అమెరికా ఎన్నికలు: ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలరా? బైడెన్ అభ్యర్థిత్వంపై అనుమానాలతో డెమొక్రాట్లలో చర్చ

kamala harris

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కోర్ట్నీ సుబ్రమణియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శనివారం మధ్యాహ్నం న్యూ ఓర్లీన్స్‌లోని బ్లాక్ కల్చరల్ ఫెస్టివల్‌లో వేదికపై కూర్చుని తన జీవితం, వైట్ హౌస్‌లో సాధించిన విషయాల గురించి మాట్లాడారు.

అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి బ్లాక్ అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్ అయిన హారిస్ తరచుగా ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటారు. ప్రెసిడెంట్ జో బైడెన్‌ను అనుసరించే రిపోర్టర్ల గ్రూప్ కంటే చాలా చిన్న రిపోర్టర్‌ల గ్రూపు సాధారణంగా ఆమెను అనుసరిస్తుంది.

నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ పోటీలో ఉన్నారు. అయితే, ఇటీవల డోనల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చ సందర్భంగా 81 ఏళ్ల బైడెన్‌ సరిగా మాట్లాడలేక మధ్యలోనే ఆపివేయడంతో ఆయన శారీరక, మానసిక సామర్థ్యాలపై ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బైడెన్‌ను మారుస్తారంటూ ప్రచారమూ సాగుతోంది. దీంతో ఇప్పుడు చాలామంది రిపోర్టర్లు కమలా హారిస్‌ను అనుసరిస్తున్నారు.

బైడెన్ పదవిలో కొనసాగగల సామర్థ్యం, ఆయన రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు, తనకు బాధ్యతలు అప్పగించే విషయంపై గత వారం రోజులుగా చర్చ జరుగుతున్నా కమలా హారిస్ ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు.

వాట్సాప్
కమలా హారిస్, బైడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్, బైడెన్, ట్రంప్

బైడెన్‌కు హారిస్ మద్దతు

న్యూ ఓర్లీన్స్‌లో కమలా హారిస్ మాట్లాడుతూ.. మీరు అనుకున్న మార్గంలో వెళ్తున్నపుడు ప్రతికూల స్వరాలను విస్మరించాలంటూ శ్రోతలకు సలహా ఇచ్చారు.

"ఇది మీ సమయం కాదు. మీ వంతు కాదు. మీలా ఇంతకు ముందు ఎవరూ చేయదు అని కొందరు చెప్తుంటారు కానీ, అది ఎప్పుడూ వినవద్దు' అని ఆమె సూచించారు.

జూన్ 27న సీఎన్ఎన్ చర్చ తర్వాత జో బైడెన్‌ను కమలా హారిస్ పదే పదే సమర్థించారు. అధ్యక్షుడిగా ఆయన సాధించిన విజయాలను 90 నిమిషాల చర్చలో వైఫల్యంతో కప్పిపుచ్చరాదని ఆమె వాదించారు.

అదే సమయంలో యూఎస్ అధ్యక్ష అభ్యర్థి స్థానం నుంచి తప్పుకోబోనని, నామినీగా కొనసాగుతానని బైడెన్ పట్టుబట్టారు.

కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

అయినప్పటికీ, బైడెన్‌ను పక్కన పెట్టాలంటూ పలువురు కోరుతుండటంతో కొంతమంది డెమొక్రాట్లు ఆయన స్థానంలో 59 ఏళ్ల కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు.

బైడెన్ "భారీ విజయం సాధించాలి లేదా ఎవరికైనా టార్చ్ అప్పగించాలి. కమలా హారిస్ వంటి వారికి.." అని కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ షిఫ్ అన్నారు. ట్రంప్‌పై కమలా హారిస్ భారీ తేడాతో గెలవగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఎన్‌బీసీ మీట్ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఆలోచన బైడెన్ మద్దతుదారులు సహా కొందరు డెమొక్రాట్లను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన కమలా హారిస్, ఫస్ట్ బ్యాలెట్‌కు ముందే 2020లో డెమొక్రాటిక్ అధ్యక్ష నామినేషన్ పొందడంలో విఫలమవడం, వైట్‌హౌస్‌లో ఆమె పనితీరుకు కూడా తక్కువ మద్దతు లభించడం చూశారు ఆ డెమొక్రాట్లు.

