ప్రధాని మోదీ, పుతిన్‌ల ఆలింగనంపై ఎందుకు అంత తీవ్రమైన చర్చ?

ఫొటో సోర్స్, @NARENDRAMODI
సోమవారం మాస్కో చేరుకున్న భారత ప్రధాని మోదీని, రష్యా అధ్యక్షుడు పుతిన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నేతలిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలింగనం చేసుకోవడం పాశ్చాత్య విశ్లేషకులకు నచ్చలేదు, దాంతో వాళ్లు దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.
వాస్తవానికి, 2023 మార్చిలో యుక్రెయిన్‌లో జరిగిన దాడికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
మంగళవారం పుతిన్‌తో ప్రధాని మోదీ ఆలింగనాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ లక్ష్యంగా చేసుకున్నారు.
"ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత, ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి, నేరస్థుడిని ఆలింగనం చేసుకోవడం నన్ను చాలా నిరాశపరిచింది. అదీ యుక్రెయిన్‌లోని పిల్లల ఆసుపత్రిపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత..’’ అని జెలియెన్‌స్కీ అన్నారు.
జెలియెన్‌స్కీ వ్యాఖ్యపై భారత్‌లో విమర్శలు వ్యక్తం అయ్యాయి.
రష్యాలో పనిచేసిన భారత మాజీ రాయబారి, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్, "జీ-7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ, జెలియెన్‌స్కీని కౌగిలించుకున్నారు. పుతిన్‌పై జెలియెన్‌స్కీకి ఉన్న అభిప్రాయమే రష్యాకు జెలియెన్‌స్కీపై ఉంది. జెలియెన్‌స్కీ హాస్యనటుడిలా వ్యవహరిస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిలా కాదు’’ అన్నారు.


ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆలింగనంపై అభ్యంతరం
ప్రధాని మోదీ రష్యా పర్యటన వల్ల పుతిన్‌పై ఆంక్షల ప్రభావాన్ని బలహీనపరుస్తుందని పాశ్చాత్య మీడియా పేర్కొంది.
యుక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నా, భారత్ మాత్రం పాశ్యాత్య దేశాల వైపు నిలబడటం లేదు.
జులై 7న, మేధోమధన సంస్థ ట్యాంక్ ర్యాండ్ కార్పొరేషన్‌లోని ఇండో-పసిఫిక్ నిపుణులు డెరెక్ జె గ్రాస్‌మాన్, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కౌగిలించుకున్న పాత చిత్రాన్ని పంచుకుంటూ, "మోదీ సోమవారం పుతిన్‌ను ఆలింగనం చేసుకోరు లేదా ముద్దు పెట్టుకోరు" అని రాశారు.
కానీ సోమవారం సాయంత్రం పుతిన్-మోదీ ఆలింగనం చేసుకున్న చిత్రాన్ని మోదీ ‘ఎక్స్ (ట్విటర్)’లో షేర్ చేసినప్పుడు, డెరెక్, "మోదీ పుతిన్‌ను కౌగిలించుకోడన్న నా అంచనా తప్పు" అని ఒప్పుకున్నారు.
"పుతిన్ యుద్ధ నేరస్థుడు. యుక్రెయిన్ విషయంలో భారత్ నైతిక ఉదాహరణగా నిలుస్తుందని భావించాను. కానీ నేను గతంలో చాలాసార్లు చెప్పినట్లు, భారతదేశం తన ప్రయోజనాలకు మాత్రమే విలువ ఇస్తుంది'' అన్నారు.
‘‘మోదీ, పుతిన్‌ల ఆలింగనం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడి యువరాజుతో కరచాలనం చేసినట్టుగానే ఉంది’’ అని డెరెక్ రాశారు.
‘‘బైడెన్, మోదీ ఇద్దరూ తమ దేశాలను ప్రజాస్వామ్య దేశాలని పిలుచుకుంటూ, విలువల గురించి మాట్లాడతారు, కానీ ఇద్దరికీ తమ దేశ ప్రయోజనాలే ముఖ్యం’’ అని డెరెక్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాశ్చాత్య విశ్లేషకుల అంచనాలు
తుర్కియేలో సౌదీ అరేబియా జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యకు గురై, ఆ హత్య వెనుక సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని తెలిసినప్పుడు, ఈ విషయంలో సౌదీ అరేబియాను ఏకాకిని చేయాలని బైడెన్ పిలుపునిచ్చారు. కానీ ఆ తర్వాత బైడెన్ స్వయంగా సౌదీ అరేబియాకు వెళ్లి యువరాజుతో కరచాలనం చేయడంతో, బైడెన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.
యుక్రెయిన్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బాంబు దాడి చేసిన వెంటనే మోదీని పుతిన్ కౌగిలించుకోవడం భారతదేశానికి అవమానకరమని డెరెక్ అన్నారు.
ఇది యుక్రెయిన్‌పై పుతిన్ దాడి ప్రారంభించిన సమయంలో, అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పర్యటనను పోలి ఉంది. 2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన సమయంలో ఇమ్రాన్ రష్యాకు వెళ్లారు. నాడు ఇమ్రాన్ ఖాన్ పర్యటనపైనా విమర్శలు వచ్చాయి.
