కెనడా: మంత్రి కారునే రెండు సార్లు చోరీ చేశారు, ప్రతి 5 నిమిషాలకో కారు మాయం, ఎందుకిలా?

కెనడాలో కారు

ఫొటో సోర్స్, screengrab

ఫొటో క్యాప్షన్, కార్ల దొంగతనానికి ఒకే ఇంటిని రెండుసార్లు లక్ష్యంగా చేసుకున్న దొంగలు
    • రచయిత, నదీన్ యూసుఫ్
    • హోదా, బీబీసీ న్యూస్, టొరంటో

లోగాన్ లాఫార్నియర్ 2022 అక్టోబరు మాసంలో ఓ రోజు ఉదయాన్నే నిద్రలేచేసరికి ఆయన పార్కింగ్ ప్లేస్ ఖాళీగా కనిపించింది. ఆయన కొత్తగా కొన్న రామ్ రెబెల్ ట్రక్‌ను ఎవరో దొంగిలించారు.

ఒంటరియోలోని మిల్టన్ పట్టణంలోని లోగాన్ లాపార్నియా ఇంటి వద్ద అర్థరాత్రి హుడీ ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆయన పికప్ ట్రక్‌లోకి చొరబడి, దానిని తీసుకుపోవడం సెక్యూరిటీ కెమెరాలలో రికార్డ్ అయింది.

కొన్ని నెలల తరువాత చోరీకి గురైన వాహనం, సముద్రానికి ఆవల 8,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘనాలో అమ్మకానికి ఉన్నట్టు ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది.

‘‘నా కొడుకు కోసం డ్రైవర్ సీటు వెనుక లాప్‌టాప్ హోల్డర్‌ను ఏర్పాటు చేశా. కానీ మా అబ్బాయి అందులో చెత్తాచెదారం వేస్తుంటాడు. ఆ లాప్‌టాప్ హోల్డరే వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టిన ట్రక్ నాదేనని చెప్పడానికి స్పష్టమైన గుర్తు’’ అని లాఫార్నియార్ బీబీసీకి చెప్పారు.

కారు ఫీచర్స్‌ను వివరించే ఫోటోలలో లాప్‌టాప్ హోల్డర్‌లోని చెత్త కూడా చక్కగా కనిపిస్తోందని ఆయన చెప్పారు.

‘‘అది నా వాహనమే అని చెప్పడానికి నేను అస్సలు సందేహించడం లేదు’’ అని ఆయన తెలిపారు.

లాఫార్నియా కథ కొత్తదేమీ కాదు.

కెనడాలో 2022లో 1,05,000 కార్లు చోరీ అయ్యాయి. అంటే దాదాపు ప్రతి ఐదు నిమిషాలకు ఒకటన్నమాట. బాధితులలో సాక్షాత్తూ కెనడా ఫెడరల్ జస్టిస్ మినిస్టర్ కూడా ఉన్నారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన టొయోటా హైలాండర్ ఎక్స్‌ఎల్ఇ వాహనం రెండుసార్లు చోరీకి గురైంది.

కార్ల చోరీలలో టాప్ టెన్ దేశాలలో కెనడా ఒకటని ఇంటర్ పోల్ ఈ వేసవికాలం మొదట్లో జారీచేసిన జాబితా వివరిస్తోంది. ఇంటర్ పోల్ వివిధ దేశాలకు చెందిన కారు దొంగతనాల డేటాబేస్ ను నిర్వహిస్తోంది. ఆ సంస్థ డేటాబేస్ లో ఉన్న 137 దేశాలలో కెనడా అత్యధికంగా కారు దొంగతనాలు జరిగిన టాప్ 10 దేశాలలో ఒకటిగా నిలిచింది.

ఈ ర్యాంకింగ్ గుర్తించదగిన ఫీట్ అని ఇంటర్ పోల్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఈ ర్యాంక్ ఆ దేశంలో కార్ల చోరీ సమస్య ఎంత గణనీయంగా ఉందో చెప్పడానికి పనికివస్తుంది.

కెనడా ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంలో జరిగే కార్ల దొంగతనాల సమాచారాన్ని ఇంటర్ పోల్‌తో పంచుకోవడం ప్రారంభించింది.

