భారతీయ సమాజంలో వివాహం ఒక లగ్జరీగా మారిందా, ఒక్కో పెళ్ళి సగటు ఖర్చెంతో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల పెళ్లి వేడుక ముంబైలోని అంబానీ నివాసంలో శుక్రవారం నుంచి ప్రారంభమైంది.
గత నాలుగు నెలలుగా అట్టహాసంగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది అంబానీ కుటుంబం.
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న స్టార్లు, బాలీవుడ్ తారలు, వ్యాపార ప్రముఖులు, సెలబ్రిటీలు.. ఇలా ఎంతోమంది ఈ వేడుకలకు హాజరయ్యారు.
"రాయల్ వెడ్డింగ్"కు ఏ మాత్రం తీసిపోని విధంగా అంబానీ చిన్న కొడుకు పెళ్లి వేడుక ఉందని పలువురు అభివర్ణించారు.
"మన బిలియనీర్లు ఇప్పుడు సరికొత్త భారత మహారాజులు" అని ఒక రచయిత అన్నారు.
అయితే, భారతీయ పెళ్లి వేడుకలపై 2024 జూన్‌లో 'జెఫరీస్' సంస్థ విడుదల చేసిన రిపోర్టులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జెఫరీస్ అనేది ప్రపంచంలోని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ & క్యాపిటల్ మార్కెట్స్ సంస్థల్లో ఒకటి.
ఆ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం...పెళ్లి అంటే భారతీయ సమాజంలో ఒక లగ్జరీ.
పెళ్లి వేడుకలకు ప్రజలు తమ ఆర్థిక స్థోమతకు మించి డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆ సంస్థ తన రిపోర్టులో పేర్కొంది.
ప్రతి భారతీయ కుటుంబం తమ సత్తా ఏంటో సమాజం ముందు నిరూపించుకునేలా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని అర్ధమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఓ కుటుంబంలో సగటు పెళ్లి ఖర్చెంత?
సాధారణంగా నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య వరకు, జనవరి మధ్య నుంచి జులై నెల చివరి వరకూ భారత్‌లో పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది.
ఏటా భారత్‌లో 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్ళిళ్ళు అవుతుంటాయని జెఫరీస్ సంస్థ అంచనావేసింది.
అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో పెళ్ళి వయసు సాధారణంగా 20 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉంటుందని, ప్రస్తుతం 28 కోట్ల మంది పెళ్లి కాని యువత దేశంలో ఉన్నారని తెలిపింది.
భారత్‌లో పెళ్ళి అనేది సంప్రదాయాల్లో ముఖ్యమైన భాగం. తమ ఆదాయంతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళకు జనం ఖర్చు పెడుతుంటారని జెఫరీస్ సంస్థ తెలిపింది.
సగటున భారతీయులు ఒక్కో పెళ్ళికి రూ.12 లక్షలు ఖర్చు పెడుతున్నారని అంచనావేసింది.
ఇది, సగటున ఒక భారతీయ కుటుంబం సంపాదించే వార్షిక ఆదాయం (రూ.4 లక్షల) కంటే మూడింతలు ఎక్కువ. తలసరి జీడీపీకి (రూ.2.42 లక్షలకు) సుమారు ఐదింతలుగా ఉంది. దీనికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2022లో వెల్లడించిన వివరాలను జెఫరీస్ ఆధారంగా తీసుకుంది.
ఈ లగ్జరీ పెళ్ళి వేడుకలు తక్కువ ఆదాయం, మధ్య తరగతి కుటుంబాలకు భరించలేని భారంగా మారుతున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
లక్షల కోట్లతో పెళ్ళిళ్ళ పరిశ్రమ
ప్రపంచంలో అతిపెద్ద వెడ్డింగ్ డెస్టినేషన్‌గా భారత్ ఉందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జెఫరీస్ తాజాగా విడుదల చేసిన తన రిపోర్టులో వెల్లడించింది.
పెళ్ళిళ్ళ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో చైనా తర్వాత భారత్‌నే రెండో స్థానాన్ని ఆక్రమించినట్లు తెలిపింది.
భారత పెళ్ళిళ్ళ పరిశ్రమ సుమారు రూ.10.8 లక్షల కోట్లతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నట్లు జెఫరీస్ తన రిపోర్టులో పేర్కొంది.
దేశంలో ఫుడ్, గ్రోసరీ మార్కెట్ తర్వాత వివాహ పరిశ్రమే ఉన్నట్లు ఈ రిపోర్టు తెలిపింది.
భారతీయ పెళ్ళిళ్ళ పరిశ్రమ అమెరికాతో (రూ.5.8 లక్షల కోట్లతో) పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉండగా.. చైనా మార్కెట్‌తో (రూ.14 లక్షల కోట్లతో) పోలిస్తే కాస్త తక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల ఎడ్యుకేషన్ కంటే ఎక్కువగా పెళ్ళిళ్ళకే ఖర్చు చేస్తున్నారు
జెఫరీస్ రిపోర్టు ప్రకారం భారతీయులు సగటున పిల్లల ఎడ్యుకేషన్ కంటే సుమారు రెండింతలు ఎక్కువగా పెళ్ళిళ్ళపై ఖర్చు చేస్తున్నారని తెలిసింది.
