యోగి ఆదిత్యనాథ్: యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బతో ఈ అగ్రనేత రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందా?

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ 2024లో మాత్రం పాతకథను పునరావృతం చేయలేకపోయింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ కంటే సమాజ్‌వాదీ పార్టీ ఎక్కువ లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. అనేక కీలక స్థానాల్లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

యూపీలో బీజేపీ వైఫల్యంతో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే వాటిలో అతి ముఖ్యమైనది, ఈ ఫలితాల ప్రభావం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితంపై ఎలా ఉండబోతోంది? అన్నదే.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ముందు వరకూ, మరీముఖ్యంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలో భారీ మెజార్జీతో ఘనవిజయం సాధించిన తర్వాత, కొన్ని రాజకీయ వర్గాలు యోగి ఆదిత్యనాథ్‌ను భవిష్యత్ జాతీయ నాయకుడిగా చూడడం మొదలుపెట్టాయి.

కానీ, ఇప్పుడు బీజేపీ వైఫల్యానికి యోగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

గోరఖ్‌పూర్ మఠాధిపతి, అక్కడి మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్తు గురించి చర్చించే ముందు, ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు

ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యారంటే....

ఇది 2017 మార్చి 17 నాటి సంఘటన. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆరు రోజులైనా రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇంకా ఖరారు కాలేదు.

టెలికాం మంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ ప్రసాద్ మౌర్య సీఎం రేసులో ముందంజలో ఉన్నారని టీవీ చానెళ్లలో ప్రచారం జరిగింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు మనోజ్ సిన్హా లఖ్‌నవూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, తన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోగ్యం క్షీణించిందని, ఆయన్ను దిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారని...ఇలా అనేక వార్తలొచ్చాయి.

అదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ దిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వచ్చారు. ఆ వెంటనే ఆయన ఫోన్ మోగింది. అవతలివైపు అప్పటి బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడెక్కడున్నారని ఆయన యోగిని అడిగారు. గోరఖ్‌పూర్‌లో ఉన్నానని చెప్పగానే...వెంటనే దిల్లీ రావాలని షా చెప్పారు. ఇప్పటికిప్పుడు దిల్లీ వచ్చేందుకు ఫ్లైట్‌గానీ, ట్రైన్‌గానీ లేవని యోగి చెప్పారు.

మరుసటి రోజు ఉదయం, యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక విమానంలో దిల్లీకి వచ్చిన వెంటనే 11, అక్బర్‌ రోడ్డులోని అమిత్‌ షా నివాసానికి కాకుండా, నేరుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసానికి తీసుకెళ్లారు.

యోగిని కలిసేందుకు అమిత్ షా అక్కడికి వచ్చారు. యూపీకి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాలని అక్కడ అధికారికంగా యోగికి చెప్పారు.

యోగి, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

సీఎంగా యోగి పేరు ఎలా ఖరారైంది?

యోగిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయడానికి కారణమేంటి? అని ఇటీవల ప్రచురితమైన 'ఎట్ ది హార్ట్ ఆఫ్ పవర్, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్' పుస్తక రచయిత, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్‌లాల్ యాదవ్‌ను నేను అడిగా.

''యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, మనోజ్ సిన్హా, దినేష్ శర్మ వంటి ఐదు పేర్లు పరిగణలోకి తీసుకున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి ఆయన బలమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఓబీసీ కోణం నుంచి చూస్తే, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ ప్రసాద్ మౌర్య బలంగా ఉన్నారు.'' అని ఆయన చెప్పారు.

అయితే, ఎన్నో చర్చల తర్వాత యోగిని పార్టీ ఎంపిక చేసింది.

''అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే, యోగి ఒక బాబా కావడంతో సీఎం అభ్యర్థిగా సహజంగానే పేరు ముందు వరుసలోకి వచ్చింది. రెండోది, సైద్ధాంతికపరంగా, కరుడుగట్టిన హిందూత్వ విధానాలవైపు వెళ్లడానికి బీజేపీలో ప్రయత్నాలు జరుగుతున్న ఆ సమయంలో దానికి యోగి సరిగ్గా సరిపోయేలా కనిపించారు. అలాగే, ఆర్ఎస్‌ఎస్ మద్దతు కూడా ఉంది.'' అని శ్యామ్‌లాల్ అన్నారు.

