డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులు: ‘దుండగుడు భవనంపై ఉన్నాడని చూపిస్తున్నా పోలీసులు అర్థం చేసుకోలేదు’ - ప్రత్యక్ష సాక్షులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది.
ట్రంప్ మీద కాల్పులు జరిపిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు. అతడు ట్రంప్ ర్యాలీ జరిగిన ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలోని బేథల్ పార్క్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని ఎఫ్‌బీఐ చెప్పింది.
ఈ దాడి వెనుక ఉద్దేశం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని దర్యాప్తు సంస్థ తెలిపింది.
ట్రంప్ మీద కాల్పులు జరగడానికి కొన్ని నిమిషాల ముందు వేదికకు ఎదురుగా ఉన్న ఒక భవనంపై ఓ వ్యక్తి మోచేతుల మీద పాకడాన్ని చూసినట్లు ప్రత్యక్ష సాక్షి బీబీసీకి చెప్పారు.
‘‘అతని దగ్గర రైఫిల్ ఉంది. అతని చేతిలో తుపాకీ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. మేం అతనివైపు చూపిస్తుంటే, పోలీసులు కింద అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ఆ భవనంపై ఒక వ్యక్తి రైఫిల్‌తో ఉన్నాడని మేం చెబుతున్నాం. పోలీసులు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కానట్లు చూశారు. ఆ కప్పు మీద వ్యక్తి స్పష్టంగా కనిపిస్తున్నాడు, తన దగ్గర తుపాకీ ఉంది. తను పాకుతున్నాడని చూపించాం. ట్రంప్ ఇంకా ఎందుకు ప్రసంగం కొనసాగిస్తున్నాడు? సీక్రెట్ సర్వీస్ ఆయన్ను వేదిక నుంచి దూరంగా ఎందుకు తీసుకెళ్లడం లేదు? అని నేను ఆలోచిస్తున్నాను. నేను అక్కడ రెండు మూడు నిమిషాల వరకూ పైకప్పు మీద ఉన్న వ్యక్తిని చూపించి సైగలు చేస్తున్నాను. సీక్రెట్ సర్వీస్ కూడా మావైపు చూస్తోంది. నేను పైకప్పు వైపు చూపించాను. అప్పుడే ఐదు సార్లు కాల్పుల శబ్దం వినిపించింది’’ అని ప్రత్యక్ష సాక్షి గ్రెగ్ స్మిథ్ చెప్పారు.

మరో ప్రత్యక్ష సాక్షి రియాన్ నైట్ తనకు 4-5 షాట్స్ వినిపించాయని చెప్పారు.
‘‘నేను అక్కడ కూర్చుని ఉన్నాను. ఒక వ్యక్తితో గట్టిగా ఓ.. గాడ్, అతని దగ్గర తుపాకీ ఉంది అన్నాను. నేను పైకి చూస్తే అక్కడ భవనం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. తను ఎం-16 పట్టుకుని ఉన్నాడు. దాన్ని మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు గురిపెట్టి ఉన్నాడు. తను కాల్పులు ప్రారంభించాడు. ధన్, ధన్, ధన్, ధన్. సుమారు 4-5 షాట్స్ వినిపించాయి. నా వెంట జిమ్ ఉన్నారు. తనను కిందికి తోసేశా. నేను కూడా కింద పడుకున్నా. తర్వాత పైకి చూసేసరికి, సీక్రెట్ సర్వీస్ అధికారులు కాల్పులు జరిపారు, అవి ఆ దుండగుడికి తగిలాయి’’ అని ప్రత్యక్ష సాక్షి రియాన్ నైట్ వివరించారు.
కాల్పులు జరిగిన తర్వాత అక్కడ స్థితి అల్లకల్లోలంగా మారిందని బెన్ మేసర్ చెప్పారు.
‘‘నేను ఫెన్స్ లైన్ దగ్గర ఉన్నాను. అప్పుడే ఓ వ్యక్తి ఒక పైకప్పు నుంచి మరో పైకప్పు మీదికి వెళ్లడం చూశా. నేను ఒక సెక్యూరిటీ ఆఫీసర్‌తో పైకప్పు మీద ఎవరో ఉన్నారని చెప్పాను. ఆ అధికారి పరిశీలించడానికి వచ్చారు. తర్వాత నేను ఉన్న చోటుకే తిరిగి వచ్చేశా. అతడు అందరికీ కనిపించేలా ఉన్నాడు. తర్వాత మళ్లీ వాళ్లు నిలబడ్డ చోటుకు వచ్చా. నేను ఆ వ్యక్తిని చూశాను. తిరిగి వచ్చి అధికారులకు మళ్లీ చెప్పాను. మీరు మళ్లీ అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి స్పష్టంగా కనిపిస్తాడని చెప్పాను. వాళ్లు రేడియోలో ఆ సమాచారం అందిస్తారని అనుకున్నాను. నేను వెళ్లిపోడానికి వెనక్కి తిరుగుతుంటే, కాల్పుల శబ్దం వినిపించింది. తర్వాత అక్కడంతా అల్లకల్లోలంగా మారింది. అందరూ అటూ ఇటూ పరుగులు తీశారు’’ ప్రత్యక్షసాక్షి బెన్ మేసర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆ దుండగుడిని కాల్చి చంపారని, వెంటనే రక్షణాత్మక చర్యలు చేపట్టారని సీక్రెట్ సర్వీస్ కమ్యూనికేషన్ చీఫ్ ఆంథొనీ గుగ్లియేమీ చెప్పారు.
ర్యాలీలో పాల్గొన్న ఒక వ్యక్తి దుండగుడి కాల్పుల్లో మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.
బుల్లెట్ తన కుడి చెవి పైభాగాన్ని రాసుకుంటూ వెళ్లిందని పెన్సిల్వేనియాలో ర్యాలీ తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
‘‘నా చెవుల దగ్గర కరకు శబ్దం వినిపించింది. బుల్లెట్ నా చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్లినట్లు అనిపించింది’’ అని ట్రంప్ చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














