అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి: జస్టిన్ బీబర్ ప్రదర్శనకు ఎంత చెల్లించారంటే

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఫ్లోరా డ్రూరీ
- హోదా, బీబీసీ న్యూస్
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న చాలామంది పాల్గొంటున్నారు, ప్రదర్శనలు ఇస్తున్నారు.
కెనడాకు చెందిన గాయకుడు జస్టిన్ బీబర్ ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు తన బృందంతో పాటు ముంబయి వచ్చారు.
అనంత్, రాధికా మర్చంట్‌ల తొలి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో సింగర్ రియాన్నా ప్రదర్శన ఇవ్వగా.. మధ్యధరా సముద్రంలో ఓ క్రూయిజ్‌లో నిర్వహించిన రెండో పార్టీలో బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్, సింగర్ కేటీ పెర్రీ, ఇటలీ గాయకుడు ఆండ్రియా బొసెల్లీ ప్రదర్శన ఇచ్చారు.
దీంతో, ఈ వారం జరగబోయే అసలు పెళ్లి వేడుకల్లో ఎవరూ పర్‌ఫార్మ్ చేయబోతున్నారని అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు ఎదురు చూస్తున్నారు.
తుది పెళ్లి ఘట్టంలో అడెల్ పాల్గొనబోతున్నారని ఇంటర్నెట్‌లో ప్రచారమవుతోంది.
అడెల్ అంతర్జాతీయంగా పేరున్న గాయని, గేయ రచయిత. అయితే, దీనిపై ఇంకా స్పష్టత లేదు.


ఫొటో సోర్స్, EPA
ముకేశ్ అంబానీ తన కొడుకు అనంత్ పెళ్లి వేడుకలను ప్రత్యేకంగా నిలుపుతున్నారు.
అనంత్, రాధికల సంగీత్ కార్యక్రమం గత వారమే జరిగింది. ఈ వేడుకల్లో అతిథుల అంచనాలను మించి అంబానీ కుటుంబమంతా కలిసి డ్యాన్స్ వేసింది.
ముకేశ్, ఆయన కుటుంబం కలిసి వేదికపై బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ హిట్ సాంగ్ ‘దీవాన్‌గీ దీవాన్‌గీ’కి వేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ పెళ్లి వేడుకలకు హాజరవుతున్న బాలీవుడ్ స్టార్లంతా కూడా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన వస్త్రధారణతో ఆకట్టుకుంటున్నారు.
ఈ ముందస్తు పెళ్లి వేడుకలు కచేరీల మాదిరి కనిపిస్తున్నాయి. స్టార్లంతా ఈ వేడుకలో క్యాట్‌వాక్ చేస్తున్నారు.
ఈ పార్టీలకు ముందు దిగిన ఫోటోలను స్టార్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, MEGA/GC Images
ఇప్పటి వరకు జరిగిన మూడు పార్టీల ఖర్చెంతో తెలియనప్పటికీ, రియాన్నా పర్‌ఫార్మెన్స్ కోసం 7 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 58 కోట్లు) ఖర్చు పెట్టినట్లు ప్రచారమవుతోంది.
జస్టిన్ బీబర్‌కు 10 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 83 కోట్లు చెల్లిస్తున్నట్లు వివిధ కథనాలు చెబుతున్నాయి.
ఇక ఈ వారాంతంలో జరగబోయే అసలు వేడుక ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. కానీ, ఈ వేడుక త్వరగా అయిపోతే, కాస్త ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయని కొందరు భావిస్తున్నారు.
‘ప్లానింగ్ చాలా బాగా జరుగుతుంది. పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తన కార్డును గుండెలపై పెట్టుకుని గత నెలలో ‘వోగ్ యూఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా అన్నారు.
కాగా, ముకేశ్ అంబానీ నికర సంపద 115 బిలియన్ డాలర్లుగా(రూ. 9,60,120 కోట్లుగా) ఫోర్బ్స్ అంచనావేసింది.
ఈయన దేశంలోనే సంపన్న వ్యక్తి. ఆయన తర్వాత గౌతమ్ అదానీ ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














