మణిపుర్ హింస: ఏడాది గడచినా విధ్వంస గాయాలు ఇంకా మానలేదు - గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA/BBC
- రచయిత, మయూరేశ్ కొన్నూర్, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, మణిపుర్, మిజోరం నుంచి..
నిరుడు మే నెలలో మణిపుర్‌లో జాతుల మధ్య చెలరేగిన హింసలో 200 మందికిపైగా మరణించారు. ఏడాది గడచినా ఇప్పటికీ అక్కడి పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, ''మణిపుర్ శాంతి కోసం ఏడాదిగా ఎదురుచూస్తోంది.. అంతకుముందు పదేళ్లు అక్కడ అంతా బాగానే ఉంది, కానీ అక్కడ హఠాత్తుగా ఏర్పడిన లేదా సృష్టించిన వివాదం ఇంకా రగులుతూనే ఉంది. దానిపై ఎవరు దృష్టి సారిస్తారు?'' అన్నారు.
ఆ ప్రకటన తర్వాత ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ వంటి సీనియర్ అధికారులతో హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.
హింసాకాండలో ప్రభావితమైన మెయితెయ్, కుకీ తెగలకు చెందిన వారు ఇప్పటికీ పెద్దసంఖ్యలో సహాయక శిబిరాల్లో నివాసముంటున్నారు. హింస కారణంగా ప్రజలు పారిపోయి పొరుగు రాష్ట్రమైన మిజోరంలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.
ఈ హింస చెలరేగడానికి మెయితెయ్ వర్గానికి షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదా కల్పించాలనే డిమాండ్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మణిపుర్‌లోని కొండప్రాంతాల్లో ఎక్కువగా ఉండే కుకీ తెగ దీనిని వ్యతిరేకిస్తోంది.


ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA/BBC
ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి?
యాభై రెండేళ్ల నెంగ్నెయ్ చాంగ్ తన కుమారులతో కలిసి మణిపుర్‌లోని లాంగ్‌చింగ్ గ్రామంలో నివసించేవారు. ఇప్పుడు మణిపుర్ నుంచి పొరుగు రాష్ట్రమైన మిజోరం పారిపోయి వచ్చి అక్కడి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న 12,000 మంది నిరాశ్రయుల్లో ఆమె కూడా ఒకరు.
రాజధాని అయిజోల్‌కి 15 కిలోమీటర్ల దూరంలోని పట్టణ పేదల హౌసింగ్ సొసైటీలో నివసించే నెంగ్నెయ్‌కి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ లేదు. ఆమెకు ప్రస్తుతం ఎలాంటి పనీ లేదు, ఆమె వద్ద డబ్బు కూడా లేదు.
వారు ఇక్కడే సహాయ శిబిరాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. కుకీ-జోమి తెగకు చెందిన మరో 20 కుటుంబాలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి.
నెంగ్నెయ్ చాంగ్ భర్త భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేశారు. ఆయన ఎనిమిదేళ్ల కిందట మరణించారు.
''మా పిల్లలను బాగా చదవించి వారికి మంచి జీవితం ఇవ్వాలనుకున్నాం. కానీ, హింస కారణంగా ఊరొదిలి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నా కొడుకు రోజువారీ కూలీగా పనిచేయాల్సి వస్తోంది. దానికి బదులు మేమంతా చనిపోయి ఉంటే బాగుండేది'' అని ఆమె అన్నారు.
మణిపుర్ హింసాకాండ కారణంగా దాదాపు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
''మేమంతా చర్చిలో ప్రార్థనలు చేస్తున్నాం. అదే సమయంలో బయట కాల్పులు జరిగాయి. ఆ తర్వాత మా ఇళ్లకు నిప్పుపెట్టారు. ఒక్క క్షణంపాటు అదే మాకు చివరి రోజు అనిపించింది'' అని ఆమె హింస చెలరేగిన రోజు ఏం జరిగిందో చెప్పారు.
''నా భర్త ఆర్మీలో ఉండి దేశానికి సేవలందించారు. కానీ, ఇప్పుడు మా కుటుంబం శరణార్థిగా మారింది'' అని నెంగ్నెయ్ అన్నారు.

ఫొటో సోర్స్, MAYURESH KONNUR/BBC
రెండు తెగలూ ఇబ్బంది పడ్డాయ్
మణిపుర్ హింసతో వేలాది మంది జీవితాలు నాశనమయ్యాయి. హింస వల్ల ఇబ్బందులకు గురైన వారిలో కుకీలు, మెయితెయ్‌లు రెండు తెగలవారూ ఉన్నారు.