పుతిన్, మోదీల ఆలింగనంపై విదేశీ వ్యవహారాల నిపుణురాలు వెలినా చకరోవా, “పుతిన్, మోదీ ఒకరినొకరు ఆలింగనం చేసుకోరు అన్న పాశ్చాత్య విశ్లేషకుల అభిప్రాయం తప్పని మరోసారి రుజువైంది. నిజానికి, వారికి ఈ సంబంధాల గురించి చాలా తక్కువ తెలుసు’’ అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
‘ఆశ్చర్యం ఏముంది’?
వెలినా పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ, అమెరికాలోని అల్బానీ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ క్రిస్టోఫ్ క్లారీ, నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా పలువురు నాయకులను ఆలింగనం చేసుకున్న చిత్రాలను పోస్ట్ చేశారు.
"ఒక పాశ్చాత్య విశ్లేషకుడిగా, మోదీ ఆలింగనంపై ఎవరైనా ఎందుకు పందెం కాస్తారో నాకు అర్థం కాదు" అని క్లారీ వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోని ఎందరో పెద్ద నేతలను మోదీ ఆలింగనం చేసుకున్నారని, అలాంటి పరిస్థితిలో, మోదీ పుతిన్‌ను ఆలింగనం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదనేది క్లారీ అభిప్రాయం.
మేధోమధన సంస్థ విల్సన్ సెంటర్‌లో సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మాన్, మోదీ-పుతిన్‌ల సమావేశం తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై, “అమెరికాకు అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, రష్యా భారత దేశానికి రక్షణ పరికరాలను ఉత్పత్తి చేసి ఇవ్వడానికి అంగీకరించడం’’ అని పేర్కొన్నారు.
దీనిపై కన్వల్ సిబల్, “అమెరికా భారత రక్షణ వ్యవస్థను స్తంభింపజేయాలని అనుకుంటోందా? చైనా ముందు భారత్ నిస్సహాయంగా కనిపించాలని అమెరికా కోరుకుంటోందా? ప్రస్తుతం భారత్ సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. అమెరికా విశ్లేషకులు తమ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించడం లేదు’’ అని విమర్శించారు.
అమెరికాలోని డెలావేర్ యూనివర్శిటీలో భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ముఖ్తార్ ఖాన్, ఒక వీడియో పోస్ట్‌లో.. “నాటో సమావేశానికి ముందు భారతదేశం రష్యాతో నిలబడటం అనేక రకాలుగా ముఖ్యమైనది. వ్యూహాత్మక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమకు ఉందని భారత్ చూపించదలచుకుంది’’ అని విశ్లేషించారు.
"భారతదేశం తన ఆయుధాల కోసం ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇతర పాశ్చాత్య దేశాలపై ఆధారపడుతున్నా, ఈ విషయంలో అది రష్యాకు దూరం కావడం ఇష్టం లేదు అనే కోణంలో మోదీ, పుతిన్‌ల సమావేశం ప్రత్యేకమైనది.’’ అన్నారు ప్రొఫెసర్ ఖాన్.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌కు సవాల్
రష్యా- భారతదేశం మధ్య చారిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నా, అనేక సంక్లిష్టతలూ ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు తన్వీ మదన్ అభిప్రాయపడ్డారు.
"మోదీ తన మూడోసారి పదవీ కాలంలో తన మొదటి ద్వైపాక్షిక పర్యటనగా రష్యాను ఎంచుకున్నారు, అయితే భారత ప్రధాని గత ఐదేళ్లుగా రష్యాను సందర్శించలేదు, గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య వార్షిక సమావేశం జరగలేదు." అని తన్వీ అన్నారు.
‘‘అమెరికా-నాటో సదస్సు జరుగుతున్నప్పుడే మోదీ రష్యా వెళ్లే సమయాన్ని ఎంచుకున్నారు. అయితే, దీనిని ద్వైపాక్షిక పర్యటనగానే చూడాలని భారత ప్రభుత్వం చెబుతోంది. దీనికి ముందు మోదీ జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లారు.’’
ఒకప్పుడు రష్యాతో కలిసి జీ-8గా ఉన్న దేశాలు, క్రిమియా ఆక్రమణ కారణంగా రష్యాను తొలగించి జీ-7గా మారాయి. రష్యాతో భారతదేశ ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో ఉంది కానీ వాణిజ్య సంతులనం భారతదేశానికి అనుకూలంగా లేదు. భారతదేశం రష్యా నుంచి ఎక్కువ కొనుగోలు చేస్తూ, తక్కువ విక్రయిస్తోంది.
యుక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా చైనాపై ఆధారపడటం పెరిగిందని, ఈ పరిస్థితి భారత్‌కు అనుకూలంగా లేదని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా, రష్యాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యంతో, భారత్ తన స్థానాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలు.
బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














