పానీపూరి తింటే క్యాన్సర్ వస్తుందా? పుట్టబోయే బిడ్డకూ ప్రమాదమేనా? తమిళనాడు, కర్ణాటకల్లో తేలిందేంటి?

పానీపూరీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారదా. వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పానీపూరీలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉండొచ్చని ప్రజలను తమిళనాడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఆ రసాయనాలతో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికీ ప్రమాదమేనని చెప్పింది.

ఇటీవల కర్ణాటకలో పానీపూరి, గోబీ మంచూరియన్‌తో సహా ఫాస్ట్ ఫుడ్‌ శాంపిల్స్‌ను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ పరీక్షించినప్పుడు 22 శాతం నమూనాలు సురక్షితంగా లేవని తేలింది. సదరు ఆహార పదార్థాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.

“సేకరించిన చాలా ఫుడ్ శాంపిల్స్‌లో నాణ్యత లేదు. వాటిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయి’’ అని మంత్రి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

కర్ణాటక మాదిరే పలు రాష్ట్రాల్లో పానీపూరీ చాలామంది ఇష్టంగా తింటారు. దీంతో కొద్దిరోజుల కిందట తమిళనాడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కూడా ఆ రాష్ట్రంలో విక్రయించే పానీపూరీ నాణ్యతను పరీక్షించడం ప్రారంభించింది.

చెన్నై, కోయంబత్తూరు, సేలం సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు.

వాట్సాప్
పానీపూరి

‘ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్’

పానీపూరీ స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు పెద్దలకు కూడా ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.

మూడు చక్రాల చిన్న వాహనం నుంచి చిన్న స్టాల్స్, పెద్ద రెస్టారెంట్ల వరకు మెనూ కార్డుల్లో పానీపూరీ స్థానాన్ని సంపాదించుకుంది.

ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్‌కు చెన్నైలోని మెరీనా బీచ్‌లో స్నేహితులతో కలిసి సాయంత్రం పానీపూరీ తినడం అలవాటు.

“ఏడేళ్లుగా పానీపూరి తింటున్నా. నాకు ఈ రసం అంటే కూడా చాలా ఇష్టం. కారంగా ఉండాలంటే మిరియాల పొడి చల్లాలి. జలుబు చేసినపుడు ఈ రసాన్ని తాగడం అలవాటుగా మారింది" అని ప్రవీణ్ చెప్పారు.

కోయంబత్తూరుకు చెందిన దివ్య.. తన తల్లి ఇంట్లో పానీపూరీ చేసినప్పుడే తనకు మొదటగా ఆ రుచి పరిచయం అయిందని చెప్పారు.

“అది తిన్నాక పానీపూరీకి అలవాటుపడ్డాను. రెండు వారాలకు ఒకసారైనా స్నేహితులతో కలిసి తింటాను. పూరీ, రసం కలిపి తింటే శరీరానికే కాదు మనసుకు కూడా ఉత్సాహం వస్తుంది'' అని ఆమె వివరించారు.

‘‘నేను చిన్నపుడు స్కూల్ దగ్గర్లోని షాపులో పానీపూరీ తినడం మొదలుపెట్టాను. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్లినా పానీపూరీ కనిపిస్తే తింటాను. ఇది అంత పరిశుభ్రంగానైతే ఉండదు. కానీ రుచిగా అనిపిస్తుంది” అని చారులత చెప్పారు.

పానీపూరి

కలిపే రంగులివే..

అయితే, పానీపూరీలో మూడు రకాల రసాయనాలు కలుపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ రంగులు ప్రకాశవంతమైనవి, ఎక్కువ కాలం ఉంటాయి.

• పుల్లని పానీయంలో 'యాపిల్ గ్రీన్' రంగు,

• పూరీకి 'సన్‌సెట్ ఎల్లో' రంగు,

• మసాలాకు టార్ట్రాజైన్ రంగు కలుపుతారు.

రంగులు

పుల్లని పానీలో 'యాపిల్ గ్రీన్'

పూరీతో వడ్డించే పుల్లని పానీయం సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి, చింతపండు నీటితో కలిపి ఈ పానీయం తయారు చేస్తారు.

కానీ పానీయం ఆకుపచ్చగా కంటికి ఇంపుగా కనిపించాలని కొన్ని ప్రాంతాల్లో 'యాపిల్ గ్రీన్' అనే రంగు కలుపుతుంటారని చెన్నై జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారి సతీష్ కుమార్ చెప్పారు.

"అర లీటరు నీటిలో కొద్దిగా కలిపినా ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగును ఇస్తుంది" అని ఆయన తెలిపారు.

సతీష్ కుమార్
ఫొటో క్యాప్షన్, చెన్నై జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారి సతీష్ కుమార్

పూరీకి 'సన్‌సెట్ ఎల్లో' రంగు

“పూరీలు తాజాగా, కరకరలాడేలా ఉండటానికి, పసుపు రంగులో మెరిసిపోవడానికి 'సన్‌సెట్ ఎల్లో’ రంగును ఉపయోగిస్తారు. మసాలా నారింజ రంగులో కనిపించడానికి 'టార్ట్రాజైన్' అనే రంగు వాడుతారు” అని సతీష్ కుమార్ చెప్పారు.

