నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ: వీర్యదానంతో వెయ్యిమందికి తండ్రయిన నెదర్లాండ్స్ వాసి, వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, NETFLIX
- రచయిత, స్టీవెన్ మెకింతోష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నెదర్లాండ్స్‌లో కొన్ని కుటుంబాలు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా...ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రం తానేం తప్పు చేయలేదని, చాలామందికి సాయమే చేశానని చెబుతున్నారు. ఆయన పేరు జోనాథన్ జాకబ్ మీజర్. ‘వీర్య దాత’గా ఆయనకు గుర్తింపు ఉంది.
2017లో నెదర్లాండ్స్ కోర్టు జోనాథన్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ఆయన వార్తల్లో నిలిచారు. ఇప్పుడాయన వయసు 43 ఏళ్లు.
ఆ దేశంలో ఆయన వీర్యం దానం చేయడంవల్ల 100 మందికి పైగా పిల్లలు జన్మించినట్లు తేలింది. ఆ దేశ చట్ట ప్రకారం వీర్యదానం ద్వారా 25 మంది పిల్లల కోసమే చేయవచ్చు. కానీ, జోనాథన్ అంతకుమించి, అది కూడా అబద్ధాలు చెబుతూ, రహస్యంగా చేశారు అన్నది ఆరోపణ.
అయితే, తాను తప్పు చేయలేదని, తన స్పెర్మ్ డొనేషన్ వందల జీవితాల్లో సంతోషాన్ని నింపిందని జోనాథన్ వాదించారు. కేసును విచారించిన అక్కడి కోర్టు ఫెర్టిలిటీ క్లినిక్ (సంతాన సాఫల్య కేంద్రాలు)లకు వీర్యదానం చేయకుండా జోనాథన్‌పై నిషేధం విధించింది.
అయితే, ఆరేళ్ల తర్వాత అంటే 2023లో జోనాథన్ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. నిషేధం పడినా జోనాథన్ తన స్పెర్మ్‌ను విక్రయించడం కొనసాగించారని, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 మంది శిశువుల జననానికి ఆయన 'సహకారం' అందించారని డచ్ అధికారుల అంచనా వేశారు.
అంతేకాదు, తాను కొద్దిమందికే వీర్యాన్ని దానం చేసినట్లు అబద్ధాలు చెప్పి వందల కుటుంబాలకు ఆయన వీర్యాన్ని అందించినట్లు జోనాథన్‌పై ఆరోపణలు వచ్చాయి.


ఫొటో సోర్స్, Getty Images
జోనాథన్‌పై నెట్‌ఫ్లిక్స్ సిరీస్..
జోనాథన్ స్పెర్మ్‌ను ఉపయోగించిన మహిళలు కొందరు కొన్నిరోజుల కిందట నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌లో తమ అనుభవాలు పంచుకున్నారు.
జోనాథన్ తమను ఎలా నమ్మించారో వారు డాక్యుమెంటరీలో వివరించారు. ఆయనకు ఎంతమంది పిల్లలున్నారో తెలిసిన తర్వాత తాను మోసపోయానని తెలిసిందని, బాధగానూ, కోపంగానూ ఉందని ఓ బాధిత మహిళ చెప్పారు.
అయితే, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో వివరాలు పంచుకోవడానికి జోనాథన్ నిరాకరించారు. కానీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
వందలమందికి స్పెర్మ్ డొనేషన్ చేయడాన్ని సమర్థించుకున్నారు. తన స్పెర్మ్‌ను పొందిన 'చాలామంది' సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
17 ఏళ్లుగా అదే పని..
జోనాథన్ సుమారు 17 సంవత్సరాలుగా వీర్యదానం చేస్తున్నారు.
చాలా సందర్భాల్లో ఈ పనిని రహస్యంగా చేశారు. ఫెర్టిలిటీ క్లినిక్‌ల ద్వారా కాకుండా, వీర్యం కావాల్సిన వారితో ఆయన నేరుగా మాట్లాడారు.
నెదర్లాండ్స్‌లో ఆయన 102 మంది పిల్లల పుట్టుకకు స్పెర్మ్ అందించారు. ఈ పని కోసం 11 ఫెర్టిలిటీ క్లినిక్‌లు ఆయన నుంచి స్పెర్మ్ తీసుకున్నాయి. ఆయన వీర్యదానంపై 2017 నుంచి నెదర్లాండ్స్‌లో నిషేధం ఉండటంతో 2023 వరకు తన వీర్యాన్ని దేశం వెలుపల ఇచ్చేవారు. అయితే, అదే సంవత్సరం ఒక మహిళ, ఒక సంస్థ ఆయనపై సివిల్ దావా వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
జోనాథన్ చర్యలు తమ పిల్లలకు వావివరసల సమస్య ( రక్తసంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు)ను తెచ్చి పెట్టే ప్రమాదం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
జోనాథన్ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో 550 నుంచి 600 మంది పిల్లలు పుట్టడానికి తానే కారణమని అంగీకరించారు.
