ఎస్ జానకి: రెండేళ్ల చిన్నారిలా, 90 ఏళ్ల ముసలమ్మలా అంత చక్కగా ఆమె ఎలా పాడేవారు?

ఎస్ జానకి

ఫొటో సోర్స్, S.JANAKI TWITTER

    • రచయిత, డాక్టర్. రొంపిచర్ల భార్గవి
    • హోదా, బీబీసీ కోసం

నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ.. అనే పాట వినిపించినప్పుడు దిగులంతా పోయి మనసు దూదిపింజలా తేలికవుతుంది.

మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం.. మెరిసినా కరుగు నీ యవ్వనం.. ఈ పాట విన్నప్పుడు సన్నని విషాదంతో గుండె బరువెక్కుతుంది.

నీ లీల పాడెద దేవా.. అని నాదస్వరంతో ఆ గొంతు పోటీ పడుతుంటే.. ఈమె పలకలేని స్వరం వుందా అనిపిస్తుంది.

శివదీక్షాపరురాలనురా.. అనే ఘనం శీనయ్య పదం పాడుతుంటే ఇంతకన్నా శృంగార భావవ్యక్తీకరణ ఉంటుందా? అనిపిస్తుంది

ఇంకా ఇలా చెప్పాలంటే ఎన్నో పాటలు.. ఆమె పాడిన వేల పాటల్లో మంచి పాటలు ఎంచడం ఎంత కష్టమైన పని.

ఇదంతా ఎవరి గురించీ అంటే.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖ నేపథ్య గాయని యస్. జానకి గురించే..

పైన చెప్పిన పాటలలో ప్రతిభంతా ఆమె దేనా? ఆ పాట వెనక పనిచేసిన రచయితలూ, సంగీత దర్శకులు, నటించినవారు, చిత్రీకరించిన వారూ లేరా? అంటే ఉన్నారు. కానీ రచయిత రాసిన సాహిత్యాన్ని, సంగీత దర్శకుడి బాణీనీ జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని, ఆ పాటకు మెరుగులు దిద్ది.. తన గొంతులో సొగసుగా పలికించడ మనే పని అత్యంత ప్రతిభా వంతంగా చేశారామె.

అందుకే ఇళయారాజా లాంటి సంగీత దర్శకులు తమ పాటలు ఆమే పాడాలని పదే పదే కోరి, వెంటపడి మరీ పాడించుకునే వాళ్లు. ఈ మాట జానకి తన ఇంటర్వ్యూల్లో చాలా సార్లు చెప్పారు.

ఆవిడ గొంతు సన్నగా తీగలాగా సాగుతూ, పై స్థాయిలో శ్రుతులు కూడా అవలీలగా పలుకుతూ అలరిస్తుంది.

గాయనీ గాయకులకు అనుకరణ అనేది ప్రధానంగా వచ్చి వుంటుంది. మిమిక్రీ కాదు అది మళ్లీ వేరే. అలా మిమిక్రీ చేస్తూ నటులను అనుకరిస్తూ పాడేది బాలసుబ్రహ్మణ్యం. ఈ అనుకరణ ఆవిడ చాలా బాగా చేస్తారు. అందుకే ఆవిడ ఏ రకమైన పాటయినా అంటే సోలో అయినా, యుగళమైనా, క్లబ్ సాంగయినా ,లాలి పాటయినా, ఏదైనా పాడి మెప్పించ గలరు.

అంతే కాదు రెండేళ్ల పిల్ల లాగానూ, 90 ఏళ్ల ముసలమ్మ లాగానూ, టీనేజి పిల్లవాడి లాగానూ కూడా పాడి మెప్పించగలరు.

