డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఎవరు? కట్టుదిట్టమైన భద్రత నడుమ అంత దగ్గరికి ఎలా రాగలిగాడు?

ఫొటో సోర్స్, CBS News
- రచయిత, గ్యారీ ఓడోనోగ్యు, మెక్ ఆర్థర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అమెరికా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీస్ టీం జరిపిన కాల్పుల్లో నిందితుడు చనిపోయాడని పోలీసులు చెప్పారు.
ట్రంప్‌పై దాడికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఎఫ్‌బీఐ తెలిపింది. ఈ ఘటన గురించి ఏదైనా సమాచారం తెలిస్తే అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఏవైనా ఫోటోలు లేదా ఆన్‌లైన్ వీడియోలు ఉంటే, వాటిని తమతో పంచుకోవచ్చని చెప్పింది.
ఇంతకీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితుడు అక్కడికి ఎలా రాగలిగాడు? అతనెవరు? ఇంతకుముందు నేర చరిత్ర ఉందా?

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
నిందితుడు ఎవరు?
ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. అతడు పెన్సిల్వేనియాలోని బేథల్ పార్క్ ప్రాంతంలో నివాసం ఉంటాడని తెలిపింది.
ట్రంప్ ర్యాలీ జరిగిన ప్రదేశం నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో నిందితుడి నివాసం ఉంటుంది.
ట్రంప్‌పై దాడికి సెమీ ఆటోమేటిక్ AR-15 రైఫిల్‌ను ఉపయోగించారని, సుమారు 200-300 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపారని బీబీసీ న్యూస్ పార్ట్‌నర్ సీబీఎస్ రిపోర్ట్ చేసింది.
నిందితుడి దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డు లేదని, దాంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిందని ఎఫ్‌బీఐ తెలిపింది.
పెన్సిల్వేనియా పబ్లిక్ కోర్టు రికార్డుల ప్రకారం నిందితుడు క్రూక్స్‌కి నేర చరిత్ర లేదు.
అతడు పెన్సిల్వేనియాలో రిపబ్లికన్‌గా నమోదు చేసుకున్నారని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) తెలిపింది.
అయినప్పటికీ ఎన్నికల ప్రచార ఆర్థిక రికార్డుల ప్రకారం.. ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున అంటే 2021 జనవరి 20న ప్రోగ్రెసివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి క్రూక్స్ 15 డాలర్లు విరాళంగా ఇచ్చాడు.
ఆదివారం ఉదయం బేథల్ పార్క్‌లోని థామస్ మాథ్యూ క్రూక్స్ ఇంటిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఈ దాడిని హత్యాయత్నం కేసు కింద ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది, ట్రంప్ ర్యాలీ జరిగిన స్థలాన్ని క్రైమ్ సీన్‌గా పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'బుల్లెట్ తగిలిన వ్యక్తికి చికిత్స చేశాం'
ర్యాలీకి వచ్చిన ఒక వ్యక్తి తలకు బుల్లట్ తగిలిందని, తనకు చికిత్స చేశానని అక్కడే ఉన్న ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ డాక్టర్ ఒకరు సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
"నాకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. నేను పటాకులేమో అనుకున్నాను. ‘ఆయనను కాల్చారు, ఆయనను కాల్చారు’ అంటూ ఎవరో అరుస్తుండటం విన్నాను" అని డాక్టర్ చెప్పారు.
''జనం అటూ ఇటూ పరుగెత్తుకుంటూ బెంచీల మధ్య ఇరుక్కుపోయారు. అక్కడ చాలా రక్తం కనిపించింది'' అని ట్రంప్‌పై కాల్పుల తర్వాత అక్కడి కనిపించిన పరిస్థితి గురించి ఆ డాక్టర్ వివరించారు.
తన కుడి చెవి పైభాగంలో బుల్లెట్ దూసుకుపోయిందని ఘటన అనంతరం డోనల్డ్ ట్రంప్ తెలిపారు.
‘‘నా చెవుల దగ్గర కరకు శబ్దం వినిపించింది. బుల్లెట్ నా చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్లినట్లు అనిపించింది’’ అని ట్రంప్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
' పైకప్పుపై దాక్కున్నాడు’: ప్రత్యక్ష సాక్షి
తుపాకీ కాల్పుల శబ్దం వినడానికి కొన్ని నిమిషాల ముందు ఒక వ్యక్తి వేదిక దగ్గరలోని ఇంటి పైకప్పు మీద పాకడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షి గ్రెగ్ బీబీసీకి చెప్పారు.
