ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు.
ఆయన తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీపై విజయం సాధించారు.
లెక్కించిన 3 కోట్ల ఓట్లలో డాక్టర్ పెజెష్కియాన్‌కు అనుకూలంగా 53.3 శాతం ఓట్లు జలీలీకి 44.3 శాతం ఓట్లు వచ్చాయి. దాంతో పెజిష్కియాన్ ఎన్నికైనట్టు ధ్రువీకరించారు.
జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో కేవలం 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆ రౌండ్‌లో ఏ అభ్యర్థికి మెజారిటీ రాలేదు.
ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరిగింది.

పెజెష్కియాన్ అధ్యక్షుడిగా ఎన్నికవడంపై, తెహ్రాన్ సహా ఇరాన్‌వ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు అవుతున్న వీడియోలు చూపుతున్నాయి.
ఆ వీడియోల్లో ఎక్కువగా యువకులు డాన్స్ చేస్తూ ఆకుపచ్చ జెండాను ఊపుతూ కనిపిస్తున్నారు.
హారన్లు కొడుతూ కార్లలో ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్ మోరల్ పోలీసింగ్‌ను మాజీ హార్ట్ సర్జన్ అయిన డాక్టర్ పెజిష్కియాన్ వ్యతిరేకించారు. ఆంక్షల వల్ల ఏకాకిగా మారిన ఇరాన్‌ను తిరిగి ప్రపంచంతో కలుపుతానని వాగ్దానం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
జలీలీపై వ్యతిరేకత ఎందుకు?
పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు సడలిస్తే తన అణు కార్యక్రమాన్ని అదుపులో పెట్టుకోవడానికి అంగీకరిస్తూ 2015లో ఇరాన్ చేసుకున్న అణు ఒప్పందాన్ని మళ్లీ సవరించుకునే దిశగా పాశ్చాత్య దేశాలతో "నిర్మాణాత్మక చర్చలు" జరపాలని డాక్టర్ పెజెష్కియాన్ పిలుపునిచ్చారు.
అయితే ఆయన ప్రత్యర్థి సయీద్ జలీలీ యథాతథ స్థితికి అనుకూలంగా ఉండేవారు.
జలీలీ పాశ్చత్య వైఖరికి బద్ధ విరోధి. అణు ఒప్పంద పునరుద్ధరణకు ఆయన వ్యతిరేకి.
ఆ ఒప్పందం ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకమని ఆయన చెబుతారు.
అసంతృప్తి మధ్య కిందటివారం అత్యల్పంగా నమోదైన పోలింగ్‌తో పోల్చితే శుక్రవారం ఎక్కువమంది ఓటు వేయడానికి వచ్చారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
జలీలీ విజయం సాధిస్తే.. బాహ్య ప్రపంచంతో మరింత ఘర్షణ పడేలా ఇరాన్‌ను ముందుకు నడుపుతారని, దేశానికి ఆయన తీసుకువచ్చేది ఏమీ లేకపోగా, మరిన్ని ఆంక్షలతో ఇరాన్‌ని ఇంకా ఎక్కువగా ఏకాకిని చేస్తారని ఆందోళన చెందిన ప్రజలు శుక్రవారం పెద్దసంఖ్యలో ఓటేసినట్లు భావిస్తున్నారు.
ఇరాన్‌లో శక్తిమంతమైన గార్డియన్ కౌన్సిల్ ఉంది. అందులో 12మంది సభ్యులు ఉంటారు. ఆ 12 మందిలో మత పెద్దలు, న్యాయనిపుణులు ఉంటారు. ఇరాన్ రాజకీయాలపై గార్డియన్ కౌన్సిల్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఎన్నికలలో ఎవరు పోటీచేయాలో వద్దో గార్డియన్ కౌన్సిల్ పరిశీలిస్తుంది. ఆ పరిశీలనలో పెజెష్కియాన్, జలీలీ ఆమోదం పొందారు.
ఆ ప్రక్రియలో ఎన్నికల బరిలో నుంచి 74 మంది అభ్యర్థులను తొలగించారు.
గతంలో అధికారపక్షానికి విధేయులుగా లేని అభ్యర్థులను గార్డియన్ కౌన్సిల్ అనర్హులుగా ప్రకటించడంపై మానవ హక్కుల సంఘాలు విమర్శించాయి.

ఫొటో సోర్స్, Reuters
‘అది వ్యతిరేకత కాదు’
ఏళ్ల తరబడి పేరుకుపోయిన అశాంతి ప్రభుత్వ వ్యతిరేకతగా మారి 2022-23 మధ్య దేశాన్ని కుదిపేశాక అనేకమంది మధ్య తరగతి, యువ ఇరానియన్లు ప్రభుత్వంపై తీవ్రమైన అపనమ్మకంతో ఉంటూ గతంలో ఓటు వేయడానికి నిరాకరించారు.
తన పాలన పట్ల వ్యతిరేకత కారణంగా తక్కువశాతం ఓట్లు పోలయ్యాయనే వాదనను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కొట్టిపారేశారు.
‘‘పోలింగ్ తక్కువగా జరడానికి కారణాలు ఉన్నాయి. రాజకీయనాయకులు, సామాజికవేత్తలు వాటిని పరిశీలిస్తారు. ఓటు వేయనివారంతా వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తే అది పూర్తిగా తప్పే’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ మెచ్చిన అరకు కాఫీ అసలు ఆంధ్రప్రదేశ్‌లోకి ఎలా వచ్చింది?
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- టీ20 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా ఆటగాళ్లు బార్బడోస్‌లో ఏం చేస్తున్నారు, ఎప్పుడు తిరిగి వస్తారు?
- రిషి సునక్: కన్జర్వేటివ్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, సునక్ హామీలు ప్రజలకు నచ్చలేదా?
- బ్రిటన్ ప్రధాని కాబోతున్న లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