అయితే, అనేక దేశాల్లో జోనాథన్‌కు దాదాపు 1000 మంది వరకు పిల్లలు ఉన్నారని కోర్టు విచారణలో తేలింది. దీంతో ఇక జోనాథన్ ఎప్పుడూ వీర్యదానం చేయరాదని న్యాయమూర్తి ఆదేశించారు. అలా చేస్తే ప్రతి స్పెర్మ్ డొనేషన్‌కు లక్ష డాలర్ల ( సుమారు రూ. 83 లక్షల ) వరకు జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది.

ఫొటో సోర్స్, NETFLIX
'ది మ్యాన్ విత్ 1000 కిడ్స్'
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ పేరు 'ది మ్యాన్ విత్ 1000 కిడ్స్'. ఈ డాక్యుమెంటరీలో జోనాథన్ వీర్యాన్ని పొంది, మోసపోయినట్లుగా చెబుతున్న మహిళలతో పాటు వారి కుటుంబాలు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి.
స్పెర్మ్ డొనేషన్ చేస్తున్నప్పుడు, తాను ఇంతకుముందు వందలమందికి వీర్యాన్ని ఇచ్చినట్లు జోనాథన్ చెప్పకుండా దాచారని ఒక బాధిత మహిళ ఆరోపించారు.
మరొక మహిళ " చాలా బాధగా ఉంది. వీర్యాన్ని దానం చేస్తున్నప్పుడు గతంలో తాను అయిదు కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేసినట్లు చెప్పారు." అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, netflix
జోనాథన్ వీర్యంతో తల్లి అయిన నటాలీ అనే మహిళ బీబీసీతో మాట్లాడారు. ఆయన ఏం చేశారో మీడియా ద్వారా తెలుసుకున్నానని నటాలీ తెలిపారు.
"ఈ పిల్లలు ఏదో ఒక రోజు కలుసుకొని ప్రేమలో పడొచ్చు. కానీ, వాళ్లు ఒకే తండ్రి (వీర్యదాత)కి జన్మించారని ఆ సమయంలో వారికి తెలియకపోతే ఎంత ప్రమాదం? ఇది ఆందోళన కలిగించే విషయం."అని నటాలీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేస్తా: జోనాథన్
అయితే, స్పెర్మ్ డొనేషన్‌తో ఇబ్బందిగా ఉన్న వారినే డాక్యుమెంటరీలో చూపించారని కానీ, 'సంతోషంగా' ఉన్నవారు చాలా సంఖ్యలో ఉన్నారని, వారిని విస్మరించారని జోనాథన్ ఆరోపించారు.
"నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి ఉద్దేశపూర్వకంగా 'ది మ్యాన్ విత్ 1000 కిడ్స్' అనే పేరు పెట్టింది. దానిని ‘ది స్పెర్మ్ డోనార్ హూ హెల్ప్‌డ్ ఫ్యామిలీస్ కన్సీవ్ విత్ 550 చిల్డ్రన్’ అన్న పేరు మాత్రమే పెట్టాలి. అలా పెట్టలేదంటే వారు అబద్ధాలు చెబుతున్నారని అర్ధం." అని ఆయన ఆరోపించారు.
వందలమంది పిల్లలను కనేందుకు వీర్యాన్ని దానం చేయడంలో తనకు "తప్పు ఏమీ కనిపించడం లేదు" అని జోనాథన్ బీబీసీకి చెప్పారు.
అదే సమయంలో వందలమందికి స్పెర్మ్ ఇచ్చిన విషయం దాచిపెట్టడం వల్ల, తన స్పెర్మ్ నుంచి జన్మించిన పిల్లల మధ్య లైంగిక సంబంధం జరగొచ్చనే వాదనలను ఆయన తోసిపుచ్చారు.
"ఇప్పుడు చవకైన డీఎన్ఏ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. నా డీఎన్ఏ రికార్డు డేటాబేస్‌లో ఉంది. కాబట్టి ఎవరైనా నన్ను గుర్తుపట్టొచ్చు." అని జోనాథన్ చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