"ఒకతను మోచేతులపై పాకుతున్నారు, ఆయన రైఫిల్ కూడా పట్టుకున్నారని పోలీసులకు చెప్పాను" అని గ్రెగ్ వివరించారు.
"పోలీసులకు ఈ విషయం చెప్పినా ట్రంప్ తన ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించారు? సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను ఎందుకు వేదిక నుంచి కిందకి తీసుకురాలేదు? నాకు ఐదుసార్లు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించినప్పుడు అదే ఆలోచిస్తున్నాను" అని గ్రెగ్ అన్నారు.
బుల్లెట్లు పేలిన వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణగా నిలిచి, వేదిక పైనుంచి ఆయనను కిందకి తీసుకెళ్లారు. ట్రంప్‌ని బయటకు తీసుకెళ్తున్నప్పుడు ఆయన ముఖం మీద రక్తం కనిపించింది.
కాల్పులు జరిపిన వ్యక్తి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సీక్రెట్ సర్వీస్ టీం ఆ వ్యక్తిని కాల్చడం తాను చూశానని గ్రెగ్ చెప్పారు.
అప్పుడు ర్యాలీలో ట్రంప్ ప్రసంగాన్ని గ్రెగ్ వింటున్నారు. ట్రంప్ ప్రసంగం ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత తాను ‘గన్ పట్టుకున్న వ్యక్తి’ని చూశానని గ్రెగ్ చెప్పారు.
"మాకు 50 అడుగుల దూరంలో పక్కనే ఉన్న ఇంటి పైకప్పు మీద ఒక వ్యక్తి పాకడం చూశాను. అతని చేతిలో రైఫిల్ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది" అని గ్రెగ్ అన్నారు.
"పోలీసులు ఇంటి కింద తిరుగుతున్నారు. మేం పైకప్పు వైపు చూపించి, అక్కడ రైఫిల్‌తో ఒక వ్యక్తి ఉన్నారు చూడండి అని పోలీసులకు చెప్పాం. కానీ పోలీసులు అర్థం చేసుకోలేదు" అని ఆయన చెప్పారు.
నిందితుడు మూడు, నాలుగు నిమిషాల పాటు అక్కడే ఉన్నారని గ్రెగ్ తెలిపారు. ఇంటి పైకప్పు వాలుగా ఉండటంతో పోలీసులు ఆ వ్యక్తిని చూడలేకపోయారన్నారు.
‘’ఈ పైకప్పుల మీద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎందుకు లేరు. ఇదంతా పెద్ద స్థలమూ కాదు, కానీ ఎందుకు ఇలా జరిగింది?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
నిందితుడిని సీక్రెట్ సర్వీస్ టీం చంపడం చూశానని గ్రెగ్ చెప్పారు.
"సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పైకప్పు మీదికి ఎక్కారు. వారి తుపాకులను నిందితుడిపైకి గురిపెట్టారు. ఆయనను వదల్లేదు, చంపేశారు" అని గ్రెగ్ తెలిపారు.
ఒక వ్యక్తి భవనం పైనుంచి కాల్పులు జరిపినట్లు చూపుతున్న వీడియోను బీబీసీ వెరిఫై బృంధం కూడా పరిశీలించి, ధృవీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
షూటర్‌ను చంపేశాం: సీక్రెట్ సర్వీస్
షూటర్‌ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది హతమార్చారని, తక్షణ రక్షణ చర్యలు తీసుకున్నారని సీక్రెట్ సర్వీస్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంథోనీ గుగ్లియానీ చెప్పారు.
నిందితుడి కాల్పుల్లో ర్యాలీలోని ఒకరు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.
గన్ శబ్దం వినిపించడంతో ర్యాలీలో గందరగోళం ఏర్పడిందని అక్కడే ఉన్న జాసన్ అనే వ్యక్తి చెప్పారు.
"సీక్రెట్ సర్వీస్ టీం వెంటనే స్టేజీ పైకి వచ్చి ట్రంప్ చుట్టూ చేరడం కనిపించింది. ర్యాలీకి వచ్చిన వారంతా కిందకి వంగేశారు" అని జాసన్ బీబీసీతో చెప్పారు.
"ట్రంప్ వెంటనే లేచి నిలబడి, పిడికిలి బిగించి జనానికి ఏదో చెప్పారు" అని జాసన్ తెలిపారు.
"ఆయన ముఖం మీద రక్తం కనిపించింది. చెవి నుంచి రక్తం కారుతోంది. ఆయన లేచి నిలబడ్డారు, బతికే ఉన్నారు" అని జాసన్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














