మహిళా రెజ్లర్లు: లైంగిక వేధింపుల మానసిక గాయాల నుంచి కోలుకున్నారా, ఒలింపిక్స్‌కు ఎలా సిద్ధమయ్యారు?

వినేష్ ఫోగట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023 నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ రెజ్లర్‌లలో వినేష్ ఫోగట్ ఒకరు
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెజ్లింగ్‌లో ప్రకంపనలు సృష్టించిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నిరసనలు వెల్లువెత్తి ఏడాది గడిచాక, భారత మహిళా అథ్లెట్లు 2024 పారిస్ ఒలింపిక్స్‌తో సహా ప్రధాన ఈవెంట్‌లకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో వాళ్ల శిక్షణ గురించి బీబీసీ యువ రెజ్లర్లతో మాట్లాడింది.

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని రీతికా హుడా కొద్దిలో కోల్పోయేవారే. కానీ, ఈ ఏడాది ఆ అర్హత సాధించిన అయిదుగురు భారత మహిళా రెజ్లర్లలో 23 ఏళ్ల రీతికా కూడా ఉన్నారు.

ఒక సంవత్సరం కిందట ఆమె ఆత్మవిశ్వాసానికి తగిలిన ఎదురుదెబ్బల తర్వాత ఆమె కష్టానికి లభించిన ఫలితం ఇది. తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరింత శిక్షణ, మరిన్ని పోటీలలో పాల్గొనడం అవసరమని ఆమెకు తెలుసు.

ఒక సంవత్సరం కిందట, అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలతో దేశంలో రెజ్లింగ్ పోటీలన్నీ నిలిచిపోయాయి.

అయితే ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.

భారత క్రీడా మంత్రిత్వ శాఖ బ్రిజ్ భూషణ్‌ను తొలగించలేదు. అయితే లైంగిక వేధింపుల చట్టాలను పాటించకపోవడం వంటి అనేక లోపాలను చూపిస్తూ ఫెడరేషన్‌ను రద్దు చేసింది.

అనంతరం దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలిక బృందాన్ని ఏర్పాటు చేసింది.

రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న ఏకైక భారతీయ మహిళ సాక్షి మాలిక్‌ సహా దేశంలోని అత్యంత నిష్ణాతులైన రెజ్లర్‌లు బ్రిజ్ భూషణ్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ దిల్లీ రోడ్లపై నిరసన వ్యక్తం చేయడాన్ని హుడా గుర్తు చేసుకున్నారు.

ఈ నిరసనలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి.

నిరసనల సందర్భంగా రెజ్లర్‌లు నూతన పార్లమెంటు భవనం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కూడా రెజ్లర్‌ల పట్ల వ్యవహరించిన తీరును ఖండించి, వాళ్ల ఫిర్యాదులపై నిష్పాక్షిక విచారణ చేయాలని కోరింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
సాక్షి మాలిక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్ 58 కేజీల ఫ్రీ‌స్టైల్ విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు.

తప్పుకున్న సాక్షి

ఏటా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వివిధ క్రీడలకు కొన్ని టోర్నమెంట్‌లను అర్హతా ఈవెంట్‌లుగా నిర్దేశిస్తుంది.

ఒలింపిక్స్‌లో పోటీ చేయడానికి, రెజ్లర్‌లు తప్పనిసరిగా ట్రయల్స్‌లో ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించాలి. జాతీయ పోటీలలో విజయం సాధించాలి.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్యూఎఫ్ఐ) ఆమోదం పొందాలి.

కానీ పోటీలు లేకపోగా, స్పోర్ట్స్ క్యాలెండర్‌ అనేక వారాలపాటు ఖాళీగా ఉండటాన్ని హుడా గమనించారు.

"మేము ట్రైనింగ్ తీసుకున్నాం. కానీ ట్రయల్స్ లేవు, అంటే మేం పోటీ పడలేం. మాలోని లోపాలను సరిదిద్దుకోలేం. ఒలింపిక్స్‌కు సిద్ధం కాలేమేమో అనే భయం మమ్మల్ని నిరంతరం వెంటాడేది. ” అని హుడా అన్నారు.

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఈవెంట్‌లలో కేవలం 24 పతకాలు సాధించిన దేశానికి (వాటిలో పావు వంతుకు పైగా రెజ్లింగ్‌లోనే వచ్చాయి), ఇది ఆందోళన కలిగించే విషయమే.

