అస్సాం: కజిరంగా నేషనల్ పార్క్‌ను ముంచెత్తిన వరదలు, అరుదైన జాతికి చెందిన ఆరు ఖడ్గమృగాలు మృతి

ఖడ్గమృగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కజిరంగా నేషనల్ పార్క్ ప్రపంచంలోనే అత్యధిక ఖడ్గమృగాలకు ఆవాసంగా ఉంది.

ఈశాన్య భారతంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా ఆరు అరుదైన ఖడ్గమృగాల సహా 130కి పైగా జంతువులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల సంవత్సరాలలో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ దారుణ వరదలను చవిచూస్తోంది.

చనిపోయిన జంతువులలో 117 హాగ్ జింకలు, రెండు సాంబార్ జింకలు, ఒక రీసస్ మకాక్ కోతి, ఒక ఒట్టర్(నీటి కుక్క)కూడా ఉన్నాయి.

2017 లో యానిమల్ కారిడార్ల నుంచి ఎత్తైన ప్రాంతాలకు వలస వెళ్ళే క్రమంలో దాదాపు 350కి పైగా జంతువులు వరదవల్ల, వాహనాలు ఢీకొనడం వల్ల మరణించాయి.

వరదల నుంచి 97 జంతువులను కాపాడామని అధికారులు చెప్పారు. వాటిలో 25 జంతువులు చికిత్స పొందుతున్నాయని, పూర్తిగా కోలుకున్న 52 జంతువులను తిరిగి అడవిలోకి వదిలిపెట్టినట్టు అధికారులు చెప్పారు.

ఈ శతాబ్దం ఆరంభంలో అంతరించిపోయే దశకు చేరుకున్న ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు కజిరంగా నేషనల్ పార్క్ నిలయం. ప్రస్తుతం ఇక్కడ 2,400లకు పైగా ఒంటికొమ్ము ఖడ్గ మృగాలు ఉన్నాయి.

ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
వన్య ప్రాణులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివిధ రకాల జంతుజాతులకు కజిరంగా నేషనల్ పార్క్ ఆవాసంగా ఉంది.

కజిరంగా నేషనల్ పార్క్ పులుల అభయారణ్యం కూడా. అలాగే ఏనుగులు, అడవి గేదెలతోపాటు అనేక పక్షి జాతులకు కూడా నిలయం.

అంతరించిపోతున్న దక్షిణాసియా డాల్ఫిన్లు కూడా ఈ పార్క్ మీదుగా ప్రవహించే నదుల్లో కనిపిస్తాయి.

గతవారం పార్క్ సమీప గ్రామంలోని ఓ ఇంటిలో ఉన్న 18 నెలల వయసున్న ఖడ్గమృగం పిల్ల‌ను సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ రిహాబిలిటేషన్ అండ్ కన్జర్వేషన్ సంస్థ రక్షించిందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అస్సాంను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

ఈ ఏడాది కురిసిన వర్షాలకు పార్కులోని చాలా ప్రాంతాలతోపాటు వేలాది గ్రామాలు నీట మునిగాయి.

ఈ వరదల కారణంగా 60 మందికి పైగా మరణించగా, 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

పంటలు నీట మునిగాయి. పశువులు మరణించాయి.

వర్షాల కారణంగా రాబోయే రోజులలో బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

అస్సాం అంతటా నిరాశ్రయుల కోసం వందలాది సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు.

వర్షాకాలంలో ఈశాన్య భారతదేశంతో పాటు పొరుగు దేశాలలో కూడా వరదలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడటం సాధారణంగా జరుగుతుంటుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)