భారత్‌లో పిల్లలకు ప్రీ ప్రైమరీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఉండే 18 ఏళ్ల కాలానికి ఒక్కో కుటుంబం సగటున రూ.6 లక్షలు ఖర్చు చేస్తున్నారని రిపోర్టు పేర్కొంది.
పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి వివాహం కోసం డబ్బులు దాచిపెడుతున్నారు. ఇక అమ్మాయి అయితే, మరింత ఎక్కువగా కూడబెట్టుకోవాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్ళిళ్ళకు గిఫ్ట్‌గా మాత్రమే కాదు..
అయితే, ఇప్పటి వరకు పెళ్ళిళ్ళ సీజన్‌లో బంగారం, దుస్తుల అమ్మకాలు పెరుగుతాయనే ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ, ఈ రెండు కన్స్యూమర్ సెగ్మెంట్లతో పాటు పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలకు కూడా వివాహాల సీజన్ సాయపడుతుందని జెఫరీస్ తన రిపోర్టులో పేర్కొంది.
పెళ్ళిళ్ళ సీజన్‌లో ఈ ఇండస్ట్రీలకు డిమాండ్ ఉంటోందని తెలిపింది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీల్లోని కంపెనీలు తమ మార్కెట్ వ్యూహాలు, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ను వివాహాల తేదీలకు అనుగుణంగా చేపడుతుంటాయని చెప్పింది.
పెళ్ళి వేడుకల సమయంలో సాధారణంగా కట్నకానుకలుగా అమ్మాయి తరఫు వాళ్లు కార్లను, బైకులను బహుమతిగా ఇస్తుంటారు.
అయితే, కేవలం పెళ్ళి బహుమతులుగా మాత్రమే కాక, పెళ్ళయిన తర్వాత తమ కుటుంబ అవసరాలకు తగ్గట్లు కూడా వాహన కొనుగోళ్లను చేపడుతున్నారని జెఫరీస్ తెలిపింది.
వీటితోపాటు హైఎండ్ టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయెన్సెస్ వంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని జెఫరీస్ తన రిపోర్టులో చెప్పింది.
వివాహాల సమయంలో, వీటిని వధూవరులకు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు, ఆ తర్వాత ఇంట్లో అవసరాల కోసం కూడా ఈ వస్తువులను కొంటున్నారు. దీంతో, వీటి అమ్మకాలు పెరుగుతున్నాయి.
వివాహాల సందర్భంగా ఇళ్లకు రంగులు వేయడం, గృహ ప్రవేశం చేయడంలాంటివి ఉంటాయి. దీంతో పెయింట్ తయారీదారులు కూడా లాభపడుతున్నారు.
అయితే, ఈ రంగాలపై పెళ్ళిళ్ళ సీజన్ కచ్చితంగా ఏ మేర ప్రభావం చూపుతుందో చెప్పడం కొంచెం కష్టమేనని, అయితే కంపెనీలు మాత్రం ఈ సీజన్‌కు అనుగుణంగా తమ మార్కెట్ వ్యూహాలను, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ను చేపడుతున్నాయని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) విడుదల చేసిన డేటాను చూసుకుంటే, 2022 డిసెంబర్‌లో కంటే 2023 డిసెంబర్‌లో ఆటో రిటైల్ అమ్మకాలు భారత్‌లో 21 శాతం పెరిగి 19,90,915 యూనిట్లుగా నమోదయ్యాయి.
అలాగే, 2023 నవంబర్‌లో ఏకంగా 28,54,242 యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు ఫాడా తన డేటాలో వెల్లడించింది. ఆ నెలలో టూవీలర్లు, ప్యాసెంజర్ వెహికిల్ సేల్స్ సరికొత్త రికార్డులను సృష్టించినట్లు తెలిపింది.
అదే ఏడాది సెప్టెంబర్ నెలలో 18,82,071 వెహికిల్స్ అమ్ముడు పోగా, అక్టోబర్‌లో 21,17,596 వెహికిల్స్ అమ్ముడుపోయినట్లు ఫాడా డేటాలో తెలిపింది.
సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ నడిచే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆటోమొబైల్ అమ్మకాలు రికార్డు గ్రోత్‌ను నమోదు చేశాయి.
అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో 22,06,070 యూనిట్లు మార్చిలో 21,27,177 యూనిట్లు, ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్లు, జనవరిలో 21,27,653 యూనిట్ల వెహికిల్స్ విక్రయించినట్లు ఫాడా డేటాలో తెలిసింది.
‘‘ఎస్‌యూవీలకు డిమాండ్‌తో పాటు కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడం, సమర్థవంతమైన మార్కెటింగ్ విధానాలు, వినియోగదారులకు ప్రవేశపెట్టే స్కీమ్‌లు, పెళ్ళిళ్ళ సీజన్ ఈ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కారణం’’ అని ఫాడా 2024 ఫిబ్రవరి నెలలో తెలిపినట్లు జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది.