ఎస్ జానకి

ఫొటో సోర్స్, Wikipedia

రెండేళ్ల పిల్లవాడి లాగా పాడిన పాట - "గోవుల్లు తెల్లనా, గోపయ్య నల్లనా"

టీనేజ్ పిల్లవాడిలాగా పాడినది - "పాప పేరు మల్లి ఊరు కొత్త దిల్లీ"

ముసలమ్మ లాగా పాడింది - "అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక"

ఆమె ఇప్పటి వరకూ వివిధ భాషల్లో సుమారు యాభైవేల పాటల వరకూ పాడి వుంటారని ఒక అంచనా.

ఆమె పాడిన భాషలు - తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఒడియా, ఇంగ్లీషు, బెంగాలీ..

ఆమెకు నాలుగు సార్లు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది.

1977 -సెందూరప్పూవె అనే తమిళ పాటకి

1981 - ఎత్తమనూర్ అంబలతిలే అనే మళయాళం పాటకి

1984 - వెన్నెల్లో గోదారి అందం అనే తెలుగు పాటకి

1992 - ఇంజి ఇడుప్పజఘ అనే తమిళ పాటకి

తమిళ ప్రభుత్వం కలైమామణి బిరుదుతో సత్కరించింది. మొత్తం ఆమెకు 32 అవార్డులు వచ్చాయి. కేరళ, ఒడిశా, తమిళ, తెలుగు ప్రభుత్వాల నుంచి ఆమె ఈ అవార్డులు అందుకున్నారు.

మైసూరు విశ్వ విద్యాలయం నుంచి ఆమె గౌరవ డాక్టరేట్ పొందారు. 2013లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. కానీ ఆమె దాన్ని తిరస్కరించారు. అభిమానుల ఆదరాభిమానాలే తనకు చాలన్నారు.

వీడియో క్యాప్షన్, ఎన్టీఆర్ శతజయంతి: రామారావు గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

ప్రస్థానం ఎలా మొదలైంది?

ఇన్ని వేల పాటలు పాడి ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానం సంపాదించిన యస్.జానకి గాన ప్రస్థానం ఎలా మొదలయిందో ఒక సారి పరిశీలిస్తే ఆమె కృషి ఎంతటిదో తెలుస్తుంది.

ఆమె అసలు పేరు శిష్ట్లా జానకి. తల్లిదండ్రులు శిష్ట్లా శ్రీరామమూర్తి, సత్యవతి. ఆమె పుట్టింది గుంటూరు జిల్లాలోని రెపల్లె దగ్గరున్న "పల్లపట్ల" అన్న గ్రామంలో. తండ్రి స్కూల్ టీచర్‌గా పనిచేసేవారు. ఆమె చాలా చిన్నతనం నుంచే ఏ పాటయినా ఇట్టే పట్టేసి పాడుతూ వుండేవారు.

ప్రత్యేకంగా సంగీతం నేర్చుకున్నది తక్కువ. ఏదైనా సరే అనుకరించడం ఆమె బాగా వచ్చేది. ఒకసారి వాళ్ల ఊరిలో సర్కస్ వస్తే, ఆ సర్కస్‌లో పిల్లని అనుకరిస్తూ పిల్లి మొగ్గలేసి, రూపాయి బిళ్ల నోటితో అందుకున్నానని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.

ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా కరీంనగర్ దగ్గరున్న సిరిసిల్లలో చిన్నతనమంతా గడిపారు. ఆ రోజుల్లో చూసిన సినిమాల్లో పాటలు ఆమె అచ్చంగా అలాగే పాడుతుంటే అందరు మరీ మరీ పాడించుకుని వినేవారు. జానకి అక్కచెల్లెళ్లంతా కూడా బాగా పాడే వారట.

వీడియో క్యాప్షన్, ఎన్టీఆర్.. ఇలా గుర్తుండిపోతారు

రాజమండ్రిలో..

కుటుంబం రాజమండ్రిలో ఉన్నప్పుడు తల్లి బలవంతం మీద గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద ఒక సంవత్సర కాలం జానకి సంగీతం నేర్చుకున్నారు.

