పాము కరిస్తే ఏం చేయాలి, అన్ని పాములు విషపూరితమైనవేనా, అసలు పాములు లేకపోతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
పాము. ఈ పేరు వింటే చాలామంది భయపడతారు. కనిపిస్తే చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజంగా అన్ని పాములు హానికరమైనవేనా? ఈ ప్రపంచంలో పాములు లేకపోతే ఏమవుతుంది?
కొన్ని విషపూరిత పాముల వల్ల మనుషులకు హానికలిగే అవకాశం ఉంది. కానీ పాముల వల్ల మన పర్యావరణానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే జనావాసాల్లోకి పాము వచ్చిందంటే వెంటనే చంపేస్తుంటారు.
నిజానికి పట్టణీకరణ పెరుగుతుండటంలో పాముల ఆవాసాలన్నీ ధ్వంసమైపోతున్నాయి. దీంతో వాటికి మనం పరోక్షంగా శత్రువులమవుతున్నాం.
‘పాముకు మనిషే మొదటి శత్రువు’ అని 1960వ దశకంలో తమిళనాడు, కేరళలో పాములపై విస్తృతంగా పరిశోధనలు చేసి 'నమ్ నాతు పంపుగల్' అనే పుస్తకం రాసిన ప్రొఫెసర్ ఎం.వీ. రాజేంద్రన్ వ్యాఖ్యానించారు.
జీవవైవిధ్య పరిరక్షణకు పాములు ఎంతటి ప్రయోజనకారులో ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఏటా జులై 16న ప్రపంచ పాముల దినోత్సవాన్ని జరుపుకుంటారు.


ఫొటో సోర్స్, Getty Images
పాములు లేకుంటే ఏం జరుగుతుంది?
ఆహార గొలుసులో పాములు ఎంతో ముఖ్యమైనవి. ప్రత్యేకించి పాములు అనేక ప్రాణులను తింటాయి. ఇతర జంతువులను నియంత్రణలో ఉంచుతాయి.
ఆహార గొలుసులో ప్రతిప్రాణికి తనదైన పాత్ర ఉంది. కానీ పాముల పాత్ర ప్రత్యేకమైనది. అవి మాంసాహార జీవులు. అనేక జీవులను తింటాయి. దీనివల్ల పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. అలాగే పాములు పూర్తి ప్రొటీన్ జీవులు కావడం వల్ల అవి ఇతర జంతువులకు ఆహారంగా మారతాయి. వేటకు గురయ్యే జీవిగానూ, వేటాడే జీవిగానూ పాము ఆహార గొలుసులో కీలకపాత్ర పోషిస్తోంది.
‘‘ఆహార గొలుసులో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళే జీవులలో పాములు ముఖ్యమైనవి. ఈ గొలుసు నుంచి పాములు తప్పుకుంటే, ఇతర జీవుల ఆహార పంపిణీ గొలుసులో ఖాళీ ఏర్పడి, అది మరికొన్ని ఇతర జీవుల ఆహార లభ్యతపై ప్రభావం చూపుతుంది’’ అని డాక్టర్ ఏ. తనికైవేల్ వివరించారు.
వ్యవసాయ భూములలో పాము ‘కీటక నాశని’ గానూ పనిచేస్తుంది.
పాములు పర్యావరణ అనుకూల వ్యవసాయ భూములలో సహజమైన ముఖ్యమైన భాగమని, ఎలుకలను నియంత్రించడానికి పర్యావరణ వ్యవస్థ సమతుల్యతకు అవి సహాయ పడతాయని తనికైవేల్ తెలిపారు.
భారత్‌లో 351 రకాల పాము జాతులను గుర్తించినట్టు తెలిపారు. వాటిల్లో 141 తమిళనాడు ప్రాంతంలోనే కనుగొన్నారని, భారత్‌లోని పాముల్లో 62 జాతులు విషపూరితమైనవని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏటా 54 లక్షల మందికి పాముకాటు
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 54 లక్షల మంది మంది పాము కాటుకు గురవుతుంటే, అందులో విషపూరితమైన పాము కాటుకు 18 లక్షల నుంచి 27 లక్షల మంది గురవుతున్న కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
పాముకాటు వల్ల ఏటా 81 వేల మంది నుంచి 137 వేల 880 మంది మరణిస్తున్నారని, పాముకాటు వల్ల మూడు రెట్లు ఎక్కువ అంగవైకల్యాలు, ఇతర శాశ్వత వైకల్యాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
విషపూరిత పాము కాటు వల్ల పక్షవాతం వచ్చి శ్వాస తీసుకోవడం కష్టమవడం, ప్రాణాంతక రక్తస్రావం, కోలుకోలేని మూత్రపిండాల వైఫల్యం, శాశ్వత వైకల్యానికి కారణమయ్యే కణజాల నష్టం ఏర్పడుతుంది.
