భారతీయుడు-2 రివ్యూ: లోక నాయకుడు ప్రేక్షకులను అలరించగలిగాడా?

ఫొటో సోర్స్, Twitter/Lyca Productions
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
దాదాపు మూడు దశాబ్దాల (28 ఏళ్ళు) కిందటి సోషల్ కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా వచ్చిన ‘భారతీయుడు-2’ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది.
దీనికి ముఖ్య కారణం డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్‌ల కాంబినేషన్. మరి తాజాగా వచ్చిన ఈ సినిమా ప్రీక్వెల్ స్థాయితో పోటీ పడిందా? దాన్ని మించిందా? లేక దెబ్బతిన్నదా ? చూద్దాం.
1996లో సోషల్ కల్ట్ క్లాసిక్‌గా భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన సినిమా ‘భారతీయుడు.’
40 ఏళ్ళ కమల్ హాసన్‌ను 70 ఏళ్ళ సేనాపతిగా చూసిన తెలుగు ప్రేక్షకులు, ఆ పాత్రను అలానే ఇప్పటి వరకు గుర్తుంచుకున్నారంటే దానికి కారణం కమల్ నటన, శంకర్ దర్శకత్వాలే.

ఫొటో సోర్స్, Twitter/Lyca Productions
కథేoటి?
భారతీయ సమాజంలో లంచం వల్ల విద్య, వైద్య రంగాల్లో ప్రమాణాలు పడిపోవడం... అర్హత, ప్రతిభ ఉన్నవారు ఎలా నష్టపోతున్నారు అన్న అంశం మీద తీసిన సినిమా ఇది.
ఈ అవినీతి పేరుకుపోయిన తీరును చూపించడానికి అనేక సబ్ ప్లాట్స్ ఈ కథలో ఉన్నాయి.
అవినీతిని నిర్మూలించాలన్న ఆశయంతో సేనాపతి చెన్నై తిరిగి వస్తాడు. అవినీతి నిర్మూలనలో ప్రజలకు ఓ మార్గం సూచిస్తాడు.
ఆ మార్గం ఏమిటి ? దాని వల్ల సమాజంలో నిజంగా మార్పు వచ్చిందా? ఇదీ.. స్థూలంగా ఈ సినిమా కథ.

ఫొటో సోర్స్, Twitter/Lyca Productions
సేనాపతి (కమల్ హాసన్):
సేనాపతి రీ-ఎంట్రీని ప్రీక్వెల్‌తో కనెక్ట్ చేసే ఎలిమెంట్‌తో డిజైన్ చేయడం ఈ ఎంట్రీకి ప్రాధాన్యం ఉండేలా చేసింది.
శంకర్ 1996లో ‘భారతీయుడు’లో ‘సేనాపతి’ పాత్ర కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను తీసుకుని దానికి తగ్గట్టు స్పెషల్ ఎఫెక్ట్స్‌తో కమల్ హాసన్ పాత్రను డిజైన్ చేశారు.
సేనాపతి పాత్రకు అకాడమీ అవార్డ్ విన్నర్ మైఖేల్ వెస్ట్ మోర్ మేకప్ చేశారు. ఇది ఆ రోజుల్లో ఏ దర్శకుడూ ఊహించని, చేయలేని ప్రయోగం. అందుకే భారతీయ సినిమా చరిత్రలో సేనాపతి పాత్రకి విశేష స్థానం ఉంది.
భారతీయుడు-2లో సేనాపతి పాత్ర నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గంలో నడిచే పాత్ర అనే చెప్పే సన్నివేశంగా ఈ పాత్ర తెరపై తైపే (తైవాన్ రాజధాని) అనే ప్రదేశంలో ఉండటం వల్ల ఈ సింబాలిజం కథకు బలమైంది.
ఎందుకంటే ఆ ప్రదేశంలోనే సుభాష్ చంద్ర బోస్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ కనెక్టింగ్ ఎలిమెంట్ వల్ల ఈ రీ ఎంట్రీ బలంగా ఉంది.

