‘పురుషుల ఆత్మహత్యలకు మహిళలే కారణం’ అంటూ రాజకీయ నాయకుడి వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, GETTY IMAGES
పురుషుల ఆత్మహత్యలు పెరగడానికి మహిళల ఆధిపత్య ధోరణే కారణమన్న నిరాధార ఆరోపణలు చేసినందుకు దక్షిణ కొరియాలోని ఒక రాజకీయ నాయకుడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమాజంలో ఇటీవల కాలంలో అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పురుషులకు ఉద్యోగాలు లభించడం లేదని, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం కష్టతరంగా మారిందని సోల్ నగర కౌన్సిలర్ కిమ్ కి-డక్ అన్నారు.
దేశం(దక్షిణ కొరియా) కొద్దికాలంగా ‘మహిళా ఆధిపత్య సమాజంగా మారడం ప్రారంభించింది’, ‘పురుషుల ఆత్మహత్యాయత్నాల పెరుగుదలకు ఇది కొంత కారణం కావచ్చు’ అని డక్ అన్నారు.
ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉన్నది దక్షిణ కొరియాలోనేనని, జెండర్ ఈక్వాలిటీ విషయంలో దేశం చెత్త రికార్డులు కలిగి ఉందని ఆయన అన్నారు.
దీంతో ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా డక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డెమొక్రటిక్ పార్టీకి చెందిన కౌన్సిలర్ కిమ్ కి డక్ తన వ్యాఖ్యలకు కారణం తెలిపారు. హాన్ నది మీద వంతెనల పైనుంచి దూకినవారి డేటాను విశ్లేషించేటప్పుడు తాను ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు.
సోల్ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో ఉన్న నివేదిక ప్రకారం.. 2018లో ఆ నగరంలో ఆత్మహత్యాయత్నాల సంఖ్య 430 కాగా.. 2023లో ఆ సంఖ్య 1,035కి పెరిగింది. ఆత్మహత్యాయత్నం చేసినవారిలో ప్రతి 100 మందిలో పురుషుల సంఖ్య 2018లో 67 ఉండగా 2023కి 77శాతానికి పెరిగింది.


ఫొటో సోర్స్, Getty Images
‘మహిళల ఆత్మహత్యలే ఎక్కువ’
కిమ్ డక్ వ్యాఖ్యలపై ఆత్మహత్య నిరోధక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
"తగిన ఆధారాలు లేకుండా ఇలాంటి వాదనలు చేయడం ప్రమాదకరం, అవివేకం" అని యోన్‌సీ విశ్వవిద్యాలయ మానసిక ఆరోగ్య విభాగ ప్రొఫెసర్ సాంగ్ ఇన్ హాన్ బీబీసీతో చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. బ్రిటన్ సహా అనేక దేశాల్లో, 50 ఏళ్లలోపు పురుషుల మరణానికి ఆత్మహత్య చేసుకోవడమే అతిపెద్ద కారణం అని ఆయన చెప్పారు.
అలాగే, సోల్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించే పురుషుల సంఖ్య పెరగడానికి కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ సాంగ్ అన్నారు.
కిమ్ డక్ వ్యాఖ్యలు విచారకరమని ఆయన అన్నారు.
దక్షిణ కొరియాలో ఫుల్ టైమ్ ఉద్యోగం చేసే పురుషుల సంఖ్య కంటే మహిళల సంఖ్య బాగా తక్కువ.
మహిళలు తాత్కాలిక, పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. వేతనాల చెల్లింపులో లింగవివక్ష నెమ్మదిగా తగ్గుతోంది.
అయినా ఇప్పటికీ స్త్రీలు పురుషుల కంటే సగటున 29 శాతం తక్కువ వేతనం పొందుతున్నారు.
మహిళల జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నాల వల్ల తాము నష్టపోయామన్న అనవసర భావన యువకులలో పెరిగింది. ఇది యాంటీ ఫెమినిస్ట్ ఉద్యమాలకు దారితీస్తోంది.