అయినప్పటికీ ఆడమ్ షిఫ్, సౌత్ కరోలినా కాంగ్రెస్ సభ్యుడు జిమ్ క్లైబర్న్ వంటి సీనియర్ డెమొక్రాట్‌లు పార్టీ ఒత్తిడి కారణంగా బైడెన్ వైదొలగాలని నిర్ణయించుకుంటే ఆయన స్థానంలో హారిస్ స్పష్టమైన ఎంపిక అని సూచిస్తున్నారు.

బైడెన్, కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బైడెన్, కమలా హారిస్

బైడెన్ మద్దతు?

డొనాల్డ్ ట్రంప్‌తో పోటీలో బైడెన్ కంటే కమలా హారిస్ మెరుగ్గా రాణిస్తారని కొన్ని పోల్‌లను ఉటంకిస్తూ మద్దతుదారులు సూచిస్తున్నారు. ఆమెకు జాతీయ ప్రొఫైల్, ప్రచార మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎన్నికలకు కేవలం నాలుగు నెలలే ఉన్నాయని, యువ ఓటర్లను ఆమె ఆకర్షించగలరని వారు చెప్పారు.

వైట్‌హౌస్‌లోని సీనియర్లు కొందరు కమలా హారిస్‌ను రాజకీయంగా బలహీన వ్యక్తిగా భావించారు. అయినా కూడా హారిస్ అధ్యక్ష అభ్యర్థి రేసులో మొదటి స్థానానికి ఎదగడం పెద్ద మలుపు.

చాలాకాలం నుంచి హారిస్‌ను తక్కువగా అంచనా వేస్తున్నారని డెమొక్రాటిక్ వ్యూహకర్త, హారిస్ మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జమాల్ సిమన్స్ అభిప్రాయపడ్డారు.

"కమలా హారిస్ అధ్యక్షుడితో ప్రచారం చేసినా లేదా అధ్యక్ష అభ్యర్థిగా నిలిచినా రిపబ్లికన్‌లు, ట్రంప్ ప్రచారాన్ని ఆమె తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది" అని సిమన్స్ బీబీసీతో అన్నారు.

కమలా హారిస్; బైడెన్

ఫొటో సోర్స్, REUTERS/LEAH MILLIS/FILE PHOTO

షెడ్యూల్ మార్చేసిన హారిస్..

ఇటీవల ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్‌కు వ్యతిరేకత రావడంతో హారిస్ అధ్యక్షుడితో పాటే ఉంటూ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. ఆమె గత బుధవారం ఒక సమావేశానికి హాజరయ్యారు, అక్కడ డెమొక్రాటిక్ గవర్నర్‌లకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు.

జూలై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం. ఆ రోజు వైట్ హౌస్‌లో జరిగిన వేడుకల్లో బైడెన్‌తో కలిసి పాల్గొనడానికి హారిస్ ఏటా తన లాస్ ఏంజెల్స్ ఇంట్లో అగ్నిమాపక, సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో జరిగే కార్యక్రమాన్ని పక్కనపెట్టారు.

మాజీ ప్రాసిక్యూటర్‌ అయిన హారిస్ చర్చ జరిగినప్పటి నుంచి ట్రంప్‌ను బహిరంగ వేదికలలో విమర్శించడంపై దృష్టి సారించారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికి, మహిళల హక్కులకు ముప్పు అని ఆమె ఆరోపించారు. అదే సమయంలో బైడెన్‌కు మద్దతుగా నిలిచారు.