మెయితెయ్‌లు అధికంగా ఉండే ఇంఫాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన అందరికీ చేదు అనుభవాలున్నాయి.
ఆకంపాత్ ప్రాంతంలోని 'ఐడియల్ గర్ల్స్ కాలేజ్' ఏర్పాటు చేసిన సహాయ శిబిరంలో సుమారు వెయ్యి మంది ఉంటున్నట్లు చెప్పారు.
ఆ కాలేజీ తరగతి గదులు ఇప్పుడు ఇళ్లుగా మారాయి. ఒక్కో గదిలో రెండు నుంచి నాలుగు కుటుంబాలు కలిసి ఉంటున్నాయి.
అక్కడే వండుకుంటున్నారు, ఆ పక్కనే పిల్లలు చదువుకుంటున్నారు.
మోరే పట్టణంలో హింస చెలరేగడంతో లెంబీ చింగ్థామ్, ఆమె తల్లి, ఇద్దరు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు, వృద్ధురాలైన అమ్మమ్మతో అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వారు ఈ శిబిరానికి వచ్చారు.
స్కూల్‌లో, 12వ తరగతిలో టాపర్‌గా నిలిచిన లెంబీ డాక్టర్ అవ్వాలనే కోరికతో నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఆమె తల్లి శిబిరంలోనే వస్తువులను తయారుచేసి విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ, ఆమె తన చదువును కొనసాగించలేకపోయారు. ప్రస్తుతం ఆమె శిబిరంలో ఉంటున్న పిల్లలకు చదువు చెప్తున్నారు.
''నేను డిప్రెషన్‌కు గురయ్యా. డిప్రెషన్‌లో ఉన్నప్పటికీ, నా కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటా'' అని లెంబీ చింగ్థామ్ అన్నారు.

ఫొటో సోర్స్, MAYURESH KONNUR/BBC
విడిపోయిన కుటుంబాలు..
నెంగ్నెయ్ చాంగ్ మిజోరంలో ఉండగా, అదే గ్రామానికి చెందిన ఆమె బంధువు బోయిను హావోకీప్ మణిపుర్‌లో కుకీల ఆధిపత్యం ఉండే చురాచంద్‌పూర్‌లో ఉన్నారు. హింస చెలరేగిన కొద్దిరోజుల తర్వాత, నిరాశ్రయులైన వేలాది మంది కుకీలు మళ్లీ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు.
తల్లిదండ్రులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న బోయిను మణిపుర్‌లో జాతి హింస, మానసిక ఒత్తిడి అనే అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నారు.
''చిన్నచిన్న దుకాణాలు పెట్టుకున్నాం. కొందరు కూరగాయాలు అమ్ముతున్నారు. మరికొందరు రోజువారీ కూలీ పనులకు వెళ్తున్నారు. ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం. మా కుటుంబం భూమి కౌలుకి తీసుకుని సాగు చేస్తోంది. అదే మా ఆదాయవనరు'' అని ఆమె చెప్పారు.
నెంగ్నెయ్ కుటుంబంతో వారికి ఇప్పుడు ఎలాంటి సంబంధాలూ లేవు. అప్పుడప్పుడూ ఆమె తల్లిదండ్రులు వారితో ఫోన్‌లో మాట్లాడుతుంటారు. రాష్ట్రాలు దాటిన ఈ కుటుంబాల మధ్య సంబంధాలు ఇక ముగిసిపోయినట్లే కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, MAYURESH KONNUR/BBC
ఈ హింస ప్రభావం రెండు వర్గాల మహిళలపైనా ఉంటుందని, అది అంత తేలిగ్గా పోదని ఇంఫాల్‌లోని 'నంబోల్ ఎ సనోయ్' కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మణిపుర్ మహిళలపై పరిశోధన చేస్తున్న శ్రీమా నిగోంబమ్ అన్నారు.
ఆమె మాట్లాడుతూ, ''చాలా మంది మహిళలు సంపాదనకు దూరమయ్యారు. ఎక్కువ మంది అభద్రతా భావంలో ఉన్నారు. చాలా మంది మహిళలు మానసిక సమస్యలు, గృహ హింస, లైంగిక హింసకు గురయ్యారు. సహాయ శిబిరాల్లో ఉంటున్న మహిళలు తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయారు. వీటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది, ఒక్కరోజులో మారదు'' అని శ్రీమా చెప్పారు.

