చంద్రుడి మీద గుహలు: భవిష్యత్తులో మనుషులు ఉండేది వీటిలోనేనా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు....

నాసా

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, చంద్రునిపై గుహలు ఉండొచ్చని సుమారు 50 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు భావించారు.
    • రచయిత, జార్జినా రన్నార్డ్
    • హోదా, సైన్స్ ప్రతినిధి, బీబీసీ న్యూస్

చంద్రుడిపై తొలిసారి శాస్త్రవేత్తలు ఓ గుహను కనుగొన్నారు. ఈ గుహ సుమారు 100 మీటర్ల లోతులో ఉంది.

చంద్రుడిపై మానవులు శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇదొక అనువైన ప్రదేశం కానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇది కేవలం ఒక గుహ మాత్రమేనని, ఇలాంటివి చంద్రుడి ఉపరితలం మీద వందల కొద్దీ ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చంద్రుడిపై మనుషుల కోసం శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి.

కానీ, రేడియేషన్, తీవ్ర ఉష్ణోగ్రతలు, అంతరిక్ష వాతావరణం నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఈ దేశాలకు ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

తాజాగా కనుగొన్న గుహ మానవ ఆవాసాలకు అనువైన ప్రదేశంగా కనిపిస్తోందని తొలి బ్రిటీష్ వ్యోమగామి హెలెన్ షర్మాన్ అన్నారు. చంద్రునిపై ఉన్న ఈ గుహలలో రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో మనుషులు నివసించగలరు అనడానికి ఇది సూచికని ఆయన అన్నారు.

ఈ గుహ చాలా లోతుగా ఉందని ఆమె అన్నారు. వ్యోమగాములు లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి జెట్ ప్యాక్స్‌ లేదా లిఫ్ట్‌ను వాడాల్సి ఉందని తెలిపారు.

ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటో‌కు చెందిన లొరెంజో బ్రుజోన్, లియోనార్డో కారర్‌లు మారే ట్రాంక్విలిటాటిస్ అనే రాళ్లునిండిన ప్రదేశంలో ఈ గుహను గుర్తించారు.

రాడార్‌ను ఉపయోగించి ఇక్కడున్న గుంతలలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా వారికి ఈ గుహ కనిపించింది. మారే అంటే సముద్రం అని అర్ధం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సముద్రం ఉండేదని భావిస్తున్నారు.

ప్రస్తుతం భూమి మీద నుంచి చూస్తే మనిషి కంటికి కూడా ఇది కనిపిస్తుంది. 1969లో అపోలో 11 నౌక ఇక్కడే దిగింది.

ఈ గుహకు చంద్రుని ఉపరితలంపై ఒక స్కైలైట్‌ కింద నుంచి వర్టికల్‌గా, వేలాడదీసిన గోడలాగా ఉంది. చంద్రగర్భంలో ఈ గుహ మరింత విస్తరించి ఉండొచ్చు.

లక్షల, కోట్ల సంవత్సరాల కిందట చంద్రునిపై లావా ప్రవహించినప్పుడు, రాయి ద్వారా సొరంగం ఏర్పడి ఇది రూపొంది ఉండొచ్చు.

భూమిపై ఏర్పడ్డ ఇలాంటి లావా గుహలు స్పెయిన్‌లోని లాంజరోట్‌లో ఉన్నట్లు ప్రొఫెసర్ కారర్ వివరించారు.

చంద్రుడిపై ఇలాంటి వాటిని కనుగొన్నప్పుడు, మానవాళి చరిత్రలో దీన్ని చూసిన తొలి వ్యక్తి మీరే అని తెలిసినప్పుడు, ఈ చిత్రాలను చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందని ప్రొఫెసర్ అన్నారు.

ఈ గుహ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రొఫెసర్లు బ్రుజోన్, కారర్‌లు ప్రయత్నించారు. చంద్రుని ఉపరితలంపై నివాసానికి ఇది అనువైన ప్రదేశం కావొచ్చని వారు భావిస్తున్నారు.

చంద్రునిపై గుహలు

‘‘భూమిపై జీవం గుహలలోనే ప్రారంభమైంది. అందువల్ల చంద్రునిపై ఉన్న గుహలలో కూడా మనుషులు జీవించవచ్చని భావించొచ్చు.’’ అని ప్రొఫెసర్ కారర్ అన్నారు.

ఈ గుహను ఇంకా పూర్తిగా అన్వేషించాల్సి ఉంది. ఉపరితలాన్ని లోతుగా అన్వేషించే రాడార్లు, కెమెరాలు, లేదంటే రోబోలను ఉపయోగించి వీటిని మ్యాప్ చేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చంద్రునిపై గుహలు ఉండొచ్చని సుమారు 50 ఏళ్ల కిందట శాస్త్రవేత్తలు భావించారు. ఆ తర్వాత 2010లో లూనార్ రీకన్నియసాన్స్ ఆర్బిటర్ అనే మిషన్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ అపోలో మిషన్లు దిగిన ప్రదేశాలను ఫోటోలు తీసింది.

ఈ ఫోటోలలో గుంతలు కనిపించాయి. ఇవి గుహలకు ప్రవేశ మార్గాలు కావొచ్చని శాస్త్రవేత్తలు భావించారు. అయితే, గుహలు ఎంత లోతులో ఉన్నాయో అప్పుడు శాస్త్రవేత్తలకు తెలియదు.

ప్రస్తుతం ప్రొఫెసర్లు బ్రుజోన్, కారర్‌లు ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నారు. అంతేకాక, గుహల గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు.

‘‘చంద్రుని ఉపరితలంపై 20 సెం.మీ. రెజుల్యూషన్ వరకు మా దగ్గర మంచి ఫోటోలు ఉన్నాయి. అపోలో మిషన్లు దిగిన ప్రదేశాలను మనం చూడొచ్చు. కానీ, ఉపరితలం కింద ఏముందో మనకు తెలియదు. వాటిని కనుగొనేందుకు చాలా అవకాశాలున్నాయి.’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన టోపికల్ టీమ్ ప్లానెటరీ కేవ్స్ కోఆర్డినేటర్ ఫ్రాసెస్కో సౌరో బీబీసీ న్యూస్‌కు తెలిపారు.

భవిష్యత్‌లో అంగారకుడిపై గుహలను అన్వేషించేందుకు కూడా ఈ పరిశోధన ఉపయోగపడనుందని, అక్కడ మానవాళి జీవనంపై ఆధారాలను కనుగొనేందుకు ఇదొక మార్గం కాగలదని అన్నారు.

చంద్రునిపై గుహలు మానవులకు ఉపయోగపడవచ్చు. అంతేకాక చంద్రుని చరిత్ర, సౌర వ్యవస్థ గురించి వెల్లువెత్తే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకూ ఇది సాయపడొచ్చని శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు.

గుహ లోపల ఉన్న రాళ్లు దెబ్బతినవు. అంతరిక్ష వాతావరణానికి పాడవవు. దీంతో, కోట్లాది సంవత్సరాల కిందటి విస్తృతమైన భౌగోళిక రికార్డును ఇవి మనకు అందించగలవు. శాస్త్రవేత్తల ఈ పరిశోధన ‘నేచర్ ఆస్ట్రానమీ’ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)