వైస్ ప్రెసిడెంట్‌లు ఎల్లప్పుడూ ఆశయం, విధేయతను బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే తనకు, అధ్యక్షుడికి మధ్య అంతరం చూపించడానికి ఇది సమయం కాదని హారిస్‌కు తెలుసు.

కమలా హారిస్‌కు ఎవరు పోటీ?

బైడెన్‌కు కమలా హారిస్ మాత్రమే ప్రత్యామ్నాయం కాదు. మిషిగన్‌కు చెందిన గ్రెషెన్ విట్మర్, కాలిఫోర్నియాకు చెందిన గావిన్ న్యూసోమ్, పెన్సిల్వేనియాకు చెందిన జోష్ షాపిరో, ఇల్లినాయిస్‌కు చెందిన జేబీ ప్రిట్జ్‌కర్, పీట్ బుట్టిగీగ్, అలాగే కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా వంటివారు ఉన్నారు.

హారిస్, ఆమె సిబ్బంది ఈ ఊహాగానాలపై బహిరంగంగా చర్చించడం లేదు. అదేసమయంలో కమలా హారిస్ వెంట కొందరు పార్టీ సభ్యులు చేరుతున్నారు.

ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో ఒక మెమో సర్క్యులేట్ అవుతోంది. అది డెమొక్రటిక్ కార్యకర్తలు రాసినట్లు చెబుతున్నారు. హారిస్‌కు రాజకీయ బలహీనతలు ఉన్నప్పటికీ ఆమెకు ఎందుకు మద్దతు ఇవ్వాలో అందులో రాసుకొచ్చారు.

మరొకరిని ఎన్నుకుంటే ప్రచారానికి అంతరాయం కలగవచ్చని, మీడియాలో నెలల తరబడి డెమొక్రటిక్ అంతర్గత పోరుపైనే చర్చ జరగొచ్చని మెమో హెచ్చరించింది. ఒకవేళ బైడెన్ వైదొలిగితే, హారిస్ కాకుండా మరొక అభ్యర్థిని ఎన్నుకుంటే పార్టీలో చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తారని ఆ మెమో సూచిస్తోంది.

"ఇలాంటి పరిస్థితిలో హారిస్‌ను పక్కన పెట్టడానికి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకూడదు" అని అక్కడి చట్టసభ సభ్యులలో ఒకరైన క్లైబర్న్ అన్నారు.

రిపబ్లికన్లు కూడా..

మరోవైపు రిపబ్లికన్లు కూడా బైడెన్ స్థానంలో కమలా హారిస్‌ను ప్రధాన అభ్యర్థిగా గుర్తించారు. రిపబ్లికన్లు భిన్నమైన పోటీకి సిద్ధం కావాలని సౌత్ కరోలినాకు చెందిన సెనేటర్ లిండ్సే గ్రాహం ఆదివారం హెచ్చరించారు. ఒకవేళ ఆయన హారిస్‌ను శక్తిమంతమైన అభ్యర్థిగా భావించి ఉండొచ్చు.

హారిస్ ప్రోగ్రెసివ్ కాలిఫోర్నియా నేపథ్యాన్ని గ్రాహం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె బైడెన్‌తో కాకుండా వామపక్ష వ్యక్తి అయిన బెర్నీ సాండర్స్‌కి దగ్గరగా ఉండాలని సూచించారు.

బైడెన్‌తో చర్చ తర్వాత ట్రంప్ కూడా హారిస్‌పై విమర్శలు చేశారు. అయితే సంపన్న దాతలతో సహా చాలామంది డెమొక్రాట్‌లకు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ట్రంప్‌ను బైడెన్ కాకుండా హారిస్ ఓడించే అవకాశాలు ఎక్కువున్నాయా? అంటే జవాబు దొరకని ప్రశ్నే.

