ఆంధ్రప్రదేశ్‌లో ‘999 పవర్ స్టార్’ అనే మద్యం బ్రాండ్ ఉందా? ఇంతకీ ఈ పేర్లకు ఎవరు అనుమతులిస్తారు, అభ్యంతరం ఉంటే ఎవరికి చెప్పాలి

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ‘999 పవర్ స్టార్’ అనే పేరు చుట్టూ రాజకీయ వివాదం నెలకొంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు మీద ఈ 'మద్యం బ్రాండ్' విడుదల చేశారని ఎక్స్ వేదికగా వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపించింది.
సాధారణంగా సినిమా రంగంలో కొందరు నటులకు అభిమానులు ‘బిరుదులు’ పెట్టుకుంటారు. టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్‌ను 'పవర్ స్టార్' అని పిలుస్తారు.
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ అనే పేర్లతో మద్యం బ్రాండ్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఆ పేర్లపై అప్పట్లో టీడీపీ సోషల్ మీడియా విభాగం విమర్శలు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక హోదా తీసుకురాలేక జగన్‌మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ అనే మద్యం బ్రాండ్ తీసుకొచ్చారు’ అని అప్పట్లో టీడీపీ నాయకులు, శ్రేణులు విమర్శలు చేశారు.

ఇంతకీ ‘999 పవర్ స్టార్’ బ్రాండ్ ఉందా?
‘999 పవర్ స్టార్’ పేరుతో ఏపీ ప్రభుత్వం మద్యం విడుదల చేసిందంటూ జులై 2న వైఎస్‌ఆర్‌సీపీ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
ఇది పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఇచ్చిన ‘బహుమతి’ అని అర్థం వచ్చేలా ఆ పోస్ట్‌లో రాశారు.
దీనికి కౌంటర్‌గా టీడీపీ.. ఆ బ్రాండ్ ఇప్పటిది కాదని, అది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ కాలం నుంచే ఉందని చెబుతూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
“చివరకు వైసీపీ వాళ్లు నా పేరుతో కూడా మద్యం బ్రాండ్ తీసుకొచ్చారనే విషయాన్ని పత్రికల్లో చూసి తెలుసుకున్నా” అని ఎన్నికల ప్రచారం సందర్భంగా 2024 మార్చి 30న పిఠాపురంలో పవన్ కల్యాణ్ అన్నారు.
ఇప్పుడు ఆ వీడియోను టీడీపీ పోస్ట్ చేసింది.
‘‘999 పవర్ స్టార్’’ బ్రాండ్ పేరుతో మద్యం ఉన్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.
ఆ పేరుతో బ్రాండ్ ఉన్నట్లు విజయవాడకు చెందిన ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఉన్నతాధికారి బీబీసీతో చెప్పారు. పేరు వెల్లడించడానికి ఆ అధికారి ఇష్టపడలేదు.
చండీగఢ్‌కు చెందిన ‘‘ఎంపైర్ ఆల్కోబ్రెవ్ ప్రైవేట్ లిమిటెడ్’’ అనే కంపెనీ ఈ బ్రాండ్‌తో చాలాకాలంగా విస్కీ తయారు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలకు ఆ కంపెనీ మద్యం సరఫరా చేస్తోంది.
ప్రస్తుతం ‘‘999 పవర్ స్టార్’’ బ్రాండ్ పేరుతో సోషల్ మీడియాలో కనిపిస్తున్నట్లే గతంలో ‘‘స్పెషల్ స్టేటస్’’, ‘‘త్రీ క్యాపిటల్స్’’ అనే మద్యం బ్రాండ్లు సోషల్ మీడియాలో కనిపించాయి.
అప్పుడు టీడీపీకి చెందిన అనుబంధ సోషల్ మీడియా విభాగాలు, టీడీపీ అభిమానుల సోషల్ మీడియా అకౌంట్లలో ఈ బ్రాండ్లపై అనేక మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు ‘‘999 పవర్ స్టార్ బ్రాండ్’’ మీద వైఎస్‌ఆర్‌సీపీ, ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా విభాగాలు కామెంట్లు చేస్తున్నాయి.
అయితే ‘‘స్పెషల్ స్టేటస్’’, ‘‘త్రీ క్యాపిటల్స్’’ పేరుతో ఎప్పుడూ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరగలేదని, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
2021లోనూ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) అధికారులు ఇదే విషయాన్ని చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/YSRCP