అలాగే, చింతపండును రాత్రంతా నానబెట్టడానికి బదులుగా తక్షణ పులుపు కోసం కొన్ని లవణాలు కలుపుతారు.

నాడీ వ్యవస్థపై ప్రభావం..

యాపిల్ గ్రీన్ డైని బట్టలు, లోహాలకు రంగులు వేయడానికి కూడా ఉపయోగిస్తారు. సబ్బు, షవర్ జెల్ వంటి ప్రోడక్టులలో కూడా వినియోగిస్తారు.

సన్‌సెట్ ఎల్లోను శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, ఫార్మాస్యూటికల్స్‌లో కూడా ఉపయోగిస్తారు. ఇది శరీరంపై ప్రమాదకరమైన ప్రభావాలను చూపుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

అదేవిధంగా, టార్ట్రాజైన్ అనేది ఆహారం, పానీయాలు, సౌందర్య సాధనాలలో ఉపయోగించే సింథటిక్ పసుపు రంగు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ రంగు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తేలింది.

డాక్టర్ అదితి

'దీర్ఘకాల వినియోగం క్యాన్సర్‌కు కారణమవుతుంది'

ఈ రసాయనాలు శరీరానికి హానికరమని, ఎక్కువ కాలం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పిగ్మెంట్లు పానీపూరీకి మాత్రమే కాకుండా ఐస్ క్రీం, చాక్లెట్ వంటి అనేక రకాల ఆహారాలలో కూడా కలుపుతారు.

శరీరానికి హాని కలిగించకుండా ఉండేందుకు కొన్ని పాశ్చాత్య ఆహార నియంత్రణ సంస్థలు వీటిని ఎంత మోతాదులో తీసుకోవచ్చో పరిమితులను విధించాయి.

ఈ మార్గదర్శకాల ప్రకారం ‘‘ప్రతి రోజూ ఒక వ్యక్తి తన శరీర బరువులో కేజీకి 4 నుంచి 7.5 ఎంజీల వరకు ఈ రంగులను తీసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదంటే శరీర బరువులో కిలోకు 1.4 ఎంజీ మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు 60 కిలోల బరువున్న వ్యక్తి ఒక రోజులో 60 నుంచి 80 ఎంజీ మోతాదులో ఈ రంగులను తీసుకోవచ్చు’’ అని డాక్టర్ అదితి చెప్పారు.

అంతకుమించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. ఆ రంగులు మోతాదు మించితే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, అజీర్ణం, నిద్రలేమి మొదలైనవి తక్షణ ప్రభావాలుగా కనిపిస్తాయని తెలిపారు.

‘’ఈ రసాయనాలను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ, కాలేయం దెబ్బతినవచ్చు. శరీరంలో ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గి కొవ్వు శాతం పెరగవచ్చు. గర్భిణీలు ఈ రంగులు వినియోగించినట్లయితే భవిష్యత్తులో వారి పిల్లలు నరాల పెరుగుదల రుగ్మతలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలు జన్యు పరివర్తనాలకు కూడా కారణమవుతాయి, వాటిని అధికంగా తీసుకోవడం క్యాన్సర్‌కు దారితీయవచ్చు" అని డాక్టర్ అదితి వివరించారు.

పానీపూరీ

ఫొటో సోర్స్, Getty Images

పానీపూరి విక్రేతలకు శిక్షణ

చెన్నైలో 1000కి పైగా పానీపూరీ దుకాణాలు ఉన్నాయి. చెన్నై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సతీష్ కుమార్ నేతృత్వంలోని బృందాలు 350కి పైగా ఫుడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాయి.

చాలామంది పానీపూరీ విక్రేతలు చేతులకు ఎలాంటి గ్లౌవ్స్ లేకుండా తయారు చేసి వడ్డిస్తుంటారని, దీనివల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

“పానీ పూరీ అమ్మే వ్యక్తి తన చేతులతో తాకిన మసాలా, పానీలను కస్టమర్లకు వడ్డిస్తే 90 శాతం వరకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆహారాలు వేడిగా వడ్డించరు. కాబట్టి ఆహారంలో ఉండే బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉండదు’’ అని సతీష్ కుమార్ చెప్పారు.

ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పానీపూరీ అమ్మేవారికి తమిళనాడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

"ఈ రంగులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రభావాల గురించి వారికి వివరిస్తున్నాం. కస్టమర్ ఆరోగ్యం దెబ్బతింటే తమ వ్యాపారం కూడా దెబ్బతింటుందని వారు ఆలోచించడం మొదలుపెట్టారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ కూడా అందజేస్తాం. ఇప్పటివరకు 70 మందికి శిక్షణ ఇచ్చాం’’ అని చెన్నై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సతీష్ కుమార్ వివరించారు.

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)