ఫొటో సోర్స్, @shankarshanmugh
భారతీయుడులో సేనాపతిది ఎమోషన్స్ నిండిన పాత్ర.
దేశభక్తితో పాటు మానవీయ కోణం ఉండటం వల్లే ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అయ్యారు.
కానీ ఈ సీక్వెల్‌లో సేనాపతి కేవలం 'Action driven.'
అన్యాయం, అవినీతి పట్ల ఈ పాత్రకు కలిగే ఎమోషన్స్ ఈ సినిమాలో సరిగ్గా రిఫ్లెక్ట్ కాలేదు.
కేవలం యాక్షన్ హీరో ఎలిమెంట్స్, కామిక్ టైమింగ్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్న పాత్ర ఇది.
అందుకే ఈ సినిమా ముగింపులో ఏ రకమైన ఉద్వేగం ప్రేక్షకుడికి కలగదు. ఈ సేనాపతిని సమాజం తమలో ఒకడిగా, తమ కోసం ఉండే వాడిగా భావించే బలమైన ఘటనలు లేవు.
అలాగే మర్మకళ లాంటి గంభీర విషయాన్ని సోషల్ జస్టిస్ సందర్భంలో కూడా హాస్యంగా మార్చడం సినిమా కథలో ఉన్న జీవాన్ని చంపేసింది. మొత్తం మీద యాక్షన్ హీరోగా సేనాపతికి వెల్కమ్ చెప్పిన సినిమా ఇది.

ఫొటో సోర్స్, Twitter@shankarshanmugh
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్):
ఇతను ఒక యూట్యూబర్. ఈ పాత్ర వల్లే సేనాపతి భారత్‌కు తిరిగి వస్తాడు కనుక ఇది కథలో బలమైన పాత్ర. సమాజం కోసం నిలబడే, అన్యాయాన్ని ప్రశ్నించే పాత్రగా మొదలయ్యే ఈ పాత్ర తనవరకు వచ్చేసరికి యూ-టర్న్ తీసుకుంటుంది.
ఈ షిఫ్ట్ వల్ల అతనిది బలమైన రోల్ నుంచి బలహీనమైనదిగా మారిపోయింది.
సిద్ధార్థ్ ఎనర్జీ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింటైనా చివరకు అది కూడా పేలవమై పోయింది. చివరిలో ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయినట్లు చూపించడం కూడా అసహజంగా ఉంటుంది.
వరదరాజన్ (సముద్రఖని):
సముద్రఖని లాంటి అద్భుత నటుడికి ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ ఉన్నా, అది ఇంకా బలంగా ఉండి ఉండాల్సింది. సేనాపతి పాత్రతో ఏదో ఒక కనెక్షన్ ఎలిమెంట్ ఉండేలా దీన్ని మలిస్తే, ఈ సినిమాకు సముద్రఖని అసెట్ అయ్యేవాడు.
అలా కాకుండా ఒక ఫ్యామిలీ డ్రామాలోనే ఈ పాత్ర పరిధిని కుదించడం వల్ల సముద్రఖని గొప్పగా నటించినా, కథలో స్కోప్ లేకపోవడం వల్ల సబ్ ప్లాట్‌లో ఒక పాత్రలానే మిగిలిపోయింది.
ప్రమోద్ (బాబీ సింహ):
సేనాపతిని పట్టుకునే ప్రయత్నంలో ఉండే ఓ సీబీఐ ఆఫీసర్ ఇతను. కథ మేరకు బాగానే చిత్రించారు. కానీ సేనాపతికి హీరోయిక్ ఎఫెక్ట్స్ ఉంచే క్రమంలో కొన్ని చోట్ల ఈ అధికారికి ఉండాల్సిన బిగిని లేకుండా చేశారు.
ఇక ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నా వారి రోల్స్ పేలవంగా కనిపిస్తాయి. అలాగే వారి స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ ఉండటం వల్ల వీరిద్దరు సినిమాకు అసెట్ కాలేకపోయారు.