అయితే మహిళల ఆధిపత్యధోరణి భావనకు కిమ్ డక్ తన రిపోర్టులో పరిష్కారం కూడా చెప్పారు.
"మహిళల ఆధిపత్య ధోరణి పెరుగుతోందన్న భావనను అధిగమించడానికి ప్రజల్లో జెండర్ ఈక్వాలిటీపై అవగాహన కల్పించాలి, దానివల్ల పురుషులు, మహిళలు సమాన అవకాశాలు పొందుతారు" అని కౌన్సిలర్ కిమ్ డక్ పేర్కొన్నారు.

‘కొరియాలో మహిళలపై ద్వేషం ఎక్కువ’
కిమ్ డక్ వ్యాఖ్యలు"నిరాధారమైనవి" ఆయన "మహిళాద్వేషి" అని ఎక్స్ వేదికగా కొరియన్లు ఖండిస్తున్నారు. ‘‘ఆయన ఈ లోకంలోనే ఉన్నారా’’ అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.
"లింగ వివక్ష నుంచి బయటపడడానికి పోరాడుతున్న కొరియన్ మహిళలపై కౌన్సిలర్ సులభంగా నిందలు మోపారు" అని జస్టిస్ పార్టీ ఆరోపించింది.
సమస్య కారణాలను "సరిగ్గా విశ్లేషించడానికి" బదులుగా ఆయన చేసిన నిరాధార వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చింది.
ఈ వ్యాఖ్యపై స్పందించాలని బీబీసీ సంప్రదించినపుడు "నాకు స్త్రీ-ఆధిపత్య సమాజాన్ని విమర్శించే ఉద్దేశం లేదు, దాని పరిణామాల గురించి కేవలం వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే తెలిపాను’ అని కిమ్ డక్ అన్నారు.
గత నెలలో, 60 ఏళ్ల మరో కౌన్సిలర్ తీరు కూడా విమర్శల పాలైంది. ఆయన జననాల రేటును పెంచడానికి జిమ్నాస్టిక్స్,పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలని యువతులకు సూచిస్తూ అధికార వెబ్‌సైట్‌లో వరుస కథనాలను ప్రచురించారు.
అదే సమయంలో.. అబ్బాయిల కంటే అమ్మాయిలను ముందుగానే పాఠశాలకు పంపించాలని, తద్వారా వారు పెళ్లికి సిద్ధమయ్యే సమయానికి సహవిద్యార్థులు ఒకరినొకరు ఎక్కువగా ఆకర్షితులవుతారు అని గవర్నమెంట్ థింక్ ట్యాంక్ ఒకటి సిఫారసు చేసింది.
"ఇటువంటి వ్యాఖ్యలు దక్షిణ కొరియాలో స్త్రీద్వేషం ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తాయి" అని కొరియన్ ఉమెన్స్ ట్రేడ్ యూనియన్ డైరెక్టర్ యూరి కిమ్ అన్నారు.
రాజకీయ నాయకులు, విధాన నిర్ణేతలు మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదని, బదులుగా వారిని బలిపశువులని చేయడానికి ఇష్టపడుతున్నారని ఆమె ఆరోపించారు.
“ఉద్యాగాలు చేస్తున్నందుకు మహిళలను నిందించడం మన సమాజంలో అసమానతను ఇంకా పెంచుతుందని” అని ఆమె బీబీసీకి చెప్పారు.
ప్రస్తుతం దక్షిణ కొరియా పార్లమెంట్ సభ్యులలో 20 శాతం మంది మహిళలు, మొత్తం స్థానిక కౌన్సిలర్లలో 29 శాతం మంది మహిళలు ఉన్నారు.
చట్టవిరుద్ధమైన విషయం అయితేనే రాజకీయ నాయకులు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించిన వాటిని పరిశీలించగలం అని సోల్ సిటీ కౌన్సిల్ బీబీసీతో చెప్పింది.
తమ వ్యక్తిగత ఆరోపణలకు వారే పూర్తిగా బాధ్యత వహిస్తారని, తదుపరి ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని తెలిపింది.
బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














