నంద్యాల: బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్

నంద్యాల

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఇద్దరు పెద్దవారు ఉన్నారని ఎస్పీ చెప్పారు.

గ్యాంగ్ రేప్, మర్డర్, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

‘‘బాలురు బాలికపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపి కేసీ కెనాల్ వద్దకు తీసుకొచ్చారు. తరువాత ఈ విషయాన్ని బాలురు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో బాలురకు చెందిన తండ్రి, పెదనాన్న వనములపాడు మీదుగా బాలిక మృతదేహాన్ని పుట్టిలో కృష్ణా నదిలోకి తీసుకువెళ్ళి శవానికి తాడుతో రాయికట్టి నీటిలోకి పడేశారు’’ అని ఎస్పీ చెప్పారు.

బాలిక మృతదేహం కోసం ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ చెప్పారు.

నంద్యాల

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బాలిక కోసం నంద్యాలలోని ముచ్చుమర్రి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.

‘‘పాపను ఇస్తే దహన సంస్కారాలు చేసుకుంటాం’’

కనిపించకుండా పోయిన బాలిక తల్లిదండ్రులతో బీబీసీ మాట్లాడింది.

‘‘ఇప్పటికీ అమ్మాయి ఆచూకీ లేదు. మా పాప మాకు కావాలి. నీళ్ళల్లో ఉందా? ఏమైనా చేశారా? అనేది ఇంతవరకు తెలియలేదు. మా పాపను మాకు ఇస్తే దహన సంస్కారాలు చేసుకుంటాం. ఆడుకోవడానికి వెళ్లిన పాప, ఇంకా రాలేదని ఆదివారం(7న) సాయంత్రం తెలిసింది’’ అని పాప తండ్రి అన్నారు.

అన్నం తిని ఆడుకోవడానికి వెళ్లిన కూతురు మళ్లీ తిరిగి రాలేదని పాప తల్లి బాధపడుతూ చెప్పారు.

‘‘అక్కడున్న పార్కులోనే చేశారని అంటున్నారు. మాకు అయితే ఇంతవరకు తెలియలేదు’’ అని ఆమె అన్నారు.

పాప ఆచూకీ తెలియకపోవడంతో బాధితుల బంధువులు, మరికొందరు నందికొట్కూరులోని పోలీస్ స్టేషన్ వద్ద ఈనెల 11వ తేదీన ధర్నాకు దిగారు.

పోలీసులు నచ్చచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఘటనా స్థలానికి వెళ్లారు. ముచ్చుమర్రి శబరి సొంత ఊరు కావడంతో ఈ కేసుకు రాజకీయ రంగు కూడా పులుముకుంది.

బాధితులను కలిసేందుకు ముచ్చుమర్రికి బయలుదేరిన వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

చేతులు ముఖానికి అడ్డం పెట్టుకున్న వ్యక్తి ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మైనర్లకు రేప్ ఆలోచనలు వస్తాయా?

మైనర్లలో ఇలాంటి ఆలోచనలు రావడానికి అనేక కారణాలుంటాయని సైకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి ఐతరాజు అన్నారు.

‘‘ఇంట్లోని, సమాజంలోని రకరకాల అంశాలు వయసుకొస్తున్న పిల్లల మీద ప్రభావం చూపుతాయి. ఇంట్లో లేదా చుట్టు పక్కల వాళ్లలో లైంగికంగా చెడు ప్రవర్తన ఉంటే ఆ పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ముందే సన్నిహితంగా ఉంటూ ఉంటారు. చిన్నచిన్న గదుల్లో నివసించే కుటుంబాల్లో తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడం పిల్లల కంట పడొచ్చు. అది వారి మీద ప్రభావం చూపుతుంది’’ అని డాక్టర్ స్రవంతి తెలిపారు.

కొందరు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా నేరాలకు పాల్పడేలా దారి తీస్తాయని ఆమె అన్నారు.

‘‘బైపోలార్ డిజార్డర్, కాండక్ట్ డిజార్డర్ వంటి సమస్యలు కొందరు పిల్లల్లో నేరపూరిత ప్రవృత్తిని పెంచుతాయి. వయసు పెరిగే కొద్దీ అది పెరుగుతూ వస్తుంది. ఇలాంటి వారు తాము చూసింది ఇతరుల మీద ప్రయోగించడానికి ప్రయత్నిస్తారు. శృంగారానికి వారి శరీర నిర్మాణం పూర్తిగా సిద్ధం కాకపోయినా ఒకరకమైన ఆనందం కోసం అలా చేసే అవకాశం ఉంది’’ అని డాక్టర్ స్రవంతి వివరించారు.