ఫొటో సోర్స్, Twitter/ShankarShanmugh
నోస్టాల్జిక్ వాల్యూ - ప్లస్సా? మైనస్సా?
‘భారతీయుడు-2’ సినిమాకు ‘నోస్టాల్జిక్ వాల్యూ’ ఉంది. 1996లో బ్లాక్ బస్టర్ సినిమాగా వచ్చిన ‘భారతీయుడు’తో ప్రేక్షకులకు ఉన్న ‘సినిమాటిక్ బాండింగ్’ వల్ల ఈ సీక్వెల్ ప్రేక్షకులను కొంత ఆ పూర్వ భాగంతో కూడా కనెక్ట్ చేసుకునేలా చేస్తుంది.
28 ఏళ్ళ క్రితం ‘భారతీయుడు’ అనే సోషల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను విజువల్ గ్రాండీర్‌తో అద్భుతంగా మలిచిన దర్శకుడు శంకర్.
కానీ ఈ 2024 సినిమాలో ఈ ఎఫెక్ట్స్ కమర్షియల్ సినిమా ఫార్ములాగా మారిపోయాయి. ఈ సందర్భంలో శంకర్ ‘భారతీయుడు-2’కి ఈ ‘నోస్టాల్జిక్ వాల్యూ’ బలమైందో, బలహీనమైందో చూద్దాం.
ప్లస్ పాయింట్స్
సేనాపతి పాత్ర పయనం 28 ఏళ్ళ తర్వాత ఆ వయసులోనూ (అంటే దాదాపు వందేళ్ళకు దగ్గర పడిన పాత్ర) అంతే సహజంగా ఉండటం ఒక ప్లస్ పాయింట్. అలాగే ‘థీమ్ కనెక్షన్’ను మిస్ కాకుండా ప్రీక్వెల్‌కు కొనసాగింపు ఉండేలా చూసుకోవడం కూడా కొంతమేరకు బలమే.
మైనస్ పాయింట్స్
‘భారతీయుడు-2’ ఎక్కువగా యాక్షన్ టోన్‌తో నడిచిన కథ. కానీ భారతీయుడు మాత్రం ఎమోషనల్ టోన్‌తో డ్రామా, యాక్షన్‌ల జోడింపుతో నడిచిన సినిమా. అందుకే ఈ సీక్వెల్‌లో అవినీతి-దేశభక్తి కేంద్రంగా ఉండే సినిమాల్లో కలిగే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కలగదు.
మొత్తానికి స్టోరీ టెల్లింగ్‌లోనే వైరుధ్యమైన మార్పులు ఉండటంతో ‘నోస్టాల్జిక్ వాల్యూ’ ఈ సీక్వెల్‌కు మైనస్ అయ్యిందనే అనుకోవచ్చు.

