డర్టీ జోక్స్: సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చా, తండ్రీ కూతుళ్ళ బంధంపై జుగుప్సగా మాట్లాడిన యూట్యూబర్‌పై విమర్శలేంటి?

డర్టీ జోక్స్

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలపై లైంగిక చర్యలను ప్రోత్సహించేలా, ఉన్న ఒక యూట్యూబ్ వీడియో తెలుగు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఐదారేళ్ల పాప, ఆమె తండ్రిగా కనిపిస్తోన్న వ్యక్తి చేసిన ఒక షాట్/రీల్ పై యూట్యూబ్‌లో రివ్యూ చేసిన కొందరు తెలుగు కుర్రాళ్లు, ఆ రీల్ తరువాత ఏమైయుండొచ్చు అంటూ ఊహాగానాలు చెబుతూ అసభ్యకర, జుగుప్సాకర, చట్టవ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ఆ వీడియో ఉన్నదున్నట్టు యూట్యూబులో వచ్చింది.

దానిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు సదరు యూట్యూబర్ ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
స్క్రీన్ గ్రాబింగ్

ఫొటో సోర్స్, screen grab

ఫొటో క్యాప్షన్,

వీడియో చేసింది ఎవరు?

సోషల్ మీడియా వేదికగా అనేక రకాల వీడియోలు వస్తున్నాయి. వాటిల్లో రోస్టర్లు అంటే రోస్ట్ చేసే వాళ్లు అనే అర్థంలో కొందరు యూట్యూబర్లు ఉంటారు.

వీరు సినిమా వీడియోలు, ప్రముఖులకు సంబంధించిన వీడియోలు, ఇతరత్రా ఫేమస్ అయిన సోషల్ మీడియా వీడియోల గురించి మాట్లాడుతూ తమ అభిప్రాయాలు అత్యంత తీవ్రమైన భాషలో చెబుతారు.

రోస్ట్ చేస్తున్నాడురా అని బయటివారు అనుకునే తరహాలో వీరు ఆన్‌లైన్‌లో మాట్లాడుతుంటారు.

ఇది కొన్నిసార్లు రికార్డింగుగానూ, మరికొన్నిసార్లు లైవ్‌లోనూ ఉంటుంది.

తాజా వీడియో ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి తన సొంత యూట్యూబు చానెల్లో లైవ్ గా చేసింది. ఆయన గతంలో కొన్ని చిన్న సినిమాల్లో నటించారు. ఆయనతోపాటూ మరో ముగ్గురు యువకులు కలసి వేర్వేరు చోట్ల కూర్చుని ఒక రీల్ గురించి లైవ్ లో మాట్లాడారు.

ఆ రీల్ లో ఒక తండ్రి, కూతురు ఉంటారు. అది నిజంగా జరిగిన ఘటన కాకుండా, తండ్రీ కూతురూ కలసి చేసిన రీల్‌లా కనిపిస్తోంది. అలాగే వారిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు అనేది కూడా తెలియదు. ఆ విషయాలను బీబీసీ నిర్ధరించలేదు.

కానీ రీల్ చూడగానే స్థూలంగా తండ్రీ-కూతురు అనిపించేలా ఉంటారు. ఆ రీల్ లో పైన ‘‘నాకు పిల్లలంటే ఇష్టం ఉండదు. కానీ నాకే కనుక కూతురు ఉంటే’’ అని హెడ్డింగ్ ఉంటుంది.

సుమారు 30-40 ఏళ్ల వయసున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎదురుగా సుమారు 4-6 ఏళ్ల వయసున్న చిన్నారి ఉంటారు.

ఆ వ్యక్తి బెల్టు చేతితో పట్టుకుని చాలా కోపంగా అమ్మాయివైపు చూస్తాడు.

కానీ, ఆమె దగ్గరికి వచ్చి బెల్టుతో కొట్టకుండా దాన్ని ఉయ్యాలలాగా మార్చి, తన రెండు చేతులతో పట్టుకుని, అందులో ఆమెను కూర్చోబెట్టుకుంటాడు. అక్కడితో ఆ వీడియో అయిపోతుంది.

ఈ వీడియో మీద ప్రవీణ్ బృందం కామెంట్లు చేస్తూ అసభ్యకరమైన భాష వాడారు.