‘‘తయారీదారులకు సమస్యలున్నప్పటికీ, నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చిన పెళ్ళిళ్ళ సీజన్ వల్ల ఆటోమొబైల్ అమ్మకాలు పెరుగుతాయి’’ అని అంతకుముందు 2023 డిసెంబర్‌లో ఫాడా చెప్పింది.
‘‘పెళ్లి తేదీలు, పంటల అమ్మకానికి సంబంధించి రైతులకు చేసిన చెల్లింపులతో టూవీలర్ కేటగిరీలో కొనుగోళ్ల శక్తి పెరిగింది. అదనంగా వివిధ మోడళ్లు, వేరియంట్లు అందుబాటులోకి రావడం, అనుకూలమైన మార్కెట్ ట్రెండ్ ఈ వృద్ధికి సహకరించాయి’’ అని 2023 డిసెంబర్ నెల డేటా, 2023 ఆర్థిక సంవత్సరపు ఆటో రిటైల్స్ డేటా విడుదల సందర్భంగా ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలామంది పెళ్ళిళ్ళ సమయంలో వాహనాలను కట్నంగా పొందుతుంటారు. ఆర్థికంగా కాస్త మంచి స్థోమత కలిగిన వారు అయితే, కార్లను కూడా గిఫ్ట్‌గా ఇస్తున్నారు.
ప్రకాశ్ అనే వ్యక్తికి ఏప్రిల్ నెలలో పెళ్ళయింది. తను పెళ్లి సమయంలో కొత్త కారు కొన్నాడు. ఈ సమయంలో కారు అవసరం గురించి చెబుతూ ఇలా తెలిపాడు.
‘‘పెళ్ళి తర్వాత అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లాలి, సంప్రదాయబద్ధంగా ఆలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టైమ్‌లో అందర్నీ బస్సుల్లో తీసుకెళ్లడం కష్టం. అంతేకాక, పెళ్ళికు ముందు షాపింగ్ నుంచి ఈ తర్వాత వరకు ఉండే పెళ్ళి పనులకు సొంతంగా వెహికిల్ ఉండాలి. లేదంటే, ఇబ్బందవుతుందని అనిపించింది. అందుకే ఒక కారు తీసుకున్నా’’ అని చెప్పాడు.
ఇలా పెళ్ళిళ్ళ సీజన్‌లో అవసరాల కోసం కొందరు, కట్నకానుకల కోసం కొందరు వెహికిల్స్‌ను కొంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లి కోసం బ్యాంకుల నుంచి రుణాలు
జెఫరీస్ తన రిపోర్టు విడుదల చేస్తూ....భారతీయ పెళ్లి వేడుకలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది.
పెళ్లిళ్ల సమయంలో స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న డబ్బుల కంటే బ్యాంకులు, లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తీసుకునే రుణాలు పెరుగుతున్నాయని తెలిపింది. ఈ రుణాలపై బ్యాంకులు ఏడాదికి 10 శాతం నుంచి 36 శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయని పేర్కొంది.
2018-19 మధ్యకాలంలో పెళ్లిళ్ల కోసం రుణాలు కావాలంటూ 20 నుంచి 30 ఏళ్ల మధ్యనున్న వారి నుంచి 20 శాతం అప్లికేషన్లు వచ్చినట్లు డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియాలెండ్స్ తన ప్రెస్ రిలీజ్‌లో తెలిపింది.
ఇదే ప్లాట్‌ఫామ్ 2023లో సర్వే చేస్తే, పెళ్లి కోసం వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు చూస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న 26 శాతం మందికి పైగా చెప్పినట్లు తెలిపింది.
ఒకవైపు పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకుంటూ, ఆ అప్పు నుంచి బయటపడేందుకు ఎన్నో ఏళ్లు ప్రయత్నిస్తుండగా.. మరికొంత మంది తమ పొదుపులో ఎక్కువ భాగాన్ని పెళ్లి వేడుకల కోసమే వెచ్చిస్తున్నారు.
చెన్నైకు చెందిన దినేష్ అనే వ్యక్తి తన పొదుపులో 70 శాతం పెళ్లి కోసం ఖర్చు పెట్టేందుకు వెనుకాడలేదని బీబీసీకి చెప్పారు. జ్యూవెల్లరీ, వెడ్డింగ్ హాల్, స్టేజ్ డెకరేషన్ కోసం తన పెళ్లికి రూ.30 లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలిపారు.
అలాగే, కార్తీకా అనే అమ్మాయి తమ పెళ్లికి అయిన రుణభారంతో తన తల్లిదండ్రులు, భర్త పడ్డ కష్టాలను గుర్తుకు చేసుకున్నారు.
తమ పెళ్లికి చేసిన అప్పు తీర్చేందుకు పదేళ్లు పట్టిందని తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














