కళ్లు ఎందుకు పొడిబారుతాయి? ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
మీ కళ్లు తరచుగా దురదగా ఉంటే, నీరు కారుతుంటే, చికాకు కలిగిస్తూ వెలుతురును చూడలేకపోయినట్లయితే మీరు ‘కళ్లు పొడిబారడం’ అనే సమస్యను ఎదుర్కొంటున్నట్లు లెక్క.
రకరకాల కారణాలతో కళ్లపై ఉండే టియర్ ఫిల్మ్ ప్రభావితం కావడం వల్ల కళ్లు పొడిబారతాయి. మూడు పొరలతో టియర్ ఫిల్మ్ ఏర్పడుతుంది. టియర్ ఫిల్మ్‌లో లిపిడ్ లేయర్ (నూనె), ఆక్వాస్ లేయర్ (నీరు), మ్యూకర్ లేయర్ ఉంటాయి.
టియర్ ఫిల్మ్‌లోని ఈ మూడు పొరల కలయిక కళ్లను శుభ్రంగా, తడిగా ఉంచుతుంది.
ఈ మూడు పొరల్లో దేనిలోనైనా మార్పులు వస్తే కళ్లు పొడిబారతాయి.
ఇది తీవ్రమైన సమస్య ఏమీ కాదు, కానీ చాలా ఇబ్బంది పెడుతుంది.

టియర్ ఫిల్మ్ సరిగ్గా పనిచేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయని యూకేకు చెందిన సౌథాంప్టన్ యూనివర్సిటీ ఆప్తమాలజీ ప్రొఫెసర్ పర్వేజ్ హొస్సేన్ బీబీసీతో చెప్పారు.
కళ్లు పొడిబారడానికి ప్రధాన కారణం మెబోమియన్ గ్రంథులు పనిచేయకపోవడమని చెప్పారు. దీనితో పాటు అటో ఇమ్యూన్ వ్యాధులు, కొన్ని రకాల ఔషధాల వాడకం, కాంటాక్ట్ లెన్స్‌లు వాడటం, హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చని తెలిపారు.
కనురెప్పల్లో ఉండే మెబోమియన్ గ్రంథులు, టియర్ ఫిల్మ్‌ను తయారు చేసే లిపిడ్లను స్రవిస్తాయి. అలాగే ఎవాపరేషన్ (కంటిలోని తడి ఆవిరిగా మారిపోవడం)ను నివారిస్తాయి.
గ్రంథులు సరిగా పనిచేయకపోతే కంట్లోని నీటిపొర సాధారణం కంటే వేగంగా ఆవిరవుతుందని పర్వేజ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కళ్లు పొడిబారడానికి కారణాలు ఏంటి?
కళ్లు పొడిబారడం వల్ల దురద, చికాకు, నీరు కారడంతో పాటు మసకగా కనిపించడం, ఎర్రబారడం, నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
వాతావరణంలో తేమ లేకపోవడం, దుమ్ముధూళి, స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల ఈ లక్షణాలన్నీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
మనం కంప్యూటర్ స్క్రీన్లను తదేకంగా చూసినప్పుడు కళ్లను ఆర్పడం తగ్గిస్తాం. కళ్లు శుభ్రపడటానికి, కంట్లోని తడిని సమంగా పరచడానికి తరచుగా కళ్లను ఆర్పడం చాలా అవసరం.
తక్కువగా కళ్లు ఆర్పడం వల్ల కంట్లోని తడి ఆవిరయ్యే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
మధ్య వయస్కుల్లో ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ.
‘‘మేం చేసిన అధ్యయనాల్లో 50 ఏళ్ల వారిలో, మెనోపాజ్‌కు చేరువ అవుతున్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువ ఉన్నట్లు తేలింది’’ అని పర్వేజ్ చెప్పారు.
మెబోమియన్ గ్రంథులపై హార్మోన్ల ప్రభావమే దీనికి కారణమని ఆయన తెలిపారు.
డిజిటల్ పరికరాలను అతిగా వాడటం కారణంగా ఈ సమస్య చాలా ముందుగానే కనిపిస్తోందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నివారణ, చికిత్స
కళ్లు పొడిబారడాన్ని నివారించేందుకు మయో క్లినిక్ కొన్ని సిఫార్సులు చేసింది. మయో క్లినిక్ అనేది క్లినికల్ ప్రాక్టీస్‌కు అంకితమైన ఒక స్వచ్ఛంద సంస్థ. వైద్య పరిశోధనలు కూడా చేస్తుంది.
- కళ్లలోకి దుమ్ముధూళి చేరకుండా చూసుకోవాలి.
- ఎక్కువసేపు తదేకంగా చూడాల్సి వస్తే మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి
- తరచుగా కళ్లను ఆర్పాలి
- కంటి స్థాయికి దిగువన కంప్యూటర్ స్క్రీన్ ఉండేలా చూసుకోవాలి.
- ధూమపానం మానేయాలి, పొగ తాగేవారికి దూరంగా ఉండాలి.
- కళ్లను తడిగా ఉంచుకోవడానికి వైద్యులు సిఫారసు చేసిన కంటి చుక్కల్ని వాడాలి.
గోరువెచ్చని నీటితో కనురెప్పలను శుభ్రం చేసుకోవడం, కళ్ల చుట్టూ సుతిమెత్తగా నొక్కడం వంటివి చేయాలని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచించింది. ఇలా చేయడం వల్ల కంటిలోని గ్రంథుల నుంచి విడుదలైన కొవ్వులు కరిగిపోతాయి.
గ్రంథుల నుంచి స్రావాలు విడుదలయ్యేందుకు కంటి రెప్పలను వేళ్లతో లేదా దూదితో తేలికగా నొక్కాలని సూచించింది.
ఇలాంటి తేలికైన పనులు చేయడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని పేర్కొంది.
(గమనిక: ఈ కథనం స్థూల అవగాహన కోసమే. కంటికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వైద్యుదులను సంప్రదించాలి)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














