కల్కి సినిమాలో కనిపించిన నెల్లూరు జిల్లా ఆలయం ప్రత్యేకత ఏమిటి

పెరుమాళ్లపాడు ఆలయం

ఫొటో సోర్స్, BBC/THULASIPRASAD REDDY

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలైన తరువాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పల్లెటూరు చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది.

కల్కి సినిమాలోని ఒక సన్నివేశంలో కనిపించిన దేవాలయమే దీనికి కారణం.

నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడులో ఆ దేవాలయం ఉందంటూ చాలా వీడియోలు, ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అలా పెరుమాళ్లపాడు ఫేమస్ కావడంతోపాటు చాలా మంది యూట్యూబర్లు, ప్రజలు ఈ ఆలయాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు.

బీబీసీ బృందం ఆ ప్రాంతానికి వెళ్లేసరికి వ్లాగర్లు, సందర్శకులతో హడావుడిగా కనిపించింది.

‘‘కల్కి సినిమాలో చూశాను. అసలు ఇక్కడ ఏముందో తెలుసుకుని వీడియో చేద్దామని వచ్చా’’ అని విష్ణువర్దన్ అనే యూట్యూబర్ చెప్పారు.

పెరుమాళ్లపాడులో గుడి ఉన్నది నిజమే. కొన్నేళ్ల కిందట ఇది ఇసుకలో కూరుకుపోయింది.

సుమారు మూడేళ్ల కిందట బీబీసీ ఈ గుడిని చూసినప్పుడు అది ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే, ఇప్పుడు కల్కి సినిమా వల్ల చూడడానికి వస్తున్న సందర్శకులతో సందడిగా కనిపిస్తోంది.

అసలు ఆ గుడి కథేంటి? కల్కి సినిమాలో చూపించింది ఈ గుడినేనా? ఆ ఊరివాళ్లు ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు
పెరుమాళ్లపాడు ఆలయం

ఫొటో సోర్స్, BBC/THULASIPRASAD REDDY

గుడి చరిత్ర ఏంటి?

పెరుమాళ్లపాడు వద్ద పెన్నా నది తీరంలో ఒక పురాతన దేవాలయం కొన్నేళ్ల కిందట బయటపడింది. ఇసుక ఎడారిలా ఉన్న ప్రాంతం మధ్యలో బయటపడిన ఒక ఆలయ పైభాగం కనిపిస్తుంటుంది.

అది శివాలయమని, అక్కడ ఉన్నది నాగలింగేశ్వరుడని సోమశిల ప్రాంత ఆలయాల అధికారి పెంచల వరప్రసాద్ ‘బీబీసీ’తో చెప్పారు.

‘‘అది నాగలింగేశ్వరస్వామి దేవాలయం. అయితే గుడిని ఎవరు కట్టించారు? ఎన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించారనేది తెలియదు’’ అని ఆయన అన్నారు.

గుడి నిర్మాణం, ఏ కాలంలో దానిని నిర్మించారనే విషయాల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఏవీ లభించనప్పటికీ, ఆలయ నిర్మాణ శైలిని బట్టి అది చోళుల కాలం నాటిదిగా తెలుస్తోందని చరిత్రకారుడు ఈతకోట సుబ్బారావు బీబీసీతో చెప్పారు.

‘‘ఆలయాన్ని గమనిస్తే చోళుల కాలం నాటిదిగా అనిపిస్తుంది. చోళులు 12, 13వ శతాబ్దంలో నెల్లూరు ప్రాంతం వైపు వచ్చారు’’ అని ఆయన తెలిపారు.

గుడి ఎలా భూమిలో కూరుకుపోయిందనేందుకు ఆధారాలు లేవు. గతంలో భారీ వరదలు వచ్చినపుడు నెల్లూరు ప్రాంతంలో ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని, ఈ ఆలయం కూడా ఆ సమయంలో భూస్థాపితమై ఉండవచ్చని సుబ్బారావు అన్నారు.

కల్కీ

ఫొటో సోర్స్, BBC/THULASIPRASAD REDDY

ఫొటో క్యాప్షన్, పెన్నా నది వంతెన

‘‘1927లో పెద్ద గాలివాన ఒకే ఒక్క రోజులో జిల్లాని అతలాకుతలం చేసింది. వేల మంది చనిపోయారు. ఆ సమయంలో పెరుమాళ్ళపాడే కాదు, ఎన్నో గ్రామాలు కోతకు గురయ్యాయి. వరదలో కొట్టుకుపోయాయి. 1884, 1872 బలమైన వరదలు వచ్చినపుడు మాత్రం చాలా ఊర్లు మునిగిపోయాయి. అప్పుడు ఈ ఆలయం కూడా మునిగిపోయి ఉండొచ్చనే వాదన ఉంది’’ అని సుబ్బారావు చెప్పారు.

అప్పటి వరదల్లో పెరుమాళ్లపాడు కూడా మునిగిపోవడంతో, ఆ గ్రామాన్ని అదే పేరుతో గ్రామస్తులు మరోచోట ఏర్పాటు చేసుకున్నారని కూడా ఆయన చెప్పారు.