కార్లను చోరీ చేశాక వాటిని హింసాత్మక నేరాలకు వాడటమో, లేదంటే అనుమానాస్పద కెనడీయన్లకు అమ్మేయడమో, అదీ కాదంటే వాటిని విక్రయించేందుకు విదేశాలకు తరలించడమో చేస్తారని అధికారులు చెబుతున్నారు.

కెనడాలో ఫిబ్రవరి నుంచి చోరీకి గురైన 1,500 కార్లను ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలో కనుగొన్నట్టు ఇంటర్‌పోల్ చెప్పింది.

ఇతర దేశాలలోని ఓడరేవులలో ప్రతి వారం మరో 200 కార్లను గుర్తిస్తున్నట్టు తెలిపింది.

ఇన్సురెన్స్ బ్యూరో ఆఫ్ కెనడా కార్లచోరీని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించింది.

కిందటేడాది బీమా సంస్థలు వాహన చోరీ క్లెయిముల్లో సుమారు 8వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లించాల్సి వచ్చిందని తెలిపింది.

ఈ సమస్య వల్ల, కార్లు చోరీకి గురికాకుండా ఎలా రక్షించుకోవాలనే విషయంపై కెనడా పోలీసులు బహిరంగ ప్రకటనలు జారీచేయాల్సి వచ్చింది.

మరోపక్క కెనడియన్లు తమ కార్లను రక్షించుకోవడానికి కార్లలో ట్రాకర్లు ఏర్పాటు చేసుకోవడం దగ్గరనుంచి, భద్రతా సిబ్బందిని తమ కారుకు కాపలాగా నియమించుకునే వరకు అనేక చర్యలు తీసుకుంటున్నారు.

కొంతమంది స్థోమత కలిగినవారు దొంగలకు చెక్ పెట్టేందుకు తమ పార్కింగ్ ప్రాంతాలలో, బ్యాంకులు, ఎంబసీల వద్ద కనిపించే రిట్రాక్టబుల్ బోల్లార్డ్స్ (సెక్యూరిటీ బార్స్ లాంటివి) ఏర్పాటు చేసుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
కెనడాలో విలాసవంతమైన కారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కార్లు చోరీకి గురికాకుండా యజమానులు సెక్యూరిటీ బార్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

కోవిడ్ కాలం నుంచి మొదలు

టొరంటో శివార్లలోని మిస్సిసాగా ప్రాంతంలో నివసించే నౌమాన్ ఖాన్, ఆయన సోదరుడు కార్ల చోరీకి బాధితులుగా మారాక, ఈ రిట్రాక్టబుల్ బోల్లార్డ్స్ ఇన్‌స్టాలేషన్ వ్యాపారం మొదలుపెట్టారు.

ఒకసారి ఇంట్లో ఖాన్ భార్య, ఆయన పిల్లలు నిద్రిస్తుండగా దొంగలు తలుపులు బద్దలుకొట్టుకుని ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి బయట పార్క్ చేసి ఉన్న మెర్సిడెస్ జీఎల్‌ఈ కారు తాళాలకోసం వారు వెదికారు. అయితే దొంగలపై తిరగబడటంతో పలాయనం చిత్తగించారని ఖాన్ తెలిపారు.

ఈ భయంకరమైన అనుభవం తరువాత ఖాన్ విలాసవంతమైన కార్లను అన్నింటినీ అమ్మేసి, కేవలం కుటుంబ అవసరాల కోసం రెండు సాధారణ కార్లను మాత్రమే అట్టిపెట్టుకున్నారు.

ఇప్పుడు తన వ్యాపారం ద్వారా టొరంటో ప్రాంత ప్రజల నుంచి ఇటువంటి కథలనే వింటున్నట్టు ఖాన్ చెప్పారు.

‘‘మేం చాలా బిజీగా ఉన్నాం’’ అని ఆయన తెలిపారు. ‘‘మాకు ఓ క్లయింట్ ఉన్నారు. ఆయన వీధి అంతా అనేక ఆక్రమణలు ఉన్నాయి. దీంతో తనకు భద్రత లేదని భావించి, ప్రతిరాత్రి కాపలా కాసేందుకు ఓ సెక్యూరిటీగార్డును నియమించుకున్నారు’’ అని చెప్పారు.

