ఫ్రెంచ్ పార్లమెంట్ ఎన్నికలు: ఆధిక్యంలో వామపక్ష సంకీర్ణం

జీన్-లూక్ మెలెంకాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వామపక్ష కూటమి నేత జీన్-లూక్ మెలెంకాన్

‘ఎవరూ దీన్ని అంచనా వేసి ఉండకపోవచ్చు. హైడ్రామా, సుస్పష్టం, కానీ, ఆశ్చర్యకరం’

ఫ్రాన్స్‌లో ఆదివారం ఎన్నికలు ముగియగానే అక్కడి న్యూస్ చానల్స్‌లో కనిపించిన హెడ్‌లైన్స్ ఇవి.

ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్‌లో.. మేక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ కూటమిని, లీ పెన్‌కు చెందిన ఫార్ రైట్ పార్టీ నేషనల్ ర్యాలీని వెనక్కి నెట్టి వామపక్ష సంకీర్ణం ముందంజలోకి వచ్చింది.

దీంతో తమ విజయాన్ని ప్రకటించుకోవడంలో వామపక్ష ఫైర్‌బ్రాండ్ నేత జీన్ లుక్ మెలన్షన్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు.

స్టాలిన్‌గ్రాడ్ స్క్వేర్‌లో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘ప్రభుత్వ ఏర్పాటుకు న్యూ పాపులర్ ఫ్రంట్‌ను అధ్యక్షుడు తప్పనిసరిగా పిలవాలి’ అన్నారు. అంతేకాదు, మేక్రాన్, ఆయన కూటమి ఓడిపోయినట్లు అంగీకరించాలి అని కూడా అన్నారు.

అయితే, ఫ్రాన్స్‌లో హంగ్ పార్లమెంట్ ఏర్పడనుంది. 577 సీట్లు ఉన్న అక్కడి పార్లమెంట్‌లో ఎన్నికల్లో పోటీ చేసిన మూడు కూటముల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 289 సీట్ల మెజారిటీ ఉండాలి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఆదివారం నిర్వహించిన రెండో, మూడో రౌండ్ ఎన్నికల్లో వామపక్ష సంకీర్ణం ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ ముందంజలో ఉన్నట్టు ఫలితాల సరళి వెల్లడించింది.

ఫ్రెంచ్ పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన ట్రెండ్స్ బయటికి వచ్చాక, ఆ దేశ రాజధాని పారిస్‌లోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

వేలాది మంది ప్రజలు పారిస్ వీధుల్లోకి వచ్చారు.

వామపక్ష కూటమి మద్దతుదారులు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో వామపక్ష సంకీర్ణం న్యూ పాపులర్ ఫ్రంట్‌ 182 సీట్లు గెలుచుకుంది.

అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌ సెంట్రిస్ట్ కూటమి 168 సీట్లను గెలుపొందింది. ఫస్ట్ రౌండ్ లీడర్ నేషనల్ ర్యాలీ, దాని మిత్రపక్షాలకు 143 సీట్లు వచ్చాయి.

వామపక్ష సంకీర్ణం న్యూ పాపులర్ ఫ్రంట్‌ ముందంజలో ఉందని, ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మూడవ స్థానానికి పడిపోతుందని తెలియగానే, న్యూ పాపులర్ ఫ్రంట్ మద్దతుదారులు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వీధుల్లోకి వచ్చారు.

అయితే, కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

పారిస్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనలను నియంత్రించే పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

వామపక్ష కూటమి మద్దతుదారుల సెలబ్రేషన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ పార్టీ తొలి రౌండ్‌లో ఆధిక్యంలో కొనసాగింది. తాజా ఫలితాలలో ఇది మూడవ స్థానానికి పడిపోయింది.

అయితే, ఏ కూటమికి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఫ్రాన్స్ ప్రస్తుతం హంగ్ పార్లమెంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారన్న దానిపై స్పష్టత లేదు. మేక్రాన్‌ పార్టీకి చెందిన ప్రస్తుత ప్రధాని గాబ్రియల్ అట్టల్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

577 సీట్లున్న పార్లమెంట్‌లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 289 సీట్లు రావాలి. కానీ, ఏ కూటమికి కూడా సంపూర్ణ మెజార్టీ రాలేదు.

ఫార్ రైట్ నేషనల్ ర్యాలీకి వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా ఉండేందుకు చాలా మంది లెఫ్ట్ వింగ్, సెంట్రిస్ట్ అభ్యర్థులు ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్నారు. ఈ ఫలితాలు వారికి తీవ్ర నిరాశ కలిగించి ఉండొచ్చు.

న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి

ఫొటో సోర్స్, REUTERS

న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమిలో ఎవరెవరున్నారు

మేక్రాన్ ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల తేదీలను ప్రకటించగానే, సోషలిస్టులు, ఎకాలజిస్టులు, కమ్యూనిస్టులు, ఫ్రాన్స్అన్‌బౌడ్‌లు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.

అంతకుముందు ఈ పార్టీలు ఒకదానికొకటి విమర్శించుకున్నాయి.

వీరి సిద్ధాంతాల్లో, ప్రజలను చేరుకునే పద్ధతుల్లో ఈ పార్టీల మధ్యలో కీలకమైన వైరుద్ధ్యం కూడా ఉంది.

కానీ, ఫార్ రైట్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉంచడానికి ఇవి ఒక కూటమిగా ఏర్పడ్డాయి.

పడిపోయిన యూరో విలువ

ఫ్రాన్స్‌లో అనూహ్య ఫలితాల కారణంగా మార్కెట్లపై ఆ ప్రభావం పడింది.

యూరో విలువ 0.2 శాతం పడిపోయింది. ప్రస్తుతం ఒక యూరో విలువ 1.08 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

దేశంలో రాజకీయ ప్రతిష్టంభన నెలకొనడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

కానీ, చాలా మంది ప్రజలు నేషనల్ ర్యాలీ పార్టీ అధికారంలోకి రాకపోతుండటంతో ట్రెండ్స్‌ను చూస్తూ ఊరటగా భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పార్లమెంట్ ఎన్నికల్లో వెనుకబడ్డ అతివాద నేషనలిస్ట్ పార్టీ

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)