తండ్రీ కూతుళ్ల మధ్య లైంగిక చర్యలు అనే అర్థం వచ్చేలా ఆ భాష ఉంటుంది.

వీడియోపై లైవ్ డిస్కషన్ పెట్టిన ప్రణీత్ తో పాటూ, అందులో పాల్గొన్న ఆది, బుర్రా అనే వారు కామెంట్లు చేసినట్టు కనిపిస్తోంది. దానికి మిగిలిన వారు గట్టిగా నవ్వుతారు.

ఆ వీడియోలో కనిపించిన డాలస్ నాగేశ్వర రావు ఏ కామెంట్లూ చేసినట్టు కనిపించలేదు.

ఈ క్లిప్ ఇంటర్నెట్లో విడుదల కాగానే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ వీడియోను చూసిన వారు తీవ్రమైన భాషలో ప్రణీత్, ఆయన బృందాన్ని భయంకరంగా తిడుతూ, చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు.

యూట్యూబర్

ఫొటో సోర్స్, SaiDharam Tej

సాయిధరమ్ తేజ్ స్పందన

సినీ నటుడు సాయి ధరమ్ తేజ ఈ వీడియోలో కొంత భాగాన్ని ఎక్స్‌లో షేర్ చేసి తీవ్రంగా విమర్శించారు.

పిల్లలపై వేధింపులకు కారణమయ్యే వీడియోలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

తన పోస్టును తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, డీజీపీలకు ట్యాగ్ చేశారు.

మంచు మనోజ్, నారా రోహిత్ వంటి హీరోలు కూడా దీనిపై స్పందించారు.

సాయి ధరమ్ తేజ ట్వీటుకు తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డీజీపీ స్పందించారు.

తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, RevanthReddy /X

మహిళలపై వేధింపుల గురించి ఆన్‌లైన్‌ వేదికగా తరచూ ప్రశ్నించే గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా దీనిపై మాట్లాడారు

‘‘లక్షల ఫాలోయర్లు ఉండే అకౌంట్‌లు, మీమ్ పేజీల వారు పెట్టే అశ్లీల, అసభ్య కంటెంట్ గురించి మనం ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నాం. టీనేజీలో ఉన్న నటుల శరీరాలను సెక్సువలైజ్ చేస్తూ వారు పోస్టులు పెట్టేవారు. వీళ్లంతా తమను తాము అమాయక, డాంక్ , డార్క్ హ్యూమర్ గా చెప్పుకుంటారు. కానీ ఎవరైనా కోర్టులో పిల్ వేస్తే వీళ్లంతా జైలుకు వెళతారు. వారి ఫాలోవర్లలో మన చుట్టూ మనకు తెలిసినవాళ్లలోనే చాలామంది ఉంటారు. వాళ్లకు ఆ కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ చూసి వాళ్లు ఎంజాయ్ చేస్తారు. దాన్ని వాళ్లు బాగా సమర్థించుకుంటారు. వీళ్లు నిజంగానే మారారు అనుకుందాం. కానీ ఓ నటిని అసభ్యంగా చూపిస్తూ, సెక్సువలైజ్ చేస్తూ మరో మీమ్ రాగానే ఎవరో ఒకరు నిరసన తెలుపుతారు. అప్పుడు మళ్లీ ఈ బ్యాచే వాళ్లను అటెన్షన్ సీకర్లు, సూడో ఫెమినిస్టులు అని విమర్శిస్తుంది.’’ అని ఆమె రాశారు.

చిన్మయి శ్రీపాద

ఫొటో సోర్స్, ChinmaiSripada/X

కేసు నమోదు

తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, @tg_womensafety

దీనిపై తమ సైబర్ సెక్యూరిటీ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టుగా తెలంగాణ పోలీసులు ప్రకటించారు.

ఆంధ్ర రాష్ట్ర పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటున్నట్టు వారు తెలిపారు.

ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీసు మహిళా రక్షణ విభాగం, డీజీపీలు ప్రకటన విడుదల చేశారు.

వారిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని డీజీపీ చెప్పారు. పిల్లల భద్రతపై తగిన అవగాహన కల్పిస్తామన్నారు.