జానకి పాటవిని ‘‘నీకు సరిగమలు నేర్పవలసిన పనిలేదు. అవి నీగొంతులోనే పలుకుతున్నాయి.’’ అని చెప్పి నేరుగా "నగుమోము గనలేని" అనే త్యాగరాజ కీర్తన నేర్పడం మొదలు పెట్టారు.

జానకి ఒక సంవత్సరం సంగీతం నేర్చుకున్నాక ఆయన కాలంచేశారు. ఆ తర్వాత ఆమె గురువు దగ్గర సంగీతం నేర్చుకోలేదు. కర్ణాటక సంగీతం మీద తనకి పెద్దగా ఆసక్తి లేదనీ, హిందీ సినిమా పాటలు, తెలుగు సినిమా పాటలు బాగా పాడేదాన్నని ఆమె చెబుతారు.

హిందీలో లతా గొంతే తనకి గురువని చెబుతారు జానకి. లతా పాట పాడే విధానం తనని బాగా ఆకర్షించిందనీ ఆమె పాడిన "రసికబలమా" అనే పాట తను ఎవరు పాడమన్నా పాడేదాన్నని చెబుతారు. అలాగే ఘంటసాల, లీల, సుశీల.. వీరి పాటలు కూడా పాడే వారట.

వీడియో క్యాప్షన్, కాంతార సినిమాలో మాదిరిగా భూతకోల ఆడేవారు ఎలా అలంకరించుకుంటారో మీకు తెలుసా?

సినిమాల్లోకి అలా..

తండ్రి మరణించిన తర్వాత అక్కాబావల దగ్గర హైద్రాబాద్‌లో జానకి వుండేవారు.

ఆమె బావగారు గరిమెళ్ల నరసింహా రావు మంచి సంగీత విద్వాంసులు. ఆయన కుమారుడే నేడు అన్నమయ్య ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్.

బావ గారింట్లో వుంటూ లలిత సంగీత కచేరీలు చేస్తున్న జానకి డాక్టర్ చంద్రశేఖర్ దృష్టిలో పడింది. ఆయన ఒక మిమిక్రీ కళా కారుడు. తక్కువ వ్యవధిలో అనేకమంది ప్రముఖుల వేషాలు వేసి మిమిక్రీ చేస్తుండేవారు. ఆయన మేకప్ మార్చుకునే వ్వవధిలో జానకి పాట వుంటే బాగుంటుందని భావించారు. దీనికి జానకి బావగారు కూడా ఒప్పుకున్నారు.

అలా కొంత కాలం జరిగాక ఆయన జానకి పాట అందరూ వింటే బాగుంటుందని భావించారు. అప్పుడే ఏవీఎం స్టూడియోకి ఒక సిఫారస్ లెటర్ రాస్తే వాళ్లు రమ్మన్నారు. జానకి వెళ్లి అక్కడ పాడగానే వాళ్లు ఆనందించి స్టాఫ్ ఆర్టిస్టుగా తీసుకున్నారు.

జానకి మొదటగా 1957లో తమిళ్ సినిమా "విధియున్ విలయాట్టు" కోసం పాట పడారు. టీ చలపతి రావు దర్శకత్వంలో పాడిన ఈ పాట, సినిమా రిలీజ్ కాకపోవడంతో వెలుగు చూడలేదు.

ఆ వెంటనే, అదే సంవత్సరంలో తెలుగులో తిలక్ దర్శకత్వంలో వచ్చిన "ఎంఎల్ఏ" సినిమాలో పాడే అవకాశం లభించింది. పెండ్యాల దర్శకత్వంలో ఘంటసాలతో కలిసి "నీ ఆశ అడియాస" అనే పాట పాడారు.

వీడియో క్యాప్షన్, ఏఆర్ రెహమాన్ షోను ఆపేయాలని వేదిక పైకి వెళ్లిన పోలీసులు... అసలేం జరిగింది?

