అగ్నివీర్: మాజీలకు 10% రిజర్వేషన్లు, ఏయే ఉద్యోగాలకు వర్తిస్తుందంటే...

ఫొటో సోర్స్, Getty Images
- ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం 2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా నియమితులైన వారిని అగ్నివీర్‌లు అంటారు.
- ఈ పథకం ప్రకారం, సైన్యంలో చేరిన 75 శాతం మంది అగ్నివీర్‌లు నాలుగేళ్ల తర్వాత రిటైర్ అవుతారు.
- అగ్నివీర్‌లను ప్రభుత్వం వాడుకుని వదిలేసేందుకు చూస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.
- అవసరమైతే ఈ పథకంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిరుడు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
సెంట్రల్ ఆర్మ్‌డ్ సెక్యూరిటీ ఫోర్సెస్ రిక్రూట్‌మెంట్ (కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో)లో మాజీ అగ్నివీరులకు 10 శాతం సీట్లను రిజర్వ్ చేయాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) వంటి భద్రతా దళాల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తారు.
దీని ప్రకారం, అగ్నివీర్‌గా రిటైర్ అయిన సైనికులకు వయోపరిమితితోపాటు శరీర దారుఢ్య పరీక్షల్లోనూ సడలింపు ఇవ్వనున్నారు.
భారత సైన్యంలోని మూడు విభాగాలు సైనికులు, వాయుసేన, నౌకాదళంలో నియామకాల కోసం 2022లో ప్రభుత్వం ఈ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ స్కీమ్ ప్రకారం సైన్యంలో చేరిన అగ్నివీర్‌ల పదవీ కాలం నాలుగేళ్లు. ఆ తర్వాత వారిలో 25 శాతం మందిని సైన్యంలో కొనసాగిస్తారు. మిగిలిన 75 శాతం మంది సైన్యం నుంచి రిటైర్ కావాల్సి ఉంటుంది.
ఈ పథకంపై ప్రతిపక్షం ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించింది. సైన్యం శిక్షణ పొందిన అగ్నివీర్‌లు రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనే దానిపై ఒక ప్రణాళిక ఉండాలని అంటోంది.
ఇటీవల, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నేత అయిన తర్వాత, మరోసారి అగ్నివీర్ అంశాన్ని సభలో లేవనెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని ఆయన అన్నారు.
అయితే, కేంద్ర బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంపై కొందరిలో ఆశలు చిగురించగా, మరికొందరు దీని వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో చూడాలని అంటున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
రిజర్వేషన్ కల్పిస్తూ సీఐఎస్‌ఎఫ్ ప్రకటన
కేంద్ర బలగాల్లో మాజీ అగ్నివీర్‌ల నియామకాలకు సంబంధించి హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుందని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ - సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
''దానికి అనుగుణంగా మాజీ అగ్నివీర్‌ల నియామకం కోసం సీఐఎస్‌ఎఫ్ అన్ని ఏర్పాట్లూ చేసింది. కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో 10 శాతం సీట్లను మాజీ అగ్నివీర్‌ల కోసం సీఐఎస్‌ఎఫ్ రిజర్వ్ చేసింది.'' అని ఆమె పేర్కొన్నారు.
''ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (శరీర దారుఢ్య పరీక్షలు)లో సడలింపు ఉంటుంది. గరిష్ట వయోపరిమితిలో మొదటి ఏడాది ఐదేళ్లు, ఆ తర్వాతి నియామకాల్లో మూడేళ్ల సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్‌లకు ఈ ప్రయోజనాలు కల్పించేందుకు సీఐఎస్‌ఎఫ్ కట్టుబడి ఉంది.'' అని ఆమె చెప్పారు.

బీఎస్‌ఎఫ్ ప్రకటన..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ ప్రభుత్వ వార్తా సంస్థ దూరదర్శన్‌తో మాట్లాడుతూ, బీఎస్‌ఎఫ్ రిక్రూట్‌మెంట్‌లో 10 శాతం పోస్టులు మాజీ అగ్నివీర్‌లకు రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు.