ఫొటో సోర్స్, MAYURESH KONNUR/BBC
కోటీశ్వరుడి నుంచి కూలీగా మారిన లాలాసొంగేట్
60 ఏళ్ల లాలాసొంగేట్.. తన భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కోడళ్లు, ముగ్గురు మనవరాళ్లతో మిజోరంలోని సహాయ శిబిరంలో ఉంటున్నారు.
ఒకప్పుడు మణిపుర్‌లో కోట్ల రూపాయల విలువైన ఇంట్లో ఆయన ఉండేవారు. ఇప్పుడు ఆయన కుమారులు రాబర్ట్, హైలరీ ఇద్దరూ మిజోరంలో రోజువారీ కూలీలుగా పనిచేయాల్సి వచ్చింది.
''ఈ హింస కారణంగా మేం సర్వస్వం కోల్పోయాం. మా అబ్బాయిల కోసం ఎయిర్‌పోర్టు దగ్గర దుస్తుల షోరూం ప్రారంభించేందుకు 80 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టా. మా దగ్గర 40 లక్షల రూపాయల కార్లు ఉండేవి. ఇప్పుడు ఏమీ మిగల్లేదు.
మిజోరంలో క్షేమంగా ఉన్నాం. ఇక్కడి ప్రభుత్వం చాలా సాయం చేసింది. యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ) వేసుకోవడానికి దుస్తులు, ఆహార పదార్థాలు ఇచ్చింది. ఇక్కడి ప్రజలు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు'' అని లాలాసొంగేట్ చెప్పారు.
మణిపుర్‌లోని చురాచంద్‌పుర్‌కి చెందిన లాలాసొంగేట్ బావమరిది రామ్‌థాంగ్ 28 ఏళ్లపాటు సైన్యంలో పనిచేశారు.
తమకు దూరమైన బావ కుటుంబాన్ని తలచుకుంటూ గతంలో అంతా బాగున్నప్పుడు కలిసి దిగిన ఫోటోలను మాకు చూపించారు.
''చాలా బాధగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇక్కడే కలిసి ఉందామని, ఇక్కడికి వచ్చేయమని లాలాసొంగేట్‌కి చెబుతుంటా. కానీ, ప్రస్తుతానికి అక్కడే ఉంటానని చెప్పాడు'' అన్నారాయన.
1971 పాకిస్తాన్ యుద్ధంలో పోరాడిన రామ్‌థాంగ్, తనకు వచ్చిన పతకాలన్నింటినీ ఈ గొడవల్లో కోల్పోవడం బాధాకరం. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో ఆయన కూడా కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి.

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA/BBC
ఇప్పటికీ శిబిరాల్లోనే...
పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి, కానీ నేటికీ మణిపుర్‌లో పరిస్థితులు గాడినపడలేదు. ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు మిజోరంలోని సహాయక శిబిరాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం మణిపుర్ నుంచి వెళ్లిన 12 వేల మంది శరణార్థులతో పాటు మియన్మార్ నుంచి పారిపోయి వచ్చిన దాదాపు 35 వేల మంది కూడా మిజోరంలో తలదాచుకుంటున్నారు.
శరణార్థులకు మిజో తెగతో సంబంధాలు ఉండడంతో అక్కడి ప్రజలు వారికి సాయం అందిస్తున్నారు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మంగ్ మిజో అసోసియేషన్ సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంది.
సంస్థ సీనియర్ నేత డాక్టర్ సావ్మా వే మాట్లాడుతూ, ''కుటుంబం అన్నప్పుడు చాలా అవసరాలుంటాయి. అందువల్ల సహాయ శిబిరంలో ఉంటున్న చాలా మంది రోజుకూలీలుగా పనిచేయాల్సి వస్తోందని మాకు తెలుసు. వాళ్లు పనిచేస్తారని మేం స్థానికులకు చెప్పాం. అయితే, మిజోరం చాలా చిన్న రాష్ట్రం, ఇక్కడ వనరులు చాలా తక్కువ'' అన్నారు.

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA/BBC
అయిజోల్‌లోని అనేక సహాయ శిబిరాలను బీబీసీ బృందం పరిశీలించింది. అక్కడ, ప్రభుత్వం నుంచి తమకు రేషన్ అందడం లేదని చాలా మంది శరణార్థులు ఆరోపించారు. ఉదాహరణకు, రే కాంప్లెక్స్‌లోని సహాయ శిబిరంలో.. హింస వల్ల ప్రభావితమైన కుకీ / జోమి తెగకు చెందిన 62 కుటుంబాలు ఉన్నాయి. వారిలో చిన్నారులు, వృద్ధులు ఉన్నారు.
తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోజుకూలీగా పనిచేయాల్సి వస్తోందని ఇక్కడ ఉంటున్న జాన్ లాల్ ఝు చెప్పారు.
రేషన్ సరిగ్గా అందడం లేదన్న ఫిర్యాదులపై మిజోరం ముఖ్యమంత్రికి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అడ్వైజర్, స్థానిక ఎమ్మెల్యే అయిన లాల్వెంచుంగ మాట్లాడుతూ, ''ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది. రాష్ట్రంలో వనరులు కూడా పరిమితంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మా మొర ఆలకిస్తే, శరణార్థులకు మరింత సాయం చేయవచ్చు'' అన్నారు.
బీజేపీ మిజోరం రాష్ట్ర అధ్యక్షులు వన్‌లాల్ హముకా మాట్లాడుతూ, ''రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆర్నెళ్లు కావొస్తున్నా నేటికీ మణిపుర్ నుంచి వస్తున్న బాధితులకు సంబంధించిన సరైన సమాచారం కేంద్రానికి అందించలేకపోయింది. భారత ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు, హింసకు గురైన బాధితులను సరిగ్గా గుర్తించాలి. వారి పేర్లు, జాబితాలు పంపాల్సి ఉంటుంది''అన్నారు.
ఈ రాజకీయ చర్చ 33 ఏళ్ల జోసెఫ్ లులున్ జీవితంపై ప్రభావం చూపించే అవకాశం లేదు.
అయిజోల్‌లో వర్షాల కారణంగా గత రెండు రోజుల నుంచి పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గర్భవతి అయిన తన భార్యతో కలిసి నిరుడు చురాచంద్‌పూర్‌లోని ఓ గ్రామం నుంచి మిజోరం పారిపోయి వచ్చారు. దాదాపు ఏడాదిగా సహాయ శిబిరంలోనే ఉంటున్నారు.
'' పని కోసం నేను రోజూ కిలోమీటర్ల దూరం నడవాలి'' అని జోసెఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, MAYURESH KONNUR/BBC
చెల్లాచెదురైన మెయితెయ్ కుటుంబాలు
రాజధాని నగరం ఇంఫాల్‌లోని చాలా ప్రదేశాల్లో డిటర్జెంట్ పౌడర్, అగర్‌బత్తీ వంటి వస్తువులను విక్రయిస్తున్న నిర్వాసితులను మేం గమనించాం. సహాయ శిబిరాల్లో తయారు చేసి, బయటికి వెళ్లి విక్రయిస్తున్నారు. అలా జీవితం గడుపుతున్నారు.
వారిలో కుకీల ఆధిప్యం ఉన్న ప్రాంతమైన చురాచంద్‌పూర్ నుంచి సహాయ శిబిరానికి వచ్చిన తోనావూజం రమేశ్ బాబు ఒకరు. ఆయన గ్రామానికి చెందిన కొందరు మహిళలతో కలిసి సబ్బులు, అగర్‌బత్తీలు, కొవ్వొత్తులను విక్రయిస్తున్నారు.
''మా తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు సహాయక శిబిరంలో రాత్రింబవళ్లూ కష్టపడి ఈ వస్తువులను తయారుచేస్తారు. మాలో కొందరం నగరానికి వచ్చి వాటిని విక్రయిస్తుంటాం. ఇంతకుమించి వేరే మార్గం ఏముంది?'' అన్నారాయన.
మిజోరంలో నివసిస్తున్న నెంగ్నెయ్, లేదా చురాచంద్‌పూర్‌లోని బోయిను, లేదా లెంబీ చదువుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మణిపుర్ హింస, ఆశ్రయం కోల్పోవడం వంటివి రెండు తెగలకు చెందిన మహిళలపై మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఈ సాయం సరిపోతుందా?
మణిపుర్ బీజేపీ అధికార ప్రతినిధి మాయంగలాబామ్ సురేశ్ మాట్లాడుతూ, ''శిబిరాల్లో కొంత ఆహారం లేదా కొంత డబ్బు ఇవ్వడం వల్ల ప్రజలు సంతోషంగా ఉండరనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతి నిరాశ్రయుడికీ మరింత సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం'' అన్నారు.
ఏడాది కిందట చెలరేగిన హింస గ్రామాలను నాశనం చేసింది. ఇళ్లను నాశనం చేసింది, కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. మంచి భవిష్యత్తుపై ఆశలు, ప్రభుత్వాల ప్రయత్నాలు, వాదనల మధ్య మణిపుర్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులు ఇవే.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














