, ఆయన్ను మారిస్తే కొత్త సమస్యలు ముందుకు రావచ్చని ఇంకొందరు వాదిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

కొత్త వారిలో సమర్థత చూస్తున్న నేతలు

ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్ తడబడటంతో, అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి ఆయన తక్షణమే తప్పుకోవడం మంచిదని కొందరు అంటున్నారు.

బైడెన్ వయసు, మానసిక సామర్థ్యంపై వస్తోన్న ఆందోళనలు ఎదుర్కొనడం కష్టమని కొందరు డెమొక్రాట్లు అంటున్నారు.

‘డోనల్డ్ ట్రంప్‌ను ఓడించే కసి అధ్యక్షుడికి ఉందా?’ అనే ప్రశ్నలపై అమెరికా ప్రజల్లో చర్చ సాగుతోందని కాలిఫోర్నియా ప్రతినిధి ఆడం షిఫ్ అన్నారు.

బైడెన్‌కు ప్రస్తుతం 81 ఏళ్లు కాగా, ట్రంప్ వయసు 78 ఏళ్లు. ఈ ఇద్దరు అభ్యర్థుల వయసు ప్రస్తుతం ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు బైడెన్‌‌ పట్ల కొందరు ఓటర్లు విశ్వాసాన్ని కోల్పోతున్నారని కొన్ని పోల్స్ సూచిస్తున్నాయి.

శుక్రవారం విడుదల చేసిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పోల్‌లో, 86 శాతం డెమొక్రాట్లు బైడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో ఆయనకు 93 శాతంమంది మద్దతు ఇచ్చారు. అంటే అప్పటితో పోలిస్తే బైడెన్‌కు మద్దతు కాస్త తగ్గింది.

డెమొక్రాట్ల నుంచి బైడెన్ ఈ అనూహ్య వ్యతిరేకత ఎదుర్కొనడానికి ముందు కూడా ఆయనపై వ్యతిరేక ఉంది.

అమెరికా ఆర్థిక వ్యవస్థను, దేశ దక్షిణ సరిహద్దులో వలసదారుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న పలు విధానపరమైన విషయాల్లో ఓటర్ల నుంచి బైడెన్‌కు వ్యతిరేకత ఎదురైంది.

గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై బైడెన్ స్పందిస్తున్న తీరును కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఏబీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏబీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో బైడెన్

కొత్త వ్యక్తితో అంతకంటే పెద్ద ప్రమాదం

బైడెన్‌ను ఇప్పుడు వదులుకోవడం వల్ల నష్టాలున్నాయని కొందరు డెమొక్రాటిక్ నేతల అభిప్రాయం.

ఒకవేళ ప్రస్తుత అధ్యక్షుడిని రేసు నుంచి తప్పిస్తే ఆ తర్వాత ఎవరు, ఏంటన్నది అస్పష్టంగా ఉంది. బైడెన్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? ట్రంప్‌ను ఆ అభ్యర్థి ఎలా ఎదుర్కోగలరు? అనేవి ఆ పార్టీకి అంతుబట్టని వ్యవహారాలు.

ఇటీవల కాలంలో, చాలామంది బైడెన్ అనుచరులు ఇప్పుడు కొత్త వ్యక్తిని ఎంచుకోవడం ప్రమాదమని నొక్కి చెప్పారు. బైడెన్ తన సక్సెస్ ఏంటో ఇప్పటికే నిరూపించి చూపారని అంటున్నారు.

‘‘బైడెన్ పెద్ద వారే. ఒకప్పుడు మాట్లాడినట్లు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌ విమానం మెట్ల మీద నుంచి ఆయన జంప్ చేస్తూ రావాలని నేను కోరుకుంటాను. కానీ, ఆయన చేయలేరు. అయితే, మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే... పాలసీ. ఎవరి పాలసీలు దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయో చూడాలి.’’ అని వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్ సీబీఎస్ న్యూస్‌తో అన్నారు.

కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ కూడా శనివారం పెన్సిల్వేనియాలోని జరిగిన ఓ ర్యాలీలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘ప్రత్యర్ధి పార్టీ మా నుంచి ఏం కావాలనుకుంటుందో అదే జరుగుతోంది. వాళ్లు మా పార్టీలో అంతర్గత పోరును కోరుకున్నారు.’’ అని న్యూసోమ్ చెప్పారు.

బైడెన్‌ను మార్చడం వల్ల, అది నేరుగా ట్రంప్‌ పార్టీకి ఉపయోగపడుతుందని కొందరు బైడెన్ సపోర్టర్లు తెలిపారు.

ట్రంప్‌ను ఎదుర్కొని కమలా హారిస్ విజయం సాధించగలరని ఆడం చెప్పారు.
ఫొటో క్యాప్షన్, ట్రంప్‌ను ఎదుర్కొని కమలా హారిస్ విజయం సాధించగలరని ఆడం షిఫ్ చెప్పారు.

అధ్యక్ష రేసు మధ్యలోకి కమలా హారిస్

బైడెన్ భర్తీ చేయగల సమర్థవంతురాలు ఉపాధ్యక్షురాలు కమలా హారిసేనని గత వారం ప్రారంభంలో ఓహియో మాజీ ప్రతినిధి టిమ్ ర్యాన్ అన్నారు.

‘‘కమలా హారిసే మన ముందున్న ఉత్తమ మార్గం.’’ అని ర్యాన్ వ్యాఖ్యానించారు.

‘‘జో బైడెన్ కంటే కమలా హారిస్ అభ్యర్థిత్వం ఎక్కువ ప్రమాదకరమని ఎవరు అంటున్నారో వారు వాస్తవంలో బతకడం లేదు.’’ అని ర్యాన్ అన్నారు.

బైడెన్‌కు కమలా హారిస్ నుంచి బలమైన మద్ధతు లభిస్తున్నప్పటికీ, ఆయన స్థానంలో ఆమెను రంగంలోకి దింపే వ్యూహాలకు ఇటీవల కాలంలో మద్ధతు లభిస్తోంది.

ట్రంప్‌ను ఎదుర్కొని కమలా హారిస్ విజయం సాధించగలరని ఆదివారం నాడు మీట్ ది ప్రెస్ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఆడం షిఫ్ చెప్పారు.

క్యాంపెయిన్‌లో ఇప్పటికే ఆమె విజయం సాధించారని, డెమొక్రాటిక్ పార్టీ వ్యవస్థకు, దాని ఫండ్‌రైజర్లకు ఆమె చిరపరిచితురాలని మద్దతుదారులు అంటున్నారు.

కమలా హారిస్‌కు తన పనేంటో తెలుసని డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ మాజీ చైర్ డొన్నా బ్రెజిల్ ఏబీసీతో అన్నారు.

అయితే వయసు ఒక్కటే బైడెన్‌ విషయంలో వ్యతిరేకత కాదు. పరిపాలనకు సబంధించిన విధానపరమైన నిర్ణయాలు కూడా డెమొక్రాట్ పార్టీ నేతలు కమలా వైపు చూసేలా చేస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, ఈ సారి కూడా గెలుపు నాదే అంటున్న బైడెన్..

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)