నిరసనలు ప్రారంభమైన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, చివరకు 2023 డిసెంబర్‌లో డబ్యూఎఫ్ఐ కి ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికలలో బ్రిజ్ భూషణ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు పాల్గొనకుండా నిరోధించాలని రెజ్లర్‌లు భారత క్రీడామంత్రిని కోరారు.

బ్రిజ్ భూషణ్‌ ఇప్పటికే గరిష్టంగా మూడుసార్లు పని చేసినందు వల్ల ఆయన పోటీ చేయలేదు. కానీ, ఆయన సన్నిహితుడు సంజయ్ సింగ్ భారీ మెజారిటీతో చీఫ్‌గా ఎన్నికయ్యారు.

దీంతో మహిళా రెజ్లర్‌లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అదే రోజు, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ దీనికి నిరసనగా తాను ఇకపై రెజ్లింగ్ పోటీలలో పాల్గొననని ప్రకటించారు.

"ఆ క్షణం గురించి ఆలోచించినప్పుడు నేను ఇప్పుడు కూడా భావోద్వేగానికి గురవుతాను." అని మాలిక్ చెప్పారు.

"రెజ్లింగ్ వల్లనే నాకు ప్రేమ, గౌరవం లభించాయి. అయినా సరే నేను దానిని వదులుకోవలసి వచ్చింది." అని ఆమె అన్నారు.

వినేష్ ఫోగట్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసనలు ప్రపంచవ్యాప్తంగా పతాకశీర్షీకలు అయ్యాయి.

గాడిన పడిన శిక్షణ

సాక్షి మాలిక్ నిర్ణయంతో యువ రెజ్లర్‌లు ఆశ్చర్యపోయినా, వారు తొందరగానే తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

హరియాణా రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల రెజ్లర్ తనూ మాలిక్ మాట్లాడుతూ “నేను రెజ్లింగ్‌లోకి రావడానికి సాక్షి మాలికే కారణం.’’ అన్నారు.

"ఆమె ఏడవడం చూసినప్పుడు నాలో నేను ‘ఆమె మన కోసం పోరాడింది, మనం ఇప్పుడు దీన్ని వదిలిపెట్టకూడదు’ అనుకున్నాను." అన్నారు.

ఆ రోజు నుంచి తనూ మాలిక్ మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నారు.

రాష్ట్ర మహిళా యుధ్‌వీర్ రెజ్లింగ్ అకాడమీలో ఆమె శిక్షణ ఉదయం నాలుగున్నర గంటలకే ప్రారంభమవుతుంది.

పెద్ద పెద్ద ట్రక్కు టైర్లను ఎత్తడం, రెజ్లింగ్ టెక్నిక్‌లను అభ్యసించడం, కఠినమైన ఐదు గంటల ఫిట్‌నెస్ సెషన్‌తో ఆమె రోజు ప్రారంభమవుతుంది.

ఆహారం, విశ్రాంతి తర్వాత, మహిళా రెజ్లర్లు మధ్యాహ్నం నుంచి మరో ఐదు గంటల పాటు శిక్షణను కొనసాగిస్తారు.

12 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు రెజ్లింగ్ మ్యాట్ మీద చెమటలు పట్టేలా శిక్షణ పొందుతారు.

ఖాళీ సమయంలో వాళ్లు తాము ఫిట్‌గా ఉండటానికి సహాయపడే ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుంటారు.

వారిలో ఎవరూ అకాడమీలో లైంగిక వేధింపుల గురించి లేదా మాజీ రెజ్లింగ్ చీఫ్‌పై వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు.

అయితే తాము పట్టు వదలకూడదని వాళ్లు నిశ్చయించుకున్నారు.

అందరి అంచనాలకు విరుద్ధంగా, నిరసనల కారణంగా అకాడమీలో అమ్మాయిల సంఖ్య తగ్గలేదని కోచ్ సీమా ఖారబ్ చెప్పారు.

"నిరసనలతో ఈ యువ రెజ్లర్లు తమ స్వరాన్ని వినిపించవచ్చని, వేధింపులకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవచ్చని, వాళ్లకు వ్యవస్థ మద్దతు ఉందనే హామీ లభించింది." అని తెలిపారు.