ఫొటో సోర్స్, Getty Images
మద్యం బ్రాండ్లకు పేర్లు ఎలా పెడతారు?
మద్యం బ్రాండ్లకు ఏపీబీసీఎల్ అనుమతి ఇస్తుందని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు.
మద్యం తయారు చేసే కంపెనీ తన బ్రాండ్‌కు ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చని ఆయన చెప్పారు.
“ప్రభుత్వ ఎక్సైజ్ విధానం ప్రకారం మద్యం తయారు చేసే డిస్టలరీ కంపెనీలు కావలసిన బ్రాండు పేరును పెట్టుకోవచ్చు. అయితే, ఇందుకోసం ఆ పేరుకు అనుమతి కోరుతూ సదరు కంపెనీ ఏపీబీసీఎల్‌లోని డిస్టిలేషన్ విభాగానికి దరఖాస్తు పంపాల్సి ఉంటుంది.
ఏపీబీసీఎల్ అధికారులు ఆ పేరును పరిశీలిస్తారు. అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాష్ట్రంలోని మిగతా అన్ని డిస్టలరీలకు సమాచారం పంపుతారు.
ఈ ప్రక్రియ కోసం కొంత గడువు ఇస్తారు. ఒక వేళ అభ్యంతరాలు వస్తే ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ పేరు కోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీకి పంపుతారు.
దానిపై వారు మార్పులతో తిరిగి దరఖాస్తు చేసుకోవడం లేదా మరో కొత్త పేరును సూచించడం జరుగుతుంది. తర్వాత దానికి ఆమోదం తెలుపుతారు.
నిర్ణీత రుసుం చెల్లించి ఏటా ఆ పేరును రెన్యూవల్ చేయించుకుంటూ ఉండాలి. మద్యం వినియోగదారులను ఆకర్షించేందుకు, సులభంగా గుర్తుపెట్టుకునే పేర్లనే పెడతారు.
ఒక వేళ దరఖాస్తు పరిశీలన సమయంలో అధికారులకు ఆ పేరు విషయంలో అభ్యంతరం ఉంటే సంబంధిత కంపెనీకి ఆ విషయాన్ని తెలియజేస్తారు.
అప్పటికే ఇతర కంపెనీల బ్రాండ్లకు ఉన్న పేర్లు, అభ్యంతరకరమైన పేర్లు అయినప్పుడు అధికారులు ఆ దరఖాస్తుని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు’’ అని ఆ అధికారి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అవి సోషల్ మీడియా బ్రాండ్లు: ఏపీబీసీఎల్
సోషల్ మీడియాలో అనేక పేర్లతో మద్యం బ్రాండ్లు కనిపిస్తున్నాయని ఏపీబీసీఎల్ అధికారులు అంటున్నారు. నిజానికి బ్రాండ్ పేరు విషయంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే కూడా ఏపీబీసీఎల్ చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
‘‘మద్యం బ్రాండ్ల పేరు విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు ఏపీబీసీఎల్‌కు సమాచారం ఇవ్వవచ్చు. అంతేకాదు బ్రాండ్ పేరుతో ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకైనా ఇబ్బంది కలిగిస్తే ఆ తీవ్రతను బట్టి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు కోర్టులను కూడా సంప్రదించవచ్చు’’ అని విశాఖపట్నానికి చెందిన స్టేట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారి చెప్పారు.
‘ఒకవేళ సోషల్ మీడియాలో కనిపించే ఏదైనా మద్యం బ్రాండ్ నిజంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ప్రతి మద్యం సీసాపై సీల్ ఉంటుంది. అది ప్రభుత్వం ఏర్పాటు చేసే సీల్. దానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టలరీలో తయారైంది, ఏ డిపోకి వెళ్లింది, ఏ దుకాణానికి వెళ్లిందో కూడా తెలుస్తుంది’ అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్, 1968 ప్రకారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఏపీలో డిస్టిలరీలకు మద్యం తయారీ అనుమతులు ఇస్తుంది.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దాదాపు 3 వేల మద్యం దుకాణాల్లో అమ్మకాలు సాగుతున్నాయి.
ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం విధానాన్నే అనుసరిస్తుందా? లేదంటే కొత్త పాలసీని తీసుకొస్తుందా ? అనేది ఇంకా తెలియదు.
ఏపీలో పాత మద్యం విధానానికి 2024 సెప్టెంబర్ వరకు గడువు ఉంది.
మద్యం పేర్ల వివాదంపై కేసులున్నాయా?
ఏపీలో మద్యం బ్రాండ్లపై వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేసులేమైనా నమోదయ్యాయా అని విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలోని కొందరు పోలీసు అధికారులతో బీబీసీ మాట్లాడింది.
మద్యం బ్రాండ్లు, పేర్ల విషయంలో ఎవరూ కేసులు పెట్టలేదని పోలీసులు చెప్పారు.
మద్యం తాగి గొడవలు చేయడం, నేరాలు చేయడం వంటి కేసులే కానీ, మద్యం పేరు విషయంలో కేసులు నమోదు కాలేదని ఒక పోలీసు అధికారి చెప్పారు.
ఒక మద్యం బ్రాండ్ వలన ఎవరికైనా వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగితే వాళ్లు సివిల్ కేసులు పెట్టవచ్చు. పరువునష్టం కోరవచ్చు.
సోషల్ మీడియాలో కూడా వ్యక్తులకు, సంస్థలకు, వ్యవస్థలకు నష్టం వాటిల్లే విధంగా పేర్లు ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని విశాఖపట్నానికి చెందిన న్యాయవాది శ్రీరామమూర్తి బీబీసీతో చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














