ట్రంప్ మీద దాడి అమెరికా ఎన్నికల ప్రచారాన్ని మార్చేయబోతోందా? ట్రంప్ వ్యతిరేక ప్రచార ప్రకటనలను బైడెన్ శిబిరం ఆపేస్తోందా

బైడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సారా స్మిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముఖంమీద రక్తం కారుతుండగా, జనం వైపు చూస్తూ ట్రంప్ పిడికిలి బిగించడం, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను హడావుడిగా స్టేజ్ మీద నుంచి కిందికి దింపడంలాంటివన్నీ కేవలం ఒక చరిత్రగానే కాదు, రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార తీరునూ మార్చే అవకాశం కనిపిస్తోంది.

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఈ ఘటన ప్రభావం కచ్చితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పడి తీరుతుంది.

కాల్పులు జరిపిన వ్యక్తి ఇప్పటికే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ప్రతిదాడిలో చనిపోయారు. ట్రంప్‌పై దాడి ప్రయత్నాన్ని ఒక హత్యాయత్నంగానే తాము భావిస్తున్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ వర్గాలు అమెరికాలో బీబీసీ పార్ట్‌నర్ అయిన సీబీఎస్ న్యూస్‌తో చెప్పాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
అమెరికా

ఫొటో సోర్స్, Reuters

దాడికి గురైన అనంతరం రక్తమోడుతున్న ముఖంతో ఉన్న ట్రంప్ ఫోటోలను ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ ‘‘ఇలాంటి పోరాటయోధుడే అమెరికాకు కావాలి’’ అని క్యాప్షన్ పెట్టారు.

ఘటన జరిగిన కాసేపటికే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ టీవీ స్క్రీన్ మీద కనిపించారు. అమెరికాలో ఇలాంటి రాజకీయ హింసకు తావులేదంటూ ప్రకటన చేశారు.

ట్రంప్‌పై దాడితో తాను తీవ్రంగా కలత చెందినట్లు ప్రకటించిన బైడెన్, తాను ట్రంప్‌తో స్వయంగా మాట్లాడతానని కూడా చెప్పారు.

దాడి జరిగిన కాసేపటికే, జోబైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ అప్పటికే ప్రసారానికి సిద్ధం చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ యాడ్స్‌ను వీలయినంత త్వరగా నిలిపేసే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ సమయంలో ఘటనను ఖండించకుండా, ట్రంప్‌ను విమర్శిస్తూ సిద్ధం చేసిన ప్రకటనలను ప్రసారం చేయడం సముచితం అనిపించుకోదని బైడెన్ టీమ్ భావిస్తోంది.

జో బైడెన్

ఫొటో సోర్స్, AFP

అన్ని రాజకీయ వర్గాలకు చెందిన నేతలు, ట్రంప్ అంటే గిట్టని వారు కూడా ఈ దాడిని ఖండించడానికి ముందుకు వచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు తావులేదంటూ ప్రకటనలు చేస్తున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ లాంటి వాళ్లంతా ఈ చర్యను ఖండించారు.

ట్రంప్ ఈ ప్రమాదం నుంచి బయటపడటం తమకు సంతోషం కలిగించిందని వారు అన్నారు.

నాన్సీ పెలోసీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌ను రెండుసార్లు అభిశంసించడంలో సహకారం అందించిన నాన్సీ పెలోసీ కూడా ట్రంప్‌ మీద జరిగిన దాడిని ఖండించారు.

అయితే, ఈ హింసకు జోబైడెన్‌దే బాధ్యతని కొంతమంది ట్రంప్ సన్నిహితులు, మద్ధతుదారులు ఇప్పటికే విమర్శలు చేశారు.

ఈ హత్యాయత్నం వ్యవహారం దేశంలో పెరుగుతున్న హింసకు నిదర్శనమని రిపబ్లికన్ పార్టీ సభ్యుడొకరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో వ్యాఖ్యానించారు.

ప్రచారంలో బైడెన్ పార్టీ ఉపయోగిస్తున్న పదజాలంతోనే ఇలాంటి ఘటనలకు జరుగుతున్నాయని సెనెటర్ జేడీ వాన్స్ అన్నారు. ఈయన ట్రంప్‌కు బలమైన మద్దతుదారు. రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే వాన్స్ ఉపాధ్యక్షుడవుతారని ఊహాగానాలు ఉన్నాయి.

మరికొందరు రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తుండగా, బైడెన్ వర్గం దానిని తోసిపుచ్చుతోంది. విద్వేషాలు రగిలించే అవకాశం ఉన్న ఇలాంటి ప్రకటనలు సరికాదని అంటోంది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

మొత్తం మీద ఇప్పటికే ఈ ఘటనపై రాజకీయంగా వాదోపవాదనలు, విమర్శలు ప్రతివిమర్శలు సాగుతున్నాయి.

అవి ఎన్నికల ప్రచార సరళిని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)