నవంబర్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా కమలా హారిస్ ప్రెసిడెంట్ బైడెన్ కంటే మెరుగ్గా పని చేస్తారని వెలువడిన ఇటీవలి సీఎన్ఎన్ పోల్‌ను కమలా హారిస్ మద్దతుదారులు సూచిస్తున్నారు.

పోల్ ప్రకారం ప్రత్యక్ష పోరులో హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి కంటే కేవలం రెండు పాయింట్లతో వెనుకబడి ఉండగా, బైడెన్ ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నారు. స్వతంత్ర ఓటర్లు, మహిళలలో బైడెన్ కంటే హారిస్ మెరుగైన స్థానంలో ఉన్నారని పోల్ సూచించింది.

అయినప్పటికీ చాలామంది పోలింగ్ నిపుణులు ఇటువంటి ఊహాజనిత సర్వేలను తోసిపుచ్చారు. ఒకవేళ బైడెన్ పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకుంటే, డెమొక్రాట్లు ఇతర అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటే ఓటరు అభిప్రాయాలు మారవచ్చని అభిప్రాయపడ్డారు.

బైడెన్ ప్రచారానికి దగ్గరగా ఉన్న ఒక డెమొక్రాటిక్ పోల్‌స్టర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడి కంటే పార్టీ ఓట్లను హారిస్‌ ఎక్కువ సాధించగలరని అంగీకరించారు. అయితే ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయంపై సందేహం ఉందన్నారు. ఈ దశలో ట్రంప్‌తో హారిస్‌ను పోల్చిన సర్వేలు అంత పట్టించుకోవల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ పరంగా మీడియాతో మాట్లాడే హక్కు తనకు లేదని అందుకే తన ఐడెంటిటీనీ చెప్పడం లేదని ఆ వ్యక్తి అన్నారు.

kamala harris

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జో బైడెన్ తన రన్నింగ్ మేట్‌గా కమలా హారిస్‌ను ప్రకటించిన తర్వాత ట్రంప్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌‌తో ఆమె చర్చలో పాల్గొన్నారు.

ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోగలరా?

హారిస్ తల్లి భారత్, తండ్రి జమైకాకు చెందినవారు. కొన్ని నియోజకవర్గాల్లో హారిస్ అభ్యర్థిత్వం పార్టీకి శక్తినివ్వగలదని, అక్కడ యువ, నల్లజాతి, లాటినో ఓటర్లలో బైడెన్ కంటే హారిస్‌కు అనుకూలత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కానీ ఆమె యువ ఓటర్లలో ఓటింగ్‌ శాతాన్ని ఆమె పెంచగలరా? అనేది మరొక అనిశ్చిత ప్రశ్న.

2020లో బైడెన్ స్వల్ప తేడాతో గెలిచిన పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో హారిస్ కారణంగా యూనియన్, బ్లూ కాలర్ ఓటర్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందా? అని పార్టీలో కొందరు అనుమానపడుతున్నారు. నవంబర్‌ ఎన్నికల్లో విజయానికి రెండు పార్టీలకూ ఈ ఓట్లు చాలా అవసరం.

ఒకవేళ హారిస్ అభ్యర్థి అయితే.. మధ్యపశ్చిమ రాష్ట్రాలలో న్యూట్రల్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో లేదా నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్‌ను రన్నింగ్ మేట్‌గా ఎంచుకోవచ్చని కొందరు డెమొక్రాట్‌లు సూచించారు.

బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌ల వయస్సు దృష్ట్యా ఈ ఎన్నికల్లో రెండు పార్టీల వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులపై ఓటర్లు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని గత ఎన్నికల్లో బైడెన్ ప్రచారంలో భాగమైన సెలిండా లేక్ చెప్పారు.

మరోవైపు ట్రంప్ తన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే నార్త్ డకోటా గవర్నర్ డగ్ బర్గమ్ లేదా ఒహియో సెనేటర్ జేడీ వాన్స్ పోటీదారులుగా ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న డెమోక్రాట్ నేతలు

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)