యోగి
ఫొటో క్యాప్షన్, బీబీసీ ఆఫీస్‌లో సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ లాల్ యాదవ్‌(కుడివైపు)తో రేహాన్ ఫజల్

ఎంపీల గ్రూప్ నుంచి యోగి పేరు తీసేశారు..

అయితే, యోగి సన్నిహితులు కొద్దిరోజుల ముందు ఏదో జరగబోతుందని పసిగట్టారు. మార్చి 4న యూపీలో, ఆరో దశ ఎన్నికల్లో భాగంగా గోరఖ్‌పూర్ ఎన్నికలు పూర్తయిన వెంటనే అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుంచి యోగికి ఫోన్ వచ్చింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వెళ్లేందుకు ఆహ్వానం అందింది.

యోగి జీవిత చరిత్ర రాసిన ప్రవీణ్ కుమార్ తన పుస్తకంలో దీని గురించి ఇలా రాశారు. '' భారత ఎంపీల బృందం న్యూయార్క్ మీదుగా ట్రినిడాడ్ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు వెళ్తోంది. యోగి పాస్‌పోర్ట్‌లో ట్రినిడాడ్ వీసా పెట్టారు. కానీ, ఆ పర్యటనకు వెళ్తున్న ఎంపీల జాబితా నుంచి చివరి నిమిషంలో ఆయన పేరు తొలగించినట్లు యోగికి చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు జాబితా నుంచి తొలగించినట్లు తెలిసింది.''

సీఎం అయిన చాలా రోజుల తర్వాత, ఒకసారి యోగి మాట్లాడుతూ చివరి నిమిషంలో తన పేరును తొలగించడంతో నిరాశకు గురయ్యానని ఆయన అంగీకరించారు. అయితే, దాని వెనకున్న అసలు కారణం ఆయనకు ఆ తర్వాత తెలిసింది.

అప్పటి వరకూ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా లో-ప్రొఫైల్ నేతల వైపే నరేంద్ర మోదీ మొగ్గు చూపేవారు. కానీ, అందుకు భిన్నంగా యోగి పేరును ఆమోదించడం కాస్త అసాధారణమే. ఎందుకంటే, ఆయన కూడా మోదీలానే ప్రజాదరణ కలిగిన హిందూత్వ నాయకుడు.

కానీ, ఆయన వయసు, హిందూత్వ పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఆయన పేరును ఆమోదించింది.

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, TIMES GROUP BOOKS

యోగి ఇన్నింగ్స్ ప్రారంభం

'దేశంలో మోదీ, యూపీలో యోగి' అనే నినాదంతో యోగి ఆదిత్యనాథ్ తన ఇన్నింగ్స్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే యూపీ సెక్రటేరియట్ అనుబంధ భవనాలకు కాషాయ రంగు వేశారు.

అనంతరం ఆయన ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. దాని ప్రకారం, మతాంతర వివాహం లేదా మతమార్పిడికి కనీసం రెండు నెలల ముందు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి.

హిందూత్వ ఇమేజ్‌ను బలపరిచే ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు యోగి.

2018 అక్టోబర్ 16న అలహాబాద్ జిల్లా పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. మూడు వారాల తర్వాత ఫైజాబాద్‌ను అయోధ్యగా మార్చారు.

బిజ్నోర్‌లో ప్రసంగిస్తూ, ''ఇప్పుడు ఏ జోదా బాయ్ అక్బర్‌తో వెళ్లదు'' అని ప్రకటించారు.

యోగి ప్రభుత్వం మరో కొత్త ప్రయోగం చేసింది. సీఏఏ నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగడంతో ఆ నిరసనల్లో పాల్గొన్న వారిపై జరిమానా విధించింది.

'యోగి ఆదిత్యనాథ్, రిలిజియన్, పాలిటిక్స్ అండ్ పవర్, ది అన్‌టోల్డ్ స్టోరీ'లో శరత్ ప్రధాన్, అతుల్ చంద్ర ఇలా రాశారు.

''2019 మార్చిలో లఖ్‌నవూ పోలీసులు 57 మంది నిరసనకారులపై చర్యలు ప్రారంభించారు. నిరసనకారుల పేర్లు, వారి ఫోటోలు, వివరాలను బహిరంగంగా, హోర్డింగులపై ప్రదర్శించడం ప్రారంభించారు. ఈ చర్యలన్నీ ఆయన్ను ఆర్ఎస్‌ఎస్‌ను ఆకట్టుకున్నాయి.''