పేరు తెచ్చిన పాట

ఆ తర్వాత తనకి బాగా పేరు తెచ్చిన పాట ఎస్ఎం సుబ్బయ్య నాయుడి దర్శకత్వంలో "కొంజుం సెలంగై"1962) సినిమాలో "సింగార వేలనే దేవా. దీనిలో నాదస్వరం వాయించింది కారై కురుచి అరుణా చలం. ఆయనతో పోటీగా పాడే గాయని కోసం చాలామందిని అడిగారట. చివరికి లతా మంగేష్కర్‌ను కూడా సంప్రదించారట. ఇలా వెదికేటప్పుడు గాయని లీల.. జానకి పేరు సూచించారట. ఆమె ఒక్కతే పాడగలదు అంత పై శ్రుతిలో అని చెప్పారట.

అయితే ఈ పాటలో నాదస్వరం ముందే రికార్డు చేసి పెట్టారు. అది విని జానకి అలాగే పాడారు. అయితే పాటలో ముందు జానకి పాడితే దానికి అనుగుణంగా నాదస్వరం వాయించినట్టు వినపడుతుంది. ఆ తర్వాత ఇదే పాట "నీలీల పాడెద దేవా" అని తెలుగులో కూడా ఆమెనే పాడారు.

ఇక అక్కడ నుంచి ఆమె గాన ప్రస్థానం వేగంగా సాగింది. 1957 నుంచి 2016వరకూ కొన్ని వేల పాటలు వివిధ భాషల్లో ఆమె పాడారు. 2016 నుంచి ఆమె పాడటం ఆపేస్తున్నానని ప్రకటించారు.

తెలుగులో ప్రముఖులతో

తెలుగులో ప్రముఖ గాయనీ గాయకులందరితోనూ కలిసి ఆమె పాడారు. ఘంటసాల, పీబీ శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యంలతో ఎన్నో పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యం బాగా పాడుతున్నారని ఒక సంగీత పోటీలో ఆయన ప్రతిభను గమనించి ప్రోత్సహించింది కూడా ఆమెనే. వారిద్దరూ స్టేజీ మీద సరదాగా చేసే అల్లరి చూడముచ్చటగా వుంటుంది.

దాదాపు అందరి సంగీత దర్శకుల దగ్గరా పాడారు జానకి. పెండ్యాల, ఘంటసాల, రాజేశ్వరరావు, మహదేవన్, టీ చలపతి రావు, చక్రవర్తి.. వీరందరి దగ్గరా పాడినా ఇళయరాజాకెందుకో ఆమెంటే ప్రత్యేకాభిమానం. ఏదైనా మాటా మాటా వచ్చి ఈమె పాడనని అలిగితే ఆయన వచ్చి బతిమాలి తీసుకువెళ్లి పాడించుకునే వారట.

వీడియో క్యాప్షన్, రాజమౌళి, కీరవాణి, ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఏమిటి?

వ్యక్తిగత జీవితం ఇలా

వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె డాక్టర్ చంద్రశేఖర్ కుమారుడు వి.రామప్రసాద్‌ను ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఆయనకి ఆమె పాటంటే చాలా ఇష్టం. ఆయనే తన అభ్యున్నతికి కారణం అని చెబుతారామె.

ఆయన 1990లో మరణించారు. ఆమెకు ఒక్కడే కొడుకు. ఆయన పేరు మురళీకృష్ణ.

ఆమె ఇంటర్వ్యూలు చూస్తుంటే.. ఆమె స్వభావం చాలా సరళంగా, సూటిగా అనిపిస్తుంది. ఆమె మాట్లాడే విధానంలో కూడా నేర్చిన మాటలేమీ వుండవు. "నా గొంతులో సంగతులు అట్టాగే పలుకుతాయి, ఎట్టా వస్తాయో నాకే తెలియదు" అని అంటారామె. ఆమె మాట్లాడుతుంటే అంత స్వచ్ఛంగా, నిజాయితీగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)