''కట్టుదిట్టమైన క్రమశిక్షణలో, నాలుగేళ్లపాటు కష్టపడి అనుభవం సంపాదించిన అగ్నివీర్‌లు బీఎస్‌ఎఫ్‌కు సరిపోతారు. ఒకరకంగా రెడీమేడ్ సైనికులు మాకు దొరుకుతున్నట్లే.'' అని ఆయన అన్నారు.
''అవసరమైన కొద్ది శిక్షణ ఇచ్చిన తర్వాత మేం వెంటనే వారిని సరిహద్దుల్లో మోహరించవచ్చు. వాళ్ల కోసం మేం ఎదురుచూస్తున్నాం.'' అని ఆయన అన్నారు.
బీఎస్‌ఎఫ్‌లోని మొత్తం ఖాళీల్లో 10శాతం వారికి రిజర్వ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
సశస్త్ర సీమా బల్
అగ్నివీర్ కోటా గురించి సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌధరి పీటీఐతో మాట్లాడారు.
నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం కోటా కల్పించామని.. సశస్త్ర సీమా బలగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశామన్నారు.
"మొదటి బ్యాచ్‌కు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండదు.'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్..
రైల్వే పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ, ''భవిష్యత్తులో కానిస్టేబుల్ స్థాయిలో ఏ నియామకాలు జరిగినా అగ్నివీర్‌లకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్‌తో పాటు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.'' అని చెప్పారు.
"2026 డిసెంబర్ నుంచి 2027 జనవరి మధ్య సైన్యం నుంచి పదవీ విరమణ పొందే మొదటి బ్యాచ్ అగ్నివీర్‌లకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. తర్వాతి బ్యాచ్‌లకు మూడేళ్ల వయోపరిమితి వర్తిస్తుంది. అగ్నివీర్‌ల రాక ఆర్పీఎఫ్‌కి కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తుంది.'' అన్నారాయన.
సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిశ్ దయాళ్ సింగ్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం సీఆర్పీఎఫ్‌కి ప్రయోజనకరమని, తద్వారా సైన్యం వద్ద శిక్షణ పొందిన వ్యక్తులు సీఆర్పీఎఫ్‌లోకి వస్తారని అన్నారు.
అందుకు తగిన ఏర్పాట్లు చేశామని, నియామకాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు.
''అప్పటికే అగ్నివీర్‌గా శిక్షణ పొందిన వ్యక్తి మొదటి రోజు నుంచే మా బలగాల్లో భాగమవుతారు.'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యువత ఏమంటోంది?
ఆర్మీ నుంచి రిటైర్ అయిన మనీశ్ కుమార్ బిహార్‌లోని మోతిహారీలో యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన క్యాంప్‌లో ఆర్మీ, పోలీస్, ఇతర ఉద్యోగాల కోసం యువతకు శిక్షణ ఇస్తారు.
బీబీసీ ప్రతినిధి చందన్ కుమార్ జజ్‌వారేతో మనీశ్ కుమార్ మాట్లాడుతూ, ''మా దగ్గర 70 మంది వివిధ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్నారు. ఈ కొత్త ప్రకటన వల్ల అగ్నిపథ్ స్కీమ్‌లో భారీ మార్పులు వస్తాయని నేను అనుకోవడం లేదు.'' అన్నారు.
మనీశ్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్న యువకుడు అమర్జీత్ కుమార్ మాట్లాడుతూ, ''ఇది సరైన నిర్ణయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆర్మీ పాత రిక్రూట్‌మెంట్ విధానమే ఉత్తమం. 10 శాతం కాకపోతే 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చు. లేదంటే రిటైర్ అయిన అగ్నివీర్‌లందరికీ ఇతర శాఖల్లో నేరుగా ఉద్యోగాలు ఇవ్వొచ్చు. అది వేరే విషయం.'' అన్నారు.
