డోనల్డ్ ట్రంప్: ‘‘నేను ప్రాణాలతో బయటపడటానికి కారణమదే’’

ఫొటో సోర్స్, Getty Images
‘‘నేను చనిపోయాననే అనుకున్నా’’ అని శనివారం రాత్రి పెన్సిల్వేనియాలో హత్యాయత్నానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
కాల్పుల ఘటన అనంతరం ఆయన తొలిసారిగా కన్జర్వేటివ్ యూఎస్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘అదృష్టమో, దేవుడి దయో’’ తనను కాపాడిందని ట్రంప్ అన్నారు.
‘‘అద్భుతమైన విషయం ఏమిటంటే.. నేను నా తలను సరైన సమయంలో, సరైన విధంగా పక్కకు తిప్పడం, లేదంటే నా చెవును రాసుకుంటూ వెళ్లిన బుల్లెట్ నా ప్రాణం తీసి ఉండేది. బహుశా నేను చనిపోయి ఉండేవాడిని, ఇక్కడ ఇలా ఉండే వాడిని కాదు’’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్‌పై జరిగిన దాడిలో ఓ ప్రేక్షకుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని థామస్ మాథ్యూ క్రూక్స్‌గా అధికారులు గుర్తించారు.
సీక్రెట్ సర్వీస్ టీం జరిపిన కాల్పుల్లో అతను చనిపోయాడు.
తనపై కాల్పులు జరిపారని గ్రహించిన తరువాత తాను జనం వైపు చూసిన క్షణం గురించి ట్రంప్ వివరించారు.
‘‘ఆ క్షణంలో అక్కడ నిలబడ్డ ప్రజల నుంచే నాకు శక్తి వచ్చింది. అదేమిటనేది వర్ణించడం కష్టం. కానీ ప్రపంచమంతా చూస్తోందని నాకు తెలుసు. చరిత్రే దీనిని నిర్ణయిస్తుందని తెలుసు. నేను బాగానే ఉన్నాననే విషయం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది’’ అని ఆయన వాషింగ్టన్ ఎగ్జామినర్‌కు చెప్పారు.
‘‘దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే అవకాశం దక్కింది’’ అని ట్రంప్ అన్నారు.
ఆయన విస్కాన్సిన్‌లో మిల్వాకీలో జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ (ఆర్‌ఎన్‌సీ)కు హాజరయ్యే నిమిత్తం విమానం ఎక్కేందుకు సిద్ధమవుతూ మాట్లాడారు. ఈ కన్వెన్షన్‌లోనే ట్రంప్‌ను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
‘‘ఓ షూటర్ నన్ను ఆపలేరు’’
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాలను లక్ష్యంగా చేసుకుని గతంలో రూపొందించిన ప్రసంగాలకు పూర్తి భిన్నంగా ఈసారి తన ప్రసంగం ఉండనుందని ట్రంప్ చెప్పారు.
‘‘శనివారం నాడు దాడి జరగకపోయి ఉంటే, అదో అద్భుతమైన ప్రసంగమై ఉండేది’’ అని తెలిపారు.
‘‘నిజాయితీగా చెప్పాలంటే అది పూర్తిగా ఓ భిన్నమైన ప్రసంగం అవుతుంది. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి అదొక అవకాశం’’ అని చెప్పారు.
అంతకుముందు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో విస్కాన్సిన్ పర్యటన రెండు రోజులు వాయిదా వేయాలని భావించినట్టు చెప్పారు.
కానీ తన పర్యటన యథావిధిగా జరపడానికే కట్టుబడినట్టు ఆయన చెప్పారు.
‘‘ఓ షూటర్ లేదా హంతకుడు అని చెప్పదగ్గవాడు, నా పర్యటనను బలవంతంగా మార్పు చేయడానికి నేను అనుమతించను’’ అని ట్రంప్ అన్నారు.
హత్యాయత్నం తనపై ప్రభావం చూపిందని ఆయన చెప్పారు.
మరోపక్క ఘటనాస్థంలోనే సీక్రెట్ సర్వీసు కాల్చిచంపిన 20 ఏళ్ళ క్రూక్స్, ఈ పని ఎందుకు చేశారనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు.
దీనివెనుక క్రూక్స్ ఒక్కడే ఉన్నాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎఫ్‌బీఐ చెప్పింది. అతనికి ఎవరి నుంచైనా సాయం అందిందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతామని తెలిపింది.
ఇక శనివారం నాటి ఘటనలో చనిపోయిన ప్రేక్షకుడిని స్వచ్ఛంద ఫైర్‌పైటర్ అయిన 50 ఏళ్ళ కోరే కాంప్‌రేటర్‌గా గుర్తించారు. ఆయన కాల్పుల నుంచి తన కుటుంబాన్ని రక్షించే క్రమంలో చనిపోయారు.
ట్రంప్‌పై దాడి అనంతరం టెలివిజన్‌లో ప్రసంగించిన బైడెన్ ‘రాజకీయ వేడి తగ్గాలని’’ పిలుపునిచ్చారు.
‘‘మనం ఇలాంటి దారిలో ప్రయాణించకూడదు. చరిత్రలో ఇంతకుముందు ఇలాంటి ప్రయాణం చేశాం’’ అని ఇటీవల కాలంలో అమెరికాలో పెరుగుతున్న రాజకీయ హింసను ప్రస్తావిస్తూ బైడెన్ చెప్పారు.
‘‘అమెరికాలో మన విభేదాలను బ్యాలెట్ బాక్సుల ద్వారా పరిష్కరించుకుందాం’’ అని చెప్పిన బైడెన్.. ‘‘బుల్లెట్లతో కాదు.. బ్యాలెట్ బాక్సులతో..’’ అని అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