పాముకాటుకు గురయ్యేవారిలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, పిల్లలు ఉన్నారు. పిల్లలు తరచుగా పెద్దల కంటే తీవ్రమైన ప్రభావానికి గురవుతారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో పాము కాట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
ఆసియాలో ఏటా 20 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. ఆఫ్రికాలో ఏటా 4,35,000 నుంచి 5,80,000 మంది పాము కాటుకు చికిత్స పొందుతున్నారు.
అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లోని పేద గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు కారణంగా మహిళలు, పిల్లలు, రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆరోగ్య వ్యవస్థలు బలహీనంగా, వైద్య వనరులు తక్కువగా ఉన్న దేశాల్లో ప్రభావం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఏటా 50 వేల మంది మృతి
భారత్‌లో ఏటా 30 నుంచి 40 లక్షల పాము కాటు కేసులు నమోదవుతుండగా, సుమారు 50,000 మరణాలు సంభవిస్తున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాము కాటు మరణాలలో సగమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
చాలా దేశాలలో పాము కాటు బాధితులలో కొద్ది శాతం మంది మాత్రమే క్లినిక్‌లకు, ఆసుపత్రులకు వస్తున్నారని పేర్కొంది.
భారత్‌లో 'వన్ హెల్త్' విధానం ద్వారా 2030 నాటికి పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది.
ఈమేరకు స్నేక్ బైట్ హెల్ప్‌లైన్ నంబర్ 15400 ఐదు రాష్ట్రాల్లో (పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, దిల్లీ) ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
విషపూరిత పాము కరిస్తే ఏమవుతుంది?
విషపూరిత పాములను రెండు రకాలుగా వర్గీకరించారు.
ఒక రకం పాముల్లో కోరలు పటిష్టంగా ఉంటాయి. అవి నాడీ మండలం, శ్వాస వ్యవస్థలపై దుష్ప్రభావం చూపే న్యూరోటాక్సిక్ వీనమ్ (విషం) వదులుతాయి.
ఇంకో జాతి పాముల్లో ముడుచుకునే కోరలు ఉంటాయి. ఈ పాములు తమ కోరలను తాము వేటాడేటపుడు, దాడి చేసేటపుడు ఉపయోగిస్తాయి. ఈ తరహా పాముల విషం.. మామూలుగా చర్మ కణజాలాన్ని ధ్వంసం చేసి, అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
అత్యంత ప్రమాదకర విషసర్పాలు ఏవి?
అత్యంత ప్రమాదకర విషమున్న పాములు ఏమిటి? మనుషులకు అతి పెద్ద ముప్పుగా ఉన్న పాములు ఏమిటి అనే తేడాలు గుర్తించటం ముఖ్యం.
భూమి మీద సంచరించే పాములన్నిటిలోకీ.. ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌లాండ్ తాయ్‌పాన్ పాము అత్యంత విషపూరితమైనది.
ఈ పాము ఒక్క కాటుతో వంది మందిని చంపగలిగేంత విషపూరితమైనది అని చెప్తారు. అయితే.. ఈ జాతి పాము కాట్ల వల్ల మనుషులు చనిపోయిన దాఖలాలు ఇంతవరకూ లేవు. చాలా బిడియమైన ఈ పాములు మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంలో జీవిస్తుండటంతో పాటు.. ఆస్ట్రేలియాలో యాంటీవీనమ్ విస్తృతంగా అందుబాటులో ఉండటం దీనికి కారణం.
సముద్ర పాములు కూడా చాలా విషపూరితమైనవి. కానీ అవి మనుషులకు తారసపడటం చాలా అరుదు కాబట్టి.. మనుషులు ఈ పాము కాట్లకు గురవటం కూడా అత్యంత అరుదుగా ఉంటుంది.
తక్కువ విషపూరితమైనవే అయినా.. బ్లాక్ మాంబా, కోస్టల్ తైపాన్ (ఆస్ట్రేలియా) పాముల నుంచి మనుషులకు ఎక్కువ ప్రమాదం ఉంది.
