నేరగాళ్లకు ప్లాస్టిక్ సర్జరీ చేసి గుర్తుపట్టలేనట్లుగా మార్చేస్తున్న సీక్రెట్ హాస్పిటల్స్

ఫొటో సోర్స్, Presidential Anti-Organised Crime Commission
- రచయిత, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ న్యూస్
ఫిలిప్పీన్స్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న కొన్ని ఆసుపత్రులు నేరగాళ్లు చట్టానికి దొరక్కుండా సహకరిస్తున్నాయి.
వివిధ నేరాలకు పాల్పడినవారు, కుంభకోణాల్లో ఉన్నవారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఈ రహస్య ఆసుపత్రులు సాయం చేస్తున్నాయి.
మనీలా దక్షిణ శివారు ప్రాంతాల్లో మే నెలలో ఇలాంటి ఒక ఆసుపత్రిపై దాడులు చేసినట్లు పోలీస్ శాఖ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.
చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఇలాంటి మరో రెండు ఆసుపత్రులు రానున్న వారాల్లో మూత పడతాయని తెలిపారు.
రెండు నెలల కిందట పాసే నగరంలోని ఆసుపత్రిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ పరికరాలను, డెంటల్ పరికరాలను, చర్మాన్ని తెల్లగా మార్చే ఐవీ డ్రిప్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వీటి సహాయంతో పూర్తిగా ఒక వ్యక్తిని కొత్త రూపంలోకి మార్చేయవచ్చని ‘ప్రెసిడెన్షియల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కమిషన్’(పీఏఓసీసీ) అధికార ప్రతినిధి విన్‌స్టన్ జాన్ కాసియో చెప్పారు.
చట్టవిరుద్ధంగా నడిచే మరో రెండు ఆస్పత్రులు.. పాసేలోని ఆసుపత్రుల కంటే నాలిగింతలు పెద్దవని పోలీసుల నిఘాలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.
ఫిలిప్పీన్స్‌లో చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఆన్‌లైన్ క్యాసినోలకు చెందిన వారు ఆ ఆస్పత్రులకు క్లయింట్లుగా ఉన్నట్లు చెప్పారు.
గ్యాంబ్లింగ్ చట్టవిరుద్ధమైన చైనాలోని జూదగాళ్లకు సేవలందించేందుకు ఈ ఆన్‌లైన్ క్యాసినోలు లేదా పోగోస్(ఫిలిప్పీన్ ఆన్‌లైన్ గేమింగ్ ఆపరేషన్స్) కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
టెలిఫోన్ స్కామ్‌లు, అక్రమంగా మనుషులను తరలించడం వంటి క్రిమినల్ కార్యకలాపాలకు పోగోస్‌ను రక్షణ కవచంగా ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

ముగ్గురు డాక్టర్లను(వియత్నాంకు చెందిన ఇద్దరు డాక్టర్లు, చైనాకు చెందిన ఒకరు), చైనీస్ ఫార్మాసిస్ట్‌ను, వియత్నాంకు చెందిన నర్సును పాసేలో జరిపిన దాడిలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఫిలిప్పీన్స్‌లో పనిచేసేందుకు వీరెవరికీ అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
పోలీసు అధికారులు హెమోడయాలసిస్ మెషిన్‌ను కూడా గుర్తించారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీతో పాటు పలు వైద్య చికిత్సలను అందిస్తున్నారు.
‘‘బయట నుంచి చూస్తే రెగ్యులర్ క్లినిక్స్ మాదిరిగానే ఉన్నాయి. కానీ, దానిలోకి వెళ్తే, వారి వద్దనున్న టెక్నాలజీ చూసి మీరు షాక్ అవుతారు’’ అని కాసియో చెప్పారు.
‘‘ఈ పోగో ఆస్పత్రులు సరైన గుర్తింపు కార్డులను అడగవు. వారు నేరగాళ్లు కావొచ్చు లేదా ఫిలిప్పీన్స్‌లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారైనా కావొచ్చు’’ అని తెలిపారు.
పాసే నగరంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.
మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే కాలంలో పోగోల ప్రభావం ఎక్కువ ఉండేది. 2022తో ముగిసిన డ్యూటెర్టే ఆరేళ్ల పదవీ కాలంలో చైనాతో సత్సంబంధాలు కోరుకున్నారు.
ఆయన తర్వాత వచ్చిన ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ పోగోలపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు.
‘‘ఫిలిప్పీన్స్ స్కామ్ హబ్‌గా పేరు పడటాన్ని అధ్యక్షుడు కోరుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ప్రజలను వారెలా లక్ష్యంగా చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు స్కామ్ ఫామ్‌లపై దాడులకు దిగాలని మాకు ఆదేశాలు ఇచ్చారు’’ అని కాసియో చెప్పారు.
2022 డిసెంబర్‌లో ఇమిగ్రేషన్ అధికారులు చైనాకు చెందిన అనుమానిత మాఫియా సభ్యుడిని అరెస్ట్ చేశారు.
ఈయన అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు ఆరోపణలున్నాయి.
ఇలాంటి కేసులకు అండర్‌గ్రౌండ్ హాస్పిటల్స్‌తో లింక్ ఉండొచ్చని కాసియో తెలిపారు.
నగర మేయర్ ఆలిస్ గువో కార్యాలయానికి సమీపంలో పోగో స్కామ్ సెంటర్ వెలుగులోకి రావడంతో, ఆమెపై పలు విమర్శలు వచ్చాయి.
ఆమె చైనాకు గూఢచారిగానూ పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