ఫొటో సోర్స్, Twitter/Anirudh Ravichander
సినిమాటోగ్రఫీ
కొన్ని అంశాల్లో ‘భారతీయుడు’ కన్నా ఈ సీక్వెల్ లైటింగ్, ఫ్రేమింగ్, యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ అంశాల్లో మెరుగ్గా ఉంది. అలాగే బ్రైట్ కలర్ పాలెట్ కూడా ఉండటం వల్ల ఇది సినిమా విజువల్ అప్పీల్‌కు బలమైంది.
కానీ ఈ సీక్వెల్ ‘సోషల్ రియాలిటీ’ని ప్రతిఫలించడంలో ఊహించిన స్థాయిని అందుకోలేదు. కేవలం కమర్షియల్ స్క్రీన్ ఫ్రేమ్‌కే పరిమితమైపోయాయి ఈ ఎఫెక్ట్స్.
సాంకేతిక సాధనాల మీద ఎక్కువ ఆధారపడకుండా విజువల్ రిచ్‌నెస్ ఉండేలా చేసిన ‘భారతీయుడు’ ముందు భారతీయుడు-2 సీజీఐ, వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ తేలిపోయాయి.
కథ, విజువల్ టోన్‌ల మధ్య బ్యాలన్స్ తప్పడం వల్ల ఈ ఎఫెక్ట్స్ కొంతవరకు బ్యాక్ ఫైర్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Twitter@shankarshanmugh
దర్శకత్వం
సామాజిక అంశం కేంద్రంగా ఉన్న కథలో యాక్షన్‌ను, డ్రామాను జోడించి కమర్షియల్ హిట్స్ కొట్టడం శంకర్ మార్క్ డైరెక్షన్‌లో ప్రధాన అంశం. కానీ ‘భారతీయుడు-2’ లో ఈ మార్క్ గురి తప్పింది.
యాక్షన్ సీక్వెన్స్‌లకు, ఎమోషనల్ సన్నివేశాలకు మధ్య తప్పిన బాలన్స్‌తో టైట్ స్క్రీన్ ప్లే ఉండే స్క్రీన్ టైమ్ తగ్గిపోయింది.
‘భారతీయుడు’ లో ఉన్న సేనాపతి పాత్ర చిత్రణలో ఉన్న ‘ఎమోషనల్ డెప్త్’ ఇందులో లేనట్టే అనిపిస్తుంది. తన సక్సెస్ ఫార్ములా అయిన ‘సోషల్ యాక్షన్’ కాన్సెప్ట్‌ను సరిగ్గా ప్రజెంట్ చేయడంలో శంకర్ కొంత ఫెయిల్ అయ్యారు.
అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్‌గా మారిందా?
‘భారతీయుడు’ లో పాటలు కథలో ఒక భాగం. కానీ ఈ సీక్వెల్‌లో మాత్రం పాటలు కమర్షియల్ గ్రౌండ్‌లో కనిపిస్తాయి. ’సేనాపతి’ పాత్ర గురించి రాసిన ‘తాత వస్తాడే’ పాటకు కూడా మ్యూజిక్ పక్కా మాస్ కమర్షియల్ స్టయిల్‌లో కంపోజ్ చేయడంతో ఆ పాటకు ఎమోషనల్ డెప్త్ లేకుండా పోయింది. మిగిలిన పాటల్లో క్యాచీ లిరిక్స్ కానీ, ఎమోషన్‌ను పండించేవిగానీ లేవు.
సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సన్నివేశాల్లో, యాక్షన్ సీక్వెన్స్‌లలో, దేశభక్తి థీమ్‌ను చిత్రించడంలో పర్లేదనిచ్చింది. కానీ కొన్ని సన్నివేశాల్లోఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డైలాగ్స్‌ను డామినేట్ చేయడం ఒక మైనస్ అయితే, ఒరిజినాలిటీని కోల్పోయినట్టు ఉండటం, అలాగే ఒక ఐకానిక్ మ్యూజిక్ స్టయిల్ దీనిలో కనిపించకపోవడం అన్నిటికంటే పెద్ద వెలితి. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ యాక్షన్ మూవీకి సరిపోయే మ్యూజిక్ మ్యాజిక్ ఈ సినిమాలో కనబడదు.
డబ్బింగ్ ఎలా ఉంది?
ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు తప్ప మిగిలిన అన్ని పాత్రలకు డబ్బింగ్ నప్పడం వల్ల ఈ అంశం మాత్రం సినిమాకు ప్లస్ పాయింట్‌గానే మారింది.

ఫొటో సోర్స్, Lyca Productions
కమర్షియల్ ఎలిమెంట్స్
సీరియస్ కథలో కథకు సంబంధం లేని పాటలు, కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో కథకు తగ్గ సీరియస్ వాతావరణం సినిమాలో కనబడలేదు. సినిమా రన్ టైమ్ ఎక్కువ ఉండటం, దానికి తగ్గ స్టోరీ ఫ్లో లేకపోవడంతో, చాలా చోట్ల బోరింగ్‌గా అనిపిస్తుంది.
కథలో స్టార్ కాస్ట్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం వల్ల స్క్రీన్ ప్రజెన్స్ కేవలం కమర్షియల్ అంశంగా మాత్రమే మిగిలిపోయింది. సినిమా బిగినింగ్ మాత్రమే ప్లాట్‌ను ఎస్టాబ్లిష్ చేసేలా ఉంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ పూర్తిగా కమర్షియల్ ఫక్కీలో ఉండటం వల్ల సినిమా టోనే పూర్తిగా మారిపోయింది.
సీరియస్ డ్రామా, యాక్షన్, కామెడీ, మసాలాలతో ఈ సినిమా కలగాపులగం అయిపోయి, ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ తాకిడికి కథ, ఆత్మ ప్రేక్షకుడికి కనిపించకుండా పోయింది.
కథే వీక్‌గా ఉండటం వల్ల, ఎన్నో ఉపకథలు కలిసిపోవడం వల్ల, కేవలం యాక్షన్ సీన్స్ మీదే కథ నడవటం వల్ల ‘ఎమోషనల్’గా ప్రేక్షకులతో కనెక్ట్ కాలేకపోయింది ఈ సినిమా. అలాగే సాంకేతికంగా కూడా నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయింది ఈ సినిమా .
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