ఈ రెండు పాములదీ ఒకే జాతి కుటుంబం. వీటి విషం.. ఇతర పాముల విషాలకన్నా వేగంగా ప్రభావం చూపుతుంది. అంటే.. ఈ పాములు కాటువేసినపుడు తక్షణమే చికిత్స అందించకపోతే అర గంటలోనే మరణం సంభవిస్తుంది.
బ్లాక్ మాంబా అని పిలిచే పాము నిజానికి గోధుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఆ పాము నోరు లోపలి రంగు నల్లగా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది.
సహారాకు దక్షిణంగా ఉండే ఆఫ్రికా దేశాల్లో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది.
మూడు మీటర్ల పొడవు వరకూ పెరుగుతుంది.
ఇక ఇన్‌లాండ్ తాయ్‌పాన్‌తో పోలిస్తే కోస్టల్ తాయ్‌పాన్ చాలా దుందుడు స్వభావం గలది.

ఫొటో సోర్స్, Getty Images
ఏ పాముల వల్ల మరణాలు ఎక్కువ?
పాము కాటు కేసులు, మరణాల సంఖ్యల విషయంలో చిన్నదిగా కనిపించే పింజర (సా-స్కేల్డ్ వైపర్) అత్యంత ప్రాణాంతకమైన వాటిలో ఒకటి.
పశ్చిమ ఆఫ్రికా మొదలుకుని భారత ఉపఖండం వరకూ చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చీకట్లో ఎక్కువగా కాటు వేస్తుంటుంది.
ప్రపంచంలో దాదాపు సగం పాము కాట్లు సంభవిస్తున్నట్లుగా భావించే భారతదేశంలో.. మనుషుల మరణాలకు అత్యధికంగా కారణమయ్యే నాలుగు రకాల పాముల్లో పింజేరి ఒకటి.
ప్రమాదకరమైన నాలుగు పాముల్లో మిగతా మూడు ఇవీ..
కట్ల పాము (ఇండియన్ క్రెయిట్): పగటిపూట మొహమాటంగా కనిపించే ఈ పాము.. రాత్రిపూట చాలా దూకుడుగా దాడి చేస్తుంది. ఇది 1.75 మీటర్ల (5 అడుగుల 9 అంగుళాల) వరకూ పొడవు ఉంటుంది.
రక్త పింజర (రసెల్స్ వైపర్): ఇది మామూలుగా దూకుడు స్వభావమున్న పాము. ఇండియా, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద తరచుగా కనిపిస్తుంటుంది.
నాగు పాము / తాచు పాము (ఇండియన్ కోబ్రా): నాగు పాము భారత ఉపఖండమంతటా కనిపిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. చీకట్లో ఇది ఎక్కువగా దాడి చేస్తుంది. అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పాము కాటు వేసినపుడు ఏం చేయాలి?
ఎవరినైనా పాము కాటు వేసినపుడు ఈ చర్యలు తీసుకోవాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది:
- ప్రశాంతంగా ఉండి, తక్షణమే వైద్య చికిత్స పొందాలి.
- శరీరంలో కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి. నగలు, వాచీల వంటి వాటిని తొలగించాలి.
- దుస్తులను వదులు చేయాలి.. కానీ విప్పేయవద్దు.
ఇవి చేయకూడదు:
- పాము కాటు ప్రాంతం నుంచి విషయాన్ని నోటితో లాగివేయటం
- పాము కాటు ప్రాంతాన్ని కోసివేసి విషాన్ని తొలగించటం లేదా రక్తస్రావం జరిగేలా చేయటం
- పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయటం
- పాము కాటు వ్యక్తిని వదిలి వెళ్లటం
కాటు వేసిన ప్రాంతం నుంచి రక్తప్రసరణను నిలిపివేస్తూ కట్టుకట్టటం వంటివి చేయరాదు. అలా చేయటం వల్ల విషం వ్యాపించకుండా ఆగదు. పైగా వాపు మరింత విషమించటానికి, ఆ అవయవం తొలగించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు.
విషపూరితమైన పామును పట్టుకోవటానికి ప్రయత్నించకుండా ఉండటం కూడా ముఖ్యం. చనిపోయిన పాములతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
పామును చంపేసిన కొంతసేపటి వరకూ దాని నాడీ మండలం క్రియాశీలంగానే ఉండొచ్చు.. దానివల్ల విషపూరిత కాటు వేయవచ్చు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