యూట్యూబర్ స్పందన

ప్రణీత్ హనుమంత్

ఫొటో సోర్స్, @phanumantwo

‘‘వీడియోలో సమస్యాత్మకమైన భాగాన్ని తొలగించాను. (వీడియోపై) నిర్ణయం తీసుకోవడంలో జరిగిన లోపానికి బేషరతుగా, నిర్ద్వందంగా క్షమాపణలు చెబుతున్నాను. ఒక కంటెంట్ క్రియేటర్ గా నేను అందర్నీ నవ్వించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దురదృష్టవశాత్తూ డార్క్ కామెడీకీ, అసభ్యతకీ మధ్య లైన్ దాటేశాను. అని మొదటి ట్వీట్ చేశారు. ’’ అని సదరు యూట్యూబర్ స్పందించారు.

‘‘నన్ను ఎన్నయినా అనండి. కానీ దయచేసి నా కుటుంబాన్ని వదిలేయండి. వారికి ఇది జరగాల్సింది కాదు. నేను మంచి కొడుకుని కానేమో, కానీ వారు మాత్రం ఒక పిల్లాడికి మంచి తల్లిదండ్రులుగానే ఉన్నారు.’’ అని మరో ట్వీట్ చేశారు.

ప్రణీత్ హనుమంత్

ఫొటో సోర్స్, p.hanumantu/Insta

ఎక్స్ లో ఈ పోస్టులు పెట్టిన తరువాత తన ఇన్ స్టాగ్రాములో కూడా ఒక వీడియో విడుదల చేశారు ప్రణీత్ హనుమంతు.

నా పేరు ప్రణీత్. గత రెండు రోజులుగా మీ ప్రమేయం లేకుండా మీ టైమ్‌లైన్‌లో నా ముఖం చూసి ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు. చైల్డ్ సెక్స్ అబ్యూజ్ అనే ఒక సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కానీ, పిడోపైల్ కానీ మామూలే అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మేం ఏ రీల్ మీద జోక్స్ వేశామో అది అసలైన తండ్రీ – కూతుళ్లకు సంబంధించిన వీడియో కాదు. అది ఒక డార్క్ కామెడీ బేస్డ్ రీల్. దాన్ని ఆధారంగా చేసుకుని మేం వేసిన జోక్స్‌ని చాలామంది నిజమైన తండ్రీ కూతుళ్ల సంబంధాన్ని సెక్సువలైజ్ చేశామన్నట్టుగా తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కామెడీకి నిర్వచనం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అయితే మేంచేసింది ఫన్నీ అని భావించడం మా జడ్జిమెంట్ లోపం. ఇప్పటి వరకూ తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నా. కానీ ఈసారి చేసిన తప్పు వల్ల నాతో పాటూ చాలామందిని కిందకు పట్టుకెళ్లాను. ముఖ్యంగా నా తల్లితండ్రులను. గత రెండు రోజులుగా చాలామంది వారి మీద పోస్టులు పెడుతూ తిడుతున్నారు. నిజంగా చెబుతున్నాను. నేను వారికి మంచి కొడుకును కాలేకపోయాను కానీ, వాళ్లు నాకెప్పుడూ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. కాబట్టి మిమ్మల్ని అడుక్కుంటున్నాను. దయచేసి వారిని దీని నుంచి బయట ఉంచండి. వారిని ఇందులోకి లాగకండి. నేను వేసిన జోకుకూ, దాని పరిణామాలకూ పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఈ విషయంలో నేను చట్టానికి సహకరిస్తాను. ఇలాంటి జోక్ వేసినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. దీని వల్ల బాధించబడిన అందరికీ, కోపం వచ్చిన అందరికీ క్షమాపణ చెబుతున్నాను.’’ అని ప్రణీత్ హనుమంతు రాశారు.

అయితే, బయటపడినవారు వీరేనని, కానీ, ఇలాంటి వాళ్లు ఆన్‌లైన్‌లో

వీరు బయటపడ్డారుగానీ, ఇలాంటి వారు ఆన్‌లైన్‌లో చాలామందే ఉన్నారనీ, ఆఖరికి టీవీల్లో వచ్చే కొన్ని కామెడీ షోలు కూడా దీనికి మినహాయింపు కాదంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్, చైల్డ్ సెక్సువాలిటీ, చైల్డ్ న్యూడిటీ వంటి వాటిని అన్ని ప్లాట్ ఫాములూ చాలా కఠినంగా అణిచివేస్తాయి.