‘‘మన సమాజంలో పిల్లలతో లైంగిక విషయాలను చర్చించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు కాబట్టి వాళ్లకు చెప్పే వాళ్లు కూడా ఉండరు. వాళ్లకు వచ్చే సందేహాలు బయట వాళ్లకు కూడా చెప్పుకోలేరు. అలాంటి పిల్లలందరూ జత కలిసి ఫోన్లలో పోర్న్ చూడటం వంటివి చేస్తారు. సినిమాలు, టీవీ షోలలో చూపించే అడల్ట్ కంటెంట్ కూడా పిల్లల మీద ప్రభావం చూపుతుంది’’ అని ఆమె చెప్పారు.

డాక్టర్ స్రవంతి
ఫొటో క్యాప్షన్, నేరాలకు పాల్పడే పిల్లల్లో కొన్ని రకాల లక్షణాలను ముందుగానే పసిగట్టవచ్చని డాక్టర్ స్రవంతి చెప్పారు.

పిల్లల్లో అలాంటి లక్షణాలను ఎలా గుర్తించాలి?

13 ఏళ్ల నుంచి పిల్లల్లో కొత్తకొత్త భావాలు వస్తూ ఉంటాయని, తమ శరీరంలో వచ్చే మార్పుల గురించి పూర్తిగా తెలియని వయసులో వారు ఉంటారని, ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ స్రవంతి తెలిపారు.

‘‘లైంగిక పరిపక్వత రావడానికి ముందు ఉండే వయసును అడాలసెన్స్ అంటాం. అంటే 14-18 లోపు వయసు. దానికంటే ముందు ఉన్నదాన్ని ప్రీ అడాలసెన్స్ స్టేజ్ అంటాం. అవయవాల్లో కొత్త కొత్త మార్పులు, కొత్తగా హార్మోన్స్ వాళ్ళల్లో ప్రవహిస్తూ ఉండడం వంటివి పిల్లల్లో ఒక రకమైన ఒత్తిడిని తీసుకొస్తాయి. అందరికంటే భిన్నంగా కొత్త లోకంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు తగిన సమయం కేటాయించి ఆ మార్పులను అర్థం చేసుకోవాలి’’ అని వివరించారు.

నేరాలకు పాల్పడే పిల్లల్లో కొన్ని రకాల లక్షణాలను ముందుగానే చూడొచ్చని డాక్టర్ స్రవంతి చెప్పారు.

‘‘ఇంట్లో టెడ్డీబేర్ల వంటి బొమ్మలు, పెంపుడు జంతువులతో లైంగికచర్యలకు ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలు ఒంటరిగా మొబైల్ చూడటానికి ఇష్టపడుతుంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? వారి మిత్రులు ఎవరు? ఎలాంటి ప్రదేశాలకు వెళ్తున్నారు? మాదకద్రవ్యాలు వంటి వాటికి అలవాటు పడ్డారా? అనేది గమనించాలి’’ అని డాక్టర్ సూచించారు.

గ్రాఫికల్ చిత్రం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

‘‘పిల్లల్లో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వారిని సైకాలజిస్టుల వద్దకు తీసుకెళ్లాలి. బిహేవియర్ థెరపీ ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే జువైనల్ హోమ్స్‌లో పెట్టి చికిత్స అందిస్తారు. నేరాలు జరగడానికి ముందే ఇంట్లోను, పాఠశాలల్లోనూ పిల్లలకు తగిన అవగాహన కల్పించాలి’’ అని డాక్టర్ స్రవంతి వివరించారు.

చిన్నారులపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

చట్టం ఏం చెబుతోంది?

కేసు తీవ్రతను బట్టి వీరికి శిక్షలు ఉంటాయని న్యాయవాది సరస్వతి బీబీసీతో చెప్పారు.

‘‘నేరం చేసిన పిల్లల వయసు 12సంవత్సరాల లోపు ఉంటే వారిని నేరస్తులుగా పరిగణించరు. ఎందుకంటే ఆ వయసు పిల్లలకు అవగాహన ఉండదని చట్టం చెబుతోంది. అలాంటి పిల్లలను జువైనల్ హోమ్ లో ఉంచుతారు.

వయసు 12 నుంచి 16 సంవత్సరాల వయసు ఉంటే 3-7సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

కొన్ని కేసుల్లో తీవ్రతను బట్టి 16 సంవత్సరాలు దాటిన వారిని అడల్ట్ కింద పరిగణిస్తారు’’ అని సరస్వతి వివరించారు.

వీడియో క్యాప్షన్, నంద్యాల అత్యాచార ఘటన:మైనర్లలో రేప్‌ ఆలోచనలు ఎందుకు వస్తాయి?

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)