‘‘చరిత్ర ఆధారంగా చూస్తే వరదల సమయంలో పెన్నా ఆనకట్టకు మించి ఒకటిన్నర రెండు అడుగుల పైన నీళ్లు ప్రవహించాయి. అప్పట్లో కలువాయి నుంచి నెల్లూరు వరకు ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. అందుకే పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఊరు మునిగిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అలాగే, ఈ పెరుమాళ్ళపాడు అనే గ్రామం కూడా మునిగిపోయింది’’ అన్నారు సుబ్బారావు.

వరదలు, ఇసుక మేటలు వేయడం వల్ల గుడి పూడిపోయిందన్నది చరిత్రకారులు చెబుతున్న మాట.

కల్కీ

ఫొటో సోర్స్, BBC/THULASIPRASAD REDDY

ఫొటో క్యాప్షన్, పెరుమాళ్లపాడు గ్రామం

పెరుమాళ్లపాడు వాసులు ఏమంటున్నారు..

పెరుమాళ్లపాడులోని ప్రజలు కూడా కొందరు ఆ గుడికి సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. పెన్నా నది వరదల్లో తమ ఊరు మునిగిపోతే, ప్రస్తుతం ఉన్న చోట అదే పేరుతో ఊరు కట్టుకున్నట్లుగా చెబుతున్నారు.

60 ఏళ్ల కిందట గోపురం కనిపించేదని, అక్కడ ఆడుకునే వాళ్లమని 70 ఏళ్ల జయరామ నాయుడు బీబీసీతో చెప్పారు.

“మేం చిన్నప్పుడు ఇక్కడ పైకి దూకి ఆడుకునే వాళ్లం. అప్పట్లో పై గోపురం మాత్రమే కనిపించేది. తర్వాత కొంతకాలానికి ఇది పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది” ఆయన అన్నారు.

ఊరి పెద్దల ద్వారా ఆ గుడి కథలు విన్న కొందరు యువకులు కరోనా సమయంలో అక్కడ తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆ గుడి గోపురం బయట పడింది. ఈ గుడి పెరుమాళ్లపాడుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు అదే గుడిని ఊరికి దగ్గరలో నిర్మించాలని ఆ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పోతుగుంట వెంకటేశ్వర్లు కోరుతున్నారు.

‘‘బయట ఉద్యోగాలు చేసుకుంటూ, చదువుకుంటున్నవాళ్లు కరోనా సమయంలో తలాకొంత డబ్బులు వేసుకొని జేసీబీతో తవ్వారు. అప్పుడు ఆ గుడి బయటపడింది. అక్కడే ఆలయం నిర్మిస్తే దొంగలు పడే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పుడు దేవస్థానాన్ని ఊరికి దగ్గరలో కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని వెంకటేశ్వర్లు తెలిపారు.

పెరుమాళ్లపాడు ఆలయం

ఫొటో సోర్స్, BBC/THULASIPRASAD REDDY

ఈ ఆలయానికి మాన్యాలు కూడా ఉన్నాయని, గుడి ఎక్కడ కట్టాలనే విషయంలో గ్రామస్తుల నిర్ణయానికి అనుగుణంగా పనులు మొదలు పెడతామని ఈవో వరప్రసాద్ చెప్పారు.

‘‘1987లో ఈ గుడి దేవాదాయ శాఖ పరిథిలోకి వచ్చింది. గుడి మాన్యాల రక్షణకు దేవాదాయ శాఖలో కలిపారు. ఆలయానికి 80 ఎకరాల మాన్యం భూమి ఉంది. మూడు సంవత్సరాలకు ఒకసారి వేలం పాట పెడతాం. వచ్చిన డబ్బులు బ్యాంకులో జమ చేస్తాం. ఈ మేరకు గుడి కట్టడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన చెప్పారు.

కల్కి సినిమా

ఫొటో సోర్స్, BBC/THULASIPRASAD REDDY

కల్కి సినిమాలో ఉన్నది ఈ ఆలయమేనా?

ఇటీవల విడుదలైన కల్కి సినిమాలో ఓ పాప తనను వెంటాడే విలన్ల రోబోట్ నుంచి తప్పించుకుంటూ ఇసుకలో జారుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక గుడి గోపురం కిందకు దూరి లోపల దాక్కుంటుంది. ఆ సీన్‌లో కనిపించిన ఆలయం, పెరుమాళ్లపాడు దగ్గర్లోని ఆలయమేనని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

పెరుమాళ్లపాడు దగ్గర్లోని దేవాలయం వద్ద షూటింగ్ జరిగిన మాట వాస్తవమేనని స్థానికుడు రామకృష్ణ చౌదరి తెలిపారు.

“2022లో ఇక్కడ కల్కి సినిమాను రెండు రోజులు షూట్ చేశారు. సినిమాలో కనిపించడం వల్ల ఎక్కడెక్కడి నుంచో చూడటానికి జనాలు ఇక్కడికి వస్తున్నారు” అని ఆయన చెప్పారు.

సినిమా కథకు తగినట్లుగా ఉండడం వల్ల ఇక్కడ షూటింగ్ జరిపి ఉంటారని ఈతకోట సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)