గైడ్‌లైన్స్ ఏం చెబుతున్నాయి?

సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు లేదా వీడియోలు పోస్టు చేయడం మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అసభ్యకరమైన, లైంగిక దాడులకు సంబంధించిన, చట్ట వ్యతిరేకమైన పోస్టులు, వీడియోలు, ఫోటోలు, కామెంట్లను దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు అనుమతించవు.

అయితే వీటి విషయంలో ఒక్కో సంస్థకూ ఒక్కో రకమైన పాలసీ ఉంది. అలాగే వేర్వేరు భాషల్లో, సంస్కృతుల్లో ఏ పదాలు అసభ్యకరమైనవి, ఏవి చట్టపరమైనవి అనే నిర్ధారణ చేయడం కూడా కాస్త కష్టమే.

అందుకే ఇలాంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ వీడియోలపై చర్యలు తీసుకోవడానికి ఒక్కోసారి కాస్త సమయం పడుతూ ఉంటుంది.

అయితే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్, చైల్డ్ సెక్సువాలిటీ, చైల్డ్ న్యూడిటీ వంటి వాటిని అన్ని ప్లాట్‌ఫాములూ చాలా కఠినంగా అడ్డుకుంటాయి. అలాంటివి పెట్టిన వారి అకౌంట్లు కొంత కాలం నిలిపివేయడం లేదా మొత్తంగా రద్దు చేయడంలాంటి చర్యలు తీసుకుంటాయి.

మైనర్లను అసభ్యంగా, అశ్లీలంగా చూపించేలా ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించకూడదు.

చిన్నారులను వారి వయసుకు తగని సన్నివేశాల్లో కనిపించేలా చేయకూడదు.

ఇది కుటుంబాల్లో జరిగే కలహాలు కావచ్చు, మగ-ఆడ సంబంధాల గురించి వివరించే ఘటనలు కావచ్చు. ఆపరేషన్ థియేటర్లో ప్రక్రియలు కావచ్చు.

ప్రమాదకరమైన, హానికరమైన చర్యల్లో పిల్లలను భాగస్వామ్యం చేస్తున్నట్లు చూపించే వీడియోలు, ఫోటోలు వాడకూడదు. ఆల్కహాల్ తాగడం, ఈ-సిగరెట్లు, పొగాకు, మాదక ద్రవ్యాల వినియోగం, మందుగుండు సామగ్రిని జాగ్రత్తలు తీసుకోకుండా ఉపయోగించడం, తుపాకుల వినియోగం.. ఇవన్నీ దీనికిందకే వస్తాయి.

చిన్నారులను శారీరకంగా, లైంగికంగా, మానసికంగా హింసించడం, వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగించే దృశ్యాలను చూపించడం వంటివి నిషేధం.

మైనర్లను అవమానించేలా, కించపరిచేలా, వేధించేలా ఫోటోలు, వీడియోలు ఉండకూడదు.

యూట్యూబ్ వంటి సంస్థలు అలాంటి కంటెంట్ ఏదైనా తమ దృష్టికి వస్తే నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ అనే సంస్థకు నివేదిస్తుంది.

ఇది అంతర్జాతీయ లా ఎన్‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలతో కలసి పనిచేస్తుంది.

చట్టం ఏం చెబుతోంది?

ఇది చట్టపరంగా తీవ్రమైన నేరం అంటున్నారు న్యాయవాదులు. ‘‘పోక్సో చట్టం, ఐటీ చట్టం రెండిటి కిందా ఇది నేరం. ఆ మాటకొస్తే సాధారణ చట్టాల కింద కూడా అది శిక్షార్హమే. వారు చెప్పిన మాటలు అసభ్యకరంగా ఉండడం, అసభ్యతను ప్రచారం చేయడం, నేరాలను ప్రోత్సహించే విధంగా ఉండటం కిందకు వస్తాయి. వాటి కింద వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.’’ అని మానవ హక్కుల న్యాయవాది జైభీమ్ రావు బీబీసీతో చెప్పారు .

వీడియో క్యాప్షన్, Praneeth Hanumantu యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై వివాదం ఏమిటి, అసలు ఏం జరిగింది?

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)