''ప్రభుత్వం కొత్త ప్రకటన చేసింది. దానివల్ల ఎంత ప్రయోజనముందో చూడాలి. మిగిలిన ఉద్యోగాల్లోనూ ప్రభుత్వం ఈ మినహాయింపు ఇస్తే బావుండేది.'' అని మరో యువకుడు చిత్తరంజన్ కుమార్ అన్నారు.
సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి వాటిలో జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లలోపే. మరి 25 ఏళ్లకి పదవీ విరమణ పొందే అగ్నివీర్‌లు ఈ ఉద్యోగాలకు ఎలా సిద్ధమవుతారు? అని చిత్తరంజన్ ప్రశ్నించారు.
మరో యువకుడు రవిరంజన్ మాట్లాడుతూ, ''మంచి నిర్ణయమే. రిటైర్మెంట్ తర్వాత అగ్నివీర్ ఇంట్లో కూర్చోలేడు కదా. ఏదో ఒకటి చేయాలి. 10 శాతం అవకాశం కల్పించినా, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు.'' అన్నారు.

ప్రభుత్వంపై రాహుల్ ముప్పేటదాడి
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాయి.
అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది.
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కొద్దిరోజుల కిందట అగ్నివీర్ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ''ప్రభుత్వం వారిని అమరవీరులుగా సంబోధించదు. 'అగ్నివీర్' అని మాత్రమే అంటుంది. వారికి పెన్షన్, పరిహారం, అమరవీరుల హోదా వంటివి ఉండవు. సాధారణ సైనికులకు పెన్షన్ సౌకర్యం ఉంది. అలాగే వారికి భారత ప్రభుత్వం సాయమందిస్తుంది. కానీ, అగ్నివీరులను సైనికులుగా పరిగణించదు. అగ్నివీర్‌లను వాడుకుని వదిలేసే కూలీలుగా చూస్తోంది.'' అని విమర్శించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, ఆయన తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా, రాహుల్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు.
అవసరమైతే అగ్నివీర్ స్కీమ్‌లో మార్పులు చేస్తామని నిరుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంంలోకి రాకముందే దాని మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్ అగ్నిపథ్ పథకాన్ని పున:పరిశీలించాలని బహిరంగంగానే డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, ANI PHOTO/SANSAD TV
'అగ్నివీర్' అంటే ఎవరు?
2022లో కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకొచ్చింది. భారత సైన్యంలోని మూడు విభాగాలైన సైన్యం, వాయుసేన, నౌకాదళాలకు సంబంధించిన నియామకాల కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ స్కీమ్ కింద నియమితులయ్యే సైనికుడిని 'అగ్నివీర్' అని వ్యవహరిస్తారు. వారి పదవీకాలం నాలుగేళ్లు.
అగ్నివీర్ పథకం తీసుకొచ్చిన తర్వాత, గతంలో ఉన్న నియామక ప్రక్రియలను భారత రక్షణ శాఖ నిలిపివేసింది.
అగ్నిపథ్ పథకం ప్రకారం, నాలుగేళ్లు పూర్తయిన తర్వాత అగ్నివీరులలో 25 శాతం మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల సర్వీస్ అనంతరం పదవీ విరమణ పొందుతారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల అనంతరం ఆర్మీలోని మూడు విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, ANI
'అగ్నివీర్'పై నేపాల్‌లోనూ వ్యతిరేకత
అగ్నివీర్ స్కీమ్‌పై లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేసినప్పుడు, పొరుగు దేశం నేపాల్‌లోనూ ఇది చర్చనీయాంశమైంది.
భారత ప్రభుత్వం రెండేళ్ల కిందట అగ్నిపథ్ పథకం కింద నియామకాలు ప్రారభించినప్పుడు, భారత సైన్యంలో చేరొద్దని తమ యువతకు నేపాల్ సూచించింది.
అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది.
దీని కారణంగా రెండు దేశాల మధ్యనున్న రెండొందల ఏళ్ల నాటి సైనిక సంబంధాల వారసత్వం ప్రమాదంలో పడిందని కూడా కొందరు విశ్లేషకులు అన్నారు.
( బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