కెనడా కంటే జనాభా ఎక్కువగా ఉన్న అమెరికా, యూకేలలో కార్ల దొంగతనాలకంటే, కెనడాలో కార్ల చోరీ విస్తృతి ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని యూఎస్‌బ్యూరో ఆఫ్ జస్టిస్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ అలెక్సిస్ పైక్వెరో చెప్పారు.

‘‘పైగా అమెరికా మాదిరి కెనడాకు ఎక్కువగా ఓడరేవులు కూడా లేవు’ అని పైక్వెరో చెప్పారు.

కోవిడ్ మహమ్మారి కాలం నుంచి అమెరికా, కెనడా, యూకే దేశాలన్నీ కార్ల చోరీ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కెనడాలో కార్ల దొంగతనాల రేటు(లక్షమంది ప్రజలకు గానూ 262.5 కార్లు)ఇంగ్లండ్‌, వేల్స్‌ (లక్షమందికి 220 కార్లు) రేటు కంటే ఎక్కువని ఆయా దేశాల నుంచి అందుతున్న తాజా సమాచారం వెల్లడిస్తోంది.

2022 డేటా ఆధారంగా ప్రతి 1,00,000 మందికి 300 వాహన దొంగతనాలు జరుగుతున్న అమెరికాకు ఇది చాలా దగ్గరగా ఉంది.

కోవిడ్ మహమ్మారి తరువాత ప్రపంచవ్యాప్తంగా కార్ల కొరత ఏర్పడటం, పాత, కొత్త కార్లకు డిమాండ్ పెరగడం, ఇటీవల సంత్సరాలలో కార్ల చోరీలు ఎక్కువకావడానికి ఓ పాక్షిక కారణమైంది.

అంతర్జాతీయంగా కొన్ని రకాల కార్లకు డిమాండ్ పెరగడంతో వ్యవస్థీకృత నేరగాళ్ళు కార్ల చోరీని పుష్కలమైన ఆదాయ వనరుగా మార్చుకున్నారని కెనడియన్ ఆటోమొబైల్ అసోసియేషన్‌లో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్‌ రిలేషన్స్‌గా పనిచేస్తున్న ఇల్లియట్ సిల్వర్‌స్టెయిన్ చెప్పారు.

అయితే కెనడా ఓడరేవులు నిర్వహించే తీరు కారణంగా ఇతర దేశాల కంటే ఇక్కడ కార్ల చోరీ మరింత సులభంగా జరుగుతోందని సిల్వర్‌స్టెయిన్ వివరించారు.

‘‘ఓడరేవు వ్యవస్థలో దేశం నుంచి వెలుపలకు ఏం వెళుతోందనే విషయంపై కంటే దేశంలోకి ఏం వస్తోందనే విషయంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. పైగా ఒకసారి ఓడరేవులో షిప్పింగ్ కంటైనర్‌లో వాహనాలు ప్యాక్ అయిపోతే వాటిని తనిఖీ చేయడం అసాధ్యమైపోతుంది’’ అని ఆయన చెప్పారు.

అయినా పోలీసులు చోరీకి గురైన కొన్నికార్లను స్వాధీనం చేసుకోగలిగారు.

టొరంటో పోలీసు సర్వీస్ అక్టోబర్‌లో 11 నెలల విచారణను వివరిస్తూ తాము 1,080 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 367 కోట్ల 23 లక్షల 55వేల 533 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్ల దొంగతనాలకు సంబంధించి మొత్తం 550 అభియోగాలు మోపారు.

డిసెంబర్- మార్చి నెలాఖరు మధ్య పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ వద్ద 400 షిప్పింగ్ కంటైనర్లు తనిఖీ చేశాక చోరీకి గురైన దాదాపు 600 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే మాంట్రియల్ రేవు ద్వారా ప్రయాణించే సరుకుల పరిమాణాన్ని బట్టి చూస్తే ఈ తరహా తనిఖీలు చేయడం కష్టమని నిపుణులు చెబుతున్న మాట. ఒక్క 2023 సంవత్సరంలోనే పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ ద్వారా 1.7 మిలియన్ కంటైనర్లు రవాణా అయ్యాయి.

