కలుషితమైన ట్యాంకర్లలో వంట నూనె రవాణా, చైనాలో ప్రకంపనలు..

ఫొటో సోర్స్, Getty Images
రసాయనాలను తరలించే ట్యాంకర్లను సరిగ్గా శుభ్రం చేయకుండానే, వంట నూనెల రవాణాకు ఉపయోగించారనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని చైనా ప్రభుత్వం తెలిపింది.
ఆన్‌లైన్‌లో ఈ విషయం విస్తృతంగా ప్రచారమవడంతో, సోషల్ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
రసాయనాల రవాణాకు ఉపయోగించే ట్యాంకర్లను సరిగ్గా శుభ్రం చేయకుండానే వంట నూనె లాంటి ఆహార ఉత్పత్తులను తీసుకెళ్తున్నట్లు బయటపడిందని ప్రభుత్వ అధికారిక పత్రిక బీజింగ్ న్యూస్ తెలిపింది.
కలుషితమైన ట్రక్కులలో వంట నూనెను రవాణా చేయడం పరిశ్రమలో "బహిరంగ రహస్యం" అని ఒక ట్యాంకర్ డ్రైవర్ చెప్పినట్టుగా ఆ పత్రిక రాసింది.
గత కొద్దిరోజులుగా చైనా సోషల్ మీడియాలో ఈ వివాదమే టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది.

చైనాలో X లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయిన వీబోలో ఈ వ్యవహారం గురించి పది వేల పోస్ట్‌లు ఉన్నాయి. వీటికి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కొన్ని లక్షల మంది వీటిని వీక్షించారు.
"ఆహార భద్రత అత్యంత ముఖ్యమైన విషయం" అన్న ఒక కామెంట్‌కు 8,000కు పైగా లైక్‌లు వచ్చాయి.
"ఒక సాధారణ వ్యక్తి ఈ ప్రపంచంలో జీవించడమే అద్భుతమైన విషయం" అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు.
చాలా మంది దీనిని 2008లో జరిగిన ఘటనతో పోల్చారు. అప్పట్లో పారిశ్రామిక రసాయనమైన మెలమైన్ ఎక్కువ మోతాదులో కలపడం వల్ల కలుషితమైన పాలపొడి కారణంగా దాదాపు మూడు లక్షల మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆరుగురు మరణించారు.
"2008 నాటి ఘటన కంటే ఇది చాలా ఘోరమైనది. ఇది కేవలం ఒక ప్రకటనతో పరిష్కారం కాదు" అని మరొక యూజర్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని సినోగ్రెయిన్ ,హోప్‌ఫుల్ గ్రెయిన్ అండ్ ఆయిల్ గ్రూప్ సహా అనేక ప్రధాన చైనీస్ కంపెనీలు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.
ఆహార భద్రతా నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సినోగ్రెయిన్ కంపెనీ తెలిపింది.
ఏ ట్రక్కైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే వాటి వినియోగాన్ని తక్షణమే నిలిపివేస్తామని ఆ కంపెనీ చెప్పింది.
ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయని హోప్‌ఫుల్ గ్రెయిన్ ప్రతినిధి ప్రభుత్వ నియంత్రిత వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్‌కు చెప్పారు.
ఈ ఆరోపణలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపడతారని చైనా ప్రభుత్వం తెలిపింది. తప్పు చేసిన కంపెనీలను, వ్యక్తులను శిక్షిస్తామని చెప్పింది. తమ విచారణలో గుర్తించిన విషయాలను వెంటనే వెల్లడిస్తామని తెలిపింది.
"చట్టవిరుద్ధంగా నడిచే సంస్థలు, అందుకు బాధ్యులైనవారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాం. ఎవరినీ వదిలిపెట్టం" అని ప్రభుత్వం చెప్పినట్లు సీసీటీవీ తెలిపింది.
హెబీ, టియాంజిన్ ప్రావిన్సుల ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై దృష్టి సారించినట్టు చెప్పాయి.
బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