సంజయ్ సింగ్
ఫొటో క్యాప్షన్, డబ్యూఎఫ్‌ఐ కొత్త చీఫ్ సంజయ్ సింగ్

ఈ జూన్‌లో పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై వేధింపులు, బెదిరింపులు, లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం వంటి అభియోగాలు మోపారు. అయితే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఇటీవల కొత్త ఫెడరేషన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ సింగ్ మాజీ చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌తో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు. తన ఎన్నికలో బ్రిజ్ భూషణ్ సింగ్ జోక్యానికి సంబంధించిన ఆరోపణలను తోసిపుచ్చారు.

రెజ్లర్‌లు తనను కొత్త చీఫ్‌గా అంగీకరించారని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం జాతీయ రెజ్లింగ్ పోటీలలో చాలా మంది పాల్గొనడమే దీనికి రుజువు అని ఆయన అన్నారు.

“మేము ఎవరిపట్లా వివక్షను ప్రదర్శించం. రెజ్లర్‌లు అందరూ నాకు కావాల్సిన వారే. నేను ఇద్దరు బిడ్డలకు తండ్రిని. అమ్మాయిలకు ఏమి అవసరమో నేను అర్థం చేసుకుంటాను.” అని సంజయ్ అన్నారు.

రీతికా హుడా
ఫొటో క్యాప్షన్, భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఐదుగురు మహిళా రెజ్లర్లలో రీతికా హుడా ఒకరు

వీడని భయం

రెజ్లింగ్ ఫెడరేషన్‌లో జరిగిన సంఘటనల కారణంగా తనూ మాలిక్ లాంటి యువతులకు లోలోపల భయం ఉంది.

"నన్ను ఒంటరిగా శిక్షణకు పంపడం గురించి మా అమ్మానాన్నలు ఎప్పుడూ భయపడుతుంటారు." అని ఆమె అన్నారు. "కానీ వాళ్లు మమ్మల్ని విశ్వసించాలి. లేకపోతే శిక్షణ ఎలా కుదురుతుంది? అది పోరాడకుండా ఓటమిని అంగీకరించడం అవుతుంది.’’ అని చెప్పారు.

మరికొందరు నిరుత్సాహంతో పెదవి విరిచారు. నిరసనల కారణంగా తాము చాలా కోల్పోయామని అన్నారు.

ఆసియన్ చాంపియన్‌లో స్వర్ణ పతక విజేత శిక్షా ఖారబ్ మాట్లాడుతూ, వివాదంతో తమ శిక్షణలో ఆటంకాలు ఎదురయ్యాయని, యువ రెజ్లర్లు కీలకమైన ఒక ఏడాది సమయాన్నికోల్పోయారని అన్నారు.

కానీ సాక్షి మాలిక్‌కు మాత్రం దీనిపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు.

"ముఖ్యమైన విషయం ఏమిటంటే - మనం పోరాడడం," అని ఆమె అన్నారు. "ఇకపై ఏ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లో ఎవరైనా ఇలాంటివి చేయటానికి ధైర్యం చేస్తారనుకోను. వేధింపులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్లకు అర్థమైంది." అని అన్నారు.

ఒలింపిక్స్‌లో ప్రపంచంలోని అతి పెద్ద రెజ్లింగ్ దిగ్గజాలతో పోటీ పడడంపై తనకు కాస్త భయంగా ఉందని, అయితే దాని కోసం ఎదురుచూస్తున్నానని హుడా చెప్పారు.

‘‘మీ కష్టాన్ని నమ్మండి, గెలుపోటములు ముఖ్యం కాదని సాక్షి మాలిక్ చెబుతుండేది. అదే నేనూ చేస్తాను.” అన్నారామె.

ఆమె శిక్షణకు సిద్ధమవుతుండగా, సాక్షి తన ఒలింపిక్ మెడల్‌తో నిలబడిన చిత్రం ఆమె వంక చూస్తోంది.

"నా దృష్టి అంతా ఇప్పుడు పతకం సాధించడంపైనే." అని హుడా అన్నారు.

ఏమో, ఎవరికి తెలుసు, ఏదో ఒకరోజు ఆమె పక్కన నా ఫోటో ఉంటుందేమో." అని ఆమె వ్యాఖ్యానించారు.