ట్రంప్‌పై కాల్పులు: సూపర్ స్ట్రాంగ్ భద్రతా వ్యవస్థను బద్దలు కొట్టిన ‘బుల్లెట్’, ఇపుడేం జరగనుంది?

ఫొటో సోర్స్, AP
- రచయిత, ఆంథోనీ జుర్చర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అధ్యక్ష అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ ర్యాలీలో పేలిన బుల్లెట్లు దశాబ్దాలుగా అమెరికాలో ఎంతో పటిష్టంగా ఉంటుందనుకునే భద్రతా వ్యవస్థకు సవాల్ విసిరాయి.
ఈ కాల్పుల ఘటన 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది దేశంలోని సామాజిక, సాంస్కృతిక ఐక్యతను దెబ్బతీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో జాతీయ భద్రతా వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంటుందనుకునే భ్రమ నాటకీయంగా బద్దలైపోయింది.
ఈ కాల్పుల్లో ట్రంప్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. బుల్లెట్ ఆయనకు చాలా దగ్గరి నుంచి వెళ్లింది. న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రికకు చెందిన డౌగ్ మిల్స్ తీసిన ఫోటోలో ట్రంప్ తలకు సమీపంలో ఒక బుల్లెట్ గాలిలో ప్రయాణిస్తున్నట్లు చూపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
'అమెరికా చరిత్రలో చీకటి కాలం'
1981లో రోనాల్డ్ రీగన్‌ను జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి కాల్చి చంపడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత అమెరికాలో ఏ అధ్యక్షుడిపై లేదా అధ్యక్ష అభ్యర్థిపైనా అలాంటి దుశ్చర్యలు జరగలేదు.
అయిదు దశాబ్దాల కిందట అమెరికా చరిత్రలోని చీకటి కాలాన్ని ప్రస్తుత ఘటన మనకు గుర్తు చేస్తుంది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు అయిన కెనడీని కాల్చి చంపారు. ఆ తర్వాత అయిదేళ్లకు అధ్యక్ష అభ్యర్థి అయిన జాన్ ఎఫ్.కెనడీ సోదరుడు రాబర్ట్ ఎఫ్. కెనడీని కూడా కాల్చి చంపారు.
అమెరికన్ పౌర హక్కుల నాయకులు మెడ్గర్ ఎవర్స్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మాల్కం కూడా రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయారు.
1960లలో నాటి అమెరికా...ఇప్పటి అమెరికా మాదిరే పొలిటికల్ పోలరైజేషన్‌తో గందరగోళంగా ఉండేది. తుపాకీ, దాన్ని ఉపయోగించిన వ్యక్తి, చరిత్ర గతిని మార్చగల కాలమది.
అయితే, ఇపుడు జాతీయ ఐక్యతను దెబ్బతీసే వాదోపవాదాలు, విమర్శలు అమెరికాలో జోరుగా నడుస్తున్నాయి. ట్రంప్ పై కాల్పుల ఘటన అమెరికా, దాని రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
షెడ్యూల్ మార్చుకున్న బైడెన్
ఘటన తర్వాత ట్రంప్ ప్రత్యర్థి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదు. ఇది అనారోగ్యకరం. మనం ఇలా ఉండకూడదు, మేము దీనిని సహించబోం." అని అన్నారు.
ట్రంప్‌తో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. వీకెండ్‌ను బీచ్‌లో గడపాలనుకున్న తన ప్రణాళికను రద్దు చేసుకొని, వైట్ హౌస్‌కి తిరిగి వెళ్లాలని బైడెన్ నిర్ణయించుకున్నారు.
ఇటీవలి దశాబ్దాలలో అమెరికన్ రాజకీయాల్లో హింస, దాని మీద చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ దాడికి డెమొక్రటిక్ పార్టీనే కారణమని రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆరోపించారు. డోనల్డ్ ట్రంప్ వల్ల అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని జో బైడెన్ గతంలో హెచ్చరించారు.
ట్రంప్‌ను బైడెన్ ఎలాగైనా అడ్డుకోవాలనుకుంటున్నారని ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థుల జాబితాలో ఉన్న ఒహియో సెనేటర్ జేడీ వాన్స్ సోషల్ మీడియాలో ఆరోపించారు.
"అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న డోనల్డ్ ట్రంప్ నిరంకుశుడనీ, ఫాసిస్ట్ అనీ అంటున్నారు. ఆయనను ఎలాగైనా ఆపాలనేదే బైడెన్ ప్రచార ప్రధాన ఎజెండా. ఆ రకమైన చర్చే నేరుగా ట్రంప్ మీద హత్యాయత్నానికి దారితీసింది." అని వాన్స్ అన్నారు.
"ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత వ్యాఖ్యలకు వామపక్ష కార్యకర్తలు, డెమొక్రటిక్ పార్టీ ఫండ్ రైజర్లు, జో బైడెన్‌ను బాధ్యులను చేయాలి. ట్రంప్ మీద దాడికి కారణం అవే." అని డోనల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార నిర్వాహకుడు క్రిస్ లాసివిటా అన్నారు.
డెమొక్రటిక్ పార్టీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అయితే, 2011లో అరిజోనాలో డెమొక్రటిక్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ సభ్యుడు గాబీ గిఫోర్డ్స్‌పై కాల్పులు జరిపినప్పుడు చాలామంది వామపక్షవాదులు రైట్ వింగ్‌ను నిందిస్తూ ఇలాంటి భాషనే ఉపయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లికన్లు ఘటనను వాడుకోనున్నారా?
పెన్సిల్వేనియా ఘటన సోమవారం నుంచి మిల్వాకీలో ప్రారంభమయ్యే రిపబ్లికన్ పార్టీ సమావేశంపై ప్రభావాన్ని చూపవచ్చు. అక్కడ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు కఠినతరం చేస్తారు. వేదికల వద్ద నిరసనలు లేదా ప్రతిఘటనలు కొత్త పద్దతిలో ఉండవచ్చు.
ప్రజలను ఆకర్షించడానికి రక్తసిక్తంగా, పిడికిలి బిగించి కనిపించే ట్రంప్ ఫోటోలు రిపబ్లికన్ పార్టీకి ఒక సాధనంగా ఉపయోగపడతాయి. శనివారం నాటి సంఘటన వారిలో కొత్త శక్తిని ఇస్తుంది.
ఇదిలా ఉండగా డోనల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కాల్పుల అనంతరం తన తండ్రి ఫోటోతో సోషల్ మీడియాలో ‘అమెరికాకు కావాల్సింది ఇలాంటి పోరాటయోధుడే ’ అని పోస్టు చేశారు.
ట్రంప్ మీద దాడి ఘటన తర్వాత ట్రంప్ ర్యాలీ భద్రత నిర్వహణలో అమెరికా సీక్రెట్ సర్వీస్ కూడా సవాల్ ఎదుర్కోనుంది. ఎందుకంటే వారి భద్రతా వలయాన్ని ఛేదించి ఒక వ్యక్తి అధ్యక్ష అభ్యర్థిపైకి తుపాకీ ఎక్కుపెట్టే దాకా వచ్చారు.
ఈ ఘటనపై తన చాంబర్ సమగ్ర విచారణ జరుపుతుందని, విచారణ పూర్తి చేసేందుకు సమయం పడుతుందని అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ హామీ ఇచ్చారు.
మొత్తానికి ఈ ఏడాది ఎన్నికల వాతావరణంతో అమెరికా రాజకీయాలు ఒక కొత్త, భయంకరమైన మలుపు తీసుకున్నాయని స్పష్టం అవుతోంది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