అయితే, ప్రభుత్వ నిర్ణయం సరికాదని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. అలా ఏర్పాటు చేసిన హోర్డింగులను తొలగించాలని 2020 మార్చిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాంటి పోస్టర్లు వేయడమంటే పౌరుల గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని, నిరసన తెలపడమనేది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కుగా పేర్కొంది.

బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

యోగిని తప్పించే ప్రయత్నం విఫలం

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, యోగిని తప్పించే సమయం ఆసన్నమైందని కేంద్రం దాదాపు నిర్ణయించుకుందని, అయితే, దానిని ఆయన ఆపగలిగారని శ్యామ్‌లాల్ యాదవ్ తన పుస్తకంలో రాశారు.

శ్యామ్‌లాల్ యాదవ్ మాట్లాడుతూ, '' అసెంబ్లీ ఎన్నికలకు అప్పటికి 9 నెలలు మాత్రమే మిగిలివుంది. ఉప ముఖ్యమంత్రి మౌర్యతో విభేదాలు ఉన్నాయని వార్తలొచ్చాయి. అయితే, ఆర్ఎస్ఎస్ నేతల జోక్యంతో వెంటనే మౌర్య ఇంటికి వెళ్లారు యోగి. అప్పటికే యోగి పార్టీని మించి ప్రజాదరణ సాధించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయన్ను ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు.'' అని ఆయన చెప్పారు.

''అంచనాలు పెరిగిపోవడంతో, యోగిని తప్పించేందుకు ఇది సరైన సమయం కాదని పార్టీ అగ్రనాయకత్వం భావించింది. లఖ్‌నవూలో ప్రధాని నరేంద్ర మోదీతో యోగీ భేటీతో ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడింది. మోదీతో కలిసి ఉన్న ఫోటోను యోగి షేర్ చేశారు. అందులో యోగి భుజంపై మోదీ చేయి వేసి వుంది. 'మేం ప్రతిజ్ఞ చేశాం, మా శరీరాన్ని, మనస్సును అంకితం చేసి, ఆకాశాన్ని దాటి, మరో ఉషోదయం కోసం బయలుదేరాం’’ అని రాశారు'' అని శ్యామ్‌లాల్ పేర్కొన్నారు.

ఆ తర్వాత జరిగిన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నేతృత్వంలో బీజేపీ విజయం సాధించింది.

యోగి, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

బుల్డోజర్, ఎన్‌కౌంటర్

2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయానంతరం, ముఖ్యమంత్రి యోగి శాంతిభద్రతలను, నేరస్తుల అణచివేతను తన గుర్తింపుగా మార్చుకున్నారు.

ఇందులో భాగంగా అలహాబాద్‌కు చెందిన అతీక్‌ అహ్మద్‌, గాజీపూర్‌కు చెందిన ముఖ్తార్‌ అన్సారీ, భదోహికి చెందిన విజయ్‌ మిశ్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్రంలో 'బుల్‌డోజర్', 'ఎన్‌కౌంటర్' అనే కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. రాంపూర్‌కి చెందిన ప్రముఖ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌పై కూడా యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

బుల్డోజర్ యోగి ఐడెంటిటీగా మారింది. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యోగిని అనుసరించారు.

శ్యామ్‌లాల్ యాదవ్ వివరిస్తూ, ''చౌదరి చరణ్ సింగ్ కాలం నుంచి, పశ్చిమ యూపీలో జాట్‌లు, ముస్లింల కూటమి చాలా బలంగా ఉండేది. కానీ, 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్ల కారణంగా అది విచ్ఛిన్నమైంది. సీఏఏ నిరసనకారుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై యోగి చేసిన వ్యాఖ్యలు ఆయన మద్దతుదారుల్లో బలమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ చర్యల కారణంగా ఆయన పార్టీ ఓటర్లకు బాగా దగ్గరయ్యారు. ఇది ఆయనకు ఎన్నికల్లో లాభించింది.'' అన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయడంతో పాటు రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి సీఎంగా ఆయన చరిత్రకెక్కారు.

పార్టీలోనూ ఆయన స్థాయి పెరిగి జాతీయ స్థాయి నాయకుడిగా కనిపించడం మొదలైంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన క్యాంపెయినర్‌గా వ్యవహరించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదు.

కేంద్ర నాయకత్వంతో విభేదాలు

పార్టీ అగ్ర నాయకత్వానికి, యోగి ఆదిత్యనాథ్‌కు మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయపడనున్నాయనే చర్చలు ఊపందుకున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శనకు యోగి ఆదిత్యనాథ్ ఎంతవరకూ బాధ్యులని రాజకీయ విశ్లేషకులు అభయ్ కుమార్ దుబేని నేను అడిగా.