చాలా కేసులలో ఓడరేవు సిబ్బందికి కూడా కంటైనర్లను తనిఖీ చేసే అధికారం ఉండదు. కొన్ని కస్టమ్స్ నియంత్రిత ప్రదేశాలలో మాత్రమే బోర్డర్ ఆఫీసర్స్ ఎటువంటి వారెంట్ లేకుండా కంటైనర్‌ను తనిఖీ చేయగలుగుతారు.

ఈ నేపథ్యంలో కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) సిబ్బంది కొరతతో అల్లాడుతోందని, ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక చెబుతోంది. కాలం చెల్లిన సాంకేతిక కూడా ఓ సమస్యగా మారింది.

కంటైనర్లు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, చోరీకి గురైన కార్లను మాంట్రియల్ లాంటి ఓడరేవుల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు

అమెరికా, కెనడా మధ్య తేడా

అమెరికా, కెనడా మధ్య కంటైనర్ల తనిఖీలోని వ్యత్యాసాలేమిటో తెలుసుకునేందుకు బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఇటీవల న్యూజెర్సీలోని పోర్ట్ న్యూఆర్క్ కంటైనర్ టెర్మినల్‌ను సందర్శించారు. బ్రాంప్టన్ నగరంలో కూడా భారీగా కార్ల దొంగతనాలు జరుగుతున్నాయి.

‘‘వారికి స్కానర్లు ఉన్నాయి. వారు డెన్సీటినీ కొలుస్తారు. స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తారు’’ అని ఆయన నేషనల్ పోస్ట్ న్యూస్ పేపర్‌కు తెలిపారు.

‘‘కెనడాలో ఇలాంటి పనులు చేయడంలేదు’’ అని చెప్పారు.

షిప్పింగ్ కంటైనర్లను తనిఖీ చేయడానికి కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీని పటిష్టం చేయనున్నామని, ఇందుకోసం భారీగాపెట్టుబడులు పెడతాని కెనడా ప్రభుత్వం మేలో చెప్పింది. పోలీసులకు కూడా కార్ల చోరీని అరికట్టేందుకు వీలుగా ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపింది.

అయితే ఈ పజిల్‌లో మిస్సవుతున్న భాగం వాహనతయారీదారులేనని సిల్వర్‌స్టెయిన్ అంటారు.

‘‘అందరూ చోరీకి గురైన వాహనాలను ఎలా రికవరీ చేయాలా అనే విషయమే మాట్లాడుతున్నారు. అసలు కారు చోరీకి గురికాకుండా సంక్లిష్టంగా తయారుచేయాలనే విషయం ముందువరుసలో నిలబడాల్సిన విషయం కదా’’ అంటారు ఆయన.

మరోపక్క లాఫార్నియర్ లాంటివారు తమ కార్లు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపై తర్జనభర్జన పడుతూనే ఉన్నారు.

ఆయన రామ్ రెబెల్ ట్రక్‌ చోరీకి గురయ్యాక దాని స్థానంలో తన ‘‘కలలవాహనం’’ అయిన టొయోటా టుండ్రాను కొనుగోలు చేశారు.

దొంగలు తేలికగా ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వీల్లేకుండా ఆయనీసారి ఇంజిన్ కదలకుండా చేసే పరికరాన్ని అమర్చారు. ఒకవేళ చోరీకి గురైనా తేలికగా పసిగట్టేలా టాగ్ ట్రాకర్ అమర్చారు. అలాగే స్టీరింగ్ తిరగకుండా చేసే పరికరాన్నీ అమర్చారు.

ఇలాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగలేమీ అధైర్యపడలేదు. ఈసారి లాఫార్నియర్ టుండ్రాను చోరీ చేయడానికి ఇద్దరు దొంగలు వచ్చారు. కానీ వారికి కాలం కలిసిరాలేదు. వాహనంలోకి చొరబడేందుకు వెనుక కిటికినీ పగులకొట్టారు.

ఆ అలజడికి మేల్కొన్న లాఫార్మియర్ వెంటనే 911కు ఫోన్ చేశారు. పోలీసులు రావడానికి పట్టిన నాలుగు నిమిషాల్లోపే దొంగలు పారిపోయారు.

దీంతో దెబ్బతిన్న తన బ్రాండ్ న్యూ కార్‌ను రిపేర్ చేయించి తరువాత అమ్మేశారు.

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)