''ఆయనపై ఉన్న బాధ్యతలను బట్టి యోగి ఆదిత్యనాథ్ ఎంతవరకూ బాధ్యులవుతారనే విషయంపై సమీక్ష చేయగలం. ఈ లోక్ సభ ఎన్నికలను పూర్తిగా బీజేపీ కేంద్ర నాయకత్వమే పర్యవేక్షించింది. పగ్గాలన్నీ అమిత్‌ షా చేతిలోనే ఉన్నాయి. టిక్కెట్లు కూడా ఆయనే ఖరారు చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని అమిత్ షానే స్వయంగా పర్యవేక్షించారు'' అని దుబే అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ, ''యోగికి అప్పగించిన పనేంటంటే, స్టార్ క్యాంపెయినర్‌గా యూపీ మొత్తం తిరిగి మత ప్రాతిపదికన ఓటర్లను ఏకం చేసే ప్రయత్నం చేయడం. అది ఆయన చేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారు కనుక ఓటమికి ఆయన బాధ్యులు కారు. ఈ ఓటమికి యోగిని బాధ్యుడిని చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది కచ్చితంగా కుట్ర'' అన్నారు.

అనుప్రియా పటేల్
ఫొటో క్యాప్షన్, అనుప్రియా పటేల్

'యోగి'ని తప్పిస్తారా?

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, యూపీ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోవడం బీజేపీ నాయకత్వానికి కష్టమే. ముఖ్యంగా ఉత్తరాఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, దిల్లీ వంటి యూపీ పక్కనే ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ఫలితాలొచ్చాయి.

2019 పార్లమెంట్ ఎన్నికలు, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాల తర్వాత యోగి ఆదిత్యనాథ్‌కు జాతీయ స్థాయిలో అవకాశాల గురించి కొన్నివర్గాల్లో ఆలోచనలు వచ్చాయి. బీజేపీ తరువాతి తరం నాయకుడిగా కనిపించారు. అయితే, ఇటీవలి లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఆ అవకాశాలకు తెరపడినట్టేనా?

దీనిపై అభయ్ కుమార్ దుబే మాట్లాడుతూ, ''యోగికి వ్యతిరేకంగా అనుప్రియా పటేల్ రాసిన లేఖ, అది మీడియా చేతికి వెళ్లిన తీరే ఎవరో ప్రోద్బలంతో జరిగిందనేందుకు నిదర్శనం. యోగి ఆదిత్యనాథ్ పాలనలో మహిళలు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారు. అలాంటిది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల నివేదిక విడుదల చేసింది. అది మహిళలపై జరుగుతున్న నేరాల్లో యూపీ ఎంత ముందుందో తెలియజేస్తుంది.'' అన్నారు.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాల ప్రజలకు ఉపాధి కల్పన విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ రాసిన బహిరంగ లేఖను అభయ్ దుబే ప్రస్తావించారు.

''యోగికి రాజకీయంగా కలిసొచ్చే అంశాలను దెబ్బతీసేందుకు ఇలాంటివి తీసుకొస్తున్నారు. బుల్డోజర్, ఎన్‌కౌంటర్ మోడల్ ఉన్నంత కాలం ఆయన విశ్వసనీయతకు ఎలాంటి భంగం కలగదు.'' అని దుబే చెప్పారు.

బీజేపీ ఎప్పుడూ యోగి సామర్థ్యాన్ని అంచనా వేస్తూనే ఉంటుందని, మరోసారి ఆ ప్రక్రియ కొనసాగుతోందని అభయ్ దుబే అన్నారు.

''ఈరోజు బీజేపీ అగ్ర నాయకత్వంలో ఆయనపై విముఖత ఎక్కువైంది. ఎన్నికల్లో చేయాల్సినంత సాయం చేయలేదని అంటున్నారు. ఆయన బీజేపీ గొంతుకి అడ్డంగా ఇరుక్కున్నారు. కక్కలేరు, మింగలేరు'' అని దుబే అన్నారు.

రానున్న రోజుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వానికి, యోగి ఆదిత్యనాథ్‌కు మధ్య సంబంధాలు మెరుగుపడతాయా? లేక ఈ టెన్షన్ మరింత ముదురుతుందా అనే విషయాలను రాజకీయ విశ్లేషకులు ఓ కంటకనిపెడుతున్నారు.

( బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)